ఎముకలకు వ్యాయామ దన్ను

వ్యాయామాలతో కండరాలు వృద్ధి చెందుతాయి. ఎముకలూ బలోపేత మవుతాయి. ఇలా శరీర నియంత్రణ, స్థిరత్వం, సమన్వయానికీ తోడ్పడతాయి. ఫలితంగా కింద పడిపోవటం, దెబ్బలు తగలటం, ఎముకలు విరగటం వంటి ప్రమాదాలనూ తగ్గిస్తాయి.

Published : 13 Jun 2023 01:28 IST

వ్యాయామాలతో కండరాలు వృద్ధి చెందుతాయి. ఎముకలూ బలోపేత మవుతాయి. ఇలా శరీర నియంత్రణ, స్థిరత్వం, సమన్వయానికీ తోడ్పడతాయి. ఫలితంగా కింద పడిపోవటం, దెబ్బలు తగలటం, ఎముకలు విరగటం వంటి ప్రమాదాలనూ తగ్గిస్తాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వల్ల వృద్ధులు కింద పడే అవకాశం మూడింట ఒక వంతు తగ్గుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కాబట్టి చిన్నవయసు నుంచే వ్యాయామాలు చేస్తే పెద్ద వయసులో ఎంతగానో ఉపయోగపడతాయి. ఎముకలను బలోపేతం చేసే వ్యాయామాలన్నీ కొన్ని ప్రత్యేక గుణాలతో ప్రయోజనాలు కల్పిస్తుండటం గమనార్హం.
ప్రతిఘటన బలం: డంబెల్స్‌ ఎత్తటం, రబ్బరు పట్టీలను సాగదీయటం, లేదూ శరీర బరువును మోయటం వంటి ప్రతిఘటన (రెసిస్టెన్స్‌) వ్యాయామాలు బలాన్ని ప్రయోగించటం ద్వారా ఎముకలు పుంజుకునేలా ప్రేరేపిస్తాయి.
బరువు మోయటం: పరుగు, నడక, డ్యాన్స్‌, పర్వతారోహణ, మెట్లు ఎక్కటం, ఆటల వంటివి గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా శరీర బరువును మోసేలా చేస్తాయి. గురుత్వాకర్షణను ఎదిరించే క్రమంలో ప్రయోగించే బలం మూలంగా ఎముకలు బలోపేతమవుతాయి.
ప్రభావాన్ని చూపటం: పరుగెత్తుతున్నప్పుడు పాదాన్ని కింద మోపిన ప్రతిసారీ శరీర బరువును మోసే ప్రభావం రెట్టింపు అవుతుంది. అందువల్ల స్కిప్పింగ్‌, జంపింగ్‌ వంటి అధిక ప్రభావాన్ని చూపే వ్యాయామాలు ఎముకలకు మరింత మేలు చేస్తాయి.
ఎక్కువ వేగంతో: వ్యాయామాల వేగం పెరిగితే శరీరం మీద ఇంకాస్త ఎక్కువ ప్రభావం పడుతుంది. ఉదాహరణకు- నెమ్మదిగా చేసే వాటితో పోలిస్తే పరుగు లేదా ఎక్కువ వేగంతో చేసే ఏరోబిక్‌ వ్యాయామాలు ఎముక పుష్టికి బాగా తోడ్పడతాయి.
హఠాత్తుగా దిశ మారటం: కదులుతున్నప్పుడు దిశ మారటమూ ఎముకలకు మేలు చేస్తుంది. హఠాత్తుగా తిరగటం, కదలటం-ఆగటం వంటి కదలికలతో ముడిపడిన ఫుట్‌బాల్‌ వంటి ఆటలాడే క్రీడాకారుల్లో తుంటి ఎముక చాలా బలంగా ఉంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఎక్కువ దూరాలు పరుగెత్తే క్రీడాకారుల్లో కన్నా వీరిలో ఎముక సాంద్రత ఎక్కువగా ఉంటున్నట్టు బయటపడింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు