UGC: 228 వర్సిటీల్లో ఇంకా అంబుడ్స్‌మన్‌ను నియమించలేదు.. డీఫాల్ట్‌ యూనివర్సిటీల లిస్ట్‌ ఇదే..!

విద్యార్థుల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం అంబుడ్స్‌మన్‌ను నియమించాలని చెప్పినా పట్టించుకోనట్లుగా వ్యవహరించిన యూనివర్సిటీల జాబితాను యూజీసీ విడుదల చేసింది.

Published : 13 Mar 2024 15:33 IST

దిల్లీ: విద్యార్థుల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అంబుడ్స్‌మన్‌ను ఇంకా నియమించని యూనివర్సిటీల జాబితాను యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (UGC) బుధవారం విడుదల చేసింది. పదేపదే గుర్తు చేసినా అంబుడ్స్‌మెన్‌లను నియమించలేదంటూ ‘డీఫాల్ట్‌ యూనివర్సిటీల జాబితా’ పేరిట లిస్ట్‌ను విడుదల చేసింది. ఈ జాబితాలో 159 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఉండగా.. మరో 67 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, 2 డీమ్డ్‌ యూనివర్సిటీలు ఉన్నాయి. వీటిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరు యూనివర్సిటీలు ఉన్నాయి. అంబుడ్స్‌మన్‌లను 30రోజుల్లో నియమించాలని ఆదేశిస్తూ 2023 ఏప్రిల్‌లో యూజీసీ గెజిట్‌ విడుదల చేసింది. ఆ తర్వాత పలుమార్లు గుర్తు చేసినా ఇంకా (2024 మార్చి 12వరకు అప్‌డేట్‌ చేసిన జాబితా ఇది) నియమించని వర్సిటీల జాబితాను తాజాగా యూజీసీ కార్యదర్శి మనీశ్‌ ఆర్‌.జోషీ విడుదల చేశారు.

ఈ జాబితాలో ఉన్న యూనివర్సిటీలు అంబుడ్స్‌మన్‌లను నియమించినట్లయితే పూర్తి వివరాలను సెంట్రల్‌ వర్సిటీలకు సంబంధించి mssarma.ugc@nic.in; రాష్ట్ర యూనివర్సిటీలైతే smitabidani.ugc@nic.in, డీమ్డ్‌ వర్సిటీలైతే jitendra.ugc@nic.in, ప్రైవేటు వర్సిటీలైతే shakeel.ugc@nic.inకు ఈమెయిల్‌ ద్వారా పంపించవచ్చని సూచించారు. ఏదైనా వర్సిటీ, కళాశాల అంబుడ్స్‌మన్‌, ఫిర్యాదుల పరిష్కార కమిటీలను నియమించకపోతే సాధారణ ప్రజలు, విద్యార్థులు సైతం పైన పేర్కొన్న ఈ మెయిళ్లకు సమాచారం ఇవ్వొచ్చని యూజీసీ కార్యదర్శి తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో అంబుడ్స్‌మన్‌ను నియమించని వర్సిటీలివే..

ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి ఆరు వర్సిటీలు ఉన్నాయి. ఏపీలో మూడు, తెలంగాణ నుంచి మూడు చొప్పున ఉన్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్‌ ఫిషరీస్‌ యూనివర్సిటీ- విజయవాడ; క్లస్టర్‌ యూనివర్సిటీ -కర్నూలు, శ్రీ వేంకటేశ్వర వేదిక్‌ యూనివర్సిటీ- తిరుపతి. తెలంగాణలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ -వరంగల్‌, నిజాం ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ -హైదరాబాద్‌, రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీ-బాసర.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని