Updated : 14 Mar 2023 02:58 IST

శక్తి.. విటమిన్లు!

కోటగోడ దృఢంగా ఉంటే శత్రువులు లోపలికి రావటం కష్టం. అలాగే మన రోగనిరోధకశక్తి బలంగా ఉంటే బ్యాక్టీరియా, వైరస్‌ల వంటి హానికారక సూక్ష్మక్రిములు ఒంట్లోకి ప్రవేశించటం కష్టం. ఒకవేళ ప్రవేశించినా సమర్థంగా ఎదుర్కోవచ్చు. జబ్బులు తీవ్రం కాకుండా చూసుకోవచ్చు. రోగనిరోధకశక్తిని బలోపేతం చేసుకోవటంలో ఆహారం పాత్ర చాలా కీలకం. ముఖ్యంగా కొన్నిరకాల విటమిన్లు ఎంతగానో తోడ్పడతాయి.


విటమిన్‌ ఎ

ఇది జబ్బులతో పోరాడే తెల్ల రక్తకణాలు చురుకుగా పనిచేసేలా పురికొల్పుతుంది. ఇది లోపిస్తే ఇన్‌ఫెక్షన్‌ మూలంగా దెబ్బతిన్న జిగురుపొరల రక్షణ వ్యవస్థ సరిగా కోలుకోదు. ఫలితంగా సహజ రోగనిరోధకశక్తి తగ్గుతుంది. ఇన్‌ఫెక్షన్లతో పోరాడే నూట్రోఫిల్స్‌.. బ్యాక్టీరియా, వైరస్‌లను చుట్టుముట్టి, వాటిని చంపే మ్యాక్రోఫేజస్‌.. ప్రత్యేక ఎంజైమ్‌లతో ఇన్‌ఫెక్షన్‌కు గురైన కణాలను, కణితి కణాలను చంపే సహజ హంతక కణాల పనితీరూ మందగిస్తుంది. కాబట్టి వీలైనంత ఎక్కువ విటమిన్‌ ఎ తీసుకోవటం మంచిది. ఇది క్యారెట్లు, పాలకూర, బ్రోకలీ, చిలగడ దుంప, మామిడి పండ్లు, బొప్పాయి పండ్లు, గుడ్లు, చేపల్లో ఎక్కువగా ఉంటుంది. బీటా కెరొటిన్‌ కూడా విటమిన్‌ ఎ రకానికి చెందినదే. దీన్ని శరీరం అవసరమైనప్పుడు విటమిన్‌ ఎ రూపంలోకి మార్చుకుంటుంది. పసుపుపచ్చ, నారింజ రంగు పదార్థాలతో ఇది లభిస్తుంది.


విటమిన్‌ ఇ

ఇదొక యాంటీ ఆక్సిడెంట్‌. రోగనిరోధక వ్యవస్థలో వయసుతో పాటు తలెత్తే క్షీణతను నివారించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. తెల్ల రక్తకణాల సామర్థ్యాన్ని, కణ విభజన ప్రక్రియను పెంచుతుంది. కణస్థాయిలో రేగే వాపుప్రక్రియ(ఇన్‌ఫ్లమేషన్‌)కు సహకరించే అంశాలను అడ్డుకుంటుంది. విటమిన్‌ ఇ లోపంతో శ్వాసకోశ జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువవుతుంది. అలర్జీలు, ఆస్థమా ముప్పూ ఎక్కువే. పొద్దు తిరుగుడు పలుకులు, గుమ్మడి పలుకులు, వంటనూనెలు, తవుడుతో కూడిన గోధుమలు, బాదం, వేరుశనగ, పాలకూర వంటి వాటితో విటమిన్‌ ఇ లభిస్తుంది.


బి విటమిన్లు

ఇవీ రోగనిరోధక శక్తిని ఇనుమడింపజేస్తాయి. ముఖ్యంగా బి6, బి12 ఎంతో మేలు చేస్తాయి. చికెన్‌, గుడ్లు, చేపలు, బంగాళాదుంపలు, తృణధాన్యాలు, శనగల వంటి పప్పులు, అరటిపండ్ల వంటి వాటితో బి6 లభిస్తుంది. తెల్ల రక్తకణాలు వృద్ధి చెందటానికి, యాంటీబాడీల భాగాలు సమ్మేళనం కావటానికి విటమిన్‌ బి12 అత్యవసరం. ఇది చేపలు, మాంసం, గుడ్ల వంటి మాంసాహారంలో ఎక్కువగా ఉంటుంది.


విటమిన్‌ సి

రోగనిరోధకశక్తిని పెంచి, ఇన్‌ఫెక్షన్ల బారినపడకుండా కాపాడటంలో విటమిన్‌ సి ఎంతగానో తోడ్పడుతుంది. ఇది అత్యంత శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌. వైరస్‌ల వృద్ధిని అడ్డుకొని, అవి వ్యాప్తి చెందకుడా చూసే ఇంటర్‌ఫెరాన్‌ అనే రసాయనం ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. కణితుల నిర్మూలనకూ ఇంటర్‌ఫెరాన్‌ తోడ్పడుతుంది. విటమిన్‌ సి శరీరంలో నిల్వ ఉండదు. దీన్ని రోజూ ఆహారం ద్వారా లభించేలా చూసుకోవాల్సిందే. బత్తాయి, నారింజ వంటి పుల్లటి పండ్లు.. జామ పండ్లు, నిమ్మకాయ, ఉసిరికాయ, బ్రోకలీ, పచ్చిమిరప, బంగాళాదుంప, కొత్తిమీరలో దండిగా ఉంటుంది.


విటమిన్‌ డి

రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయటానికి విటమిన్‌ డి అత్యవసరం. ఇది టి కణాలు, మ్యాక్రోఫేజస్‌ కణాల పనితీరును ఉత్తేజితం చేస్తుంది. చర్మానికి ఎండ తగిలినప్పుడు మన శరీరమే దీన్ని తయారు చేసుకుంటుంది. గుడ్డులోని పచ్చసొన, జంతు కాలేయంలో కొంతవరకు ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు