నోరు మంచిదైతేనే..

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. ఆరోగ్యం కూడా మంచిదవుతుంది! నోటి ఆరోగ్యానికీ గుండెజబ్బు, మధుమేహం వంటి సమస్యలకూ సంబంధం ఉంటోంది మరి.

Published : 01 Aug 2023 01:07 IST

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. ఆరోగ్యం కూడా మంచిదవుతుంది! నోటి ఆరోగ్యానికీ గుండెజబ్బు, మధుమేహం వంటి సమస్యలకూ సంబంధం ఉంటోంది మరి. అంటే నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవటం ఇలాంటి జబ్బుల నివారణకూ తోడ్పడుతుందన్నమాట. వయసు మీద పడ్డవారికిది మరింత ముఖ్యం.

గుండెజబ్బు వంటి సమస్యల ముప్పు కారకాలన్నీ మన చేతిలో ఉండవు. ఉదాహరణకు- వయసు. ఇది మీద పడకుండా ఆపలేం. అదృష్టం కొద్దీ ఆరోగ్యకరమైన జీవనశైలి, మంచి వైద్య సంరక్షణతో ఇలాంటి ముప్పులను చాలావరకు తగ్గించుకునే అవకాశముంది. వీటిల్లో అత్యంత ముఖ్యమైంది నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవటం. అయితే వయసు మీద పడినవారిలో చాలామందికిది పెద్ద సమస్యగానే నిలుస్తోంది. ఇంతకీ నోటిని శుభ్రంగా ఉంచుకోవటమంటే? రోజుకు రెండు సార్లు (ఉదయం నిద్ర లేచాక, రాత్రి పడుకోబోయే ముందు) మృదువైన పోచలతో కూడిన బ్రష్‌తో పళ్లు తోముకోవటం, ఫ్లోరైడ్‌ టూత్‌పేస్ట్‌ వాడుకోవటం. దీంతో దంతాలు, చిగుళ్లు శుభ్రమవుతాయి. రోజూ పళ్ల మధ్య సన్నటి దారంతో శుభ్రం చేసుకోవటం, మౌత్‌వాష్‌తో పుక్కిలించటమూ ముఖ్యమే. వీటితో పళ్ల మధ్య చిక్కుకున్న పదార్థాలు తొలగిపోతాయి. అలాగే ప్రతి ఆరునెలలకు ఓసారి దంత వైద్యుడిని సంప్రదించటమూ తప్పనిసరి. అయితే అన్నిసార్లూ అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. వృద్ధులకైతే మరింత కష్టం. సొంతంగా ఆసుపత్రికి వెళ్లటం కుదరకపోవచ్చు. తోడుగా వచ్చేవారు లేకపోవచ్చు. డబ్బులు కూడా సమస్య కావొచ్చు. ఇలాంటి ఇబ్బందులన్నీ వృద్ధుల్లో రకరకాల నోటి సమస్యలకు దారితీస్తున్నాయి.


వృద్ధాప్యంలో దంత సమస్యలు

నోరు ఎండిపోవటం (జెరోస్టోమియా): వృద్ధాప్యంలో ఇది పెద్ద సమస్య. వయసు మీద పడినవారికి లాలాజలం తగ్గే ముప్పు ఎక్కువ. మూత్రం ఎక్కువగా వచ్చేలా చేసే, రక్తపోటును తగ్గించే మందుల వంటివీ దీనికి కారణమవుతుంటాయి. లాలాజలం నోటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుంది. దీనిలోని సూక్ష్మక్రిమి నాశక గుణాలు పళ్లు పుచ్చిపోవటం, ఇతర ఇన్‌ఫెక్షన్లను అడ్డుకుంటాయి. లాలాజలం ఊరటం తగ్గితే నోరు ఎండిపోతుంది. ఇది చిగుళ్లు, దంతాల సమస్యలకు దారితీస్తుంది. అరవై ఐదేళ్లు, అంతకన్నా ఎక్కువ వయసువారిలో దాదాపు అందరూ (96% మంది) పిప్పిపళ్లతో, ప్రతి ముగ్గురిలో ఇద్దరు చిగుళ్లు జబ్బుతో బాధపడుతున్నారని అంచనా. నోరు ఎండిపోవటం వల్ల కట్టుడు పళ్లు కుదురుగా ఉండవు. నమలటం, మాట్లాడటం, మింగటం కష్టమవుతుంది. లాలాజలం తగ్గితే నోట్లో పుండ్లు, ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌ (థ్రష్‌) కూడా తలెత్తొచ్చు.

* మద్యం, కెఫీన్‌ పానీయాలు, కూల్‌డ్రింకులు, మసాలా పదార్థాలు మానేస్తే నోరు ఎండిపోకుండా చూసుకోవచ్చు. చక్కెర లేని బిల్లలు, చూయింగ్‌ గమ్‌ నమలటం ద్వారా లాలాజల ఉత్పత్తి పెరుగుతుంది. అవసరమైతే కణజాలం తడిగా ఉండటానికి కృత్రిమ లాలాజలం వాడుకోవచ్చు.

శుభ్రం చేసుకోలేకపోవటం: వృద్ధుల్లో నోటి ఆరోగ్యం దెబ్బతినటానికి మరో కారణం రోజూ సరిగా శుభ్రం చేసుకోలేకపోవటం. వయసు మీద పడుతున్నకొద్దీ చేతులతో చేసే పనుల్లో నైపుణ్యం కొరవడుతుంది. బ్రష్‌ను గట్టిగా పట్టుకోలేకపోవటం వల్ల చాలామంది సరిగా పళ్లు తోముకోలేరు. దీంతో శుభ్రత కొరవడి, ఇన్‌ఫెక్షన్లు తలెత్తుతాయి. పళ్లూడటం మొదలవుతుంది. 65 ఏళ్లు పైబడినవారిలో ప్రతి ఐదు మందిలో ఒకరికి దాదాపు అన్ని పళ్లూ ఊడిపోతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. కట్టుడు పళ్లతోనూ ఇబ్బందులు తలెత్తొచ్చు. పళ్లు ఊడటం, కట్టుడు పళ్లతో ఆహారం నమలటం కష్టమవుతుంది. దీంతో సరిగా తినరు. మెత్తటి పదార్థాలు తినటానికి ఇష్టపడటం వల్ల పీచు ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు తినలేరు. ప్రొటీన్‌ను అందించే మాంసం తినటానికీ ఇబ్బంది పడతారు. ఇది పోషణలేమికి దారితీస్తుంది.

* చేతి పట్టు సరిగా లేనివారు ఎలక్ట్రిక్‌ టూత్‌బ్రష్‌, పెద్ద హ్యాండిల్‌ గల టూత్‌బ్రష్‌లతో పళ్లు తోముకోవచ్చు. రబ్బరుబ్యాండ్తో టూత్‌బ్రష్‌ను చేతికి బిగించుకోవటమూ మేలే.

ఇన్‌ఫెక్షన్లు: వయసు మీరినవారికి వైరల్‌, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్ల ముప్పు అధికం. ఎముక లేదా లాలాజల గ్రంథుల ఇన్‌ఫెక్షన్లు తరచూ చూస్తుంటాం. దంతాలకు చీము పట్టటమూ నోటి ఇన్‌ఫెక్షన్లకు కారణమవుతుంది. ఇవి దీర్ఘకాలంగా వేధిస్తూ ఉండొచ్చు కూడా. ఇలాంటి ఇన్‌ఫెక్షన్లకు సత్వరం చికిత్స చేయించుకుంటే మున్ముందు దుష్ప్రభావాలను నివారించుకోవచ్చు. అప్పటికే ఉన్న దీర్ఘకాల ఇన్‌ఫెక్షన్లు ఉన్నట్టుండి ఉద్ధృతం కాకుండా తప్పించుకోవచ్చు.

* దీర్ఘకాల ఇన్‌ఫెక్షన్లకు యాంటీబయాటిక్‌ మందులు, శస్త్రచికిత్సతో చీము వంటి వాటిని తీసేయటం, వదులుగా ఉన్న పళ్లను తొలగించటం, రూట్‌ కెనాల్‌ చికిత్స వంటి పద్ధతులు ఉపయోగపడతాయి.


పళ్లకూ ఇతర సమస్యలకూ సంబంధమేంటి?

నోటి అపరిశుభ్రతకూ గుండెజబ్బు, మధుమేహం వంటి సమస్యలకూ సంబంధం ఉంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి కారణమేంటన్నది స్పష్టంగా తెలియరాలేదు గానీ దీర్ఘకాల వాపుప్రక్రియ (క్రానిక్‌ ఇన్‌ఫ్లమేషన్‌) దోహదం చేస్తుండొచ్చని భావిస్తున్నారు. చిగుళ్లు, దంతాల ఇన్‌ఫెక్షన్లు, వీటికి కారణమయ్యే బ్యాక్టీరియా నోటి కణజాలాన్ని దాటుకొని రక్తం ద్వారా గుండె వంటి ఇతర భాగాలకు చేరుకునే ప్రమాదముంది. చిగుళ్ల వాపు (పెరియోడాంటైటిస్‌) చిగుళ్ల కణజాలాన్నీ, దంతాలకు దన్నుగా నిల్చే ఎముకనూ దెబ్బతీస్తుంది. చిగుళ్ల వాపుతో ఒంట్లో వాపు ప్రక్రియ ప్రేరేపితమవుతుంది. ఇది గుండె మీదా ప్రభావం చూపుతుంది.

  •  మధుమేహం నియంత్రణలో లేకపోతే లాలాజలంలోనూ గ్లూకోజు మోతాదులు పెరుగుతాయి. ఇదీ నోట్లో ఇన్‌ఫెక్షన్లకు కారణమవుతుంది. మధుమేహంతో లాలాజలం ప్రవహించటమూ నెమ్మదిస్తుంది. ఫలితంగా పళ్లు పుచ్చిపోవటం, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్ల ప్రమాదమూ పెరుగుతుంది. నోరు మండటం, రుచి మారిపోవటం వంటివీ తలెత్తొచ్చు.
  •  నోటి అపరిశుభ్రత మూలంగా అల్జీమర్స్‌, డిమెన్షియా ముప్పు పెరుగుతున్నట్టూ ఫిన్‌లాండ్‌లో నిర్వహించిన ఒక అధ్యయనంలో బయటపడింది.
  •  రుమటాయిడ్‌ కీళ్లవాతం గలవారికి నోరు ఎండిపోయే ప్రమాదముంది. ఇది పిప్పిపళ్లు, చిగుళ్లజబ్బుకు దారితీయొచ్చు.
  •  చిగుళ్ల జబ్బు గలవారికి పార్కిన్సన్స్‌ వచ్చే అవకాశం 43% ఎక్కువగా ఉంటున్నట్టు తైవాన్‌ అధ్యయనంలో వెల్లడైంది. పార్కిన్సన్స్‌కు వాడే కొన్ని మందులతో నోరు ఎండిపోవచ్చు. నియంత్రణలో లేని కదలికల మూలంగా దవడ నొప్పి, పళ్లు అరగటం, మింగటంలో ఇబ్బంది తలెత్తొచ్చు.
  •  ఒంటరితనం వంటి కారణాలతో వృద్ధుల్లో చాలామంది కుంగుబాటు (డిప్రెషన్‌) బారినపడుతుంటారు. ఇలాంటివారికి పిప్పిపళ్లు, పళ్లూడటం వంటి సమస్యల ముప్పు ఎక్కువని పరిశోధనలు పేర్కొంటున్నాయి. సహజ దంతాలు లేకపోవటం వల్ల కుంగుబాటు ముప్పూ 28% పెరుగుతుండటం గమనార్హం. దీనికి తోడు కుంగుబాటును తగ్గించే మందులతో నోరు ఎండిపోయే అవకాశమూ ఎక్కువవుతుంది. కొందరు విచారం, దిగులు నుంచి బయటపడటానికి పొగ తాగటం వంటివీ అలవాటు చేసుకుంటారు. ఇవీ నోటి ఆరోగ్యాన్ని దెబ్బతీసేవే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని