బహు భాషలు.. బహుళ జాతులు!

భౌగోళికంగా భూగోళం మొత్తాన్ని తలపించే వాతావరణ పరిస్థితులతో భారత ద్వీపకల్పం ఉపఖండంగా ప్రసిద్ధి చెందింది. దాంతోపాటు రకరకాల జాతులు, భాషలు, సంస్కృతులు, జీవన విధానాలతో వేల సంవత్సరాలుగా వర్ధిల్లుతోంది. ఇంతటి వైవిధ్యం ఎలా

Published : 13 Jul 2022 01:02 IST

భౌగోళికంగా భూగోళం మొత్తాన్ని తలపించే వాతావరణ పరిస్థితులతో భారత ద్వీపకల్పం ఉపఖండంగా ప్రసిద్ధి చెందింది. దాంతోపాటు రకరకాల జాతులు, భాషలు, సంస్కృతులు, జీవన విధానాలతో వేల సంవత్సరాలుగా వర్ధిల్లుతోంది. ఇంతటి వైవిధ్యం ఎలా సాధ్యమైంది? చూడగానే ఎవరు ఏ ప్రాంతానికి చెందినవారో తేలిగ్గా గుర్తించగలిగేట్లుగా జనాభా అభివృద్ధి ఏవిధంగా జరిగింది? సమాజ నిర్మాణం అధ్యయనంలో భాగంగా ఈ అంశాలపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి.

భారతీయ సమాజం-మత, సాంస్కృతిక భిన్నత్వం

భారత భూభాగానికి ఇండియా అనే పేరు ఇండస్‌ నది నుంచి వచ్చింది. ఇది పంజాబ్‌లో ఉంది. వేదకాలం నాటి ఆర్యులు దీన్ని హిందూ అని పిలిచేవారు. ఆంగ్లేయుల వల్ల అది ఇండియాగా మారింది. భరతుడు పరిపాలించిన దేశం కాబట్టి భారతదేశంగా పిలుస్తున్నారు. మన దేశానికి వలస వచ్చిన ఆర్యుల్లో ‘భారత’ అనే సుప్రసిద్ధ తెగవారు పరిపాలించిందుకే భారతదేశం అనే పేరు వచ్చిందని కూడా చెబుతుంటారు.

భారత సమాజం అతి పురాతనమైంది. పూర్వం నుంచి వివిధ కాలాల్లో బయటి నుంచి విభిన్న జాతి, భాష, మత సమూహాలకు చెందిన ప్రజలు మన దేశానికి వచ్చి స్థిరపడ్డారు. అందువల్ల భారతదేశంలో వివిధ జాతులు, భాషలు, మతాలు, సంస్కృతి, సమూహాల మధ్య వైవిధ్యం కనిపిస్తుంది. భారత సమాజ మౌలిక లక్షణాల్లో సమష్టి కుటుంబం, కులవ్యవస్థ, గ్రామీణ సముదాయాలు ముఖ్యమైనవి. భారతీయ సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో నేటికీ ఈ లక్షణాలు ప్రాధాన్యాంశాలుగా ఉన్నాయి.

ప్రస్తుతం సుమారు 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశాన్ని అయిదు ప్రధాన సంస్కృతి సమూహాలుగా విభజించారు.

1) ఉత్తర ప్రాంతం: దీనిలో పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్రలకు చెందిన సంస్కృతుల సమూహాలు ఉన్నాయి.

2) దక్షిణ ప్రాంతం: ఈ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ఉన్నాయి.

3) తూర్పు ప్రాంతం: ఇందులో మరాఠీ, గుజరాతీ సంస్కృతులు ఉన్నాయి.

4) పశ్చిమ ప్రాంతం: ఇక్కడ మరాఠీ సంస్కృతి ఉంది.

5) ప్రత్యేక సమూహం: భారతదేశంలో ఉన్న ఆదిమ తెగను ప్రత్యేక సాంస్కృతిక సమూహంగా చెప్పవచ్చు.

పైన వివరించిన భేదాలే కాకుండా హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌, సిక్కు, బౌద్ధ, జైన, పార్శీలతో పాటు వివిధ మతాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. ఇలాంటి భిన్నత్వ లక్షణాలు భారతీయ సమాజంలోనే కనిపిస్తాయి.

లక్షణాలు

భౌగోళిక వైవిధ్యం: భారతదేశం ఆసియా ఖండంలో దక్షిణ మధ్య భాగంలో ఉన్న ద్వీపకల్ప దేశం. దీని విస్తీర్ణం 30,53,597 చ.కి.మీ. భారత్‌కు ఉత్తరాన హిమాలయ పర్వతాలు, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన అరేబియా మహాసముద్రం సరిహద్దులుగా ఉన్నాయి. ప్రధాన భూభాగంలో సువిశాల గంగా సింధూ మైదానం, ఎడారులు, వింధ్య పర్వతాలు, దక్కన్‌ పీఠభూమి ఉన్నాయి. భారత్‌ అనేక జీవనదుల పుట్టిల్లు. అందుకే మన దేశాన్ని ప్రపంచ సంగ్రహ స్వరూపంగా అభివర్ణించారు. ఇక్కడ శీతోష్ణస్థితి, వర్షపాతం, రుతుపవనాలు ప్రాంతాల వారీగా భిన్నంగా ఉంటాయి. ప్రజల జీవన విధానంలోనూ వైవిధ్యం కనిపిస్తుంది.

సామాజిక నిర్మితి: సామాజిక లక్ష్యాలను సాధించడానికి వ్యక్తులు నిర్ణీత ప్రమాణాలను అనుసరిస్తూ, అనుబంధ పాత్రలను నిర్వహిస్తూ అనేక సంబంధాలు రూపొందించుకుంటారు. ఇలా ఏర్పడిన సామాజిక సంబంధాల సమూహాన్నే సామాజిక నిర్మితి అంటారు. భారతీయ సమాజంలో అనేక సంస్థలు, సమూహాలు, సంఘాలు, సముదాయాలు ఉన్నాయి. వీటన్నింటినీ కలిపి భారతీయ సామాజిక నిర్మితిగా పేర్కొంటారు.

జాతి విభాగాలు: శరీర రంగు, తల వెంట్రుకలు, ముక్కు లాంటి భాగాలకు చెందిన జైవిక లక్షణాలు, భాష, సంస్కృతుల్లో ప్రత్యేకతను కలిగి, ఒక నిర్ణీత భౌగోళిక ప్రాంతానికి చెందిన మానవ సమూహాన్ని జాతి అంటారు. రేమండ్‌ ఫిర్త్‌ అభిప్రాయంలో జాతి అంటే అనువంశికంగా పొందే కొన్ని ప్రత్యేక శారీరక లక్షణాలు ఉన్న సమూహం.

బి.ఎస్‌.గుహ ప్రకారం భారతదేశంలో ఆరు ప్రధాన జాతులు ఉన్నాయి. అవి నిగ్రిటో, ప్రోటో ఆస్ట్రలాయిడ్‌, మంగోలాయిడ్‌,  మెడిటరేనియన్‌ లేదా మెడిటరేనియస్‌, వెస్ట్రన్‌ బ్రాకీసెఫాలిక్‌, నార్డిక్‌.

మన దేశంలో అధిక సంఖ్యాకులు కాకసాయిడ్‌ జాతికి చెందుతారు. ఉత్తర్‌ప్రదేశ్‌, తమిళనాడులోని బ్రాహ్మణులు; పంజాబ్‌లోని సిక్కులు, గుజరాత్‌లోని నాగర బ్రాహ్మణులు ఈ జాతికి చెందినవారే. వీరి శరీరం కొద్దిపాటి తేడాలతో తెలుపు నుంచి గోధుమ వర్ణంలో ఉంటుంది. తల వెంట్రుకలు మృదువుగా ఉంటాయి. కంటిపాపలు నీలం లేదా గోధుమ రంగులో ఉంటాయి. నాసిక (ముక్కు) ఎత్తుగా, సన్నగా ఉంటుంది.

హిమాలయ పర్వత ప్రాంతాల్లో నివసించే భారతీయులు మంగోలాయిడ్‌ జాతికి చెందినవారు. వీరి శరీర ఛాయ పసుపు రంగు నుంచి లేత గోధుమ రంగులో ఉంటుంది. కళ్లు రెండు సన్నని చీలికలుగా ఉంటాయి. తల గుండ్రంగా, ముక్కు పొట్టిగా అణిగి ఉంటుంది. వీరిని సులభంగా గుర్తించవచ్చు.

ప్రస్తుతం నీగ్రో జాతి లక్షణాలున్నవారు భారతదేశంలో తక్కువగా ఉన్నారు. వీరి శరీర ఛాయ గోధుమ రంగు నుంచి నలుపు రంగు వరకు కొద్దిపాటి తేడాలతో ఉంటుంది. శిరోజాలు మెలికలు తిరిగి ఉంటాయి. ముక్కు వెడల్పుగా, నోరు పెద్దదిగా, పెదవులు పైకి తిరిగి లావుగా ఉంటాయి. అండమాన్‌ దీవుల్లో నివసించే తెగలు, కేరళలోని కొడార్‌, మధుర ప్రాంతంలోని ఫలియాన్‌, ఆంధ్రప్రదేశ్‌లోని చెంచులు, మహారాష్ట్రలోని నిభిల్‌ తెగల వారిలో నీగ్రో జాతి లక్షణాలు కనిపిస్తాయి.

భాషాపరమైన సంయోజనం: సంస్కృతి వికాసం, సామాజిక సమైక్యత, భావప్రసారానికి తోడ్పడే సాధనాల్లో భాష ప్రధానపాత్ర పోషిస్తుంది. బహుళ భాషా సమూహాలతో ఉన్న మన దేశంలో 1652 భాషలు, మాండలికాలు ఉన్నాయి. వీటిలో 23 భాషలు మాట్లాడే ప్రజలే దేశ జనాభాలో 97% ఉన్నారు. ఈ భాషలనే రాజ్యాంగం గుర్తించింది. భారతీయులు మాట్లాడే భాషలు అయిదు భాషా కుటుంబాలకు చెందినవి.

ఆస్ట్రిన్‌ ఇండో-ఆర్యన్‌ ద్రావిడ  సినో-టిబెటన్‌ యూరోపియన్‌

ఆస్ట్రిన్‌ భాషా కుటుంబం: భారతదేశంలో మధ్య, ఈశాన్య ప్రాంతాల్లోని గిరిజనులు మాట్లాడే భాషల మాండలికాలు ఈ భాషా కుటుంబానికి చెందినవే. వీటిని మాట్లాడే వారిలో సంతాల్‌, ముండా, హూ, భిల్లులు, గోండులు ఉన్నారు.
ఇండో-ఆర్యన్‌ భాషా కుటుంబం: దేశ జనాభాలో అధికశాతం ఈ భాషా కుటుంబానికి చెందినవారే. దీనిలో హిందీ, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, రాజస్థానీ, అస్సామీ, సంస్కృతం, సింధీ, కశ్మీరీ, ఉర్దూ లాంటి భాషలు ఉన్నాయి.

ద్రావిడ భాషా కుటుంబం: ఈ భాషా కుటుంబంలో దక్షిణ భారతదేశంలోని ప్రజలు మాట్లాడే భాషల మాండలికాలు ఉంటాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఇందులోనివే.

సినో-టిబెటన్‌ భాషా కుటుంబం: దీనిలో ఈశాన్య భారతానికి చెందిన కొన్ని ఆదిమ తెగల భాషల మాండలికాలు ఉన్నాయి.

యూరోపియన్‌ భాషా కుటుంబం: ఇందులో ఇంగ్లిష్‌, పోర్చుగీస్‌, ఫ్రెంచి భాషలు ఉన్నాయి. గోవాలో పోర్చుగీసు, పుదుచ్చేరిలో ఫ్రెంచి భాషలు వాడుకలో ఉన్నాయి.

హిందీని జాతీయ భాషగా, అధికార భాషగా; ఇంగ్లిష్‌ను అసోసియేట్‌ భాషగా గుర్తించారు. గతంలో సంస్కృతంలాగా ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్‌ భాషలు భారతీయ భాషల మధ్య వారధిగా ఉపకరిస్తున్నాయి. జాతీయ సమైక్యతను పెంపొందించడంలో వీటి పాత్ర గణనీయమైంది.

2011 లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో హిందీ మాట్లాడేవారు 52.83 కోట్లు (43.63%) ఉన్నారు. బెంగాలీ 9.72 కోట్లు (8.03%), మరాఠీ 8.3 కోట్లు (6.86%), తెలుగు  8.11 కోట్లు (6.70%), ఉర్దూ 5.07 కోట్లు (4.19%), గుజరాతీ 5.54 కోట్లు (4.58%), మలయాళం 3.48 కోట్లు (2.88%), పంజాబీ 3.31 కోట్లు (2.74%), కన్నడ 4.37 కోట్ల (3.61%) మంది మాట్లాడుతున్నారు.


సమాజ నిర్మాణం

సమస్యలు, ప్రజావిధానాలు పథకాలు
ఇండో-ఆర్యన్‌ భాషలు మాట్లాడేవారు 73 శాతం, ద్రావిడ భాషలు మాట్లాడేవారు 20 శాతం; ఆస్ట్రిన్‌, యూరోపియన్‌ భాషలు మాట్లాడేవారు 13 శాతం, సినో-టిబెటన్‌ భాషలు మాట్లాడేవారు 0.08 శాతం ఉన్నారు. ఇతర భాషలు మాట్లాడేవారు 4.47 శాతం ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని