సర్వాంగ శక్తి!

ఒక్క ఆసనంతోనే అన్ని అవయవాలు పుంజుకోవాలని అనుకుంటున్నారా? అయితే సర్వాంగాసనాన్ని సాధన చేయండి.

Published : 13 Apr 2021 13:13 IST

ఒక్క ఆసనంతోనే అన్ని అవయవాలు పుంజుకోవాలని అనుకుంటున్నారా? అయితే సర్వాంగాసనాన్ని సాధన చేయండి.

చేసే విధానం

* చేతులను పక్కలకు చాపి, వెల్లకిలా పడుకోవాలి.

* మోకాళ్లను వంచుతూ మడమలను తుంటి దగ్గరకు తీసుకురావాలి.

* ఒక్క ఉదుటున కాళ్లను, తుంటిని, నడుమును పైకి లేపాలి. తల, మెడ, మోచేతులు నేలకు ఆనించి ఉంచాలి. వీపునకు అర చేతులను గట్టిగా ఆనించి, దన్నుగా ఉండేలా చూసుకోవాలి.

* మోచేతులతో నేలను నొక్కుతూ  కాళ్లను తిన్నగా పైకి చాచాలి. కాలి వేళ్లు ముక్కుకు సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. 

* బరువు మోచేతులు, చేతి పైభాగాల మీదే పడేలా జాగ్రత్త పడాలి. బరువును తల, మెడ మీద పడనీయొద్దు. మెడను నేలకు నొక్కొద్దు. కావాలంటే మెడ కండరాలను కాస్త బిగిస్తూ మెడ బిగుతుగా ఉండేలా చూసుకోవచ్చు. ఛాతీ ముందు భాగంతో చుబుకాన్ని నొక్కాలి. (మెడ మీద ఒత్తిడి పడుతున్నట్టు గమనిస్తే ఆసనాన్ని ఆపెయ్యటం మంచిది).

* కళ్లను మూసుకొని, గాఢంగా శ్వాస తీసుకుంటూ 30-60 సెకండ్ల పాటు అలాగే ఉండాలి.

* అనంతరం నెమ్మదిగా యథాస్థితికి రావాలి. ముందుగా మోకాళ్లను నుదుటికి తాకించాలి. అరచేతులు నేల వైపు ఉండేలా చేతులను నేలకు ఆనించాలి. తలను పైకి లేపకుండా నెమ్మదిగా వెన్నెముకను క్రమంగా కిందికి తీసుకురావాలి. కాళ్లను తిన్నగా చాచి ఒక నిమిషం సేపు విశ్రాంతి తీసుకోవాలి. 

* విశ్రాంతి తీసుకున్న తర్వాత మత్స్యాసనం లేదా భుజంగాసనం వేయటం మంచిది. ఇవి రెండూ వేసినా మేలే.

లాభాలు

మెదడు, ఊపిరితిత్తులు, గుండె బలోపేతమవుతాయి. రక్తం శుద్ధి అవుతుంది. జీర్ణశక్తి ఉత్తేజితమవుతుంది. అనవసరమైన కొవ్వు కరుగుతుంది. కళ్లు, చెవులు, నోటి సమస్యలు తగ్గుతాయి. కాళ్లు పైకి ఉండటం వల్ల గుండెకు మరింత ఎక్కువగా రక్తం సరఫరా అవుతుంది. మెదడు, మెడ నాడులు చురుకుగా తయారవుతాయి. మానసిక శక్తి, జ్ఞాపకశక్తి పెంపొందుతాయి. ఇది విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

చేయకూడనివారు

అధిక రక్తపోటు, గుండెజబ్బులు, చెవిలో చీము, తీవ్రమైన మెడనొప్పితో బాధపడేవారు.. అలాగే గర్భిణులు దీన్ని వేయరాదు. ఆయా జబ్బులు నయమైన తర్వాత వేసుకోవచ్చు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని