దూరపు కొండలు

మోటార్‌సైకిల్‌ గతుకుల రోడ్డువెంట నిదానంగా ఊరి పొలిమేరలవైపు వెళుతుంది. చాలా ఏళ్ళయుంటుంది మా ఊళ్లో అడుగుపెట్టక. మొన్నీమధ్య కరీంనగర్‌లో కలిసిన ..

Published : 09 Apr 2020 12:34 IST

- కటుకోజ్వల మనోహరాచారి

మోటార్‌సైకిల్‌ గతుకుల రోడ్డువెంట నిదానంగా ఊరి పొలిమేరలవైపు వెళుతుంది. చాలా ఏళ్ళయుంటుంది మా ఊళ్లో అడుగుపెట్టక. మొన్నీమధ్య కరీంనగర్‌లో కలిసిన రమణ నన్ను వాళ్ళింటికి ఒక్కసారైనా భోజనానికి రమ్మని పదేపదే పిలుస్తుంటే కాదనలేక బయలుదేరాను ఈరోజు.

మూడురోజుల్లో మళ్ళీ దుబాయ్‌ వెళ్ళబోతున్నాను. ఓసారి పుట్టినూరును చూసినట్లుంటుందీ రమణ కోరికా తీర్చినట్లుంటుంది అని బయలుదేరాను. నిజానికి రమణను చూస్తే జాలిపడాల్సిన జీవితమే. ఇప్పటికీ అదేదో మెడికల్‌ ఏజెన్సీలో గుమాస్తాగా రెండువేలకు పనిచేస్తున్నాడట. 

భార్యాబిడ్డల్తో ఎలా బతుకుతున్నాడో ఏమో.

నాకూ రమణకీ ఎంత తేడా! చిన్ననాటి స్నేహితుడైనా గత పదిహేనేళ్ళుగా పెద్దగా టచ్‌లో లేము. చదువులో ఇద్దరమూ వెనుకబడినా, కనీసం హైస్కూల్‌ చదువు కూడా ఇద్దరమూ పూర్తిచేయకపోయినా... అతనితో పోలిస్తే నేనెంత మెరుగు! నేనీమాత్రం స్థితిమంతుణ్ణి కాగలిగానంటే ఇప్పటికి మూడుసార్లు దుబాయ్‌ వెళ్ళిరావడమే కారణం.

కష్టపడే పనైనాసరే, పరాయిదేశంలో సంపాదించడం ఓ థ్రిల్‌. డబ్బు సంపాదించాలనే నా బలమైన కోరిక పదిహేనేళ్ళుగా నన్ను పరాయిదేశంలో గడిపేలా చేస్తోంది. 
పెళ్ళయిన పదిహేనేళ్ళలో ఇప్పటికి మూడుసార్లు ఇండియా వచ్చాను. రాధతో పెళ్ళయ్యాక 
నెలరోజులకి దుబాయ్‌లో అడుగుపెట్టానంటే ఐదేళ్ళకోసారి చొప్పున మూడుసార్లే ఇండియా వచ్చింది. వచ్చిన ప్రతిసారీ ఒకటీ రెణ్ణెళ్ళుండి తిరిగి దుబాయ్‌ ఫ్లైట్‌ ఎక్కడమే. పిల్లలు రాజేశ్, నరేశ్‌లు కూడా నేను దుబాయ్‌లో ఉండగానే పుట్టారు. నా ప్రమేయం లేకుండానే పెరిగారు. ఇప్పటికీ నేను వాళ్ళకి అనుకోని అతిథినే. వచ్చి ముప్ఫై రోజులైంది. మరో మూడురోజుల్లో తిరిగి ఫ్లైట్‌ ఎక్కబోతున్నాను. నా లక్ష్యం అంతా డబ్బే. ఎవరికీ తీసిపోనంతగా సంపాదించాలి. హాయిగా ఎంజాయ్‌ చేయాలి.
పిల్లల పెంపకంలో రాధ చాలా కష్టపడుతుంది. కష్టమంటే అదేమంత కష్టమైంది కాదులే. అన్ని అవసరాలకూ సరిపడా డబ్బు పంపిస్తూనే ఉంటాను.
పోయిన దఫా వచ్చినప్పుడే పదిలక్షల్తో ఓ మోస్తరు బిల్డింగ్‌ కొనిచ్చి వెశ్ళాను. ఇద్దరు పిల్లలకి చెరో సెల్‌ఫోన్‌తో సహా. రాధను కూడా ఏదీ తక్కువ కాకుండా అడిగిందల్లా కొనుక్కొమ్మనే చెబుతుంటాను.
అయినా రాధలో ఏదో వెలితి.
నేను చదివిన మిడిల్‌క్లాస్‌ చదువుకి నా తోటివాళ్ళలో ఎవరికీ తక్కువ కాకుండా సంపాదించాను. బంధువులందర్లో కూడా ఆర్థికంగా నేనే మెరుగ్గా ఉంటాను. 

ఒకరకంగా నాది విలాసవంతమైన జీవితమే. కాకపోతే, చిన్ననాడు నాతో కలిసి చదువుకున్నవాళ్ళలో ఉద్యోగం చేస్తున్నవాళ్ళు కూడా ఈరోజు కష్టపరిస్థితుల్లో బతుకుతున్నారన్నది నాకు తెలియంది కాదు.

నేను దుబాయ్‌ నుండి వచ్చిన సందర్భంగా మొన్నీమధ్య టీచరుగా పనిచేస్తున్న శంకరం భోజనానికి పిలిచాడు. ఎనిమిదోక్లాసు వరకు అతనూ నాతోపాటు చదువుకున్నవాడే. కాకపోతే నేను అంతటితో చాలించాను. శంకరం కొసెల్లా చదివేశాడు. దాంతో పంతులయ్యాడు.

అయితేమాత్రం, భోజనానికెళ్ళిన రోజు గమనించానుగా... ఇంకా అద్దెకొంపలో ఉండే ఉద్యోగం చేసుకుంటున్నాడు. భార్య మెడలో ఏమంత బంగారం లేదు. నా ఇంట్లో ఉన్న వస్తువుల్లో సగంకూడా లేవు. అంతెందుకు, చిన్నపిల్లలిద్దరూ ఇంటిముందుకొచ్చిన ఐస్‌క్రీమ్‌ కొనిపెట్టమంటే కొనేందుకు తటపటాయించేంత ఇబ్బందికర పరిస్థితిలో నెగ్గుకొస్తున్నాడని వాళ్ళ సంసారం చూస్తే తెలిసొచ్చింది.

మా పిల్లలైతే అర్ధరాత్రి మూడొచ్చినా ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లోకి వెళ్ళి తినొస్తారు. ఇంకా పదోతరగతన్నా కాలేదు, మావాడు వెళ్ళని రెస్టారెంటు లేదు. అదీ ఉన్నంతలో ప్రస్తుత మా స్థితి.

పాత మిత్రత్వంకొద్దీ ఎలాగూ నేను ఈ స్థాయికి ఎదిగాను కాబట్టే గుర్తింపుగా భోజనానికి ఆహ్వానించాడు. నిజానికి ఇది కూడా అతనికి ఎంతోకొంత భారం కలిగించేదే!

నాకెందుకో ఇలాంటి పాతమిత్రులూ బంధువుల్నీ పిలిచి, నేను వెళ్ళేలోపు పెద్దఎత్తున ‘దావత్‌’ ఇవ్వాలనిపించింది.

ఇండియాలో ఉండి ఈడ్చుకుంటున్నదానికీ నేను పరాయిదేశంలో సంపాదిస్తూ ఓ వెలుగు వెలుగుతున్నదానికీ తేడా వాళ్ళకూ అర్థమవుతుంది. నేను ఇండియాలో ఉన్న రెణ్ణెల్లూ ఏ పనీ ముట్టుకోను. నాకా అవసరం లేదు కూడా. ఇక్కడంతా బంధువుల్నీ మిత్రుల్నీ కలుస్తూ ఎంజాయ్‌ చేయడమే. ఏ పనైనా మళ్ళీ దుబాయ్‌ వెశ్ళాకే. రాయల్‌ లైఫ్‌ మెయింటెయిన్‌ చేయడమే ఇక్కడ.

ఎందుకంటే బతికినన్నాళ్ళూ ఏ లోటూ లేకుండా హాయిగా, ఎంజాయ్‌చేస్తూ జీవించాలన్నదే నా తత్వం. ఏది కొనాలన్నా ఆలోచిస్తూ కుంచించుకుపోయి బతకడం నావల్లకాదు. ఆలోచనల్లో ఉండగానే రమణ ఇల్లు వచ్చింది.

ఇది మా పుట్టినూరైనా ఈవైపు రాక చాలాకాలమే అయింది. మొదట్నుండీ నా భార్యాపిల్లలు కరీంనగర్‌లోనే ఉంటున్నారు.

మోటార్‌సైకిల్‌ రమణ ఇంటిముందు ఆపి  ఆశ్చర్యపోయాను. అదే ఇల్లు... అవే ఆనవాళ్ళు. అప్పుడెప్పుడో పది, పదిహేనేళ్ళక్రితం చూసిన పెంకుటిల్లు, ఇంకొంచెం శిథిలమైనట్లు కనిపించింది తప్ప ఎలాంటి ప్రగతీ లేదు. రమణలో కూడా ఎలాంటి మార్పూలేదు. అంతే సన్నగా, అదే వాలకం. అయినా ఆహ్లాదంగా ఉన్నాడు. నన్ను చూడగానే నవ్వుతూ ఎదురొచ్చాడు. పిల్లల్ని స్కూల్‌కి రెడీ చేస్తున్న అతని భార్య లలిత కూడా నవ్వుతూ ఆహ్వానించింది ఇంట్లోకి.

వేపచెట్టుకింద బైక్‌ నిలిపి ఇంట్లోకి అడుగుపెట్టాను. రెండుగదులు, వరండా ఉన్న పాతకాలపు పెంకుటిల్లు. పిత్రార్జితంగా వచ్చిన సొంతిల్లది. మొదటి గదిలో రెండు ఫైబర్‌ చెయిర్లుంటే ఒకదాన్లో కూర్చుండిపోయాను. గదిలో ఓపక్క చెక్కబల్ల, మంచం, ఓ మూల టేబుల్‌ ఫ్యాను. ఇంకే వస్తువులూ లేవు.

లలిత మంచినీళ్ళు తెచ్చిచ్చింది ‘‘పిల్లలు మంచిగున్నారా అన్నయ్యా’’ అంటూ.. 
‘‘వాళ్ళకేంది, బాగానే ఉన్నారు’’ అన్నాను.

రమణకు ఇద్దరు పిల్లలు. ఒకమ్మాయి, ఒకబ్బాయి. స్కూలు బ్యాగులు సర్దుకుంటూనే ‘‘నమస్తే అంకుల్‌’’ అన్నారు. నాకు ముచ్చటేసింది. నాకూ ఇద్దరు మగపిల్లలు. రాకడేగానీ పోకడలేదు.

‘‘ఏమోయ్, చదువు మంచిగా సాగుతుందా... ఏం చదువుతున్నారేంటి?’’ అన్నాను.

‘‘అన్నయ్య పది, నేనేమో ఏడు’’ అంది రమణ కూతురు బ్యాగు భుజాన వేసుకుంటూ.

‘‘ఏ స్కూల్లో వేశావేంటి?’’ అన్నాను రమణతో.

‘‘ఇంకే స్కూల్లో వేస్తాను. మొదట్నుండీ ఊళ్లో ఉన్న సర్కారు బడికే వెళ్తున్నారు. స్కూల్లో 

మధ్యాహ్నభోజనం పెడతారు. అక్కడే తింటారు. సాయంత్రం ఇంటికొస్తారు’’.

నేను కళ్ళు చిట్లించాను. సర్కారు బడి!

ఇంకా ఈరోజుల్లో సర్కారు బడికి... తెలుగు మీడియం చదువులు. ఊళ్లో రెండు ప్రైవేటు బడులున్నా వాటిలోకి పంపే స్తోమత ఎక్కడిది రమణకు? అతడిది రెండువేల సంపాదన. భార్య బీడీలు చుడుతుంది.

‘‘మీ పిల్లలు అదేదో పెద్ద స్కూల్లో ఇంగ్లిషు మీడియం చదువుతున్నారట కదా అన్నయ్యా. 

అదృష్టవంతులు బాగా’’ అంది లలిత. చేతిలో ఓ పెద్ద గ్లాసునిండా టీ తీసుకొచ్చింది.

‘‘అదృష్టవంతులే! పేద్ద పేరున్న స్కూలు. ఫీజులు కూడా వేలకువేలు కడ్తున్నా’’.

‘‘నాన్నా, పరీక్షఫీజు కట్టాలి... వందరూపాయలు’’ కొడుకు గుర్తుచేశాడు రమణకు.

రమణ కొడుకు భుజంమీద చేయివేసి చెప్పాడు ‘‘నేను రేపు స్కూలుకొచ్చి కడ్తాలే’’.

వాడు తలూపుతూ కదిలాడు.

‘‘నాకు ఇంగ్లిషు నోట్‌బుక్‌ తేవడం మర్చిపోవద్దు’’ ముద్దుగా అడుగుతోంది కూతురు.

‘‘సరే సరే’’.

వాళ్ళ ఆప్యాయత చూస్తుంటే నేనే ఏదో కోల్పోతున్నట్లనిపించింది.

‘‘వెళ్లొస్తామంకుల్‌... బై’’ రమణ కూతురు 

వెళ్ళబోతూ నా దగ్గరగా వచ్చి చిన్నగా చెప్పింది. ‘‘మా అన్నయ్య ఎప్పుడూ క్లాస్‌ ఫస్టే! నేను మా క్లాస్‌లో సెకండ్‌. ఈసారి నేను కూడా క్లాస్‌ ఫస్ట్‌ రావాలని కష్టపడి చదువుతున్నాను తెల్సా?’’

నేను ఏం చెప్పాలా అని ఆలోచిస్తుండగానే ‘‘బాయ్‌ అంకుల్‌’’ అంటూ కదిలిపోయింది.

నాకు ఆశ్చర్యంవేసింది. ఎంత వినయం పిల్లల్లో. ఇద్దరూ బ్యాగులు భుజాన వేసుకొని పెళ్ళికి వెళ్తున్నంత సంతోషంగా వెళ్తున్నారు స్కూలుకు.

నాకెందుకో ఈర్ష్య కలిగింది.

‘‘పిల్లలు బడికెళ్ళడంలో ఏ సతాయింపూ 
ఉండదనుకుంటా’’ అన్నాను అసంకల్పితంగా.

ఈసారి లలిత ఆశ్చర్యపోయింది. 

‘‘అదేందన్నయ్యా, అట్లా అంటారు. మీ పిల్లలుగానీ సతాయిస్తారా ఏం?’’ అంది.

ఏమని చెప్పాలి?

వేలకువేలు ఫీజులు కట్టి, కార్పొరేట్‌ స్కూల్లో చదివిస్తూ, అడిగిందల్లా కొనిస్తూ, అవసరానికి మించినవన్నీ సమకూరుస్తున్నా ఏనాడూ సరిగా స్కూలుకు వెళ్ళరని తెల్సు. ఇద్దరికి ఇద్దరూ దొంగలే! టీచర్స్‌ నుండి ఎప్పుడూ కంప్లైంట్సే. చదివేది కూడా ఏమీలేదు. అంత పెద్ద స్కూలైనా ఎప్పుడూ పాస్‌మార్కులు వచ్చిందిలేదు. ఇదంతా ఒకెత్తైతే వినయం, విధేయతలు, క్రమశిక్షణ అనేవి మచ్చుకైనా లేవు. అంతెందుకు, తల్లిదండ్రులపట్ల కూడా భయం, భక్తీ, గౌరవం ఏ కోశానా లేవు. పైగా మితిమీరిన పొగరు. వాళ్ళెలా దారికొస్తారో తెలియడంలేదు.

స్నేహితుడి పిల్లల వినయం, అణకువ, చదువుపట్ల శ్రద్ధ చూశాక మనసులో ఆక్రోశం పెల్లుబికింది. అణచుకోలేక వెళ్ళగక్కాను.

‘‘ఈ వయసు పిల్లలు అంతేలే. మున్ముందు వాళ్ళే గొప్పోళ్ళవుతారు’’ అంటూ మంచం తెచ్చి బయట వరండాలో వేశాడు రమణ.

బయట కూర్చొని ఆ మాటా ఈ మాటా మాట్లాడేలోపు వంట పూర్తిచేసింది లలిత.

ఇంటివెనక పెరట్లో కాసిన లేతవంకాయకూరతో చారు కలుపుకొని రమణతో కల్సి చేసిన భోజనం చాలా సంతృప్తినిచ్చింది. భోజనం అయ్యాక వరండాలోనే కాస్త నడుం వాల్చాం. రెండుగంటల తర్వాత లేచి వెశ్తానంటే ససేమిరా అన్నారిద్దరూ.

పిల్లల్తో కల్సి సాయంత్రం భోజనం చేస్తేనే అసలైన భోజనమంటాడు రమణ. అదయ్యాక రాత్రి ఉండి పొద్దున్నే వెశ్ళాలని పట్టుబట్టింది లలిత.

వాళ్ళ అన్యోన్యమే వింతగా అనిపిస్తుంటే చేసేదిలేక ఉండిపోయాను.

రాత్రి భోజనానికి ఏమేం సరుకులు తేవాలో భర్తకు లిస్టు చెప్పింది లలిత.

నేనొక్కణ్ణీ ఏం చేస్తానని రమణతో కల్సి బయలుదేరాను మార్కెట్‌కు. దార్లో రమణతో కబుర్లు వింత అనుభూతిని మిగిల్చాయి. పిల్లలూ కుటుంబంతో తన అనుబంధాన్ని వివరిస్తుంటే నాలో ఏదో తెలియని వెలితి.

సాయంత్రం స్కూలు నుండి పిల్లలొచ్చారు. రాగానే కాసేపు నాతో స్కూలు కబుర్లు చెప్పారు. ఆ తర్వాత బుద్ధిగా కూర్చొని హోంవర్కు చేసుకున్నారు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేకుండానే.

నిజంగా వాళ్ళను చూస్తుంటే ఎంతో ముచ్చటేసింది.

చీకటిపడుతుంటే అందరం భోజనానికి కూర్చున్నాం వరండాలో. మాంసాహారంతో భోజనం. చాలా కష్టంగా వెళ్ళదీసుకొస్తున్న కుటుంబమైనా భోజనం ఏర్పాట్లు మాత్రం సంతృప్తిగా చేశారు. భార్యా పిల్లలతో కబుర్లు చెబుతూ, లలిత కొసరికొసరి వడ్డిస్తుంటే నాతో కలిసి భోజనం చేస్తున్న రమణ ముఖంలోని సంతృప్తిని చూస్తుంటే నాలో ఏదో అసంతృప్తి.

ఎన్నో అనుభూతుల్ని మిగులుస్తూ భోజన కార్యక్రమం పూర్తయింది. 
కావాలని ఆ రాత్రి బయట వరండాలో మంచం వేయించుకొని పడుకున్నాను. పిల్లలూ రమణా మొదటిగదిలో పడుకొంటే లలిత వంటింట్లో పడుకుంది. బయట చల్లటిగాలికి నేను వెంటనే నిద్రలోకి జారుకున్నాను.
అర్ధరాత్రి దాటుతుందేమో... ఉన్నట్టుండి చటుక్కున మెలకువ వచ్చింది. మెల్లగా ఏవేవో ఆలోచనలు ముసురుకుంటున్నాయి. మనసులో ఏదో అసంతృప్తి. ఏదో అలజడి! ఏదో కోల్పోతున్న భావన! అన్నీ ఉన్నా ఏమీలేనివాడి ఫీలింగ్‌. ఎక్కడో వెలితి, ఏదో లోటు. మరో రెండ్రోజుల్లో ప్రయాణం. ఎన్నాళ్ళీ పరుగు? ఎందాకీ పరుగు? ఎవరికొరకీ పరుగు? నేనేం చేయాలి?! అసలు నాకేం కావాలి??

అసంతృప్తి, అలజడులతో నిద్ర ఎప్పుడో దూరంగా పారిపోయింది. అసహనంతో పొర్లుతూ ఎంతసేపు గడిచిందో తెలియదు. లేచి ఇంటి వెనుకవైపు నడిచాను మూత్ర విసర్జన కోసం.రెండోగది కిటికీ సందునుండి లైటు వెలుగుతూ కనిపించింది. చిన్నగా లలిత మాటలు వినవస్తున్నాయి. ‘‘అన్నయ్య సాయంతో నువ్వూ దుబాయ్‌ వెళ్తే?!’’ అంటోంది.

ఎందుకో వాళ్ళ మాటలు వినాలనిపించింది. భావ్యం కాదని తెల్సినా కిటికీ దగ్గరగా నడిచి లోనికి చూశాను.
రమణ లలిత ఒళ్లో పడుకుని ఉన్నాడు. 

ఆమె అతణ్ణి అపురూపంగా పొదివి పట్టుకుంటే ఆ దివ్యానుభూతిలో అతనంటున్నాడు.

‘‘నిన్నూ పిల్లల్నీ ఎప్పుడూ కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటూ ఉండటంలో ఉన్న సంతృప్తి నాకు దేంట్లో ఉంటుంది? లక్షలాది రూపాయలూ విలాసాలకంటే నాకు నా భార్యాపిల్లలూ వాళ్ళ బాగోగులే ముఖ్యం. నా పిల్లల నడవడికా చదువూ నాకు అన్నిటికన్నా ముఖ్యం’’.

నా మనస్సు చివుక్కుమంది. మరింత ముందుకు జరిగి వింటున్నాను.

‘‘అవును. నా స్నేహితుణ్ణే చూడు, తన పిల్లలకి పుట్టుకనుండి ఇప్పటివరకు దూరంగానే ఉంటున్నాడు. ఎప్పుడో అయిదేళ్ళకోసారి అలా అతిథిలా వస్తాడు, వెశ్తాడు. పిల్లల్తో అనుబంధం, ప్రేమ ఎట్లా ఏర్పడుతుంది? పిల్లలకి ఏమేం సమకూర్చాం అన్నదికాదు... వాళ్ళతో ఎంత సమయం గడుపుతున్నాం అన్నది ముఖ్యం. అదీగాక పిల్లలకు అవసరానికిమించి విలాసాలు కల్పించి, తండ్రి దగ్గరుండి నియంత్రించే అవకాశం లేకపోతే కచ్చితంగా అదుపు తప్పుతారు. అలాంటివాళ్ళకు మంచీ మర్యాదా పద్ధతులూ జీవితమూ దాని విలువా ఏం తెలుస్తాయి? కుటుంబానికి దూరంగా ఉండి లక్షలు సంపాదించినా... ఇక్కడ భార్యా పిల్లల్తో కోల్పోయేది అంతకు పదిరెట్లు ఎక్కువ. నేనది కోల్పోనందుకు చాలా సంతోషంగానే ఉన్నాను’’ అంటూ లలిత మొహాన్ని తన మొహం పైకి లాక్కున్నాడు. నేను చటుక్కున కిటికీ దగ్గర్నుంచి పక్కకి 
జరిగాను. 
వచ్చి మంచంమీద కూర్చున్నా రమణ మాటలే చెవిలో మారుమోగుతున్నాయి. ఏవేవో ఆలోచనలు. కాసేపటికి... నా మనసు పొరలపై కమ్ముకున్న మంచు విడిపోతున్నట్లనిపించింది. నెమ్మదినెమ్మదిగా సందిగ్ధత తొలగిపోతూ రేపటి వెలుగుకు ఒక స్పష్టత ఏర్పడుతుంటే... మిగిలిన జీవితానికైనా అసలైన అర్థం దొరికినట్లనిపించింది.
నేనేం చేయాలో, నాకేం కావాలో స్పష్టమైంది. నిర్ణయం బలపడింది. మెల్లగా మంచంమీద వెనక్కు వాలాను. ఆందోళన తొలగి మనసు రిలాక్స్‌ అవుతుంటే... హాయిగా నిద్రలోకి జారుకున్నాను.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని