మార్గదర్శి

బస్సు సకాలంలోనే బయలుదేరింది. కిటికీ దగ్గరి సీటే దొరికింది. హాయిగా అనిపించింది శరీరానికీ మనసుకీ. ఏం లాభం...

Published : 08 Apr 2020 19:33 IST

- జె.సరస్వతి

బస్సు సకాలంలోనే బయలుదేరింది. కిటికీ దగ్గరి సీటే దొరికింది. హాయిగా అనిపించింది శరీరానికీ మనసుకీ.

ఏం లాభం, కొన్ని నిమిషాలు మాత్రమే ఆ హాయి అనుభవించగలిగాను. ఎంతకీ ఒక కొలిక్కిరాని నా సమస్య మళ్ళీ ఎదుట నిలిచింది ఎప్పట్లాగే. చూడ్డానికి ఎంతో చిన్న విషయంలా అనిపించేది కాస్తా, నా మనస్తత్వంవల్లనో ఏమో, పెద్ద భూతంలా కనపడుతోంది.

అలా కనబడటంలో కూడా పెద్దగా ఆశ్చర్యపడాల్సిందిలేదు. ఎందుకంటే, ఎన్నో ఏళ్ళుగా నోరుకట్టుకునీ మనసు కట్టుకునీ ఎంతో జాగ్రత్తగా ప్లానులు వేసుకొని కూడబెట్టిన డబ్బది. మరి దాన్ని అర్హతలేనివాళ్ళ అధీనం చెయ్యడం, దుర్వినియోగమవుతుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండాల్సిరావడం ఎంత బాధాకరమైన విషయం!

అందుకే ఈ అతి జాగ్రత్త.

ఈ రోజుల్లో పదిలక్షలంటే పెద్దమొత్తమేం కాదు. కానీ నా వరకూ అది కొండంత ఆస్తి. దాన్ని ఏదో ఒక మంచి సంస్థకి అప్పగించాలన్నది నా కోరిక.

ఎప్పుడు పోతానో తెలియదు. అంటే, నేను వృద్ధురాలినని కాదు. ఈ సంవత్సరమే రిటైరు కాబోతున్నాను. ఆరోగ్యవంతురాలిని కూడా. కానీ ఈ రోజుల్లో చావుకీ వయసుకీ సంబంధం లేదు. యాక్సిడెంట్లూ అనుకోని ప్రమాదాలూ ఎన్నో. ఇవికాక ఒంటరిదాన్ననీ కాస్తోకూస్తో డబ్బూ దస్కం పోగేశాననీ తెలిసినవారు అవి దోచుకుపోవడానికి నన్ను హత్యచేసినా ఆశ్చర్యపడనక్కరలేదు. కనుక ముందు జాగ్రత్తగా రిటైరుకాగానే వచ్చే సొమ్మూ నా దగ్గరున్నదీ కలిపి అనాథశరణాలయాలకో వృద్ధుల ఆశ్రమాలకో రాసివ్వాలని నా తొందర. అమ్మా నేనూ బతకడానికి నాకొచ్చే పెన్షన్‌ చాలు.

పూర్వజన్మలో నేనేమీ పుణ్యంచేసి ఉండను. ఎవరికీ రుణపడి కూడా లేనేమో. ఈ జన్మలో అవివాహితగా మిగిలిపోయాను. తల్లినయ్యే అదృష్టం లేకపోయినా ఎవరినైనా పెంచుకునే అవకాశం కూడా లేకుండా ఇంటి బాధ్యతలు నన్ను మోడులా మిగిల్చాయి.

గ్రహపాటున ఆ ఇంట్లో పెద్ద బిడ్డగా పుట్టాను. పొరపాటున తండ్రి బాధ్యతల్లో పాలుపంచుకోవడం కోసం ఉద్యోగంలో చేరాను. ఇందులో నా తప్పెంతో నాకు తెలియదు. నాన్నగారి అనారోగ్యంతో ఇంటి బాధ్యత మొత్తం నా మెడకు చుట్టుకుంది. ఇద్దరు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళూ పురుళ్ళూ పుణ్యాలూ... తమ్ముడి చదువూ పెళ్ళీ... నాన్నగారి వైద్యం... ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా వూపిరిసలపని బాధ్యతలు.

అన్నీ ఒక కొలిక్కి వచ్చేసరికి ఇదిగో, నేను రిటైరయ్యే వయసుకి చేరాను.

వచ్చే జన్మలోనైనా సుఖపడాలని ఆశ. పిల్లాపాపలతో అందమైన జీవితం అనుభవించడానికి కావలసిన అర్హత కోసమే ఈ దానధర్మాల ఆలోచన. నిజానికి నా దగ్గరున్న పదిలక్షలు దానం చేయడానికి ఇంతగా ఆలోచించనక్కరలేదు. కానీ ఈ ఆశ్రమాలూ సంస్థలూ సక్రమంగా ఖర్చుపెడతాయా? అధికారులే సగం మిగుల్చుకొని మిగలినదే బాధితులకు విదిలిస్తారంటూ పత్రికల్లో చదివినవీ ఎవరో చెప్పగా విన్నవీ పదేపదే గుర్తుకొచ్చి తొందరపడి చేయిజారడానికి నా మనసు ఒప్పడంలేదు.

అలా మథనపడుతున్న తరుణంలో విశ్వనాథంగారు గుర్తుకొచ్చారు. ఆయనకు తెలియని విషయంలేదు. మంచి సలహా ఇవ్వగల సమర్థుడు. ఆయన్ని కలుసుకోడానికే ఈ ప్రయాణం.

‘‘రామానగర్‌, రామానగర్‌... దిగండి, దిగండి’’ కండక్టర్‌ కేకలతో ఆలోచనలాపి కిటికీలోంచి చూశాను. అడ్డరోడ్డు దగ్గరే ఉంది బస్సు.

‘‘అదేంటండీ, వూళ్ళొకి వెళ్ళదా బస్సు?’’ అన్నాను అయోమయంగా.

‘‘లేదండీ, ఇక్కడే దిగాలి’’ అన్నాడు కండక్టరు. వూరికి కొత్త మనిషినని అనుకున్నాడేమో ‘‘మూడు రూపాయలిస్తే ఆటో వస్తుందమ్మా... ఎక్కువ దూరం ఉండదు’’ అని చెప్పాడు.

అక్కడ దిగింది నేనొక్కదాన్నే. దూరంగా వూరు కనపడుతూనే ఉంది. ‘ఈమాత్రం దానికి మూడు రూపాయలెందుకు దండగ. అటూఇటూ చూసుకుంటూ నడిస్తేపోతుంది. చేతిలో బరువులు కూడా లేవెటూ’ అనుకుని నడక సాగించాను.

ఎన్ని రకాలుగా పొదుపుచేస్తే ఆమాత్రం డబ్బు పోగైంది! పిసినారి అన్న పేరుపడితే మాత్రమేం.

పదడుగులు వేసేసరికి నాకు కొంతదూరంలో వెళ్తున్నావిడ తెలిసిన మనిషిలా కనపడింది. నడకలో వేగం పెంచాను. మా వూరి ఎలిమెంటరీ స్కూలు టీచరుగారి భార్య జానకమ్మగా గుర్తించాను.

మాస్టారు రిటైరయ్యాక సొంత వూరు వెళ్ళారని తెలిసింది. నాలుగేళ్ళ తర్వాత ఇదే చూడ్డం. వాళ్ళకి ఇద్దరు పిల్లలు. అబ్బాయి, అమ్మాయి. ఆస్తులేమీ లేవు. ఉద్యోగమే ఆధారం. పిల్లల్ని డిగ్రీలవరకూ చదివించగలిగారు. వాళ్ళూ టీచర్లే. పెద్ద కట్నాలు ఇవ్వలేరు కనుక సామాన్య సంబంధాలే చేశారు. అప్పులు లేకపోవడంవల్లా ఆడంబరాలు అలవాటు లేకపోవడానా, ఆ వచ్చే పెన్షన్‌తో కాలం గడుపుతున్నారు.

మాస్టారు వూరికే కూర్చోకుండా నలుగురు పిల్లలకి ట్యూషన్లు చెప్పి కొంత సంపాదిస్తున్నారు, వేణ్ణీళ్ళకి చన్నీళ్ళలా.

‘‘జానకిగారూ!’’ పిలిచాను బిగ్గరగా. ఒక్కదాన్నే ఈడ్చుకుంటూ వెళ్ళేదానికన్నా మాట్లాడుకుంటూ నడిస్తే విసుగురాదు. దూరం తెలియదు.

నా పిలుపుకి వెనక్కితిరిగి చూసింది. గుర్తుపట్టి నవ్వింది.

దగ్గరకెళ్ళాక ‘‘బావున్నారా? చాలా కాలమైంది మిమ్మల్ని చూసి’’ అన్నాను.

‘‘ఆయనగారు రిటైరయ్యాక మా వూరు వెళ్ళాం. పల్లెటూరు కదా, ఖర్చులు కలిసివస్తాయని’’ అని, నా గురించి కూడా వివరాలు అడిగింది.

తెలిసినవాళ్ళుంటే చూడ్డానికి వెళ్తున్నానని చెప్పాను.

‘‘మా మేనకోడలిది ఈ వూరే. ఒకసారి రా అత్తయ్యా, ఇల్లు రీమోడల్‌ చేయించాం- చూద్దువుగాని అని ఒకటే గోల. అక్కడికే బయలుదేరాను’’ అంటూ అడక్కుండానే తన వివరం చెప్పింది.

రోడ్డుకి అటూఇటూ ఆక్రమించుకుని కట్టుకున్న పాకలూ రేకులషెడ్లూ పేదరికం ఓలలాడుతున్న ఆ మనుషులని చూస్తూ ‘‘బొత్తిగా పల్లెటూరు. బస్సు కూడా రాదు వూళ్ళొకి’’ అన్నాను నిరసనగా.

‘‘ఆఁ అలా అనకండి. వూరు బాగుంటుంది. అన్నీ మేడలూ డాబాలూ కనపడుతున్నాయి చూడండి. బస్సు రావడంలేదంటే ఇంకేదో సమస్య అయి ఉంటుంది. అయినా పెద్ద దూరం ఏం లేదు. నడవొచ్చు. ఆటోలు ఉండనే ఉన్నాయి’’ సమర్థించిందామె.

ఇంతలో ఒక పాకముందు నాలుగైదేళ్ళ పిల్లని రెక్కపట్టుకుని తల్లి బడాబడా బాదేస్తోంది. ఆ పిల్ల లబోదిబోమని ఏడుస్తూ తల్లి నుండి తప్పించుకుపోవాలని చూస్తోంది. చుట్టుపక్కలున్న ఇళ్ళ ఆడంగులు ఇది మామూలే అన్నట్లు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు.

జానకమ్మ గబగబా అటువైపుకి అడుగులేస్తూ ‘‘అమ్మాయ్‌ ఆగు. ఏంటా కొట్టడం?’’ అంది కోపంగా.

‘‘కొట్టాలా... కొయ్యాలా... దీన్ని’’ అంటూ తల్లి మరోదెబ్బ వెయ్యబోయింది.

‘‘అవునుమరి, నువ్వుగాబట్టి కష్టపడి కన్నావాయె. కొట్టుకోకుండా కోసుకోకుండా ఎలా ఉంటావూ’’ మరింత మండిపడిందామె పిల్లని తన దగ్గరకు లాక్కుని.

‘తల్లి- పిల్లని కొట్టుకుంటుంది, ముద్దులాడుకుంటుంది. ఈమెకెందుకటా మధ్యలో కల్పించుకోడం. దారేబోయే తద్దినాన్ని నెత్తికెత్తుకోడం అంటే ఇదే’ నాకు చిరాకొచ్చింది. అసలే ఎండ చిరచిరలాడిపోతోంది.

‘‘మరండీ, ఆకలౌతుంది- ‘అన్నంపెట్టు’ అని అడిగితే కొడుతున్నదండీ’’ అందా పిల్ల ఏడుస్తూ జానకమ్మని కరుచుకుపోయి.

జానకమ్మ చోద్యంగా బుగ్గలు నొక్కుకుంటూ ‘‘అయితే, ఆకలైనప్పుడు అన్నం పెట్టమని నిన్నడగకపోతే ఎవరిని అడగమంటావు?’’ అంది అదే కోపంతో.

ఆ పక్కగా గుడ్డలు జాడించుకుంటున్నావిడ కల్పించుకుని ‘చిత్రాంగి, ఆకలంటేనండీ... అన్నం పెట్టలేదండీ’ అని ఆ పిల్లని వెక్కిరించి, ‘‘పిల్ల మాటలకేంలేమ్మా, కుర్రోడు నెల్లాళ్ళనించీ పనిలోకి పోవట్లేదాయె. మందులకనీ మాకులకనీ తిండీతిప్పలకీ సతమతమవుతా ఉంది. రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు. యాడ్నించొస్తయ్యమ్మా మాకు?’’ అంది ఆవేదనగా.

అప్పుడు చూశాం అటువైపు. వాకిట్లో ఒకపక్కగా బల్లరిక్షా ఉంది. పాక వసారాలో నులకమంచం మీద మగమనిషి కూర్చోనున్నాడు. రెండు ముంజేతులకీ రెండు పాదాలకీ చీము కురుపులు చితచితలాడుతున్నాయి.

మొహంలో దైన్యం, ఆకలి గూడుకట్టుకుని ఉన్నాయి. లోతుకుపోయిన కళ్ళతో నిర్వికారంగా చూశాడు మావైపు.

‘‘ఏం మందులు వాడుతున్నారు?’’ అంది జానకమ్మ. మరి అన్నీ ఈమెకే కావాలిగా.

‘‘ఇంగ్లిషు మందులు వాడుతున్నామమ్మా. కడుపులోకి మాత్తర్లు ఇస్తున్నాడు. పైపూతకి ఏదో ఆయింటుమెంటు ఇచ్చాడు. ఏమీ గుణం కనపడ్డంలేదు. పాతయ్యి మానిపోతావుంటె కొత్తయ్యి మొలుచుకొస్తన్నయ్యి. ఒకటే సలపరం. నిద్రపోడు’’ అంది పిల్లతల్లి దిగులుగా.

జానకమ్మ ఆ కుర్రాడి దగ్గరగా వెళ్ళింది. కురుపుల్ని నిశితంగా పరిశీలించింది. ‘‘అమ్మాయ్‌, ఇలారా. నేను చెప్పినట్లు చెయ్యి. నాలుగు రోజుల్లో ఈ గజ్జి కురుపులు నామరూపాల్లేకుండా మాడిపోతాయి’’ అంది.

‘‘చెప్పమ్మా, చేస్తాను’’ అంది పిల్లతల్లి ఆశగా.

‘‘ఒక గిన్నెలో చెంబుడు నీళ్ళు సలసలా కాగబెట్టు. అందులో చారెడు ఉప్పు కలుపు. పట్టగలిగినంత వేడికి చల్లారనిచ్చి, అంటే కాస్త వేడిగానే ఉండాలి. మరీ గోరువెచ్చగా కాదు. కురుపులు మునిగేలా రెండుచేతులూ నీళ్ళలో పెట్టాలి. వేడి పట్టలేనప్పుడు పైకి తియ్యడం, నిమిషం ఆగి మళ్ళీ నీళ్ళల్లో పెట్టడం. ఇలాగ పది నిమిషాలు చెయ్యి. పాదాలకి కూడా అంతే, పళ్ళెంలో కాళ్ళుపెట్టి ఈ నీళ్ళు పది నిమిషాలు కురుపులన్నీ తడిసేలా చల్లుతూ ఉండాలి. తర్వాత ఆ నీళ్ళు పారబొయ్యి. కొత్త సూది తీసుకుని కురుపుల పైన మెల్లగా బెజ్జం పెట్టావంటే చీమూ రసీ పైకి వస్తాయి. శుభ్రమైన మెత్తనిబట్టతో దాన్ని తుడిచేసెయ్యి. ఇప్పుడు చల్లటి మంచినీళ్ళతో కురుపులన్నీ కడిగి, పొడిబట్టతో తుడువు. గోడలకి వేసుకునే సున్నం తెలుసుగా, నీరుసున్నం అంటాం. అది కిళ్ళీకొట్లో కూడా దొరుకుతుంది. కుంకుడుగింజంత తీసుకుని, దొరికితే ఆముదం, లేకపోతే కొబ్బరినూనె కలిపి టెంకాయచిప్పలో వేసి బాగా రంగరించి, ఆరగా ఆరగా కురుపులమీద రాస్తుండు. చెప్పాగా, రెండురోజులకే మానుపడతాయి. మళ్ళీ కొత్తవిరావు. పూర్తిగా ఎండిపోయేదాకా పెసరపప్పు, సెనగపప్పులకి సంబంధించినవి తినకుండా ఉంటే చాలు’’.

‘‘కందిపప్పు, మజ్జిగా వాడొచ్చామ్మా?’’ శ్రద్ధగా వింటున్న పక్కావిడ అడిగింది.

‘‘సుబ్బరంగా వాడొచ్చు’’.

‘‘మందులు మానమంటారాండీ’’ పిల్లతల్లి అడిగింది.

‘‘ఇప్పుడు నేను చెప్పినట్లు పొద్దునా సాయంత్రం చెయ్యి. రెండురోజుల్లో నీకే తెలుస్తుంది, వాడాలో మానాలో. రేపీపాటికి ఎండుముఖం పట్టవూ కురుపులన్నీ’’ అంది జానకమ్మ.

‘‘ఇప్పుడే చేస్తానమ్మా, మీరు చెప్పినట్లు’’ అంది పిల్లతల్లి ఉత్సాహంగా. ఆమె మొహంలో కాస్త ధైర్యం కనపడింది. పెద్దావిడ ఆమాత్రం అజ తీసుకున్నందుకో ఆత్మీయంగా మాట్లాడినందుకో మరి.

జానకమ్మ సంచిలోంచి పర్సు తీసింది. అందులోంచి యాభై రూపాయల కాగితం తీసి ‘‘అమ్మాయ్‌, ఇదిగో ఈ పూటకి బియ్యం తెచ్చి అన్నం వండిపెట్టు’’ పిల్లతల్లికి ఇవ్వబోయింది.

‘‘వద్దండీ... వద్దు వద్దు...’’ పిల్లతల్లి చెయ్యి వెనక్కి లాక్కుంది.

‘‘తీసుకోమ్మా! నేనేం వందలూ వేలూ ఇవ్వడంలేదుగా. పసిపిల్ల ఆకలికి తట్టుకోలేదు. మన కష్టాలూ ఇబ్బందులూ వాళ్ళకేం తెలుస్తాయి. నిన్నటిదాకా బతిమాలి బతిమాలి వద్దన్నకొద్దీ పెట్టిన అమ్మ ఇప్పుడు ఆకలి అంటున్నా పట్టించుకోదేంటి అని వాళ్ళకి చేతనైన పద్ధతిలో ఏడ్చి పని సాధించుకోవాలని చూస్తారు. ఈ పూటకి ఒక్క కిలో గింజలు తెచ్చి వండు. కురుపులు తగ్గాక బండి తొక్కడానికి అబ్బాయికి శక్తి ఉండాలా?’’ అనునయంగా ప్రేమగా అంది జానకమ్మ.

‘‘మేంగూడా సాయంజేస్తానే ఉన్నామమ్మా’’ పక్కావిడ తప్పుచేసినదానిలా సంజాయిషీ ఇచ్చింది.

‘‘అదేంటమ్మా! ఇరుగూపొరుగూ అన్నాక ఒకరికొకరు సాయం చేసుకోకుండా ఎలా ఉంటారు. అందరం అంతంతమాత్రం వాళ్ళమే గదా! మిమ్మల్నెవరూ తప్పుపట్టరు’’ అంటూ, ఆవిడని సమర్థించి, పిల్ల తల్లితో ‘‘తీసుకోమ్మా. మీ అమ్మిస్తే తీసుకునేదానివి కాదా?’’ అంది బలవంతంగా చేతిలోపెడుతూ.

పిల్లతల్లి తల తిప్పుకుని కళ్ళు తుడుచుకుంది కొంగుతో.

‘‘కండతడి పెట్టకమ్మా. కష్టాలొచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి. మేమంతాలేమా! మనుషుల మధ్యే ఉన్నారుగానీ అడవిలో కాదు’’ అంది ధైర్యం చెపుతూ మందలిస్తూ.

‘‘పాపా! ఇంట్లోకెళ్ళి సంచి పట్రా’’ అంది పిల్లతో.

రివ్వున లోనికెళ్ళి ప్లాస్టిక్‌ సంచితో వచ్చింది పిల్ల.

‘‘ఇదిగో అమ్మమ్మా’’.

‘‘అమ్మమ్మట! అప్పుడే వరస కలిపింది. చిత్రాంగివే నాతల్లీ...’’ పక్కావిడ మురిపెంగా అంది.

జానకమ్మ పిల్లతోపాటు రోడ్డువారగా ఉన్న బడ్డీకొట్టు దగ్గరకెళ్ళింది. ఒక పెద్ద బ్రెడ్డూ నాలుగు టైగర్‌ బిస్కెట్ల ప్యాకెట్లూ ఒక పాల ప్యాకెట్టూ తీసుకుని డబ్బులిచ్చింది.

‘‘అబ్బాయ్‌! నేనెవరో నీకు తెలియదనుకో. అయినా నన్ను నమ్మి నాకు అప్పు పెట్టాలి’’ అంది బడ్డీకొట్టు కుర్రాడితో.

‘‘ఏంటండీ?’’ అన్నాడా అబ్బాయి నవ్వుతూ.

‘‘రేపటినించీ ఒక నెల, అంటే ముప్పయ్‌రోజులు... ఇదిగో వీళ్ళకి పొద్దున్నే ఒక బ్రెడ్డూ ఒక పాలప్యాకెట్టూ పంపించు. ఆ మొత్తం డబ్బు నేను కడతాను. ఈ వూళ్ళొ మా మేనకోడలుంది. నేను ఎగ్గొట్టే మనిషిని కాను. ఒక రోజటూ ఇటూగా నీ డబ్బు నీకిస్తా. భయమొద్దు’’.

‘‘అదేంలేదండీ, భలేవారండీ... తప్పకుండా పంపిస్తా’’ అన్నాడా కుర్రాడు.

‘‘చూడు నాయనా! మనం నిత్యాన్నదానాలు చెయ్యలేం. గుళ్ళూ గోపురాలూ కట్టించలేం. ఏదో ఇలాగ తోటిమనిషికి చేతనయినంత సాయం. నువ్వు చేసిన పుణ్యం నీ పిల్లలకి అక్కరకొస్తుంది’’ అంది.

‘‘తప్పకుండా పంపిస్తానమ్మా. మీరేం అనుమానం పెట్టుకోకండి’’ అన్నాడా అబ్బాయి భరోసా ఇస్తూ.

సంచి తెచ్చి పిల్లతల్లికిచ్చింది. ‘‘అమ్మాయ్‌, నువ్వు వండిపెట్టేసరికి ఏ వేళవుతుందో. ముందు పాలు కాచి, ఈ రొట్టెముక్కలు తినండి. రేపటినుండీ నెలరోజులు మీకు పాలూ బ్రెడ్డూ పంపమని చెప్పా. ఆ డబ్బు గురించి మీకేం సంబంధంలేదు’’ అంది.

‘‘ఇంకా ఎందుకమ్మా... వద్దమ్మా’’ అన్నారు భార్యభర్తలిద్దరూ.

‘‘అలా మాట్లాడొద్దన్నానా? మనిషికి మనిషి సాయం చేసుకోకపోతే ఎవరు చేస్తారు? సరైన తిండి లేకపోతే కురుపులు తగ్గాక రిక్షా తొక్కడానికి ఓపిక ఎలా వస్తుంది?’’ అంది పెద్దరికంతో వాళ్ళని కోప్పడుతూ. మళ్ళీ పర్సు తీసి అయిదు రూపాయలబిళ్ళ తీసి ‘‘పాపా, దీంతో పావుకిలో పంచదార తెచ్చి, మీ అమ్మకివ్వు’’ అంది.

భార్యాభర్తల కళ్ళనిండా కృతజ్ఞత. కుర్రాడు మంచంలో ఉండే చేతులు జోడించాడు.

అసహనంగా మొదలైన ఆ సంఘటన రానురాను ఆసక్తికరంగా సాగి చివరికి నాకు మార్గదర్శకంగా ముగిసింది.

నా కర్తవ్యమేమిటో నిర్దేశించింది. అతి సామాన్యురాలైన జానకమ్మలో ఎంత గొప్ప మనసు దాగివుంది! నాకెందుకులే అని తప్పించుకుపోలేదు అందరిలా. నిజానికి వాళ్ళెవరో తెలియదు. ఆర్థికంగా బలవంతురాలూ కాదు. వేలేమీ ఖర్చుపెట్టలేదు. కానీ, ఎంత అద్భుతంగా సహాయపడగలిగింది! ఎటువంటి వాగ్దానాలూ చెయ్యకుండానే ఆ కుటుంబానికి ఎంత ధైర్యం చెప్పగలిగింది! వాళ్ళల్లో ఎంత ఆత్మవిశ్వాసం నింపగలిగింది!

అవును, నా చుట్టూనే ఉన్నారు అనేకమంది దుఃఖితులూ నిస్సహాయులూ. వాళ్ళను ఆదుకోగలిగితే, చేతనైన సహాయం చేయగలిగితే చాలు. నా జన్మ ధన్యమైనట్లే. నా డబ్బు సద్వినియోగం అయినట్లే.

ఇంకా ఎవరినో సలహా అడగవలసిన పనేం ఉంది?

మెయిన్‌రోడ్డు వైపుకి తిరిగిన నన్ను చూసి ‘‘అదేంటి? అటుగాదు ఇటు, ఇటురండి’’ అంది జానకమ్మ.

‘‘నేనొచ్చిన పని అయిపోయిందండీ. మీరు వెళ్ళండి’’ అంటూ అడ్డరోడ్డు వైపుకి సాగాను.

చిత్రంగా చూసి ఉంటుంది నన్ను.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని