కలలోని నిజం

‘‘ఆమె మీ అమ్మలాగా లేదూ’’ దూరంగా బెంచీ మీద కూర్చున్న పెద్దావిడని భర్తకి చూపిస్తూ అడిగింది జనని. ఆవిడ తన మనవడికి కాబోలు మురిపెంగా

Published : 08 Apr 2020 19:45 IST

- డా।। కె.వి.రమణరావు

‘‘ఆమె మీ అమ్మలాగా లేదూ’’ దూరంగా బెంచీ మీద 
కూర్చున్న  పెద్దావిడని భర్తకి చూపిస్తూ అడిగింది జనని. 
ఆవిడ తన మనవడికి కాబోలు మురిపెంగా 
అరటిపండు తినిపిస్తోంది.

అటువైపోసారి చూసి తలతిప్పుకున్నాడు - రైల్లో కిటికీ పక్కన కూర్చున్న మాధవరావు. భర్తకి సెండాఫివ్వడానికి వచ్చి కిటికీ పక్కన ప్లాట్‌ఫాం మీద నిలబడి ఉంది జనని. అతను తన సొంత ఊళ్లో అమ్మిన చివరి నాలుగెకరాల పొలం తాలూకు రిజిస్ట్రేషన్‌ పనిమీద నెల్లూరు నుంచి రాజంపేటకి వెళ్తున్నాడు. ఉదయం పదిగంటలవుతూంది. రైల్వేస్టేషన్‌లో పెద్దగా జనం లేరు. భర్త మొహం ప్రసన్నంగా లేకపోవడం గమనించింది జనని.
‘‘ఇక మన ఊరు ఎప్పుడోగానీ వెళ్ళరు. 
రిజిస్ట్రేషన్‌ రేపుగదా, రాత్రికి మన ఊరెళ్ళి మనింట్లో ఉండండి’’ అనునయంగా 
చెప్పింది జనని.
‘‘అది మన ఇల్లు కాదు, అనురాధది’’ కోపంగా అన్నాడు మాధవరావు.
‘‘అనూరాధ మీ చెల్లెలే గదా, ఎవరో అన్నట్టు మాట్లాడతారేం?’’
‘‘ఆ బంధం అప్పుడే తెగిపోయింది’’.
‘‘వాళ్ళ పరిస్థితి బాగుండకే గదా, మీ అమ్మ వాళ్ళకి ఇల్లు, పొలం  ఇచ్చింది. అయినా 
ఎవరికి ఇచ్చింది... మీ ఒక్కగానొక్క 
చెల్లెలికేగా. మీరు ఆ ఇంటిగడప తొక్కి 
రెండేళ్ళయింది. ఆస్తి కోసం రక్తసంబంధం తెంచుకుంటామా’’ జనని వదల్లేదు.
మాధవరావు మాట్లాడలేదు. ఓ కాకి 
గోడమీద కూర్చొని అవతలి ప్లాట్‌ఫాం మీద ఎవరో వదిలేసిన అన్నం ప్యాకెట్‌నే చూస్తోంది. దూరంగా నీడలో పడుకున్న కుక్క కాకినే గమనిస్తోంది.
‘‘ఆమెకివ్వబట్టే గదా... ఆ ఆరెకరాల 
పొలమైనా మన కుటుంబం కింద సాగులో ఉంది. మీ నాన్న ఆ పొలాన్ని తయారుచేయడానికి ఎంత కష్టపడ్డారు. అనూరాధ ఆడమనిషైనా కాయకష్టంచేసి వ్యవసాయం 
చేయిస్తోంది. మన వాటా మనమేంజేశాం... బంగారం పండే మాగాణి అమ్మి, ఈ నగరం కొసానెక్కడో ఇళ్ళస్థలాలు కొని, కంపచెట్లకూ తొండలకూ వదిలేశాం’’.
మాధవరావు భార్యవైపు కోపంగా చూశాడు. గోడమీద కాకి అన్నంపొట్లం దగ్గరకొచ్చి భయంగా అటూ ఇటూ చూసి తినకుండానే వెళ్ళి మళ్ళీ గోడమీద కూర్చుంది. కుక్క 
నిరాసక్తంగా తల మరోవైపు తిప్పుకుంది. 
రైలు కూతవేసి బయల్దేరడానికి సిద్ధపడింది.
‘‘చెల్లెలిమీద కోపం పెట్టుకుని రాత్రికి ఆ నర్సింహులింట్లో పడుకోకండి. అతను ఫ్యాక్షన్‌ మనిషి. ఎప్పుడు ఎవరు దాడిచేస్తారో తెలీదు. సాయంత్రం చల్లపొద్దున రెండుమైళ్ళు నడిస్తే మన ఊరొస్తుంది. ఇంటికెళ్ళండి, అందరూ సంతోషిస్తారు’’ కదుల్తున్న రైల్తోపాటు నడుస్తూ చెప్పింది జనని. రైలు ముందుకి నడుస్తూంటే మాధవరావు జ్ఞాపకాలు వెనక్కి పరుగెత్తాయి.

*      *      *

మాధవరావువాళ్ళది రాజంపేటకి పడమరగా పదిమైళ్ళ దూరంలో చెయ్యేటిగట్టుమీది అనుంపల్లె. ఏటికిటూ అటూ ముక్కారు పండే మాగాణి. తండ్రి కాంతయ్య వృత్తిరీత్యా టీచరైనా ప్రవృత్తిరీత్యా వ్యవసాయదారుడు. అనువంశికంగా వచ్చిన పన్నెండెకరాల మెట్టభూమిని కాయకష్టంచేసి మాగాణిగా మార్చాడు. మాధవరావు, అనూరాధ ఇద్దరే సంతానం. ఇద్దరికీ తల్లి సీతమ్మే లోకం. మాధవరావు తిరుపతిలో ఎం.ఏ. ముగించుకుని ఉద్యోగంలో చేరిన కొత్తల్లోనే అనూరాధ పెళ్లైంది. కుర్రాడికి ఆస్తిపాస్తులు అట్టే లేకపోయినా చెన్నైలో మంచి ప్రైవేటు కంపెనీలో ఉద్యోగమని మొగ్గుచూపారు. అనూరాధకి తొలిచూలు ఆడబిడ్డ. మాధవరావు పెళ్ళినాటికి రెండోది తప్పటడుగులు వేస్తోంది.
అంతా సవ్యంగా నడుస్తూందనుకున్నంతలో ఓ రోజున కారు ప్రమాదంలో అనూరాధ భర్త తీవ్రంగా గాయపడ్డాడు. ప్రాణంపోయినంత పనైంది. చెన్నైలోని పెద్దపెద్ద ఆసుపత్రులు, డాక్టర్లచుట్టూ తిరిగి ఏడాదిపాటు మందులు తీసుకున్నా ఫలితం దక్కలేదు. అతనికున్న 
ఆ కాస్త ఆస్తీ హరించుకుపోయింది. కాంతయ్య తనకు చేతనైనంతా చేశాడు. అల్లుడు పూర్తిగా మామూలు మనిషి కానేలేదు. ఉద్యోగానికి పనికిరాడన్నారు. భర్త, పిల్లల్తో అనూరాధ పుట్టిల్లు చేరింది.
కూతురి సంసారం కూలినందుకు సీతమ్మ కుంగిపోయింది. కాంతయ్య మంచంపట్టాడు. ఆపై ఆయన ఎక్కువ రోజులు బతకలేదు. ఆయన పోతూపోతూ భార్య సలహామీద సగం ఆస్తి కూతురికిచ్చి పోయాడు. సీతమ్మ కూడా తన పేరుతో ఉన్న పొలమూ ఇల్లూ కూతురికే ఇచ్చింది. మొదట్లో మాధవరావు ఇవన్నీ పట్టించుకోలేదు. రానురాను వాళ్ళూ వీళ్ళూ అనడంమూలాన - తల్లికి తనకంటే చెల్లెలంటేనే ప్రేమ ఎక్కువనీ ఆమెకి 
అవసరానికంటే ఎక్కువ ఇచ్చిందనే అభిప్రాయానికొచ్చాడు. మొదట్లో వాదించాడు, తర్వాత తల్లీ చెల్లెలితో మాట్లాడ్డం మానేశాడు. ఏడ్చి మొత్తుకోవడంతప్ప సీతమ్మ కొడుకు మనసు మార్చలేకపోయింది.
మాధవరావు భార్య జనని అత్తగారి పక్షమే వహించింది. ‘అనూరాధకు వేరే జరుగుబాటులేదు. ఇవ్వడానికి ఇల్లూ భూమీ తప్ప 
తల్లి దగ్గర మరేమీలేదు. ఎవరున్నా లేకున్నా భూమైతే కన్నతల్లిలా కడుపులోపెట్టుకు కాపాడుతుంది. భూమిని నమ్ముకుంటే అది అన్యాయం చెయ్యదు, కనీసం కలో గంజో ఇస్తుంది. మనకేం, మీకు మంచి ఉద్యోగం ఉంది’ ఇలా జనని ఎంత నచ్చజెప్పినా మాధవరావు తలకెక్కలేదు. మంకుపట్టులో మార్పులేదు. ఆ కోపంతోనే ఊళ్లో తన వాటాకొచ్చిన పొలమంతా అమ్మేశాడు. మిగిలిన బÅౌతిక బంధాన్ని 
తెంచుకుని రావడానికి ఇప్పుడు వెళ్తున్నాడు.
రైలు ఇంకా ఎండ ఉండగానే రాజంపేట చేరింది. తన ఊరెళ్ళడానికిష్టపడని 
మాధవరావు రెండుమైళ్ళ ముందే నర్సింహులుంటున్న కోసూర్లో బస్సు దిగిపోయాడు. 
ఆ రాత్రికి నర్సింహులింట్లోనే ఉండటానికి నిశ్చయించుకున్నాడు.
నర్సింహులు ఇల్లు అవడానికి డాబా అయినా నాలుగువైపులా పెద్ద పెంకుల వసారాలున్నాయి. ముందువైపు వీధిలోకి ద్వారానికిరువైపులా పెద్ద అరుగులు. రాత్రి భోజనం తర్వాత నర్సింహుల్తో పిచ్చాపాటీ మాట్లాడాక వీధి అరుగుమీద పక్క పరిపించుకున్నాడు మాధవరావు. ఇంట్లో పడుకోమన్నా వినలేదు. తన ప్రాంతాల గాలి పీల్చి, వెన్నెల చూస్తూ నిద్రపోయి చాలా కాలమైందన్నాడు.
వీధి పొడవునా చెదురుమదురుగా కలిసిపోయిన ఇళ్ళూ, చెట్లమధ్య సప్తమినాటి వెన్నెల చీకటితో నిశ్శబ్దంగా దోబూచులాడుతోంది. అప్పుడప్పుడు చల్లనిగాలి సడి చేయకుండా వీస్తోంది. తన ఊరు, తన బాల్యం, చెల్లీ తను ఆడుకోవడం, తమ చిన్ని తగవులు తల్లి తీర్చడం... మాధవరావుకి ఒక్కొక్కటీ గుర్తొస్తున్నాయి. తన ఊరికి అంత దగ్గర్లో తన ఊరుగాని మరో ఊళ్లోü ఈ అరుగుమీద ఇలా ఒంటరిగా పడుకోవడం... అతనికి 
తెలియకుండానే ఎప్పుడో నిద్రపట్టింది.

*      *      *

నిద్రపోతున్న మాధవరావుని ఎవరో మెల్లగా స్పృశించి నిద్రలేపినట్టయింది. కళ్ళు తెరచి చూశాడు. అంతా మసగ్గా ఉంది. రాత్రి ఏ ఝామో తెలియలేదు. ఎదురుగా తన కాళ్ళపక్కన వీధివైపు ఎవరో ఆడమనిషి కూర్చొని ఉంది. తేరిపార చూశాడు. ఇంతలో ఎక్కడనుంచో కొంచెం వెలుతురు ఆమెమీద పడింది. ఆమె తన తల్లి సీతమ్మ. చిత్రంగా, ఆ గుడ్డివెల్తుర్లోనూ ఆమె మొహం స్పష్టంగా కనిపిస్తోంది. పుల్లంపేట నేతచీర కట్టుకుని కొంగు భుజంచుట్టూ కప్పుకొంది. తనవైపే ఆప్యాయంగా చూస్తోంది. అదేమిటి ఇంత రాత్రివేళ ఇక్కడికొచ్చింది. ఎలా వచ్చిందసలు. అతనికంతా అయోమయంగా ఉంది. దాహంగా ఉంది. గొంతు పూడుకుపోయింది. కష్టంమ్మీద లేచి వెనక్కిజరిగి కూర్చున్నాడు.
‘‘ఏమిటిట్లా వచ్చావు... ఇంత రాత్రప్పుడు’’ ఎలాగో గొంతు పెగుల్చుకున్నాడు.
‘‘నీకోసమే. ఇంకా నామీద కోపం పోలేదురా నాయనా’’ ఆమె గొంతులో ఏదో శీతల మార్దవం గడ్డకట్టిన బాధ.
‘‘ఎందుకొచ్చావు. నీకు నేనంటే ఇష్టంలేదు... చెల్లెలంటేనే ఇష్టం’’.
‘‘నా ప్రాణాలన్నీ నువ్వేరా. తల్లికి బిడ్డల్లో తేడా ఉంటుందా నాయనా’’ ఆమె కంఠంలో వేదన. కళ్ళు ధారగా వర్షిస్తున్నాయి. 
ఆమె ఇంకా ఏదేదో మాట్లాడుతోంది, సగం స్వగతంలా.
ఆమె ముందుకు వంగి తన చెయ్యి 
పట్టుకుంది. ఆమె చెయ్యి చల్లగా ఉంది. 
ఆ చల్లదనం అతని ఒళ్ళంతా ప్రవహించింది. అతనికి తన శరీరం లోపల ఉన్నదంతా 
కరిగిపోయి శూన్యమేర్పడినట్టూ ఒళ్ళు తేలికైనట్టూ అనిపించింది.
‘‘ఇంత చిక్కిపోయినావేంరా... అన్నం సరిగ్గా తింటున్నావా?’’ ఈసారి ఆమె మొహం స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె తడికళ్ళలో ఉన్న ప్రేమను చూసి అతను నిశ్చేష్టుడయ్యాడు.
‘‘ఇంటికి రాకుండా ఇక్కడ పడుకున్నావేం బాబూ. ఈ నర్సింహులున్నాడే, వీడికి ముఠా కక్షలున్నాయి. వాడనుకుని నిన్నేమైనా 
చేస్తారేమోనని ప్రాణాలుగ్గబెట్టుకొని వచ్చినాను నాయనా. ఇంటికి రాకపోతే పోతివి, వెళ్ళి లోపల పడుకో... ఈ వేళప్పుడు ఇక్కడొద్దు... నీకు చెప్పిపోదామని వచ్చినాను నాయనా’’ ఆందోళనగా, ఆర్తిగా చెప్పిందామె. అప్పుడప్పుడూ భయంతో అటూ ఇటూ చూస్తోంది.
మాధవరావు మగతలో ఉన్నవాడిలాగా తల ఊపాడు.
‘‘వస్తానురా, చాలా దూరం పోవాలి. కోడలూ పిల్లలూ జాగ్రత్త నాయనా... వెళ్ళి లోపల పడుకో’’ అంటూ ఆమె లేచి అరుగుదిగి, పడమర దిక్కుగా నడుస్తూ వెళ్ళిపోయింది.
తల్లిని ఆగమని మాధవరావు గట్టిగా అరుస్తున్నాడు. కానీ గొంతులోంచి మాట బయటికి రావడంలేదు. లేచి తల్లి దగ్గరికి పరుగెత్తాలని ప్రయత్నిస్తున్నాడు కానీ చేతులూ కాళ్ళూ 
కదలటంలేదు. కళ్ళల్లో నీళ్ళు కారిపోతున్నాయి. బలంగా చేతుల్నీ కాళ్ళనీ విదిల్చాడు. స్తంభానికి చెయ్యి తగిలి ‘అబ్బా’ అని అరిచాడు.

*      *      *

నిద్రలో విసరగా చెయ్యి స్తంభానికి గట్టిగా తగలడంతో మాధవరావుకి మెలకువ వచ్చింది. ఒళ్ళంతా సన్నగా కంపిస్తోంది. చెమటలు పట్టాయి. కాసేపు ఏమీ అర్థంకాలేదు. చెయ్యి నొప్పి తెలుస్తోంది. వీధిలో అంతా నిశ్శబ్దంగా ఉంది. వెన్నెల పలచబడింది. లేచి కూర్చున్నాడు. తల విదిలించాడు. కొంత స్పృహలోకొచ్చాడు.
‘తన తల్లి కనిపించడం, మాట్లాడ్డం’ 
అంతా కలలో జరిగిందన్నమాట. కానీ 
ఇంకా తల్లి ఎదురుగా కూర్చున్నట్టే ఉంది. నెమ్మదిగా స్ఫురణకొస్తోంది. తల్లి చనిపోయి 
మూడేళ్ళైంది. ఆమె బÅౌతికంగా వచ్చే 
అవకాశమే లేదు. కానీ ఎంతో బÅౌతికంగా జరిగినట్టుంది. ఆమె ఆత్మ వచ్చిందా? 
తనకలాంటి వాటిమీద నమ్మకం లేదు. రాత్రంతా ఆ విషయాలే ఆలోచిస్తూ నిద్రపోయాడు. అందుకే తల్లి కలలోకొచ్చింది. కానీ అదంతా ‘కల’ అంటే ఇంకా నమ్మకం కలగడంలేదు. అంత స్పష్టంగా జరిగింది.
అరుగుదిగి వీధిలోకొచ్చి చూశాడు. దూరంగా వీధిచివర ఓ ముసలావిడ కర్ర పట్టుకుని నడుస్తూ వెüËÁ్తంది. పరుగులాంటి నడకతో వెళ్ళి చూశాడు. అక్కడెవరూ లేరు. ఇది కూడా భ్రమేనా. తిరిగివచ్చి అరుగుమీద కూర్చున్నాడు. శరీరం వణుకు తగ్గి, పూర్తి స్వాధీనంలోకి వచ్చింది. అతనిలో ఇన్నాళ్ళూ గడ్డకట్టి ఉన్న చెడు భావనలు కలలోని తల్లి స్పర్శతో కరిగి ప్రక్షాళన అయినట్టనిపించింది. తర్కానికి లొంగని మూర్ఖత్వం ‘కలలో జారిన కన్నీటి’లో కరిగింది... ముల్లును ముల్లుతోనే తీసినట్టు. వృద్ధురాలవుతున్న తల్లిని తన 
దగ్గరుంచుకోవాల్సొస్తుందని ఇన్నేళ్ళూ తనే ఈ మూర్ఖత్వాన్ని పెంచి పోషించాడా..? లోకం దృష్టిలో కోడళ్ళకంటే కొడుకులు మంచివాళ్ళుగా చెలామణి అవుతున్నారు. కొన్ని నిజాలు ఎప్పుడోగానీ బయటపడవు. తల్లిని ఎంత బాధపెట్టాడు... దీనికి నిష్కృతి ఉంటుందా!
మాధవరావు పక్కనే ఉన్న మరచెంబులోని నీళ్ళు తాగాడు. నెమ్మదించిన శరీరాన్ని మళ్ళీ పక్క మీదకు చేర్చాడు. అంతలో అతనికి కలలో తన తల్లి చెప్పిన చివరిమాటలు 
గుర్తొచ్చాయి. భయంతో కాకపోయినా, తల్లి మాటకి కట్టుబడి, పక్క చుట్టుకుని వెళ్ళి లోపల పడుకునే ఉద్దేశంతో వీధితలుపు తట్టాడు.

*      *      *

ఉదయాన్నే లేచి మొహం కడుక్కుని హాల్లో కూర్చున్న మాధవరావుకి నర్సింహులు కాఫీ తెచ్చిస్తూ ‘‘మనం రాజంపేటకు పదిగంటలకు బయల్దేరితే చాలు, ఒంటిగంటకు రిజిస్ట్రారాఫీసులో పనైపోతుంది. నువ్వు రెండుగంటల బండికి వెళ్ళిపోవచ్చు’’ అన్నాడు.

‘‘నర్సింహులూ, నువ్వేమనుకోకుండా 
ఉంటే ఒక మాట... నేను ఈ మిగిలిన 
నాలుగెకరాల భూమిని అమ్మే ఉద్దేశం 
మానుకున్నాను. నీ దగ్గర తీసుకున్న డబ్బంతా వాపసు ఇచ్చేస్తాను. నువ్వు కాదనకు’’ అన్నాడు మాధవరావు నెమ్మదిగా.
నర్సింహులు ఆశ్చర్యపోయి ‘‘సరే, నీ ఇష్టం. నీ మాట కాదనలేను. తల్లిలాంటి భూమిని పోగొట్టుకోవాలంటే ఎవరికైనా బాధే. అయినా మాధవా... నువ్వు టౌన్లో సెటిలైపోయినావు, రాధమ్మతో మాటల్లేవు, మీ ఊరికొచ్చేదే మానుకున్నావు. సేద్యం చెయ్యలేకేగదా 
అమ్మినావు. మరి ఇప్పుడు మిగిల్చుకోని 
ఏం చేస్తావు?’’ అన్నాడు.
‘‘మా చెల్లెలికి కౌలుకిస్తాను. కౌలు డబ్బు దాని పిల్లల పేర్తోనే బ్యాంకులో వెయ్యమంటాను’’ నివ్వెరపోయిన నర్సింహుల్ని చూసి చిన్నగా నవ్వి మళ్ళీ అన్నాడు మాధవరావు, 
‘‘ఇంకోమాట, నువ్వు మరో పదివేలు 
చేబదులుగా ఇవ్వు. ఇద్దరం రాజంపేట పోయి, మా చెల్లెలికీ బావకూ పిల్లలకూ మంచి బట్టలు తీసుకొని, మా ఊరెశ్దాము’’.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని