చేతితో రాస్తున్నారా?

ఒకప్పుడు చదువుకోవాల్సిన నోట్సులన్నీ విద్యార్థులు చేతితో స్వయంగా రాసుకునేవారు. కానీ ఇప్పుడు ప్రింట్లు తీసుకునే పద్ధతి ఎక్కువైంది. పరీక్షలప్పుడు తప్ప మిగతా రోజుల్లో రాయడం తగ్గిపోయింది. అయితే కాలానికి తగినట్టు మార్పు సహజమే అయినా

Published : 26 Jul 2022 01:03 IST

ఒకప్పుడు చదువుకోవాల్సిన నోట్సులన్నీ విద్యార్థులు చేతితో స్వయంగా రాసుకునేవారు. కానీ ఇప్పుడు ప్రింట్లు తీసుకునే పద్ధతి ఎక్కువైంది. పరీక్షలప్పుడు తప్ప మిగతా రోజుల్లో రాయడం తగ్గిపోయింది. అయితే కాలానికి తగినట్టు మార్పు సహజమే అయినా, చేతితో రాసే అలవాటును మాత్రం మానేయకూడదు. ఇది విద్యార్థులకు చాలావిధాలుగా మేలు చేస్తుందంటున్నారు  పరిశోధకులు. ఎందుకంటే...

మనం కంప్యూటర్‌లో టైప్‌ చేసినంత వేగంగా చేతితో రాయలేం. నెమ్మదిగా అర్థం చేసుకుంటూ రాయడం వల్ల ఆ విషయాన్నంతా మెదడు నిక్షిప్తం చేసుకుంటుంది. అందువల్ల తిరిగి చదవకపోయినా ఏం రాశామో గుర్తుంటుంది. అదే టైప్‌ చేసేటప్పుడు ఇలా గుర్తుండే అవకాశం తక్కువ. రాయడం వల్ల బ్రెయిన్‌లో వర్కింగ్‌ మెమరీ యాక్టివ్‌గా ఉంటుంది.

ఇలా రాయడం పదాల స్పెల్లింగ్‌ నేర్చుకోవడానికి, పదసంపద పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది.

మనిషికి ఏదైనా గుర్తుంచుకునే సామర్థ్యం చిన్న వయసులో ఉన్నంతగా పెద్దయ్యాక ఉండదు. వయసుపెరిగేకొద్దీ అది మరింత తగ్గి మతిమరుపునకు దారితీస్తుంది. కానీ తరచూ చేత్తో రాయడం వల్ల బ్రెయిన్‌, మెమరీ, మోటర్‌స్కిల్స్‌ అన్నీ బాగుండి ఎక్కువకాలం తెలివిగా ఆలోచించ గలుగుతాం.

చేతితో రాయడం మార్కుల పెరుగుదలకు కూడా తోడ్పడుతుంది. ఒక పరిశోధన ప్రకారం డిజిటల్‌గా చదివిన వారికంటే కాగితంపై రాసి సాధన చేసిన వారు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నట్లు తేలింది.

అంతేకాదు, ఇలా రాసేవారిలో సృజనాత్మకత స్థాయులు కూడా ఎక్కువగా ఉంటాయి.

ఆలోచనల సుడిలో ఒత్తిడితో సతమతమయ్యే మనసుకు రాయడం ద్వారా ప్రశాంతత చేకూరుతుంది. హాయిగా కూర్చుని రిలాక్స్‌ అయ్యేందుకు దోహదం చేస్తుంది.


చక్కగా రాయడం వల్ల బొటనవేలు, చూపుడువేలు మధ్య సరైన సమన్వయం ఉండి, అది ఇతర పనులు, ఆటల్లోనూ సాయపడుతుంది. భుజాలు, మణికట్టు, మోచేయి, వేళ్లకు ఇది చక్కటి కసరత్తు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని