అభ్యంఘన ఆరోగ్యం!

పండగంటే ఆనందం. పండగంటే అనుబంధం. పండగంటే ఆరోగ్యమూనూ. మన ఉరుకుల పరుగుల జీవితాల్లో ఆనందాలను, సంతోషాలను నింపే పండగలు, వాటితో ముడిపడిన సంప్రదాయాలన్నీ ఆరోగ్య మంత్రాలే! సూర్యగమన ‘పుణ్యకాలం’తో ముడిపడిన సంక్రాంతి సంప్రదాయాలూ ఇలాంటివే. వీటిల్లో కొన్ని- దినచర్య, రుతుచర్యలుగా ఆయుర్వేదం పేర్కొన్న సూత్రాలే కావటం విశేషం.

Updated : 14 Jan 2020 00:25 IST

పండగంటే ఆనందం. పండగంటే అనుబంధం. పండగంటే ఆరోగ్యమూనూ. మన ఉరుకుల పరుగుల జీవితాల్లో ఆనందాలను, సంతోషాలను నింపే పండగలు, వాటితో ముడిపడిన సంప్రదాయాలన్నీ ఆరోగ్య మంత్రాలే! సూర్యగమన ‘పుణ్యకాలం’తో ముడిపడిన సంక్రాంతి సంప్రదాయాలూ ఇలాంటివే. వీటిల్లో కొన్ని- దినచర్య, రుతుచర్యలుగా ఆయుర్వేదం పేర్కొన్న సూత్రాలే కావటం విశేషం.

న జీవితమంతా కాలంతో ముడిపడిందే. కాల గమన మార్పులకు అనుగుణంగానే మన ఆరోగ్యచక్రమూ నడుస్తుంది. పండగలు, పబ్బాల వంటివన్నీ దీన్ని గాడితప్పకుండా చూడటానికే అన్నా అతిశయోక్తి కాదు. అనూచానంగా వస్తున్న సంప్రదాయాలు కావొచ్చు, జిహ్వ చాపల్యాన్ని తృప్తి పరచే వంటకాలు కావొచ్ఛు అన్నీ అన్యాపదేశంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి, మున్ముందు వచ్చే వాతావరణ మార్పులను తట్టుకునేలా శరీరాన్ని తీర్చిదిద్దుకోవటానికి ఉద్దేశించినవే. ఇందులో సంక్రాంతి సంప్రదాయాలకు విశేష ప్రాధాన్యమే ఉంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సంక్రాంతితోనే ఉత్తరాయనం మొదలవుతుంది. మన పెద్దలు దీన్ని పుణ్యకాలంగా భావించటం తెలిసిందే. ఆయుర్వేదం దీన్ని ‘ఆగ్నేయం’, ‘ఆదాన కాలం’గానూ పేర్కొంటుంది. ఈ కాలంలో సూర్య కిరణాల ప్రభావంతో మన ఒంట్లోంచి బలం (కఫం) బయటకు వెళ్లిపోతుంది. శరీరం కొంత ధాతు క్షీణతకు, బలహీనతకు గురవుతుంటుంది. అందుకే శరీరానికి మంచి పోషణ, రక్షణ కల్పించటం చాలా అవసరం. ఇందుకోసం కొన్ని పద్ధతులు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రత్యేకంగా పాటించటం కష్టమని మన పెద్దలు అనుకున్నారేమో గానీ ఆరోగ్యాన్ని చేకూర్చే సంప్రదాయాలను సంక్రాంతికి అనుసంధానం చేశారు. అభ్యంగనంతో శరీరాన్ని మర్దన చేసుకోవటం, నలుగు పెట్టుకోవటం, పిల్లలకు భోగిపళ్లు పోయటం వంటివన్నీ అలాంటివే. రోజువారీ జీవితంలో వీటి విశిష్టతను తెలుసుకొని ఉండటం.. వాటిని భావి తరాలకు అందించటం మనందరి బాధ్యత.

ఆహారమూ ఔషధమే!

సంక్రాంతి వంటకాల్లో నువ్వులకు ప్రత్యేక స్థానముంది. పోలెలు, సకినాలు, అరిసెలు, పులగం వంటివన్నీ నువ్వులను కలిపి చేసేవే. నువ్వులు ఒంట్లో వేడిని పుట్టిస్తాయి. కొవ్వును కరిగిస్తాయి. శరీరానికి బలాన్నిస్తాయి. వెంట్రుకలను వృద్ధి చేస్తాయి. పుండ్లు మాన్పుతాయి. దంతపుష్టికి తోడ్పడతాయి. ఆకలిని, బుద్ధిని పెంచుతాయి. వీటిల్లో క్యాల్షియం మోతాదులు చాలా ఎక్కువ. 100 గ్రాముల నువ్వుల్లో 975 మి.గ్రా. వరకు క్యాల్షియం ఉంటుంది. ఇది పాలలో కన్నా ఎక్కువ కావటం విశేషం. నువ్వుల్లో నల్ల నువ్వులు మంచివి. తెల్లనువ్వులు మధ్యమం. ఎర్ర నువ్వులు అధమం. నువ్వులను బెల్లంతో కలిపి తీసుకోవటమూ ఆనవాయితీ. బెల్లం సైతం వేడిని కలిగించేదే. ఈ కాలంలో రేగుపండ్లు విరివిగా కాస్తాయి. ఇవి పిల్లలకు, పెద్దలకు అందరికీ మంచివే. భోగినాడు పిల్లలకు భోగిపళ్లు పోయటం తెలిసిందే. రేగుపండ్లు జీర్ణకోశ వ్యవస్థలో క్రిములనూ హరిస్తాయి. జీర్ణసమస్యలను తగ్గిస్తాయి. ఆకలిని కలగజేస్తాయి. విరేచనం సాఫీగా అయ్యేలా చూస్తాయి. వాత, పిత్త దోషాలను తొలగిస్తాయి. దప్పిక, బడలిక, రక్తదోషాలను పోగొడతాయి.

అభ్యంగనం- మర్దనోత్తేజం

పండగ సంప్రదాయాల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది అభ్యంగనం. నూనెను ఒంటికి పట్టించి, ఒకింత బలంతో శరీరాన్ని మర్దన చేసుకుంటే కలిగే ఆనందమే వేరు. నూనెను సంస్కృతంలో స్నేహ అనీ అంటారు. అందుకేనేమో స్పర్శ, ప్రేమ, అనురాగం వల్ల కలిగే ప్రయోజనాలన్నీ అభ్యంగనంతోనూ కలుగుతాయని భావిస్తుంటారు. అభ్యంగనం ద్వారా మనసులో గాఢమైన ప్రేమ, నిశ్చింత భావనలు నెలకొంటాయి. మనసు ఆనందంగా ఉంటే అంతకన్నా కావాల్సిందేముంటుంది? శరీరమూ ఆరోగ్యంతో తొణికిసలాడుతుంది. అందుకే ఆయుర్వేదం దినచర్యలో భాగంగా అభ్యంగనానికి విశేష ప్రాధాన్యమిచ్చింది. జీర్ణ సమస్యలేవీ లేకుండా, తిన్నది బాగా జీర్ణం కావాలని కోరుకునేవారంతా అభ్యంగనం చేసుకోవాలని శాస్త్రం సూచిస్తోంది. ‘‘అభ్యంగమాచరేన్నిత్యం స జరాశ్రమవాతహా| దృష్టి ప్రసాద పుష్ట్యాయుస్స్వప్న సుత్వక్త దార్ఢ్యకృత్‌||’ అని చెబుతుంది. అంటే ప్రతిరోజూ నూనెతో మర్దన చేసుకుంటే వాతదోష వికారాలు, వృద్ధాప్యం, అలసట ఉండవని అర్థం. కంటి చూపూ మెరుగవుతుంది, ఆయుష్షు వృద్ధి చెందుతుంది, నిద్ర బాగా పడుతుంది, చర్మం నిగనిగలాడుతుంది. ధాతువులు పరిపుష్టమై శరీరం దృఢంగా తయారవుతుంది.

ఎందుకీ నూనె మర్దన?

స్పర్శ ఇంద్రియమైన చర్మం మీదే వాతదోషం ఎక్కువ. దీనికి అభ్యంగనం అడ్డుకట్ట వేస్తుంది. సాధారణంగా నువ్వుల నూనెతో మర్దన చేస్తుంటారు. ఉష్ణవీర్య గుణం కల నువ్వులు వేడిని పుట్టిస్తాయి. నూనెను గోరువెచ్చగా చేసి అభ్యంగనం చేసుకుంటే చర్మం కిందుండే కఫం, కొవ్వు కరుగుతాయి. మలినాలు తొలగిపోతాయి. మూసుకుపోయిన చర్మ రంధ్రాలు తెరచుకుంటాయి. దీంతో చర్మం కొత్త ఆరోగ్యాన్ని, కాంతిని సంతరించుకుంటుంది. తలకు అభ్యంగనంతో వెంట్రుకలు వృద్ధి చెందుతాయి. కపాలం వంటి వాటికి తృప్తిని కలగజేస్తుంది. చెవుల్లో నూనె వేసుకోవటం వల్ల అంకిళ్లు, మెడ, తల, చెవుల్లో తలెత్తే నొప్పుల వంటివి తగ్గుతాయి. పాదాలకు అభ్యంగనం చేసుకుంటే పాదాలు దృఢమవుతాయి. పాదాల పగుళ్లు సైతం తగ్గుతాయి.

ఎలా చేయాలి?

ఏ నూనెతోనైనా అభ్యంగనం చేయొచ్ఛు కాకపోతే నువ్వులనూనె, ఆవనూనె శ్రేష్ఠం. ఉదయం నిద్ర లేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని తర్వాత అభ్యంగనానికి ఉపక్రమించాలి. పరగడుపున చేయటం ఉత్తమం. ఒకవేళ భోజనం చేస్తే కనీసం మూడు గంటల వరకు ఆగాలి. తల, చెవులు, అరికాళ్లకు విశేషంగా మర్దన చేసుకోవటం మంచిది. ముందుగా మాడు నుంచి మొదలుపెట్టి.. ముఖం, చెవులు, మెడ, భుజాలు, చేతులు, వీపు, కడుపు, కాళ్లు, పాదాలు.. ఇలా వరుసగా నూనె అంటుకొని నెమ్మదిగా మర్దన చేసుకోవాలి.

వీలైనప్పుడల్లా..

నిజానికి రోజూ అభ్యంగనం చేసుకోవటం ఉత్తమం. అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్ఛు అందువల్ల రెండు, మూడు రోజులకొకసారి.. లేదూ వీలున్నప్పుడల్లా.. కనీసం పండగ పూటయినా అభ్యంగనం చేసుకోవటం మంచిది. దీనికి ఎక్కువ సమయమేమీ పట్టదు. స్నానానికి ముందు పది నిమిషాలు కేటాయించినా చాలు.

ఎవరికి వద్దు

అభ్యంగనం ఎవరైనా చేయొచ్ఛు కాకపోతే జబ్బులతో బాధపడుతున్నవారికి.. ముఖ్యంగా జ్వరం, దగ్గు వంటి కఫ సంబంధ జబ్బులు గలవారు అభ్యంగనం చేసుకోవటం తగదు. అజీర్ణ సమస్యలతో బాధపడేవారు.. చర్మం మీద గాయాలు, పుండ్లు ఉన్నవారు చేయకూడదు. మహిళలు రుతుక్రమ సమయంలో అభ్యంగనానికి దూరంగా ఉండాలి.

నలుగు సైతం..

నూనెతో మర్దన చేయటమే కాదు, నలుగు పెట్టుకోవటమూ అభ్యంగనమే. దీన్నే చూర్ణ రూప అభ్యంగనం అనీ ఉద్వర్తనం అనీ అంటారు. ‘‘ఉద్వర్తనం కఫహరం మేదసః ప్రవిలాపనమ్‌| స్థిరీకరణమంగానాం త్వక్ప్రసాదకరం పరమ్‌||’’.. అంటే నలుగు పెట్టుకుంటే ఒంట్లో కఫం, కొవ్వు కరుగుతాయని. అవయవాలకు పటుత్వం, చర్మానికి అధిక కాంతి కలుగుతాయి. బియ్యం, మినప్పప్పు, పెసరపప్పు పొడులతో తయారుచేసే సున్నిపిండిని నలుగుగా వాడుకోవటం మనం చూస్తున్నదే. నూనెతో శరీరాన్ని మర్దన చేసుకున్న తర్వాత చిరు చెమట పట్టేంతవరకు పనులు, వ్యాయామాలు చేయాలి. అప్పటికే ఒంటికి రాసుకున్న నూనె శారీరక శ్రమ చేసినప్పుడు చర్మ కణాల్లోకి బాగా చొచ్చుకొని పోతుంది. దానికి తోడు వ్యాయామం చేయటం వల్ల చర్మ రంధ్రాలు మరింతగా తెరచుకుంటాయి. దీంతో అక్కడున్న మలినాలు, క్రిములు ఇంకాస్త ఎక్కువగా బయటకు వచ్చేస్తాయి. అనంతరం సున్నిపిండిని కాస్త నీటితో తడిపి చర్మానికి రుద్దుకుంటే విశేషమైన గుణం కనిపిస్తుంది.

అనంతరం స్నానం..

లుగు పెట్టుకున్న తర్వాత స్నానం చేయాలని దినచర్య సూచిస్తుంది. ‘‘దీపనం వృష్య మాయుష్యం స్నానమూర్జాబలప్రదమ్‌| కండూమల శ్రమస్వేదతంద్రాతృడ్డాహపాప్మజిత్‌||’’.. స్నానం చేయటం వల్ల జఠరాగ్ని నుంచి వెంట్రుకల రంధ్రాల ద్వారా వెలువడే వేడిని స్నానం అడ్డుకొని దాన్ని మళ్లీ లోపలికి చేరేలా చేస్తుంది. దీంతో ఆకలి వృద్ధి చెందుతుంది. తిన్నది సరిగా జీర్ణమవుతుంది. ఫలితంగా శుక్ర ధాతువుల వంటినవ్నీ పరిపుష్టమవుతాయి. ఆయుష్షు వృద్ధి చెందుతుంది. హుషారు, బలం పెరుగుతాయి. దురద, శరీరంలోని మురికి, అలసట, చెమట, నిస్సత్తువ, దప్పిక, వేడి, పాపం హరిస్తాయి. పాపం అంటే మరేమిటో కాదు. శరీరానికి హాని చేసేదని. రోగకారక క్రిములు, మురికి, లోపలి మలినాలు, విషతుల్యాలవంటివన్నీ పాపాలే అనుకోవచ్ఛు ఇవన్నీ స్నానంతో తొలగిపోతాయి.

ఆరుబయట ఆటలూ..

త్తరాయనంలో సూర్యుడి కిరణాలు తీక్షణంగా ఉంటాయి. వీటితో విటమిన్‌ డి మరింత ఎక్కువగా లభిస్తుంది. అందుకేనేమో పిల్లలు, పెద్దలంతా ఆరుబయట గడపటానికి గాలిపటాలు ఎగరేయటం, కోళ్ల పందాలు, ఎద్దుల పోటీల వంటి సంప్రదాయాలు మొదలై ఉండొచ్చు.

వావిలాకు, పసుపు వేసి కాచిన నీళ్లతో స్నానం చేయటం మంచిది. వావిలాకు వాతహర ద్రవ్యం. ఇది నొప్పులను తగ్గిస్తుంది. పసుపు క్రిమిహరం. నూనెతో మర్దన చేయటం, నలుగు పెట్టుకోవటం వల్ల చర్మం నుంచి బయటకు వచ్చిన క్రిములేవైనా ఉంటే చనిపోతాయి. చర్మ రంధ్రాల్లో మిగిలిపోయిన క్రిములనూ హరిస్తుంది. కొన్నిచోట్ల స్నానం చేసే నీటిలో రేగుపండ్లు, నువ్వులు వేసే సంప్రదాయమూ కనిపిస్తుంది. రేగుపండ్లు క్రిములను సంహరిస్తాయి. నువ్వులు ఒంట్లో వేడిని పుట్టిస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని