చిప్కో.. అప్పికో.. పేరేదైనా వన సంరక్షణే ధ్యేయం..!

జోధ్‌పూర్‌ రాజు 1730 ప్రాంతంలో నూతన రాజ మందిర నిర్మాణాన్ని తలపెట్టాడు.

Published : 26 Mar 2024 00:42 IST

టీఎస్‌పీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
ఇండియన్‌ జాగ్రఫీ

అటవీ సంరక్షణ ఉద్యమాలు

బిష్ణోయి ఉద్యమం

జోధ్‌పూర్‌ రాజు 1730 ప్రాంతంలో నూతన రాజ మందిర నిర్మాణాన్ని తలపెట్టాడు.

  • దీనికి అవసరమైన కలప కోసం ఖెజార్లి గ్రామంలో అడవులను నరకడానికి తన సైనికులను పంపగా వారిని అమృతాదేవి, ఆమె సహచరులు అడ్డుకున్నారు.
  • ఖెజ్రి (అకేసియా) చెట్లను నరకడాన్ని వ్యతిరేకిస్తూ వాటిని కౌగిలించుకున్నారు.
  • ప్రస్తుతం ఇది రాజస్థాన్‌ రాష్ట్ర వృక్షం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో దీన్ని జమ్మిచెట్టు అని పిలుస్తారు.

సైలెంట్‌ వ్యాలీ ఉద్యమం (1973 - 83)

కేరళ రాష్ట్రం పాలక్కాడ్‌ జిల్లాలోని పశ్చిమ కనుమల్లో సైలెంట్‌ వ్యాలీ అనే లోయ ఉంది.

  • ఈ అటవీ ప్రాంతంలో కీచురాళ్లు ఉండకపోవడంతో ఇది నిశ్శబ్దంగా ఉంటుంది. అందుకే దీనికి నిశ్శబ్ద లోయ అనే పేరు వచ్చింది. దీన్ని స్థానికంగా సైరంద్రి వనం అంటారు.
  • ఈ లోయ మీదుగా పశ్చిమంగా కుంతి నది ప్రవహిస్తుంది. కేరళ విద్యుత్‌ సంస్థ ఈ నదిపై 60 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉన్న 4 జల విద్యుచ్ఛక్తి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందించింది.
  • ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేరళ రాష్ట్రంలోని KSSP (కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్‌) ఒక ఉద్యమాన్ని ప్రారంభించింది.
  • ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో చెట్లను నరకడాన్ని వ్యతిరేకిస్తూ KSSP సంస్థ కోర్టుకు వెళ్లింది. తీవ్ర నిరసనల నేపథ్యంలో చివరికి కేరళ కోర్టు ఈ ప్రక్రియను ఆపాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
  • ప్రభుత్వం ఆనకట్టల నిర్మాణాన్ని విరమించుకుని సైలెంట్‌ వ్యాలీని 1985లో జాతీయ పార్క్‌గా ప్రకటించింది.
  • సైలెంట్‌ వ్యాలీ జాతీయ పార్క్‌లోని అరుదైన జంతువు సింహపు తోక కోతి (లయన్డ్‌ టెయిల్డ్‌ మకాక్‌).
  • KSSP ప్రజల్లో విజ్ఞానశాస్త్ర ప్రచారానికి, విద్యపై అవగాహన పెంపొందించడానికి వెలసిన స్వచ్ఛంద సంస్థ.

అప్పికో ఉద్యమం

  • ఉద్యమాన్ని దక్షిణాది చిప్కో ఉద్యమం అంటారు.
  • ఇది కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలోని గుచ్చిగడ్డే అనే గ్రామంలో ప్రారంభమైంది.
  • 1983లో పాండురంగ హెగ్డే ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు.
  • అప్పికో అంటే కౌగిలించుకోవడం అని అర్థం.

నర్మదా బచావో ఆందోళన్‌

భారతదేశ భూభాగానికి మధ్యలో తూర్పు నుంచి పడమరకు ప్రవహించే నది నర్మద.

  • దేశ చరిత్రలోనే నర్మదానదిపై అత్యంత పెద్దవైన అనేక ప్రాజెక్టులను నిర్మించాలని భారత ప్రభుత్వం ప్రతిపాదించింది.
  • ఈ నదిపై ఉన్న ప్రాజెక్టులు సర్దార్‌ సరోవర్‌ ప్రాజెక్టు (మహారాష్ట్ర), ఇందిరాసాగర్‌, ఓంకారేశ్వర్‌ (మధ్యప్రదేశ్‌), రాణి అవంతిబాయి ప్రాజెక్టు (మధ్యప్రదేశ్‌).
  • ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి వ్యతిరేకంగా 1985లో మేధాపాట్కర్‌, బాబా ఆమ్టేలు నాయకత్వం వహించారు. ఈ ఉద్యమం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
  • మధ్యప్రదేశ్‌ ప్రాంతంలోని అటవీ గ్రామాలైన జలసింధి, సాకర్జా, కకర్‌శిలా, అకాడియా గ్రామాల ప్రజలు తమ డిమాండ్‌లను, నర్మదానదిపై ఆనకట్టల నిర్మాణంతో తమకు జరిగే అన్యాయాన్ని వివరిస్తూ 1994లో అప్పటి మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్‌కు లేఖ రాశారు.

ప్రధాన డిమాండ్లు

ప్రాజెక్టులతో నిర్వాసితులయ్యే వారిలో కేవలం భూములున్న వారికే కాకుండా, అక్కడ నివసిస్తున్న ప్రజలందరికీ న్యాయమైన పరిహారం చెల్లించాలి.

  • ఆనకట్టల నిర్మాణంతో ముంపునకు గురైన అడవులకు బదులుగా అటవీ పెంపకాన్ని చేపట్టాలి.
  • భూములు కోల్పోయిన వారికి బదులుగా భూములు ఇవ్వాలి.
  • సరైన జీవనాధారం ఉన్నచోట పునరావాసం కల్పించాలి.
  • కానీ గిరిజనులు కోల్పోయిన భూమికి నష్టపరిహారం కింద ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద భూమి లేదు, నిర్వాసితులైన ప్రజలందరికీ సరైన పునరావాసం కల్పించడం సాధ్యం కాదు అనే రెండు విషయాలను ప్రభుత్వం ప్రకటించింది. ఫలితంగా గిరిజనులు ఉద్యమం ప్రారంభించారు.

తిరుగుబాటు ఫలితాలు

మొదట ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తీసుకుని సర్దార్‌ సరోవర్‌ ఆనకట్టను నిర్మించాలని నిర్ణయించారు. తీవ్ర నిరసనలు, ప్రజల సమీకరణ, ప్రదర్శనలు, నిరాహార దీక్షలు, అంతర్జాతీయ ఉద్యమాల తర్వాత ప్రపంచ బ్యాంకు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు సమకూర్చడానికి నిరాకరించింది.

  • అభివృద్ధి కార్యక్రమాల కారణంగా నిర్వాసితులైన ప్రజలకు తగినంత, గౌరవప్రదమైన నష్టపరిహారం చెల్లించే దిశగా ప్రభుత్వం ఆలోచించేలా చేసింది.
  • ప్రకృతికి ఆటంకం కలిగేలా నిర్మించే పెద్దపెద్ద కట్టడాల ప్రయోజనాలపై మాత్రమే కాకుండా ప్రజల జీవన విధానాలు, ప్రకృతి జీవవైవిధ్యంపై దాని ప్రభావం ఎలా ఉంటుందో అందరూ ఆలోచించేలా చేసింది.

నర్మదా బచావో ఉద్యమంలో అనేక ధోరణులు కలిసి ఉన్నాయి. అవి:

మూలవాసీ ప్రజల ఉద్యమం, నయా - ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం, పట్టణీకరణకు ఆనకట్టలు, పరిశ్రమలు, గనుల కోసం భూములు లాక్కుంటున్న నేపథ్యంలో తమ భూములను కాపాడుకోవడానికి రైతులు చేస్తున్న ఉద్యమాలు.


తెహ్రీ డ్యాం ఆందోళన

ది 1990లో జరిగిన ఉద్యమం.

  • భగీరథీ, ఖిలాంగన నదులు కలిసే చోట దీన్ని నిర్మించాలనుకున్నారు. దేశంలోనే ఇది ఎత్తయిన ప్రాజెక్టు.
  • సుందర్‌లాల్‌ బహుగుణ నాయకత్వంలో ఈ డ్యాం నిర్మాణానికి వ్యతిరేకంగా ఆందోళనలు ప్రారంభమయ్యాయి.
  • వి.డి.సక్లాని అనే వ్యక్తి తెహ్రీ డ్యామ్‌ వ్యతిరేక కమిటీని ఏర్పాటు చేశారు.

చిప్కో ఉద్యమం

1973లో ఉత్తరాఖండ్‌లోని గఢ్‌వాల్‌ కొండల్లో అలకనంద నదీ పరీవాహక ప్రాంతంలో ప్రభుత్వ అనుమతి పొందిన కాంట్రాక్టర్లు చెట్లను నరకడాన్ని నిరసిస్తూ స్థానికులు చేసిన ఉద్యమం.

  • చిప్కో అంటే హత్తుకోవడం అని అర్థం.
  • ఈ ఉద్యమాన్ని సుందర్‌లాల్‌ బహుగుణ ప్రారంభించారు.
  • పల్లెవాసులు చెట్లను హత్తుకుని గుత్తేదార్ల గొడ్లళ్లకు అడ్డుగా నిలిచారు.
  • ఈ ఉద్యమంలో గ్రామీణ మహిళలు ప్రధానంగా పాల్గొన్నారు.

జంగిల్‌ బచావో ఆందోళన్‌

1982లో ప్రస్తుత ఝార్ఖండ్‌ రాష్ట్రంలోని సింగ్‌భమ్‌ జిల్లా ప్రాంతంలో జరిగిన ఉద్యమం.

  • చోటానాగ్‌పుర్‌ అటవీ ప్రాంతంలో సహజసిద్ధమైన సాల్‌ చెట్లను తొలగించి వాటి స్థానంలో అధిక విలువైన టేకు చెట్లను పెంచడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
  • ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమమే జంగిల్‌ బచావో ఆందోళన్‌.

గాడ్గిల్‌ నివేదిక (2010)

శ్చిమ కనుమల్లో పర్యావరణ అధ్యయనానికి ఏర్పాటు చేసిన కమిటీ. మొదటగా పశ్చిమ కనుమల పర్యావరణ నిపుణుల కమిటీ అని, తర్వాత గాడ్గిల్‌ కమిషన్‌ అని పేరు పెట్టారు. ఈ కమిటీ 2011 ఆగస్టులో నివేదిక సమర్పించింది.

ముఖ్యాంశాలు: పశ్చిమ కనుమలను పర్యావరణపరంగా మూడు సున్నితమైన  ప్రాంతాలుగా గుర్తించాలి లేదా విభజించాలి.

  • జోన్‌ 1లో అభివృద్ధి కార్యక్రమాలు అంటే గనుల తవ్వకం, ప్రాజెక్టుల నిర్మాణం, థర్మల్‌ కేంద్రాలను నిషేధించాలి. కమిటీని కొన్ని సంఘాలు వ్యతిరేకించాయి. ముఖ్యంగా దక్షిణ కేరళ నుంచి వయనాడ్‌కు వెళ్లి రైతులుగా స్థిర నివాసం ఏర్పరచుకున్న సిరియన్‌ క్రైస్తవులు, గనుల తవ్వకం జరిపే వ్యక్తులు.
  • గాడ్గిల్‌ కమిటీ పర్యావరణం పట్ల అత్యంత ఆసక్తి చూపించింది అనే విమర్శ నేపథ్యంలో ఈ కమిటీ నివేదికను పునఃపరిశీలించడానికి కస్తూరి రంగన్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి సంఘాన్ని నియమించారు.

సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌

దీన్ని 1980లో అనిల్‌ అగర్వాల్‌ స్థాపించారు.

భారతదేశంలోని అభివృద్ధి, పర్యావరణ అంశాలపై అధ్యయనం చేసి వాటిపై అవగాహన కలిగేలా చేయడం దీని ఉద్దేశం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని