Updated : 06 Jul 2022 06:18 IST

అడుగడుగునా అడ్డుగోడలు!

భారత ఆర్థిక వ్యవస్థ
సమస్యలు - సవాళ్లు

సమాజంలో అసమానతలను తొలగించేందుకు రూపొందించిన భూసంస్కరణలు అనేక కారణాల వల్ల సమగ్ర అమలుకు నోచుకోవడంలేదు. బలహీన వర్గాలకు సాంఘిక న్యాయాన్ని అందించేందుకు చేసిన భూచట్టాలు, ఏర్పాటు చేసిన వ్యవస్థలు ఆశించిన ఫలితాలను అందించడంలేదు. అవినీతి, అక్రమాలు, రాజకీయ జోక్యం అడుగడుగునా అడ్డుగోడలుగా మారాయి. ఈ అంశాలను అభ్యర్థులు పోటీ పరీక్షల కోణంలో తెలుసుకోవాలి.


భూసంస్కరణ చట్టాల అమలు- లోపాలు

టి.హక్

పేదరికం, నిరుద్యోగితను నిర్మూలించి బలహీన వర్గాలను ఆదుకోవడాన్ని సాంఘిక న్యాయం అంటారు. ఆదాయం, సంపద వినియోగాల్లో ఉండే అసమానతలను తగ్గించడమూ అందులో భాగమే. భూ సంస్కరణల వల్ల సాంఘిక న్యాయం జరుగుతుంది. వ్యవసాయం రాష్ట్ర ప్రభుత్వ జాబితాలోని అంశం. వివిధ రాష్ట్రాలు భూ సంస్కరణ చట్టాలను వివిధ స్థాయుల్లో అమలు పరిచాయి. కానీ అవన్నీ ఒకే రకంగా లేవు. ఏకీకృతం చేయడానికి జాతీయ భూ సంస్కరణల మండలిని (నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ల్యాండ్‌ రిఫార్మ్స్‌) 2008లో స్థాపించినప్పటికీ ఆశించిన ఫలితం అందలేదు.

1991 నుంచి అమలుచేస్తున్న ఆర్థిక సంస్కరణల కారణంగా భూ సంస్కరణల అంశం ప్రాధాన్యాన్ని కోల్పోయింది. సరళీకరణ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత శ్రద్ధ చూపలేదు. 9వ పంచవర్ష ప్రణాళిక (1997-2002) ముగిసే నాటికి కూడా భూ గరిష్ఠ పరిమితి చట్టంలో ఎలాంటి మార్పు లేదు. బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌లలో కౌలు సంస్కరణలు కొత్త సమస్యలను సృష్టించాయి. అప్రకటిత/రాతపూర్వకం కాని విధానం పెరిగింది. 10వ పంచవర్ష ప్రణాళిక (2002-07) వ్యవసాయ వాణిజ్యీకరణ, వ్యవసాయ భూముల లీజు, భాటకాన్ని మార్కెట్‌ నిర్ణయించే ప్రస్థానాన్ని వేగవంతం చేసింది. ఈ ప్రణాళికా కాలంలో పూర్వపు భూసంస్కరణలు, వాటి లక్ష్యాలకు ప్రాధాన్యం తగ్గింది. నోబెల్‌ బహుమతి గ్రహీత ఆచార్య అమర్త్యసేన్‌ ప్రకారం ఆర్థిక సంస్కరణల ఫలితాలు అందరికీ అందాలంటే భూ సంస్కరణలు అమలు జరగాలి.

భూసంస్కరణలు పశ్చిమ బెంగాల్‌, కేరళ రాష్ట్రాల్లో విజయవంతమయ్యాయి. మిగతా రాష్ట్రాల్లో అమలులో జాప్యానికి, వైఫల్యాలకు కింది అంశాలను కారణాలుగా పేర్కొనవచ్చు.  
* రాష్ట్రాల్లో చట్టాలు రూపొందించడంలో విపరీతమైన ఆలస్యం చేయడంతో భూముల బదలాయింపులు జరిగిపోయాయి. దీనివల్ల న్యాయంగా ఆశించినంత మిగులు భూమి సమకూరలేదు.
* చట్టాలు లోపభూయిష్టంగా ఉండటంతో న్యాయస్థానాల్లో కేసులు వేశారు. దాంతో జాప్యం జరిగింది.
* చట్టాలను సమర్థంగా అమలుచేయడానికి అవసరమైన యంత్రాంగం లేకపోవడం మరో లోపం.
* మధ్యవర్తులైన జమీందార్లను తొలగించడంతో వారికి చెల్లించాల్సిన నష్ట పరిహారంపై న్యాయస్థానాల్లో వివాదాలు ఏర్పడ్డాయి. దీంతో భూసంస్కరణల వల్ల ఆశించిన ఫలితాలు అందలేదు.
* భూగరిష్ఠ పరిమితి చట్టంలో అనేక మినహాయింపులు ఇవ్వడంతో మిగులు భూమి తగ్గిపోయింది.
* చట్టాల అమలుకు అవసరమైన దృఢమైన రాజకీయ సంకల్పం, చిత్తశుద్ధి లేకపోవడంతో ప్రభుత్వాలు భూసంస్కరణల పట్ల ఉదాసీన వైఖరిని ప్రదర్శించాయి.
* ఉద్యోగస్వామ్య దృక్పథం, అధికార యంత్రాంగంలో చిత్తశుద్ధి లోపించడం, అవినీతి, అసమర్థత, రాజకీయ జోక్యం, లోపాయికారీ అక్రమాలు అడ్డుగోడలుగా మారాయి.
* సమాచార లోపం, రికార్డుల్లో లోపాలతో సంస్కరణల అమలు ఆలస్యమైంది.
* భూమి యజమానితో కౌలుదార్లు నిర్దిష్టమైన రాతపూర్వక ఒప్పందాలు చేసుకోకపోవడం వల్ల వారికి ప్రభుత్వ విధానాల కారణంగా రావాల్సిన కొన్ని రాయితీలు, పరపతి, బీమా లాంటి ప్రయోజనాలు అందలేదు.
* జమీందారీ వ్యవస్థ అంతరించి అనుపస్థిత భూస్వాములు పెరిగారు. వారి వల్ల చాలా భూమి నిరుపయోగంగా ఉండిపోయింది.
* కమతాల సమీకరణ, సహకార వ్యవసాయం లాంటి విధానాలు విజయవంతం కాలేదు. దీనివల్ల వ్యవసాయాభివృద్ధికి ఆటంకం ఏర్పడింది. ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించేందుకు దోహదపడే భారీస్థాయి వ్యవసాయం అమలుకు వీలు కాలేదు.
* ప్రభుత్వం వివిధ ప్రణాళికల్లో అమలుచేసిన గ్రామీణాభివృద్ధి పథకాలు, పేదరిక నిర్మూలన, ఉపాధి పథకాల వల్ల ఉపాంత రైతులు, వ్యవసాయ శ్రామికులు లబ్ధి పొందారు. దాంతో వారి నుంచి భూసంస్కరణల అమలు కోసం ప్రభుత్వంపై తగినంత ఒత్తిడి రాలేదు.
* కేంద్ర ప్రభుత్వం భూసంస్కరణల అమలును నిర్లక్ష్యం చేయడం వల్ల షెడ్యూల్డ్‌ ప్రాంతాలకు సంబంధించి పంచాయతీ విస్తరణ చట్టం (పెసా) పరిధిలోని అనేక అంశాలు వెలుగుచూడలేదు. సామాజిక ఆస్తులు, వనరుల సర్వే చేపట్టడానికి శిక్షణ ద్వారా సమర్థ నిర్మాణం చేయాల్సిన భూవినియోగ బోర్డుకు వనరులు లేక సాధికారతను పొందలేదు. గ్రామసభల సాధికారత జరగలేదు. భూసంబంధ విధానాలు కొరవడి మహిళల భూయాజమాన్య హక్కులు కూడా సాకారం కాలేదు.

నీతి ఆయోగ్‌ 2016లో మోడల్‌ అగ్రికల్చరల్‌ ల్యాండ్‌ లీజింగ్‌ యాక్ట్‌ను రూపొందించింది. వివిధ రాష్ట్రాల్లో కౌలు చట్టాలను సమీక్షించడానికి నీతి ఆయోగ్‌.. టి.హక్‌ అధ్యక్షతన ఎక్స్‌పర్ట్‌ కమిటీ ఆన్‌ ల్యాండ్‌ లీజింగ్‌ను ఏర్పాటు చేసింది. భూమి లేని ఉపాంత రైతులకు వ్యవసాయ భూమిని లీజుకు ఇవ్వడానికి ఉన్న అవకాశాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఉపాంత రైతులకు సంస్థాగత పరపతి సౌకర్యాలను కల్పించేందుకు ప్రయత్నిస్తుంది.

భూసేకరణ చట్టం - 2013 (Right to fair compensation and transparency in land acquisition and resettlement act - 2013)ను 2014 నుంచి అమలుచేశారు. ప్రస్తుతం ఈ చట్టం ప్రకారమే భూసేకరణ జరుగుతోంది. భూరికార్డుల డిజిటలైజేషన్‌ కింద కర్ణాటకలో చేపట్టిన భూమి ప్రాజెక్టు ముఖ్యమైంది. రాజస్థాన్‌ ప్రభుత్వం 2016లో అర్బన్‌ ల్యాండ్‌ చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా తగిన ఏర్పాట్లు చేసింది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు తమిళనాడు ప్రభుత్వం కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ చట్టాన్ని ప్రవేశపెట్టింది.


భూసంస్కరణల చట్టం ముసాయిదా - 2013

కేంద్ర ప్రభుత్వం 2013, ఆగస్టు 12న కొత్త భూసంస్కరణ చట్టం ముసాయిదాను తయారుచేసింది.

ఈ చట్టంలోని అంశాలు:  గ్రామాల్లో భూమి లేని పేదలందరికీ భూపంపిణీ చేయడం.
* దళితులు, గిరిజన వర్గాల నుంచి అన్యాయంగా తీసుకున్న భూములను తిరిగి ఇప్పించడం.
* లీజు చట్టం విధానాలను సడలించడం.
* భూమిపై మహిళల హక్కులను పెంచడం.2015 డిసెంబరు నాటికి దేశంలో 6.7 మిలియన్‌ ఎకరాల భూమిని ప్రభుత్వం మిగులు భూమిగా ప్రకటించింది. ఇందులో 6.1 మిలియన్‌ ఎకరాలను స్వాధీనం చేసుకొని దానిలో 5.1 మిలియన్‌ ఎకరాలను 5.78 మిలియన్ల ప్రజలకు పంపిణీ చేసింది.

తెలంగాణ - ధరణి పోర్టల్‌:  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2020, అక్టోబరు 29న ప్రారంభించిన సంఘటిత భూ రికార్డుల నిర్వహణ వ్యవస్థ పేరు ధరణి. ఇది వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించినది. 2020, నవంబరు 23న వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ కూడా మొదలైంది. మా భూమి (ధరణి) ఆన్‌లైన్‌ పోర్టల్‌లో ప్రజలు, పట్టాదారులు తమ భూముల వివరాలను నేరుగా తెలుసుకునే విధంగా వెబ్‌సైట్‌ను రూపొందించారు. పహాణి (అడంగల్‌), ఆర్‌ఓఆర్‌ (రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌) డాక్యుమెంట్లను దీని ద్వారా పొందవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌ - భూధార్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2015, జూన్‌ 13న ‘మీ భూమి’ పోర్టల్‌ను ప్రారంభించింది. ఇది భూయజమానులు, పౌరులు తమ భూముల వివరాలు తెలుసుకునే ఎలక్ట్రానిక్‌ సౌకర్యం. అయితే 8 ప్రభుత్వ శాఖలకు చెందిన సమాచారాన్ని ఒకే చోట నుంచి తెలుసుకోవడానికి భూసేవ ప్రాధికార సంస్థను నెలకొల్పి దాని ద్వారా 2015 నవంబరులో ‘భూధార్‌ కార్యక్రమం’ను ప్రారంభించింది. ఆధార్‌లో ఉన్నట్లు  భూధార్‌కు కూడా 11 అంకెలతో ఒక గుర్తింపు సంఖ్య ఉంటుంది. అన్ని పత్రాల్లో భూధార్‌ను చట్టపరంగా ఉపయోగించడానికి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ 2019, ఫిబ్రవరి 18న ఆమోదం తెలిపింది. ఈ తరహా ఏర్పాటు దేశంలోనే తొలిసారి ఏపీలో జరిగింది. రెవెన్యూ పరిధిలోని   99.15% భూములకు శాశ్వత భూధార్‌  సంఖ్యలను కేటాయించారు.

https://tinyurl.com/2p8au5fv


ప్రిపరేషన్‌ టెక్నిక్‌

వందల పేజీల్లో ఉండే బడ్జెట్లు, సర్వేలు చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు. పరీక్షలకు అవసరమైన గణాంకాలు పరిమితంగా ఉంటాయి. ముఖ్యమైన వాటిని  సంక్షిప్తీకరించి అందించే ప్రామాణిక పుస్తకాలను చదివితే సరిపోతుంది.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts