Exams: పరీక్షా కాలం.. ఇలా చేస్తే పిల్లల్లో ఒత్తిడి దూరం!

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఇంటర్‌ పరీక్షలు జరుగుతుండగా.. మరికొద్ది రోజుల్లోనే పదో తరగతి పరీక్షలు మొదలవ్వబోతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలు తీవ్ర ఆందోళనకు గురికాకుండా తల్లిదండ్రులకు కొన్ని సూచనలివే..

Published : 09 Mar 2024 12:10 IST

పిల్లలకే కాదు.. తల్లిదండ్రులకూ ఇది ‘పరీక్ష’ కాలమే..  ఓవైపు ఎండలు మండుతుంటే.. ఇంకోవైపు పిల్లల్లో పరీక్షల ఒత్తిడి. ప్రస్తుతం ఇంటర్‌ పరీక్షలు, త్వరలో జరగనున్న పదో తరగతి పరీక్షల నేపథ్యంలో పిల్లలు ఆందోళన, ఒత్తిళ్లకు గురికాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.  పిల్లల్లో శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు రాకుండా వారి పట్ల ఎలా వ్యవహరించాలనే అంశాలపై వైద్య నిపుణుల సూచనలివే..

  • పరీక్షల సమయంలో పిల్లలకు తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా అవసరం. కంగారు, ఒత్తిడితో అనారోగ్యాల్నీ తెచ్చిపెట్టుకుంటారు. ఇతరులతో పోల్చడం, కోప్పడ్డం.. దెప్పుళ్లకు ఇది సమయం కాదు. నువ్వు బాగా చేయగలవు, నాకు నీపై నమ్మకం ఉంది అని ప్రోత్సహించండి. కంగారు పడుతోంటే.. దగ్గరకు తీసుకొని ‘అన్నీ చదివున్నావ్‌.. పరీక్షలో గుర్తొస్తాయి. తప్పక బాగా రాస్తావు’ అనే భరోసా నింపండి.
  • టీవీ, ఫోన్‌ వంటివి నేటి పిల్లలకు ప్రధాన ఆకర్షణలుగా మారాయి. వాళ్లను చదువుకోమని చెప్పి.. మనం వాటితో సమయం గడుపుతుంటే పిల్లల ఏకాగ్రత దెబ్బతింటుంది. అందువల్ల మీరూ కొన్నాళ్లు వాటికి దూరంగా ఉండాల్సిందే. పిల్లలు అడిగితే వారి పక్కనే కూర్చోండి. ముఖ్యమైన పాయింట్లు రాసివ్వడం, అప్పజెప్పించుకోవడం వంటివి చేస్తుండండి.
  • పరీక్షల సమయంలో సహజంగానే పిల్లల మనసులు సున్నితంగా ఉంటాయి. ఇంట్లో గొడవలు వారిపై ప్రభావం చూపుతాయి. అలాంటివి వాళ్ల దృష్టికి వెళ్లకుండా జాగ్రత్తపడండి. చదువుకునే ప్రదేశం తలుపు, కిటికీలకు దూరంగా ఉండాలి. టీవీ, గోడమీద ఫొటోలు, బయటి శబ్దాలు.. వారి దృష్టిని మరల్చేవే. కాబట్టి, గోడమీద పాఠాల పాయింట్లు, స్టిక్‌ పేపర్లు పెట్టుకునే వీలుండేలా చూడండి.
  • అస్తమానం చదవమని చెప్పొద్దు. ఏకాగ్రత ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. కొందరు గంటల కొద్దీ చదివితే.. ఇంకొందరికి అరగంటకే అలసటొస్తుంది. కాబట్టి టైమ్‌టేబుల్‌నీ మీరే నిర్ణయించొద్దు. ఎంత సేపు అనే దానికన్నా నాణ్యత ముఖ్యం. ఏకధాటిగా చదువుతున్నా ఊరుకోవద్దు. విశ్రాంతి తీసుకునేలా చూడాల్సిన బాధ్యతా మనదే. ఏకాగ్రత కుదరకపోతే వేరేది చదవమనాలి. లేదా కాసేపు నచ్చిన పనిని చేయనివ్వాలి. 
  • గ్యాడ్జెట్లకు మాత్రం దూరంగా ఉంచాలి. చాలామందికి రాత్రంతా చదవడం అలవాటు. అది శారీరక, మానసిక ఆరోగ్యాలపై ప్రభావం చూపగలదు. మర్చిపోయే అవకాశాలూ ఎక్కువే. అలా కాకుండా తెల్లవారు జామున లేచి చదువుకోమనొచ్చు. నిద్ర విషయంలో రాజీ పడనివ్వద్దు.
  • ఒత్తిడి, భయంతో పిల్లలు కోపం, చిరాకు చూపిస్తే కోపగించుకోవద్దు. కారణం తెలుసుకోండి. తగిన సాయం చేయండి. పరీక్షలు జీవితంలో భాగమే కానీ.. ఇవే ప్రధానం కాదన్న విషయాన్ని చెప్పండి. ‘నింపాదిగా, నీకు వచ్చిందే రాసి రా’.. అని ప్రోత్సహించండి. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని