వరుసగా ఏడోసారి!

మనదేశంలోని విశ్వవిద్యాలయాల గురించి ఆలోచించినప్పుడు వెంటనే ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌, బెంగళూరు గుర్తుకువస్తుంది. వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థల ర్యాంకుల జాబితాలో ఐఐఎస్సీకి తప్పనిసరిగా ప్రాధాన్యం లభిస్తోంది.

Updated : 25 Jul 2022 01:10 IST

విశ్వవిద్యాలయాల్లో ఐఐఎస్సీదే అగ్రస్థానం

మనదేశంలోని విశ్వవిద్యాలయాల గురించి ఆలోచించినప్పుడు వెంటనే ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌, బెంగళూరు గుర్తుకువస్తుంది. వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థల ర్యాంకుల జాబితాలో ఐఐఎస్సీకి తప్పనిసరిగా ప్రాధాన్యం లభిస్తోంది. సైన్స్‌ కోర్సులు, పరిశోధనల్లో దేశంలో ఇదే మేటి సంస్థ. ఇందుకు ఇటీవల వెలువడిన ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకులే నిదర్శనం. విశ్వవిద్యాలయాల కేటగిరీలో ఐఐఎస్సీ మళ్లీ ప్రథమ స్థానంలో నిలిచి, తన ప్రత్యేకతను చాటుకుంది. ఈ నేపథ్యంలో ఈ సంస్థలోని వివిధ కోర్సులు, ప్రవేశ మార్గాలతోపాటు జాతీయ స్థాయి, తెలుగు రాష్ట్రాల్లో మేటి విశ్వవిద్యాలయాల వివరాలు తెలుసుకుందాం!

విశ్వవిద్యాలయాల విభాగంలో 2016 నుంచి 2022 వరకు అంటే వరుసగా ఏడుసార్లు దేశంలో మేటి విద్యాసంస్థగా ఐఐఎస్సీ నిలిచింది. అన్ని విభాగాల్లోనూ అత్యున్నత ప్రమాణాలు ఆచరించడమే ఇందుకు కారణం. ఇక్కడి కోర్సుల్లో చేరుతున్న విద్యార్థుల ప్రతిభ, ఫ్యాకల్టీ సభ్యుల నైపుణ్యాలు, ప్రయోగశాలలు, పరిశోధనలు, వసతులు, వనరులు...ఇవన్నీ అగ్రస్థానంలో నిలబెట్టాయి. ఈ సంస్థలో బీఎస్‌ రిసెర్చ్‌, ఎంటెక్‌, ఎంఆర్క్‌, ఎం డిజైన్‌, మేనేజ్‌మెంట్‌, ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ, పీహెచ్‌డీ కోర్సులు ఉన్నాయి.
బీఎస్‌ రిసెర్చ్‌: నాలుగేళ్ల వ్యవధితో బయాలజీ, కెమిస్ట్రీ, ఎర్త్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌, మెటీరియల్స్‌, మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌ కోర్సులను ఐఐఎస్సీ అందిస్తోంది. వీటిలో ప్రవేశానికి పలు మార్గాలు ఉన్నాయి. కేవీపీవై, ఐఐటీ-జేఈఈ, నీట్‌ల్లో చూపిన ప్రతిభతో కోర్సుల్లో చేరవచ్చు. నాలుగేళ్ల చదువు పూర్తిచేసుకున్నవారికి బీఎస్‌ రిసెర్చ్‌ డిగ్రీ ప్రదానం చేస్తారు. అయితే మరో ఏడాది ఇదే సంస్థలో కొనసాగితే ఎమ్మెస్సీ పట్టా చేతికందిస్తారు. పరిశోధనల్లో పాలు పంచుకోవాలని ఆశించే ఇంటర్‌ సైన్స్‌, మ్యాథ్స్‌ గ్రూపుల విద్యార్థులకు బీఎస్‌ రిసెర్చ్‌ కోర్సులు ఉపయోగపడతాయి. చేరినవారికి ప్రతినెలా స్టైపెండ్‌ చెల్లిస్తారు.
ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ: బీఎస్సీ తర్వాత నేరుగా పీజీ, పీహెచ్‌డీ రెండూ కలిపి ఐదేళ్లకే పూర్తిచేసుకునే అవకాశం ఈ సంస్థ అందించే ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీలతో లభిస్తుంది. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, బయాలజీల్లో ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ పీహెచ్‌డీ కోర్సులను ఐఐఎస్సీ అందిస్తోంది. ఐఐఎస్సీ, ఐఐటీలు కలిసి నిర్వహిస్తున్న జాయింట్‌ అడ్మిషన్‌ టెస్టు టు ఎమ్మెస్సీ (జామ్‌), జాయింట్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్టు (జస్ట్‌)ల్లో ఎందులో మెరిసినా ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీలో చేరి, స్టైపెండ్‌ పొందవచ్చు.
ఎంటెక్‌: బీటెక్‌, బీఆర్క్‌, బీడిజైన్‌ కోర్సులు చదివిన విద్యార్థులు ఐఐఎస్సీలో తమకు నచ్చిన బ్రాంచీలో ఎంటెక్‌, ఎంటెక్‌ రిసెర్చ్‌, ఎంఆర్క్‌, ఎం డిజైన్‌ చదువుకునే అవకాశం ఉంది. గేట్‌, జస్ట్‌, సీడ్‌ పరీక్షల్లో చూపిన ప్రతిభతో సంబంధిత కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. ఈ కోర్సుల్లో చేరినవారికి స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఇంజినీరింగ్‌/ టెక్నాలజీల్లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తిచేసుకున్న విద్యార్థులు ఇక్కడి మేనేజ్‌మెంట్‌ పీజీ (ఎంబీఏ) కోర్సులో చేరవచ్చు. గేట్‌/ క్యాట్‌/ జీమ్యాట్‌ స్కోర్‌తో అవకాశం లభిస్తుంది.
పీహెచ్‌డీ: ఈ సంస్థ పలు సైన్స్‌, ఇంజినీరింగ్‌, టెక్నాలజీ విభాగాల్లో పీహెచ్‌డీలు అందిస్తోంది. పీజీ కోర్సులు పూర్తిచేసుకున్నవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. నెట్‌, గేట్‌, ఇన్‌స్పైర్‌ వీటిలో ఎందులోనైనా మెరిస్తే ఐఐఎస్సీలో పరిశోధనలు చేసుకుంటూ ప్రతినెలా స్టైపెండ్‌ పొందవచ్చు. పరిశోధన, అభివృద్ధి ప్రయోగశాలలు, పరిశ్రమలు, బోధన రంగాల్లో పనిచేస్తున్న నిపుణుల కోసం ఈ సంస్థ ఎక్స్‌టర్నల్‌ పీహెచ్‌డీ కోర్సులనూ అందిస్తోంది. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభతో వీరికి అవకాశం ఉంటుంది.

టాప్‌ టెన్‌ సంస్థలు
ఐఐఎస్సీ- బెంగళూరు, జేఎన్‌యూ- న్యూదిల్లీ, జామియా మిల్లియా ఇస్లామియా- న్యూదిల్లీ, జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ- కోల్‌కతా, అమృతా విశ్వ విద్యాపీఠం- కోయంబత్తూర్‌, బీహెచ్‌యూ- వారణాశి, మణిపాల్‌ అకాడెమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌- మణిపాల్‌, కలకత్తా యూనివర్సిటీ-కోల్‌కతా, వెల్లూరు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ-వెల్లూరు, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం.
తెలుగు రాష్ట్రాల్లో: యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ 10, ఉస్మానియా విశ్వవిద్యాలయం 22, కేఎల్‌యూ 27, ఆంధ్రా యూనివర్సిటీ 36, శ్రీ వెంకటేశ్వర 67, గీతం 92, విజ్ఞాన్‌ 95 స్థానాలు దక్కించుకున్నాయి.  


 

బోధన, అభ్యసన వనరులు, పరిశోధనలు, ప్రవేశం పొందుతున్న విద్యార్థుల్లో వైవిధ్యం, పట్టాలు పుచ్చుకుంటున్నవారు, విద్యా నిపుణులు, పరిశ్రమ వర్గాలు వ్యక్తం చేసిన అభిప్రాయం...తదితర అంశాలను ప్రామాణికంగా చేసుకుని ఈ ర్యాంకులు కేటాయించారు.

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని