కాళ్ల కింద భూమి కదిలిపోతే!

కాళ్ల కింద భూమి ఒక్కసారిగా కదిలిపోతుంది. పునాదులతో సహా నిర్మాణాలు కూలిపోతాయి. ఆస్తులు, ప్రాణాలకు అపారనష్టం సంభవిస్తుంది. ఇవన్నీ భూకంపాలు సృష్టించే విధ్వంసకర విపరీత పరిణామాలు. ప్రపంచంలోని అనేక ప్రాంతాలు ఆ విపత్తు పరిధిలోనే ఉన్నాయి. మన దేశంలోనూ అపాయం పొంచి ఉంది.

Published : 03 Oct 2022 00:51 IST

జనరల్‌ స్టడీస్‌ - విపత్తు నిర్వహణ

కాళ్ల కింద భూమి ఒక్కసారిగా కదిలిపోతుంది. పునాదులతో సహా నిర్మాణాలు కూలిపోతాయి. ఆస్తులు, ప్రాణాలకు అపారనష్టం సంభవిస్తుంది. ఇవన్నీ భూకంపాలు సృష్టించే విధ్వంసకర విపరీత పరిణామాలు. ప్రపంచంలోని అనేక ప్రాంతాలు ఆ విపత్తు పరిధిలోనే ఉన్నాయి. మన దేశంలోనూ అపాయం పొంచి ఉంది. ఆ వైపరీత్యాలకు కారణాలను, తీవ్రతను తగ్గించే వ్యూహాల గురించి అభ్యర్థులు పోటీ పరీక్షల కోణంలో తెలుసుకోవాలి.

భూకంపాలు - సంభవించే ప్రాంతాలు

ప్రపంచంలో శక్తిమంతమైన భూకంపాలు ఖండపలకల చలనాలు లేదా విరూపకారక చలనాల వల్ల సంభవిస్తున్నాయి. భూమి మొదటిపొర అయిన భూపటలం విరూపకారక పలకలుగా లేదా శిలాఖండాలుగా విడిపోయి ఉంటుంది. అవి వాటి దిగువనున్న అర్ధ ద్రవశిలా పదార్థంతో ఉన్న పొరపై మెల్లగా కదులుతూ ఉంటాయి. ఆ సమయంలో పలకల మధ్య సంపీడన, తన్యత బలాలు పనిచేస్తాయి. దాంతో పగుళ్ల ద్వారా శక్తి విడుదలై కంపన తరంగాలుగా మారి భూమి ఉపరితలంపై ప్రభావం చూపిస్తుంది.

ప్రపంచంలో..

ఖండ పలకల కదలికల ఆధారంగా ప్రపంచంలో భూకంపాలు సంభవించే ప్రదేశాలను 3 మేఖలలుగా విభజించారు.

పసిఫిక్‌ పరివేష్టిత మేఖల: అమెరికన్‌ భూపటలం పలక పశ్చిమానికి జరుగుతుండగా నాజ్కా పలక, కోకోస్‌ పలకలు తూర్పు వైపు జరగడం వల్ల; పసిఫిక్‌ సముద్ర పలక పశ్చిమానికి జరుగుతూ ఫిలిప్పీన్స్‌, సోలోమాన్‌, ఫిజి పలకలను ఒత్తిడికి గురిచేస్తుంది. దాంతో పసిఫిక్‌ సముద్రం చుట్టూ 65% భూకంపాలు సంభవిస్తున్నాయి. అంతేకాకుండా పసిఫిక్‌ చుట్టూ ఎక్కువగా అగ్నిపర్వత విస్ఫోటాలు జరుగుతుంటాయి. అందువల్ల పసిఫిక్‌ పరివేష్టిత మేఖలను పసిఫిక్‌ అగ్నివలయం అంటారు. ఈ ప్రాంతంలో ఉన్న చిలీ, పెరూ, ఈక్వెడార్‌, కొలంబియా, అర్జెంటీనా, హైతీ, హోండరస్‌, నికార్‌గువా, ఎల్‌సాల్వడార్‌, కోస్టారికా, గ్వాటెమాల, మెక్సికో పశ్చిమతీరం,   అమెరికా పశ్చిమతీరం (కాలిఫోర్నియా, అలాస్కా రాష్ట్రాలు), రష్యా తూర్పు భాగం, జపాన్‌, ఫిలిప్పీన్స్‌, దక్షిణకొరియా, ఇండోనేసియా, బ్రూనై, తూర్పు తైమూర్‌, న్యూజిలాండ్‌, పపువా - న్యూగినియా, టోంగా, వనౌతు దేశాలు ఎక్కువగా భూకంపాలను ఎదుర్కొంటున్నాయి. న్యూజిలాండ్‌కు దగ్గరలో ఉన్న ఆస్ట్రేలియాకు భూకంపాల బెడద లేదు. ఎందుకంటే ఆస్ట్రేలియా భూమి అడుగు భాగంలో కంపనాలు ప్రయాణించే భ్రంశాలు లేవు.

ఆల్ప్స్‌ - మధ్యదరా సముద్రం - ఆసియన్‌ మేఖల: ఈ ప్రాంతంలో మధ్యదరా సముద్రంలో యురేషియన్‌ పలకతో ఆఫ్రికన్‌ పలక రాపిడి చేస్తుంది. ఇండియన్‌ క్రస్ట్‌ పలక ఉత్తరానికి  జరుగుతూ టిబెట్‌ ప్రాంతంలో యురేషియన్‌ పలకను ఒత్తిడి చేస్తుంది. అరేబియన్‌ పలక, ఇరానియన్‌ చిన్న పలకలు ఒకదానికొకటి   ఎదురుగా జరుగుతూ యురేషియన్‌ క్రస్ట్‌   పలకతో రాపిడి చేస్తున్నాయి. ఈ ప్రాంతంలో 20% భూకంపాలు సంభవిస్తున్నాయి. పోర్చుగల్‌, ఇటలీ, గ్రీస్‌, రొమేనియా, బల్గేరియా, మాసిడోనియా, సెర్బియా, మాంటెనెగ్రో, క్రొయేషియా, తుర్కియే (టర్కీ), ఆల్బేనియా, సైప్రస్‌, జార్జియా దేశాలతో పాటు ఆసియా ఖండంలో భారత్‌, అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌, నేపాల్‌, భూటాన్‌, చైనా, మయన్మార్‌, తజికిస్థాన్‌, కజక్‌స్థాన్‌, ఆర్మేనియా, ఇరాన్‌, ఇజ్రాయెల్‌, జోర్డాన్‌ దేశాలు; ఆఫ్రికా ఖండంలో మధ్యదరా సముద్రపు అంచులోని అల్జీరియా, మొరాకో దేశాలు ఈ మేఖల పరిధిలో ఉన్నాయి.

చిన్న మేఖల: అట్లాంటిక్‌ మహాసముద్ర భూతలంలో, హిందూ మహాసముద్రంలోని ఎర్రసముద్రం అంచు వెంబడి, తూర్పు ఆఫ్రికాలోని పగులులోయ వెంట ఉన్న ఈజిప్ట్‌, జిబౌటి, ఇథియోపియా, ఐస్‌లాండ్‌, ఆఫ్రికా పశ్చిమ తీరంలోని కేప్‌వర్ది దీవులు ఇందులో ఉన్నాయి. ఈ ప్రాంతంలో 15% భూకంపాలు సంభవిస్తున్నాయి.

భారత్‌లో..

హిమాలయాలు ప్రపంచంలో అత్యంత చురుకైన ముడుత పర్వతాలు. హిమాలయాల అంతర్భౌమ ప్రాంతం భౌగోళికంగా చాలా చురుకుగా ఉండి భూకంపాల సంభ్యావత  పెరగడానికి అనుకూలంగా ఉంది. హిమాలయాల తూర్పు ప్రాంతంలో మయన్మార్‌లోని అరకాన్‌యోమా ముడుత పర్వత మేఖల వద్ద, హిమాలయ పశ్చిమ భాగంలో పాకిస్థాన్‌లోని మక్రాన్‌ సముద్ర తీరం నుంచి అఫ్గానిస్థాన్‌ వరకు ఉన్న చమన్‌ భ్రంశ మండలంలో భూకంపాలు వస్తున్నాయి. ముఖ్యంగా టిబెట్‌ ప్రాంతంలో ఇండియన్‌ పలక  ఉత్తరానికి జరుగుతూ యురేషియన్‌ పలకలను ఒత్తిడి చేస్తోంది.

మన దేశంలో భూకంప భ్రంశ మండలాలను నాలుగు జోన్‌లుగా నిర్ణయించారు.

జోన్‌ 5: ఈ జోన్‌లో అత్యధిక అపాయం ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. ఇవి రిక్టర్‌ స్కేల్‌పై 7 నుంచి 9 పాయింట్ల తీవ్రతను నమోదు చేస్తాయి. అన్ని ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్‌ నికోబార్‌ దీవులు, ఉత్తర బిహార్‌, ఉత్తరాఖండ్‌, జమ్ము-కశ్మీర్‌లో కొంత ప్రాంతం, గుజరాత్‌లోని కచ్‌-భుజ్‌  ఈ జోన్‌లో ఉన్నాయి.

జోన్‌ 4: ఈ ప్రాంతంలో భూకంపాలు అధిక అపాయాన్ని కలిగిస్తాయి. రిక్టర్‌స్కేల్‌పై 6 నుంచి 7 పాయింట్ల తీవ్రత నమోదుకు అవకాశం ఉంది. దిల్లీ, సిక్కిం, దక్షిణ బిహార్‌, దక్షిణ ఉత్తరాఖండ్‌, గుజరాత్‌, జమ్ము-కశ్మీర్‌, పశ్చిమ బెంగాల్‌ దక్షిణ భాగం; మహారాష్ట్రలోని కొయనా ప్రాంతాలు ఈ జోన్‌లో ఉన్నాయి.

జోన్‌ 3: ఇక్కడ మాధ్యమిక భూకంపాల అపాయం ఉంటుంది. రిక్టర్‌స్కేల్‌పై 4 నుంచి 6 పాయింట్ల తీవ్రత నమోదవుతుంది. ఇందులో పంజాబ్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ పశ్చిమ భాగం, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, గోవా, లక్షదీవులు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. కోల్‌కతా, చెన్నై, ముంబయి మహానగరాలు కూడా ఈ జోన్‌లోకి వస్తాయి.

జోన్‌ 2: (1, 2 కలిపి) తక్కువ అపాయం లేదా అపాయం లేని చిన్న భూకంపాలు ఈ జోన్‌లో సంభవిస్తాయి. రిక్టర్‌ స్కేల్‌పై 0 నుంచి 4 పాయింట్ల తీవ్రత నమోదవుతుంది. ఇందులో రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ఈ జోన్‌లోకి వచ్చే ప్రధాన నగరాలు హైదరాబాద్‌, బెంగళూరు.

మనదేశంలో 5, 4 జోన్లు భూకంపాల ప్రమాదం ఉన్నవి కాగా 3, 2 జోన్లు సురక్షిత ప్రాంతాలుగా చెప్పవచ్చు. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్‌డీఎమ్‌ఏ) ప్రకారం భూకంపాల నష్టం ఎక్కువగా 5, 4 జోన్‌లలో ఉంది. దేశం మొత్తం భూభాగంలో   58.6% భాగానికి భూకంపాల ముప్పు ఉంది. 38 నగరాలు ఈ పరిధిలో ఉన్నాయి. ఇప్పటివరకు మనదేశంలో పెద్ద భూకంపం 1897లో షిల్లాంగ్‌లో వచ్చింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 8.7గా నమోదైంది.


ఒకే భూకంప తీవ్రత ఉన్న ప్రాంతాలను కలుపుతూ గీసిన రేఖలను ఐసోసిస్మల్‌ రేఖలు అంటారు. ఇవి సాధారణంగా కోడిగుడ్డు ఆకారంలో లేదా దీర్ఘవృత్తాకారంలో ఉంటాయి.


ప్రపంచంలో ఇప్పటివరకు సంభవించిన వాటిలో చిలీలో 1960, మే 22న వచ్చిన భూకంపం అతిపెద్దది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 9.25గా నమోదైంది. రెండో పెద్ద భూకంపం 1965లో అలాస్కాలో (9.1 తీవ్రత) వచ్చింది.


ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో 3, 2 భూకంపాల జోన్లు మాత్రమే విస్తరించి ఉన్నాయి. అంటే భూకంపాల బెడద అంతగా లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1969, ఏప్రిల్‌ 13న కిచ్చెన్నపల్లి గొల్లగూడెంలో పెద్ద భూకంపం సంభవించింది. దీన్ని భద్రాచలం భూకంపం అంటారు. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 5.7 గా నమోదైంది.


భూకంపాల తీవ్రతను తగ్గించే వ్యూహాలు

* భూకంప ప్రభావం నుంచి ఉపశమనానికి కమ్యూనిటీ సంసిద్ధత ఎంతో కీలకం.

* భూకంపాలు సంభవించిన సమయంలో పరిగెత్తకుండా డ్రాప్‌, కవర్‌, హోల్డ్‌ విధానం పాటించాలి.

* భవన నిర్మాణాల్లో సరైన ఆర్కిటెక్ట్‌, నాణ్యమైన ఉపకరణాలు   వినియోగించాలి.

* పెద్ద భవనాలకు మధ్యలో ఖాళీలు వదిలి, దీర్ఘచతురస్రాకార బ్లాకులుగా, ఆంగ్ల అక్షరాలు గి, లి, గీ, శ్రీ ఆకారాల్లో భవంతులు నిర్మించాలి.

* గట్టి నేలపై భవనాలను నిర్మిస్తే దృఢంగా ఉంటాయి. బలహీనమైన నేలపై ఉండే భవనాలు తీవ్రంగా కంపిస్తాయి.

* గోడలకు చిన్న కిటికీలు నిర్మించాలి. గోడలు, మూలలు కలిసే చోట రీఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏర్పాటు చేయాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని