బంగారం

.‘‘నువ్వు మావాడితో ఓసారి మాట్లాడాలి’’ రాజారావు కృష్ణమూర్తితో అన్నాడు. ‘‘ఏం, మీవాడేమన్నా ప్రేమలోపడ్డాడా?’’ నవ్వుతూ అడిగాడు..

Published : 08 Apr 2020 19:36 IST

- సి.ఎన్‌.చంద్రశేఖర్‌

‘‘నువ్వు మావాడితో ఓసారి మాట్లాడాలి’’ రాజారావు కృష్ణమూర్తితో అన్నాడు.

‘‘ఏం, మీవాడేమన్నా ప్రేమలోపడ్డాడా?’’ నవ్వుతూ అడిగాడు కృష్ణమూర్తి.

‘‘వాడి మొహానికి అదొక్కటే తక్కువ’’.

‘‘ఎందుకురా వాణ్ణి అలా తక్కువచేసి మాట్లాడతావు. వాడికేం తక్కువైందని? అందగాడు, ఆజానుబాహుడు, తెలివితేటలున్నవాడు. అన్నిటినీమించి మంచి మనసున్నవాడు’’.

‘‘నువ్వన్నవన్నీ నిజమే, ఒక్క తెలివితేటల విషయం తప్ప’’.

‘‘ఇంటర్‌లో తొంభై అయిదు శాతం మార్కులతో పాసయ్యాడంటే వాడు తెలివైనవాడికిందే లెక్క. ఇక ఎంసెట్‌ అంటావా, ఎంత కష్టపడి చదివినా రెండు మూడు గంటల్లో వారి అదృష్టాన్ని తేల్చే పరీక్ష అది. కాస్త మనోధైర్యం కోల్పోయినా, కన్ఫ్యూజ్‌ అయినా ఫలితాలు తారుమారవుతాయి. మీవాడి విషయంలో అదే జరిగి ఉంటుందని నా అభిప్రాయం’’.

‘‘కారణాలు ఏవైనా వాడికి ర్యాంకు పదివేలు దాటిందన్నమాట నిజం. మా ఆఫీసులో మా కొలీగ్‌ కొడుకు ఐఐటీలో సీటు సాధించాడు. ప్యూను కొడుకు బిట్స్‌ పిలానీలో సీటు తెచ్చుకున్నాడు. మా మేనేజరు కూతురికి మెడిసిన్‌లో స్టేట్‌లో నాలుగోర్యాంకు వచ్చింది. వాళ్ళందరూ వాళ్ళ పిల్లల విజయాల గురించి చెబుతూంటే నా కొడుకు గురించి ఏమీ చెప్పలేకపోతున్నందుకు నాకెంత బాధగా ఉంటుందో చెప్పు’’.

‘‘మానవుడి అశాంతికి కారణం కోరికలే- అని బుద్ధభగవానుడు చెప్పారు. ‘మధ్యతరగతి మానవుడి జీవితంలో అశాంతికి కారణం అతను ఎప్పుడూ తనని పక్కవాళ్ళతో పోల్చుకుంటూ ఉండటమే’ అంటాను నేను. నీ అశాంతికి కూడా కారణం అదే. భరత్‌కు తన బాధ్యతలు తెలుసు. అందుకే హాస్టల్లో ఉండి చదవడం ఇష్టంలేకపోయినా నీకోసం విజయవాడ వెళ్ళాడు. ఎంతో కష్టపడి చదివాడు. కానీ అదృష్టం వరించలేదు. అయితే, పిల్లల కృషిలో లోటులేనంతవరకూ మనం ఫలితం గురించి బాధపడనక్కరలేదు. ఈసారి కాకుంటే మరోసారి రాణిస్తారు. ఏది జరిగినా అది మన మంచికే జరిగిందనీ భగవంతుడు ఇంకేదో మంచిని మనకోసం సిద్ధంచేసి ఉంటాడనీ అనుకుంటే ఏ బాధా ఉండదు’’.

‘‘నువ్వన్నది నిజమే. కానీ మనసు రాజీపడటంలేదు’’.

‘‘నీ సహోద్యోగుల పిల్లలు సాధించిన విజయాలకు మనస్ఫూర్తిగా నీ అభినందనలు తెలియజేయి. ఆ విధంగా నీ మనసును సిద్ధంచెయ్యి. అప్పుడు నీ మనసులో ఏ బాధా ఉండదు. ఇంతకూ భరత్‌తో నేను మాట్లాడాలన్నావు. ఏ విషయం గురించి?’’

‘‘వాడు లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ తీసుకుని మరోసారి ఎంసెట్‌ ఎంట్రన్స్‌ రాస్తే మంచిదని నా అభిప్రాయం. అలాగే ఐఐటి, బిట్స్‌, ఎన్‌ఐటీ లాంటి పెద్దపెద్ద కాలేజీల్లో సీటుకోసం ఎంట్రన్స్‌ రాయొచ్చు. వాటిల్లో సీటు వస్తే వాడి భవిష్యత్తు బాగుంటుంది. కానీ వాడు అందుకు సుముఖంగా లేడు. మన వూళ్ళొని ఇంజినీరింగ్‌ కాలేజీలో చేరతానంటున్నాడు. వాడికి నువ్వంటే మంచి గౌరవం. నువ్వు వాడికి నచ్చజెప్పి లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌లో చేరేలా చూడు’’.

‘‘తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తాను’’.

మరుసటిరోజు భరత్‌తో మాట్లాడాడు కృష్ణమూర్తి. రాజారావు కోరిక గురించి చెప్పాడు.

‘‘సారీ అంకుల్‌. రెండేళ్ళు అమ్మానాన్నలకు దూరంగా గడిపాను. గాలీ వెలుతురూ లేని గదుల్లో క్లాసులు, కంపుకొట్టే టాయిలెట్లు, రుచీ శుచీ లేని వంటకాలు... ఇవన్నీ నాన్నగారి కోసం భరించాను. చదువుతప్ప మరో లోకం లేకుండా గడిపాను. ఇక నావల్ల కాదు. మన వూళ్ళొ మంచి కాలేజీలు ఉన్నాయి. నాలుగేళ్ళు ఇంటిపట్టునే ఉండి హాయిగా చదువుకుంటాను. పైగా ఐఐటీ, ఎన్‌ఐటీ లాంటి పెద్ద కాలేజీల విషయం వదిలేస్తే మిగిలిన ఏ కాలేజీలో చదివినా ఒకటే అని నా అభిప్రాయం. ఎటూ ఉద్యోగాలు బాగానే దొరుకుతున్నాయి’’.

‘‘కానీ మీ నాన్న ఆశలూ ఆశయాలూ కూడా నువ్వు అర్థంచేసుకోవాలి భరత్‌’’.

‘‘ఆయన ఆశల్ని అర్థంచేసుకున్నాను అంకుల్‌. కానీ అంతకంటే ఎక్కువగా నా బాధ్యతల్ని అర్థంచేసుకున్నాను. నాన్నకు ఆఫీసులో టెన్షన్స్‌ ఎక్కువవుతున్నాయి. ఉదయం పదిగంటలకు ఆఫీసుకు వెళ్తే రాత్రి ఎనిమిదికిగానీ ఇంటికి రాలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితిలో నేను వూళ్ళొ ఉంటే కనీసం ఇంటిపనులైనా పంచుకోవచ్చు. అమ్మ ఆరోగ్యం కూడా ఈమధ్య కాస్త దెబ్బతింది. అమ్మను డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళడం, మందులు తెచ్చివ్వడం లాంటి పనులన్నీ నేను చేయవచ్చు. నేను వూళ్ళొ ఉంటే అమ్మకూ ధైర్యంగా ఉంటుంది’’.

‘‘కానీ నువ్వు ఈ పనులన్నీ చేయడంకంటే మంచి కాలేజీలో సీటు తెచ్చుకుంటేనే వాళ్ళకు ఎక్కువ ఆనందం కలుగుతుంది’’.

‘‘ఒకవేళ లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ తీసుకుని మళ్ళీ పరీక్ష రాసినా అప్పుడూ ఇదే పరిస్థితి ఎదురైతే ఏం చేయాలి? పైగా ఒక సంవత్సరం వ్యర్థమైందన్న విషయం నాపై మరింత ఒత్తిడిని పెంచుతుంది. మీ సలహాను కాదంటున్నందుకు ఏమనుకోకండి. దయచేసి మీరిద్దరూ నన్ను అర్థంచేసుకోండి’’.

భరత్‌ తనతో చెప్పింది రాజారావుతో చెప్పి, ‘‘వాడు చెప్పిన ప్రతి కారణం సరైనదేనని నాకనిపించింది. తల్లిదండ్రులకు సంపాదించి ఇచ్చే కొడుకులు చాలామంది ఉంటారు. కానీ తల్లిదండ్రుల కోసం తపించే కొడుకులు చాలా తక్కువమంది ఉంటారు. నువ్వు చాలా అదృష్టవంతుడివి రాజా’’ అన్నాడు కృష్ణమూర్తి.

స్నేహితుడి మాటలు రాజారావు మనసును కుదుటపరచలేకపోయాయి.

‘‘మనం పిల్లలకు మంచిదారి చూపాలనుకుంటాం. వద్దు, నేను ముళ్ళదారిలోనే నడుస్తానంటే మనం ఏం చేయగలం? అనుభవించనీ తెలుస్తుంది’’.

‘‘అలా అశుభంగా మాట్లాడకు. వాడికి అంతా మంచే జరుగుతుందని ఆశిద్దాం. ఆశీర్వదిద్దాం’’.

* * *

నాలుగురోజుల తర్వాత ఎదురింట్లో ఉంటున్న సీతారామయ్య కొడుకుతోపాటు రాజారావు ఇంటికివచ్చి తన కొడుక్కి ఐఐటీ కాన్పూర్‌లో సీటు వచ్చిందనీ తామిద్దరూ కాన్పూరు వెళుతున్నామనీ తన భార్య ఇంట్లో ఒంటరిగా ఉంటుంది కాబట్టి భరత్‌ను రాత్రిపూట వాళ్ళింట్లో పడుకోమనీ కోరాడు.

భరత్‌ అందుకు ఎంతో సంతోషంగా ఒప్పుకున్నాడు.

‘‘మీరు నిశ్చింతగా వెళ్ళిరండి అంకుల్‌. అమ్మను నేను చూసుకుంటాను’’ అని సీతారామయ్యతో చెప్పి, ‘‘ఆల్‌ ద బెస్ట్‌ వినోద్‌’’ అంటూ అతని కొడుక్కి చేయి అందించాడు.

కొడుకు ముఖంలో ఎటువంటి అసూయగానీ నిరుత్సాహంగానీ కనిపించకపోవడం చూసి ఆశ్చర్యపోయాడు రాజారావు. ‘వాడి తండ్రిగా తనే వాళ్ళముందు ఎంతో ఇన్ఫీరియర్‌గా ఫీలవుతున్నాడు. మరి వీడిలో ఆ బాధే కనిపించదే’ అనుకున్నాడు.

వాళ్ళు వెళ్ళిపోయాక లలిత హాల్లోకి వచ్చి ‘‘మీకు టిఫిన్‌ తీసుకురానా?’’ అని అడిగింది రాజారావును.

‘‘వద్దు, కడుపు నిండిపోయింది’’ అన్నాడు రాజారావు విసుగ్గా.

అప్పుడే అక్కడికి వచ్చిన భరత్‌ దెబ్బతిన్నట్టు చూశాడు తండ్రివైపు. తర్వాత మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు.

ఆ క్షణంలో ఎందుకో కొడుకుపై విపరీతమైన జాలి కలిగింది రాజారావుకు.

* * *

‘‘నువ్వు మావాడితో ఓసారి మాట్లాడాలి’’ నాలుగేళ్ళ తరవాత రాజారావు కృష్ణమూర్తితో అన్నాడు.

‘‘ఏం, నువ్వు గేట్‌ ఎంట్రన్స్‌గానీ జిఆర్‌ఈ గానీ రాసి పైచదువులు చదవమంటే, వాడు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో చేరతానని అంటున్నాడా?’’ అన్నాడు కృష్ణమూర్తి నవ్వుతూ.

‘‘కాదు. నేను సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో చేరమంటే వాడు తను చదివిన కాలేజీలో లెక్చరర్‌గా చేరతానంటున్నాడు. నువ్వు వాడికి కాస్త నచ్చజెప్పు’’.

రాజారావు చెప్పింది విని ఆశ్చర్యపోయాడు కృష్ణమూర్తి.

‘సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం దొరికితే తమ జీవితాశయం నెరవేరినట్లు ఫీలవుతుంటారు చాలామంది కుర్రాళ్ళు. ఆ కంపెనీలు ఇచ్చే జీతాలు అలాంటివి. మరి భరత్‌ అటువంటి ఉద్యోగం వద్దనుకుని ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‌ పోస్ట్‌ కోరుకోవడం ఏమిటి? ఒకవేళ తను ఇంటర్వ్యూల్లో నెగ్గలేనని భయపడుతున్నాడా?’ అనుకున్నాడు.

తన అనుమానం భరత్‌తో చెప్పి ‘‘నీకు ఇంగ్లిషులో మంచి వొకాబులరీ ఉంది. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు కోరుకునే కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, చురుకుదనం నీలో ఉన్నాయి. నీకు తప్పకుండా మంచి ఉద్యోగం దొరుకుతుంది’’ అన్నాడు కృష్ణమూర్తి.

‘‘నాకు అటువంటి ఉద్యోగాలపట్ల ఆసక్తిలేదు అంకుల్‌. పొద్దున్నుంచీ రాత్రివరకూ గానుగెద్దులా పనిచెయ్యాలి. లీవులు కావలసినప్పుడు దొరకవు. జాబ్‌ సెక్యూరిటీ ఉండదు. చెవికో సెల్‌ఫోనూ చేతికో లాప్‌టాప్‌ ఇచ్చేస్తారు. ఇక మనకు ప్రైవసీ అంటూ ఉండదు. వాళ్ళు రమ్మన్నప్పుడల్లా వెళ్ళాలి, చెయ్యమన్న పనల్లా చేయాలి’’.

‘‘డబ్బు సంపాదించాలంటే కష్టపడక తప్పదు’’.

‘‘జీవితంలో డబ్బు అవసరమేకానీ డబ్బే జీవితం కాకూడదు అంకుల్‌. జీవితంలో మనకు ఆనందాన్నిచ్చేవి ఎన్నో ఉన్నాయి. అవన్నీ చూడకుండా, అనుభవించకుండా బ్యాంక్‌ బ్యాలెన్స్‌ చూసుకుంటూ జీవితాన్ని గడపడం నాకిష్టం ఉండదు. పైగా సిటీల్లో పాతికవేలు సంపాదించడం, మన వూళ్ళొ పదిహేనువేలు సంపాదించడం ఒకటే నా దృష్టిలో’’.

‘‘నీ జీతం పాతికవేల దగ్గర ఆగిపోదుగా భరత్‌. ఇంకా ఎంతో పెరుగుతుంది. ఆ స్థాయిలో జీతం ఇక్కడ పెరగదు. నువ్వు మన వూరిలో ఇంజినీరింగ్‌ చదువుతానని చెప్పిన కారణాలు నాకు నచ్చి, నిన్ను ఆరోజు సమర్థించాను. కానీ ఈరోజు మాత్రం నువ్వు చేస్తున్నది తప్పని నాకనిపిస్తుంది. మంచి భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకుంటున్నావనిపిస్తుంది. మనిషికి జీవితంలో ఎదగాలనే ఆశా తపనా ఉండాలి భరత్‌. అవి లేకపోతే మనిషిలో పురోగతి ఉండదు’’.

‘‘నాకూ ఎదగాలని ఉంది అంకుల్‌. నాకూ ఎన్నో ఆశలున్నాయి. ఈ నాలుగేళ్ళూ కీబోర్డు నేర్చుకున్నాను. అందులో మరింత కృషిచేసి గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నాను. నేను అనుకున్నది సాధించిన రోజు మీరు నా నిర్ణయాన్ని సమర్థిస్తారు’’.

‘‘నువ్వు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసుకుంటూ కూడా వాటిని కంటిన్యూ చేయవచ్చు. పైగా సిటీల్లో వాటిని నేర్చుకోవడానికీ నేర్చుకున్నవి ప్రదర్శించడానికీ అవకాశాలు ఎక్కువ’’.

‘‘అటువంటి ఉద్యోగాల్లో ఖాళీ సమయం ఎక్కడుంటుంది అంకుల్‌?’’

భరత్‌ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు కృష్ణమూర్తి. భరత్‌ తన నిర్ణయం మార్చుకోడని అర్థమైంది అతనికి. చివరి ప్రయత్నంగా ‘‘కనీసం మీ నాన్న సంతోషం కోసమైనా ఆయన చెప్పినట్లు విను భరత్‌’’ అన్నాడు.

‘‘పక్కవాళ్ళ పిల్లలతో నన్ను పోల్చుకోకపోతే ఆయన సంతోషంగానే ఉంటారు. ఆయన్ను సంతోషంగా ఉంచాలనే నా ప్రయత్నం కూడా. సీతారామయ్య అంకుల్‌ని చూస్తున్నారుగా. కొడుకు ఎక్కడో దూరంగా ఉన్నాడు. ఆయన అస్తమా పేషెంట్‌. కరివేపాకు దగ్గర్నుంచీ కరెంటుబిల్లు దాకా అన్నీ ఆయనే చూసుకోవాలి. ఓ అర్ధరాత్రి ఆయనకు బ్రీతింగ్‌ ప్రాబ్లం ఎక్కువైతే నేను వెళ్ళి డాక్టరును పిలుచుకుని వచ్చాను. అటువంటి ఇబ్బంది అమ్మకుగానీ నాన్నకుగానీ వస్తే ఎవరు చూసుకుంటారు చెప్పండి? అందుకే నేను వారిని విడిచి వెళ్ళదలచుకోలేదు’’.

‘‘నీ ఇష్టం’’ అన్నాడు కృష్ణమూర్తి నిరుత్సాహంగా.

* * *

అతి తక్కువ కాలంలో మంచి లెక్చరర్‌గా విద్యార్థుల అభిమానాన్ని సంపాదించాడు భరత్‌. తన తోటి లెక్చరర్‌ వనిత అందం, మంచితనం, సంస్కారం అతనికి నచ్చి ఆమెను పెళ్ళిచేసుకోవాలని అనుకున్నాడు. అతని ప్రపోజల్‌కు వనిత అంగీకరించింది. వారి పెళ్ళికి ఇరువైపు పెద్దలనుంచి ఎటువంటి వ్యతిరేకతా రాలేదు.

వనిత వచ్చాక లలితకు ఇంటిపని బాగా తగ్గింది. కాలేజీకి వెళ్ళేలోపు వనిత చాలా పనులు అందుకుంటుంది. ఎన్ని పనులున్నా చిరునవ్వుతో కనిపించడం, అత్తామామల్ని గౌరవించడం, ఇంటికి వచ్చిన అతిథులతో ఆప్యాయంగా మాట్లాడటంవల్ల బంధుమిత్రులందరికీ ఇష్టమైన వ్యక్తి అయింది. సాయంత్రాలు నలుగురూ కలిసి గుళ్ళకూ సినిమాలకూ ఫంక్షన్‌లకూ వెళ్ళివస్తున్నందువల్ల జీవితం హాయిగా సాగుతున్నట్టు అనిపించసాగింది రాజారావుకు. భరత్‌ ఓ సెకండ్‌హ్యాండ్‌ మారుతీ కారు కొన్నాడు. నలుగురూ కలిసి వెళ్ళడానికి ఇబ్బందిలేకుండా పోయింది.

సంవత్సరం తర్వాత రాజారావు రిటైరయ్యాడు. మరో సంవత్సరం తర్వాత మనవడితో ఆడుకోసాగారు రాజారావు దంపతులు. వాళ్ళకు కాలం గడిచేదే తెలిసేదికాదు. అనతికాలంలోనే వూళ్ళొ ఉన్న బంధువులకూ స్నేహితులకూ భరత్‌, వనిత చాలా దగ్గరయ్యారు. వారి మంచితనం, సేవా దృక్పథంవల్ల ఇంటికి వచ్చే అతిథుల సంఖ్య పెరిగింది. వచ్చినవాళ్ళంతా భరత్‌ను పొగుడుతూంటే ఎంతో గర్వంగా అనిపించేది లలితకు. అయితే భర్త కొడుకుతో ముక్తసరిగా మాట్లాడటం ఆమెను బాధించేది.

సీతారామయ్య కొడుకు వినోద్‌ బి.టెక్‌ తర్వాత అమెరికాలో ఎం.ఎస్‌. చేసి అక్కడే ఉద్యోగంలో చేరాడు. పెళ్ళికోసం ఇండియా వచ్చి తర్వాత భార్యను తీసుకుని అమెరికా వెళ్ళిపోయాడు. కోడలు పురుడు సమయంలో సీతారామయ్య దంపతులు అమెరికా వెళ్ళి మూడునెలలుండి తిరిగి ఇండియా వచ్చారు. మనవరాలి ఫొటోలు ఇంటర్‌నెట్‌లో చూసుకుంటూ కొడుకుతో ఫోన్లో మాట్లాడుకుంటూ వాళ్ళు కాలక్షేపం చేయసాగారు. ప్రతి చిన్నపనికీ సీతారామయ్య తిరుగుతున్నాడు. భరత్‌ అవసర సమయాల్లో వారిని ఆదుకుంటూ ఉన్నాడు.

ఓరోజు కృష్ణమూర్తి రాజారావు ఇంటికి వచ్చాడు. పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకున్నాక ‘‘ఎలా ఉంది జీవితం?’’ అని అడిగాడు స్నేహితుణ్ణి.

‘‘హాయిగా ఉంది. భార్య, కొడుకు, కోడలు, మనవడు- వీళ్ళే నా ప్రపంచం ఇప్పుడు. అద్భుతమైన ప్రపంచం ఇది’’.

‘‘నీ అద్భుత ప్రపంచంలో ఓ వింత కూడా ఉంది’’.

ఏమిటన్నట్లు చూశాడు రాజారావు.

‘‘తండ్రి తనయుడితో మాట్లాడకపోవడం’’.

‘‘నేను వాడితో మాట్లాడుతున్నానే’’.

‘‘అని నువ్వు లోకాన్ని నమ్మించగలవేమోగానీ నీ ప్రాణస్నేహితుణ్ణి నమ్మించలేవు. నువ్వు మనసువిప్పి వాడితో మాట్లాడటంలేదన్న విషయం నాకు తెలుసు. భరత్‌ ఎంత ఆనందంగా కనిపిస్తున్నా వాడి గుండెలో గూడుకట్టుకున్న విషాదాన్ని నేను చూడగలను. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఆ కళ్ళ వెనుక కన్నీరు నాకు కనిపిస్తుంది’’.

‘‘అంతా తెలిసినవాడివి, నీకు నేను చెప్పేదేముంది?’’

‘‘నీ పద్ధతి మార్చుకో రాజా. వాడు నువ్వు కోరిన దారిలో నడవలేదు. నిజమే. కానీ దారితప్పలేదు. చక్కగా చదువుకుని ప్రయోజకుడయ్యాడు. తన అభిరుచులకు తగ్గట్టు తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్నాడు. మీతోనే ఉంటూ ఈ కాలంలో చాలామంది తల్లిదండ్రులకు దొరకని అదృష్టాన్ని మీకు కలగజేశాడు. వాడి మనసు పూర్తిగా విరగకముందే నువ్వు మారితే మంచిది’’.

‘‘తండ్రీకొడుకుల మధ్య గ్యాప్‌ రాకూడదు. వచ్చాక దాన్ని తొలగించడం కష్టం’’.

‘‘నువ్వు ప్రయత్నమే చేయకుండా ఫలితం రాదంటే ఎలా? మావాడు మమ్మల్ని తన దగ్గరకు వచ్చెయ్యమంటున్నాడు. ఈ నెలాఖరున మేము హైదరాబాదు వెళ్ళిపోవచ్చు. ఆలోగా నీనుంచి మంచి వార్త వినాలని ఆశిస్తున్నా’’.

కృష్ణమూర్తి వెళ్ళిపోయాడు. రాజారావు చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు. అయితే కృష్ణమూర్తి ఆశించిన మంచివార్త అతనికి అందలేదు.

* * *

కీబోర్డులో చాలా కృషి చేశాడు భరత్‌. ప్రతి శని, ఆదివారాలు చెన్నై వెళ్ళి మరింత ప్రావీణ్యం సంపాదించాడు. ఓ ఆర్కెస్ట్రా టీములో చేరి వారితో కలిసి చుట్టుపక్కల వూళ్ళలో ప్రదర్శనలు ఇవ్వసాగాడు. ఓసారి తిరుపతికి వచ్చిన ఓ ప్రముఖ సినీ సంగీత దర్శకుణ్ణి కలిశాడు భరత్‌. భరత్‌ ప్రతిభ చూసి తన దగ్గరికి వచ్చెయ్యమనీ కీబోర్డు ప్లేయర్‌గా తాను అవకాశమిస్తాననీ చెప్పాడు. భరత్‌ ఎంతో సంతోషించాడు.

విషయం విన్న లలిత, వనిత కూడా ఎంతో సంతోషించారు. అయితే రాజారావు మాత్రం ఉన్న ఉద్యోగం వదులుకుని రిస్కు తీసుకోవడం మంచిదికాదని అభిప్రాయపడ్డారు.

‘‘మీరు అంతగా ఆందోళన చెందాల్సిన అవసరంలేదు నాన్నా. సంగీతరంగంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులొచ్చాయి. అవకాశాలూ బోలెడున్నాయి ఇప్పుడు. సినిమాల్లో అవకాశాలు రాకపోతే టీవీ రంగం ఉంది. అదీ లేకపోయినా ప్రైవేటు ఆల్బమ్స్‌ చేసుకోవచ్చు. ప్రతిభా కృషీ ఉంటే ఆ రంగంలో అవకాశాలకు కొదవలేదు. ఒకవేళ ఏదీ అచ్చిరాకపోతే మళ్ళీ ఈ లెక్చరర్‌ ఉద్యోగమే చెయ్యొచ్చు. ఇటీజ్‌ వర్త్‌ ఎ ట్రై’’ అంటూ తండ్రికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు భరత్‌.

‘‘నీ ఇష్టం. నువ్వు ఏ రోజు నా మాట విన్నావు, ఈరోజు వినడానికి’’ అన్నాడు రాజారావు వ్యంగ్యంగా.

భరత్‌ బాధగా తండ్రివైపు చూశాడు. తర్వాత ‘‘మీరు చెప్పినట్లే వింటాను నాన్నా. ఈ ఆఫర్‌ను వదులుకుంటాను’’ అన్నాడు.

రెండురోజుల తర్వాత భరత్‌ పనిచేసే కాలేజీ ప్రిన్సిపాల్‌ ఇంటికి వచ్చి రాజారావుతో ‘‘భరత్‌కు మంచి టాలెంటు ఉంది. అతన్ని హైదరాబాదు పంపండి. హషీమ్‌ లాంటి సంగీత దర్శకుడి దగ్గర పనిచేసే అవకాశం దొరకడం అదృష్టం. ఒకవేళ భరత్‌ ఆ రంగంలో ఫెయిలైతే మళ్ళీ మా కాలేజీలోనే లెక్చరర్‌ ఉద్యోగం ఇస్తాను’’ అన్నాడు.

రాజారావు ఒప్పుకున్నాడు.

‘‘అత్తగారినీ మామగారినీ నేను చూసుకుంటాను. మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. పూర్తి ఏకాగ్రతతో సంగీతంపై ధ్యానం పెట్టండి. చిత్తశుద్ధితో మనం ఏ పనిచేసినా అది విజయవంతమవుతుంది. మంచి మనిషికి భగవంతుడి సహాయం తప్పకుండా ఉంటుంది. చిన్నచిన్న అపజయాలనూ అవమానాలనూ పట్టించుకోకుండా మీ కృషి మీరు చెయ్యండి. గుర్తింపు దానంతట అదే వస్తుంది’’ అంది వనిత రైల్వేస్టేషన్‌లో భర్తకు వీడ్కోలిస్తూ.

హైదరాబాదులో భరత్‌కు పరిస్థితి ఆశాజనకంగా కనిపించింది. రెండేళ్ళు హషీమ్‌ దగ్గర కీబోర్డు ఆపరేటర్‌గా పనిచేసి, తర్వాత కొన్ని టీవీ సీరియల్స్‌కు సంగీతం అందించాడు. కొన్ని సినిమాలకు అసిస్టెంట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. మరో మూడేళ్ళ తర్వాత సినిమాలకు సొంతంగా సంగీతం అందించసాగాడు.

హైదరాబాదులో ఇల్లు కొన్నాడు భరత్‌. తల్లిదండ్రుల్ని తనతోపాటు హైదరాబాదు వచ్చేయమని కోరాడు. వెళ్ళడానికి రాజారావుకు అహం అడ్డొచ్చింది. కొడుకు కోరికను తిరస్కరించాడు.

లలిత ప్రోద్బలంతో కొడుకుతోపాటు హైదరాబాదు చేరింది వనిత.

* * *

‘‘ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుందంటారు. మీ ఈ విజయం వెనుక ఎవరున్నారు?’’

రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డులు ప్రకటించగానే రికార్డింగ్‌ థియేటర్‌లో ఉన్న భరత్‌ను చుట్టుముట్టిన టీవీ పత్రికా రిపోర్టర్లలో ఒకతను భరత్‌ను అడిగాడు.

‘‘నా విజయం వెనుక ఓ పురుషుడు ఉన్నారు. ఆయన మా నాన్నగారు. నేను ఐఐటీలో ఇంజినీరింగ్‌ చదవాలనీ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసి అమెరికా వెళ్ళిరావాలనీ ఆశపడ్డారు. కానీ నా అభిరుచులూ ఆలోచనలూ వేరుగా ఉండేవి. టెన్షన్లులేని ఉద్యోగం చేయాలి. రోజూ ఉదయం నాలుగు మంచి పాటలు వినాలి. వారానికి ఒక మంచి సినిమా చూడాలి. మంచి పుస్తకం నెలకు ఒకటైనా చదవాలి. అమ్మానాన్నలకు తోడుగా ఉండాలి. బంధువులకూ స్నేహితులకూ అందుబాటులో ఉండాలి... ఇలా సాగేవి నా ఆలోచనలు. అయితే ఇరుగుపొరుగు పిల్లలతో నన్ను పోల్చుకుని మా నాన్న బాధపడటం చూశాక, వాళ్ళందరికంటే భిన్నంగా ఏదైనా సాధించాలనీ మా నాన్న నన్ను చూసి గర్వపడేలా ఏదైనా చేయాలనీ నాకనిపించేది. మా నాన్నకు పాటలంటే ఇష్టం. ప్రతిరోజూ ఉదయాన గంటసేపైనా పాటలు వినడం ఆయన హాబీ. రోజూ ఆ పాటలు వినడంవల్ల నాకూ పాటలంటే ఇష్టం ఏర్పడింది. నేను విన్న పాటలను కొత్త ట్యూనులో పాడేందుకు ప్రయత్నించేవాడిని. నాలుగేళ్ళు బి.టెక్‌ చేస్తూ కీబోర్డు నేర్చుకున్నాను. ఓసారి తిరుపతికి వచ్చిన ప్రముఖ సంగీత దర్శకులు మహమ్మద్‌ హషీమ్‌ గారు నా టాలెంట్‌ చూసి నన్ను తన ట్రూప్‌లోకి ఆహ్వానించారు. ఆ తర్వాత జరిగింది మీకు తెలిసిందే. నాలో ఎదగాలన్న తపననూ ఏదైనా సాధించాలన్న కసినీ నాకు కలిగించిన మా నాన్నగారికి ఈ నంది అవార్డును అంకితం ఇస్తున్నాను’’.

టీవీలో కొడుకు ఇంటర్వ్యూ చూస్తున్న రాజారావు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. భార్యా ఇరుగుపొరుగువాళ్ళూ అభినందిస్తూంటే దుఃఖంతో ఏం మాట్లాడలేకపోయాడు. తర్వాత కృష్ణమూర్తి హైదరాబాదు నుంచి ఫోన్‌ చేశాడు.

‘‘కంగ్రాట్స్‌రా. నీ కొడుకు నీకు అద్భుతమైన బహుమతి ఇచ్చాడు’’.

‘‘నేను ఈ బహుమతికి అర్హుణ్ణి కాదు. వాడిలోని టాలెంట్‌ని నేను ఏనాడూ గుర్తించలేదు. ఎటువంటి ప్రోత్సాహాన్నీ అందించలేదు. వాడు నాకోసం తపించాడు. నేను వాణ్ణి శపించాను. నా మాటలతో కొన్నాళ్ళూ మౌనంతో కొన్నేళ్ళూ బాధించాను. నా ముఖంలో ఆనందం కోసం పదేళ్ళు శ్రమించాడు వాడు. వాడి ముఖంలో ఆనందం కోసం ఓ మంచిమాట, ప్రోత్సాహకరమైన పదం ఇన్నేళ్ళలో ఒక్కసారి కూడా నేను చెప్పలేకపోయాను.

చాలామంది ఐఐటీ స్టూడెంట్లూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లూ సాధించలేని విజయాన్ని వాడు ఈరోజు సాధించాడు. రాష్ట్రం మొత్తం ప్రజానీకానికి తెలిసిన వ్యక్తి అయ్యాడు. నేను ఎన్ని మాటలన్నా వాడు నోరెత్తేవాడు కాదు. ఈరోజు వాడు తన చేతల్తో నన్ను గెలిచాడు. వాడు... వాడు... బంగారం’’.

రాజారావు ఏడుస్తున్నాడు పశ్చాత్తాపంతో. అతని కళ్ళు వర్షిస్తున్నాయి ఆనందంతో.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు