చినుకు గోళమైనా.. మైనం పైకి పాకినా!

రెండు గాజు పలకల మధ్య నీటి పొర ఉంటే వాటిని విడదీయడం కాస్త కష్టం ఎందుకు? కీటకాలు నది నీటిపైనా చకచకా నడుచుకుంటూ వెళ్లడం ఎలా సాధ్యం? వాన చినుకులకు గోళాకారం ఏవిధంగా వస్తుంది?

Updated : 11 Mar 2023 02:23 IST

జనరల్‌ సైన్స్‌  
ఫిజిక్స్‌

రెండు గాజు పలకల మధ్య నీటి పొర ఉంటే వాటిని విడదీయడం కాస్త కష్టం ఎందుకు? కీటకాలు నది నీటిపైనా చకచకా నడుచుకుంటూ వెళ్లడం ఎలా సాధ్యం? వాన చినుకులకు గోళాకారం ఏవిధంగా వస్తుంది? కొవ్వొత్తిలో కరిగిన మైనం వత్తి పైభాగానికి ఎలా చేరుతుంది?  వాహనాల ముందు భాగాన్ని ప్రత్యేక ఆకారాల్లో తయారు చేయడానికి కారణం ఏమిటి?  పొంతన లేని ప్రశ్నలుగా అనిపించినా భౌతికశాస్త్రం వీటన్నింటికీ రెండు బలాలే మూలమని చెబుతోంది. ఆ బలాల విశేషాలు, అనువర్తనాలపై  అభ్యర్థులు అవగాహన పెంచుకుంటే పరీక్షల్లో కొన్ని ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలు గుర్తించవచ్చు.

ప్రవాహి ధర్మాలు - అనువర్తనాలు

పదార్థ భౌతిక స్థితుల్లో ముఖ్యమైనవి ఘన, ద్రవ, వాయువులు. వీటిలో ప్రవహించే గుణం ఉన్న ద్రవ, వాయు పదార్థాలను ప్రవాహులు అంటారు. ఇవి కొన్ని ప్రత్యేకమైన ధర్మాలను ప్రదర్శించడం వల్ల మన నిత్య జీవితంలో ఎన్నో   అనువర్తనాలకు కారణమవుతున్నాయి.
ప్రవాహి/పదార్థ అణువుల మధ్య రెండు రకాల   ఆకర్షణ బలాలు పనిచేస్తుంటాయి. అవి-
1. సంసంజన బలం: ఒకే రకమైన అణువుల మధ్య పనిచేసే ఆకర్షణ బలాన్ని సంసంజన బలం అంటారు.
ఉదా: గాజు - గాజు, నీరు - నీరు, ఆల్కహాల్‌ - ఆల్కహాల్‌ మొదలైన అణువుల మధ్య పనిచేసే బలం.
2) అసంసంజన బలం: రెండు వేర్వేరు రకాల అణువుల మధ్య పనిచేసే ఆకర్షణ బలాన్ని అసంసంజన బలం అంటారు.
ఉదా: గాజు - నీరు, గాజు - పాదరసం, గాజు - కిరోసిన్‌ లాంటి పదార్థ అణువుల మధ్య పనిచేసే ఆకర్షణ బలాలు.

వివిధ ధర్మాలు

1. తలతన్యత: ద్రవంలో అణువుల మధ్య పనిచేసే సంసంజన బలాల వల్ల ద్రవ ఉపరితలం కనిష్ఠ వైశాల్యాన్ని సంతరించుకునే ధర్మాన్నే తలతన్యత అంటారు లేదా ద్రవ ఉపరితలంపై ప్రమాణ పొడవుకి లంబంగా పనిచేసే బలాన్ని తలతన్యత అంటారు.
       బలం (F)
T  = -----------

    పొడవు( I )


ప్రమాణాలు:SI పద్ధతిలో న్యూటన్‌/మీటర్‌ లేదా దిబిళీ పద్ధతిలో డైన్‌/సెం.మీ. సంసంజన బలాలు ఎక్కువగా ఉన్న ద్రవానికి తలతన్యత అధికంగా ఉంటుంది. ఫలితంగా ఆ ద్రవ ఉపరితలం కనిష్ఠ ఉపరితల వైశాల్యాన్ని పొందుతుంది.
అనువర్తనాలు: * వర్షపు చినుకులు గోళాకారంగా ఉండటం.   * చిన్న చిన్న కీటకాలు ప్రవాహాల ఉపరితలాలపై నడవడం.   * పెయింట్‌లో ముంచిన బ్రష్‌ వెంట్రుకలు దగ్గరగా చేరడం.
* తలకు నూనె రాసుకున్నప్పుడు వెంట్రుకలన్నీ దగ్గరగా రావడం.  * ద్రవ ఉపరితలం సాగదీసిన రబ్బరులా ప్రవర్తించడం.
* రెండు గాజు పలకల మధ్య పలుచటి నీటి పొర ఏర్పడితే నీటికి ఉన్న తలతన్యత వల్ల ఆ రెండు గాజు పలకలను విడదీయడం కష్టమవుతుంది.* ద్రవ తలతన్యత మలిన పదార్థాలను కలపడం ద్వారా తగ్గుతుంది. అందువల్లే టూత్‌పేస్ట్‌లో కొద్దిగా తైలాన్ని కలుపుతారు. ఎందుకంటే తలతన్యత తగ్గి నురగ నోరంతా విస్తరించి దంతాలు శుభ్రమవుతాయి.* ఉష్ణోగ్రత పెరిగితే అణువుల మధ్య దూరం పెరిగి సంసంజన బలాలు తగ్గుతాయి. ఫలితంగా ఆ ద్రవ తలతన్యత తగ్గుతుంది.

ఉదాహరణ: * దుస్తులను కొద్దిగా వేడినీటిలో ఉతికితే తలతన్యత తగ్గి వాటిలోని మురికి త్వరగా వదులుతుంది.* వేడినీళ్లతో స్నానం చేస్తే శరీరం శుభ్రంగా ఉంటుంది. నీ వేడి వేడి సూప్‌ (పులుసు) నాలుకపై త్వరగా వ్యాపించి రుచికరంగా ఉంటుంది.

2. కేశనాళికీయత: సన్నటి కేశాల లాంటి (వెంట్రుక పాటి మందం) రంధ్రాల ద్వారా ద్రవం అన్ని దిశల్లో ఎగబాకే దృగ్విషయాన్ని కేశనాళికీయత అంటారు.త్యజీవితంలో కేశనాళికీయతకు ఉదాహరణలు: * వత్తుల్లోని సన్నని రంధ్రాల ద్వారా కిరోసిన్‌/నూనె ఎగబాకి కొనకు చేరి మండటం వల్ల నూనె దీపాలు వెలుగుతూ ఉంటాయి. * మండుతున్న కొవ్వొత్తిలో వేడెక్కిన మైనం కరిగి వత్తి ద్వారా పైకి చేరడం కేశనాళికీయతే. * మనుషులకు చెమట పట్టడం  * స్పాంజీ అతిచిన్న రంధ్రాలను కలిగి ఉండటంతో ఎక్కువ ద్రవాన్ని కేశనాళికీయత ధర్మం ఆధారంగా పీల్చుకుంటుంది. నీ కన్నీరు/ఆనంద బాష్పాలు రావడం.*చెట్లు వాటికి కావాల్సిన లవణాలు, నీటిని వేర్ల ద్వారా గ్రహించడం. *ఇంకు పెన్నులు, మార్కర్‌లు పనిచేసే విధానం. *కాగితం/వస్త్రంపై పడిన సిరా అన్ని దిశల్లో వ్యాపించడం. * నేలలో మట్టి కణాల మధ్య ఉండే ఖాళీ ప్రదేశాలు కేశనాళికల మాదిరిగా ప్రవర్తిస్తాయి. భూమి అడుగున ఉన్న తేమ ఈ సన్నని రంధ్రాల ద్వారా కేశనాళికీయత వల్ల భూమి పైపొరలను చేరి బాష్పీభవనం చెంది వ్యర్థమవుతుంది. అందువల్లే విత్తనాలను నాటే ముందు భూమిని దున్ని కేశనాళికా వ్యవస్థను ధ్వంసం చేసి వ్యర్థ బాష్పీభవనాన్ని అరికడతారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని