సర్వాంగీకార వినిమయ సాధనం!

ఆర్థిక లావాదేవీల కోసం మానవుడు సృష్టించిన వినిమయ సాధనమే ద్రవ్యం. ప్రభుత్వాలు చట్టబద్ధంగా జారీ చేసే నాణేలు, కరెన్సీ నోట్లతో పాటు ద్రవ్యత్వ విలువ ఉన్న అధీకృత కాగితాలు, కార్డులు నేడు ద్రవ్యంగా చెలామణి అవుతున్నాయి.

Published : 27 Mar 2024 00:07 IST

ఇండియన్‌ ఎకానమీ

ఆర్థిక లావాదేవీల కోసం మానవుడు సృష్టించిన వినిమయ సాధనమే ద్రవ్యం. ప్రభుత్వాలు చట్టబద్ధంగా జారీ చేసే నాణేలు, కరెన్సీ నోట్లతో పాటు ద్రవ్యత్వ విలువ ఉన్న అధీకృత కాగితాలు, కార్డులు నేడు ద్రవ్యంగా చెలామణి అవుతున్నాయి. మన దేశంలో ఒకప్పుడు పశువులను వస్తురూప ద్రవ్యంగా వాడితే, ప్రస్తుతం పాలిమర్‌ ద్రవ్యం విస్తృతంగా వినియోగంలో ఉంది. సమాజ, వ్యక్తిగత ఆర్థిక ప్రగతిలో కీలకమై, ప్రభుత్వాల ఆర్థిక స్థితిని మెరుగుపరిచే ద్రవ్యం పరిణామక్రమాన్ని, జారీ అయ్యే పద్ధతులను అభ్యర్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. ఇప్పటి ఆర్థిక వ్యవస్థలో ఉన్న ద్రవ్యం రూపాలు, రకాలు, వాటి అవసరం, ఉపయోగిస్తున్న సందర్భాలను అర్థం చేసుకోవాలి.

ద్రవ్యం

ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో ద్రవ్యం ప్రముఖ పాత్ర నిర్వహిస్తుంది. ఆధునిక సమాజంలో ద్రవ్యం ప్రవేశపెట్టక పూర్వం వస్తుసేవల కొనుగోలు, అమ్మకానికి ఒక నిర్దిష్ట మాధ్యమం లేదు. వస్తుమార్పిడి పద్ధతి అమల్లో ఉండేది. దానిలోని లోపాల వల్ల ద్రవ్యం ఒక వినిమయ మాధ్యమంగా చెలామణిలోకి వచ్చింది.

వస్తుమార్పిడి పద్ధతి: వస్తువును ఇచ్చి, దానికి బదులుగా కావాల్సిన మరొక వస్తువును పొందడాన్ని వస్తుమార్పిడి పద్ధతి లేదా వస్తు వినిమయ పద్ధతి అంటారు. వస్తుమార్పిడి పద్ధతిలో వినిమయ మాధ్యమం ఉండదు. అందుకే దీనిని వస్తువు నుంచి వస్తువు ఆర్థిక వ్యవస్థ అనేవారు.

ద్రవ్య ఆవిర్భావం - నిర్వచనం - పరిణామక్రమం: ‘మనీ’ (Money) అనే ఆంగ్ల పదం లాటిన్‌ పదమైన ‘మానెటా’ నుంచి పుట్టింది. రోమన్‌ దేవత అయిన మానెటా ఆలయంలో మొదటిసారి నాణేలు ముద్రించడం వల్ల ‘మనీ’ ఉద్భవించిందని చరిత్రకారుల అభిప్రాయం.

ద్రవ్యం రకాలు: విలువ, ఉపయోగిత ఆధారంగా నాలుగు రకాలుగా వర్గీకరిస్తారు. అవి 1) ద్రవ్య ముద్రణలో వినియోగించే వస్తువు ఆధారంగా ద్రవ్యం 2) ఆమోదయోగ్యత ఆధారంగా ద్రవ్యం 3) ద్రవ్యత్వం ఆధారంగా ద్రవ్యం 4) ఇతర రకాల ద్రవ్యం

పూర్తి ప్రమాణ ద్రవ్యం: ద్రవ్యం తయారీకి ఉపయోగించే లోహం అంతర్గత, బహిర్గత విలువలు సమానంగా ఉంటే అలాంటి ద్రవ్యాన్ని పూర్తి ప్రమాణ ద్రవ్యం అంటారు. ఉదా: 1835-93 మధ్య మనదేశంలో పూర్తి ప్రమాణం కలిగిన వెండి నాణేలు చెలామణిలో ఉండేవి.

తక్కువ ప్రమాణ ద్రవ్యం: నాణేల బహిర్గత విలువ అంతర్గత విలువ కంటే ఎక్కువగా ఉంటే అలాంటి ద్రవ్యాన్ని తక్కువ ప్రమాణ ద్రవ్యం అంటారు. దీనినే టోకెన్‌ మనీ అని కూడా అంటారు. ఉదా: ప్రస్తుతం మన దేశంలో ముద్రించే అన్నిరకాల కరెన్సీ నాణేలు.

ప్రాతినిధ్యపు ద్రవ్యం: తక్కువ విలువ ఉన్న లోహాన్ని లేదా కాగితాన్ని ద్రవ్యంగా ముద్రించి వాడితే, అలాంటి ద్రవ్యాన్ని ప్రాతినిధ్యపు ద్రవ్యం అంటారు. ఉదా: ప్రస్తుతం ఆర్‌బీఐ ముద్రించే కరెన్సీ నోట్లు, నాణేలు.

ప్రాతినిధ్యపు కాగితపు ద్రవ్యం: నూటికి నూరుశాతం లోహాన్ని నిల్వగా ఉంచి ద్రవ్యాన్ని జారీ చేస్తే అలాంటి ద్రవ్యాన్ని ప్రాతినిధ్యపు కాగితపు ద్రవ్యం అంటారు. ఉదా: మనదేశంలో జారీ చేసిన బంగారం, బులియన్‌ సర్టిఫికెట్లు.

పరివర్తనీయ కాగితపు ద్రవ్యం: కాగితపు ద్రవ్యాన్ని బంగారం లేదా వెండిలోకి మార్చుకోవడానికి వీలుంటే అది పరివర్తనీయ కాగితపు ద్రవ్యం.

అపరివర్తనీయ కాగితపు ద్రవ్యం: జారీ చేసిన కాగితపు ద్రవ్యం బంగారం లేదా వెండిలోకి మార్చుకోవడానికి వీలులేకపోతే అలాంటి ద్రవ్యాన్ని అపరివర్తనీయ కాగితపు ద్రవ్యం అంటారు.

చట్టబద్ధ ద్రవ్యం: ఆర్‌బీఐ జారీ చేసిన ద్రవ్యాన్ని చట్టబద్ధమైన ద్రవ్యం అంటారు. దీనికి చట్టం సమ్మతి ఉంటుంది. ఇది రెండు రకాలు:

1) అపరిమిత చట్టబద్ధ ద్రవ్యం: వ్యాపార వ్యవహారాల నిర్వహణకు, రుణాల పరిష్కారానికి ఎంత పరిమాణంలో అయినా తప్పనిసరిగా ఆమోదించాల్సిన ద్రవ్యాన్ని అపరిమిత చట్టబద్ధ ద్రవ్యం అంటారు. ఉదా: 50 పైసలకు మించి ఉన్న నాణేలు, రూపాయి నుంచి రూ.2000 వరకు నోట్లు. భారత్‌లో కాగితపు కరెన్సీని ఫియట్‌ మనీ అని, నాణేలను లీగల్‌ టెండర్‌ అని అంటారు.

2) పరిమిత చట్టబద్ధ ద్రవ్యం: కొంత పరిమితికి లోబడి ఆమోదించే ద్రవ్యమే పరిమిత చట్టబద్ధ ద్రవ్యం. ఉదా: 5, 10, 20, 25 పైసలు నాణేలు. వీటిని
రూ. 25 విలువ వరకే ఆమోదిస్తారు. 2011 జూన్‌ 30 నుంచి 25 పైసల నాణేన్ని ఆర్‌బీఐ రద్దు చేసింది.

చట్టబద్ధం కాని ద్రవ్యం: చట్టప్రమేయం లేకుండా ఇష్టాన్ని బట్టి కొన్నింటిని ద్రవ్యంగా అంగీకరిస్తే అలాంటి వాటిని చట్టబద్ధం కాని ద్రవ్యం అంటారు. దీనినే ఐచ్ఛిక ద్రవ్యం అని అంటారు. ఉదా: చెక్కులు, డ్రాఫ్టులు, హుండీలు.

సామాన్య ద్రవ్యం: ప్రజల వద్ద ఉన్న నాణేలు, కరెన్సీ నోట్లు, బ్యాంకుల వద్ద ఉండే డిమాండ్‌ డిపాజిట్లను సామాన్య ద్రవ్యం లేదా సంకుచిత ద్రవ్యం అని కూడా అంటారు. దీనికి 100% ద్రవ్యత్వం ఉంటుంది.

సమీప ద్రవ్యం: సామాన్య ద్రవ్యంతో పోల్చినప్పుడు వీటికి  ద్రవ్యత్వం తక్కువ. అవసరమైతే వీటిని తక్కువ ఖర్చుతో ద్రవ్యంగా మార్చుకోవచ్చు. అందుకే వీటిని సమీప ద్రవ్యం అంటారు.ఉదా: పొదుపు డిపాజిట్లు, బాండ్లు, డిబెంచర్లు, ట్రెజరీ బిల్లులు, ప్రామిసరీ నోట్లు.

ఇతర రకాల ద్రవ్యాలు:

1) ఆవర్జా ద్రవ్యం: జమా ఖర్చుల లెక్కలను ఏ ద్రవ్య యూనిట్‌ రూపంలో రాస్తారో ఆ ద్రవ్యాన్ని ఆవర్జా ద్రవ్యం అంటారు. ఉదా: రూపాయి, డాలర్‌.
2) వ్యవహారిక ద్రవ్యం: ఆర్థిక వ్యవస్థలో వాస్తవంగా చెలామణిలో ఉన్న ద్రవ్యాన్ని వ్యవహారిక ద్రవ్యం అంటారు. అన్ని వ్యవహారాలు దీంతోనే జరుగుతాయి.
3) విశ్వాసాశ్రిత ద్రవ్యం: వ్యవస్థ /ప్రభుత్వం /కేంద్రబ్యాంకుపై విశ్వాసం ఆధారంగా ద్రవ్యాన్ని ముద్రిస్తే అలాంటి ద్రవ్యాన్ని విశ్వాసాశ్రిత ద్రవ్యం అంటారు. మన దేశంలో ద్రవ్యాన్ని కనీస నిల్వల ఆధారంగా చేసుకుని విశ్వాసాశ్రిత పద్ధతిలో ముద్రిస్తారు.
4) పరపతి ద్రవ్యం: దీనినే బ్యాంకు ద్రవ్యం అని కూడా అంటారు.
ఉదా: బ్యాంకులు జారీ చేసే చెక్కులు, డ్రాఫ్టులు, వినిమయ బిల్లులు మొదలైనవి.
5) ఫియట్‌మనీ: ప్రభుత్వం అధికారం వల్ల కాగితపు ద్రవ్యం చెలామణిలో ఉంటే దాన్ని ఫియట్‌ మనీ అంటారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం దీన్ని జారీ చేస్తుంది. ఈ ద్రవ్యం వెనుక రిజర్వులు ఉండవు.
6) హాట్‌మనీ: విదేశీ సంస్థాగత పెట్టుబడులను హాట్‌ మనీ అంటారు. ఈ పెట్టుబడులు ఒక దేశం నుంచి మరొక దేశానికి వేగంగా తరలుతాయి.
7) డియర్‌ మనీ: అధిక వడ్డీ రేటుతో రుణాలు సులభంగా లభించని వ్యవస్థను డియర్‌ మనీ అంటారు.
8) నియర్‌ మనీ: బ్యాంకుల డిమాండ్‌ డ్రాఫ్టులు, పే ఆర్డర్లను నియర్‌ మనీ అంటారు.
9) కాల్‌ మనీ: ఒక బ్యాంకు అడిగిన వెంటనే వేరొక బ్యాంకు రుణాలు అందించడాన్ని కాల్‌ మనీ అంటారు. ఒక్క రోజుకు బ్యాంకులు ఇచ్చే రుణం కాల్‌ మనీ అని, 2-14 రోజులకు ఇచ్చే రుణాన్ని నోటీస్‌ మనీ అని, 14 రోజులకు మించితే టర్మ్‌ మనీ అని అంటారు.

ద్రవ్యం విధులు: వీటిని రెండు రకాలుగా వర్గీకరిస్తారు.  
1) ప్రాథమిక విధులు: వినిమయ మాధ్యమం: వస్తువుకు, వస్తువుకు మధ్య మధ్యవర్తిగా అమ్మకాలు, కొనుగోలు చేయడంలో ఉపయోగపడుతుంది.
విలువ కొలమానం: అన్నిరకాల వస్తుసేవలను ద్రవ్యంతో కొలవడాన్నే విలువ కొలమానం అంటారు.

2) గౌణ విధులు: ఇవి ప్రాథమిక విధులకు అనుబంధంగా ఉంటాయి. వీటినే ఉత్పన్న విధులు అంటారు.
విలువ నిధి: సంపదను ప్రస్తుత వినియోగానికే కాకుండా భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా నిల్వ చేయడానికి ఉపయోగించే ద్రవ్యమే విలువ నిధి. జె.ఎం.కీన్స్‌ దీన్ని ప్రతిపాదించారు.
వాయిదాల చెల్లింపుల ప్రమాణం: వ్యాపారాన్ని అరువు పద్ధతిలో నిర్వర్తించేందుకు ద్రవ్యం ఉపయోగపడటమే వాయిదాల చెల్లింపుల ప్రమాణం అంటారు.
విలువ బదిలీ: ద్రవ్యం విలువను బదిలీ చేయడానికి సాయపడుతుంది.

ఆచార్య కిన్లే ప్రకారం ద్రవ్య విధులు 3 రకాలు. అవి..

1) ప్రాథమిక  2) గౌణ 3) అనుషంగిక విధులు. అనుషంగిక విధులు అంటే
1) జాతీయ ఆదాయాన్ని ముద్రించడం 2) ఆదాయ సంపద పంపిణీ 3)ద్రవ్యత్వాన్ని ఆపాదించడం మొదలైనవి.

పాల్‌ ఎన్‌ జింగ్‌ ప్రకారం ద్రవ్యం విధులు రెండు రకాలు. అవి..

1) నిశ్చల  2) చలన విధులు. నిశ్చల విధులు అంటే ప్రాథమిక, ద్వితీయ అనుషంగిక విధులు. చలన విధులు అంటే ధరల స్థాయిని, ఉత్పత్తిని, వినియోగాన్ని, పంపిణీని ప్రభావితం చేసే విధులు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని