ఒక్కమాట

ఈ రోజుతో షాపింగ్‌ పూర్తిచేసి రేపు తీరుబడిగా వద్దామనుకుంటే, నీరజతో సమస్యేదో వచ్చిందంటూ ఇప్పుడే రమ్మన్నావ్‌, సంగతేమిటి పిన్నీ? ఎవరినైనా ప్రేమించానని...

Published : 08 Apr 2020 22:49 IST

- గోగినేని హిమబిందు

ఈ రోజుతో షాపింగ్‌ పూర్తిచేసి రేపు తీరుబడిగా వద్దామనుకుంటే, నీరజతో సమస్యేదో వచ్చిందంటూ ఇప్పుడే రమ్మన్నావ్‌, సంగతేమిటి పిన్నీ? ఎవరినైనా ప్రేమించానని అంటోందా? ఆ సంబంధం నీకిష్టంలేదా’’ వచ్చీరాగానే పార్వతమ్మ మీద ప్రశ్నలవర్షం కురిపించేసి సోఫాలో కూర్చుంది సరళ.

సరళ పార్వతమ్మ వాళ్ళకి దూరపు బంధువు. పార్వతమ్మ కూతురు నీరజకంటే సరళ మూడేళ్ళు పెద్ద. ఇద్దరిమధ్యా మంచి స్నేహం ఉంది. మూడేళ్ళక్రితం పెళ్ళి చేసుకుని అమెరికా వెళ్ళిన సరళ సెలవుమీద వారంరోజుల క్రితమే ఇండియా వచ్చింది.

పార్వతమ్మ అక్కడే కూర్చుని ఉన్న నీరజ వైపు నిష్ఠూరంగా చూసి ‘‘నీ చెల్లెలి ప్రేమంతా అమెరికా మీదే. ఆ పిచ్చితో ఇక్కడ వచ్చిన మంచి సంబంధాన్ని కాదంటోంది’’ అంది నిట్టూరుస్తూ.

‘‘అలా చెబితే నాకెలా అర్థమవుతుంది పిన్నీ, వివరంగా చెప్పు’’ అడిగింది సరళ.

‘‘ఎదురుగానే ఉందిగా, నీ చెల్లెల్నే అడుగూ’’ అని పార్వతమ్మ అంటుంటే, నీరజ మధ్యలోనే అడ్డంవచ్చి ‘‘అర్జంటుగా రమ్మని పిలిచినదానివి నువ్వే చెప్పొచ్చుగా’’ అంది కొంచెం కోపంగా.

సరళ చిన్నగా నవ్వింది ‘‘బావుంది, మీరిద్దరూ వాదులాడుకుంటూ నన్ను సస్పెన్స్‌లో పెడుతున్నారు. ముందు నువ్వు చెప్పు పిన్నీ సంగతేమిటో’’ అంది పార్వతమ్మ వైపు చూస్తూ.

పార్వతమ్మ మళ్ళీ గట్టిగా నిట్టూర్చింది. ‘‘మా తమ్ముడు శంకరం ట్రాన్స్‌ఫరై వచ్చి ఇప్పుడు ఈ వూళ్ళొనే ఉంటున్నాడు. మేం మొన్న వాళ్ళింటికి వెళ్ళినప్పుడు మా మరదలు తరఫు బంధువులు ఈ వూళ్ళొ ఎవరింటికో పెళ్ళికని వచ్చి వీళ్ళనీ చూసిపోదామని వచ్చారు. వాళ్ళకీ వాళ్ళబ్బాయి కిషోర్‌కీ మన నీరజ నచ్చిందని చెప్పి, సంబంధం కలుపుకోవటానికి ఇష్టపడ్డారు. మా మరదలికి వాళ్ళ కుటుంబం బాగా తెలుసు. మంచివాళ్ళని చెప్పింది. ఈడూ జోడూగా ఉన్నాడు. అన్ని విషయాలూ బావున్నాయని, నీరజకూ సంబంధాలు చూస్తున్నాం కదా అనే ఉద్దేశ్యంతో మా తమ్ముడు వాళ్ళని సాంప్రదాయంగా పెళ్ళిచూపులకి ఈరోజు మనింటికి రమ్మని చెప్పేశాడు. నీరజేమో వీల్లేదంటోంది. ముందు మనమే రమ్మని పిలిచాక, మళ్ళీ రావద్దని చెప్పటం ఏం బావుంటుంది. అంతగా అయితే వాళ్ళు వచ్చివెళ్ళాక ఏదో కారణం చెప్పి కాదనుకోవచ్చులే అని చెబుతున్నా వినిపించుకోవటంలేదు. నాకేం చేయాలో తోచక నీకు ఫోన్‌ చేశాను’’.

‘‘అన్ని విషయాలూ బాగున్నప్పుడు నీరజకెందుకూ అభ్యంతరం?’’ ఆశ్చర్యంగా అడిగింది సరళ.

‘‘ఏం చెప్పమంటావులే... తన ఫ్రెండ్సంతా అమెరికా వెళ్ళిపోతున్నారని దీనికీ అదే కోరిక. అందుకే నేనూ అక్కడి సంబంధాలే చూస్తున్నాను. కాకపోతే అనుకోకుండా ఇక్కడే మంచి సంబంధం వచ్చినప్పుడు కాదనుకోవటమెందుకూ అని మేం నచ్చచెబుతున్నా నీరజ వినిపించుకోవటంలేదు’’ అంటూ ఆవిడ లేచి నిలబడి ‘‘కాఫీ తెస్తానుండు’’ అని చెప్పి వంటగదిలోకి వెళ్ళింది.

సరళ నీరజకు కొంచెం దగ్గరగా జరిగి, భుజంమీద ఆప్యాయంగా చెయ్యివేసి ‘‘ఈరోజుల్లో అమెరికా వెళ్ళటం పెద్ద సమస్య కానేకాదు. అందరూ వెళ్తూనే ఉన్నారు. పెళ్ళయ్యాకయినా మీరిద్దరూ ప్రయత్నం చేసుకుని వెళ్ళొచ్చుగా’’ అంది.

‘‘అలా కుదరదులే’’ అంటూ నిట్టూర్చింది నీరజ. ‘‘మామయ్యా వాళ్ళింట్లో ఆ రోజు అతనితో మాట్లాడానుగా, మాటలమధ్యలో అతనికి అమెరికా వెళ్ళాలనే ఉద్దేశ్యం ఎంతమాత్రంలేదని స్పష్టంగా చెప్పాడు. అది తెలిసి కూడా వాళ్ళను రమ్మనటం ఎందుకు చెప్పు? మామయ్య నన్ను ముందు అడగకుండా తొందరపడ్డాడు. అందుకని ముందు రమ్మందాం, ఆ తర్వాత ఏదో కారణం చెప్పొచ్చులే అంటారు. అంటే నాకు నచ్చచెప్పే అవకాశం ఉంటుందిగదా అని కాబోలు. నాకు అర్థంకానిదేమిటంటే... అన్ని విషయాలూ బావున్నాయని మావాళ్ళు ఒకటే ఇదయిపోతున్నారుగానీ ఇలా అన్నీ బావున్న అమెరికా సంబంధమూ దొరకదనేం లేదుగా? వాళ్ళకి ఇష్టమై అడుగుతున్నారని ఒప్పుకునేకంటే, మనకి నచ్చే సంబంధంకోసం ఎదురుచూడొచ్చు కదా... ఏమంటావు?’’

‘‘నిజమేననుకో’’ అంటూ సరళ ఒక నిమిషం ఆగింది. ‘‘నీకు అమెరికా లైఫ్‌ మీద చాలా భ్రమలున్నాయనిపిస్తోంది. పేపరులో అప్పుడప్పుడూ నువ్వూ ఇలాంటి వార్తల్ని చూసేవుంటావుగానీ, నా అనుభవంలో తెలుసుకున్న విషయాలు కొన్ని నీకు చెప్పనా?’’

నీరజ చిన్నగా నవ్వింది. ‘‘నువ్వు ఇలా ఏదో చెప్పి నన్ను ఒప్పిస్తావనే ఉద్దేశ్యంతోనే కదా అమ్మ నిన్ను పిలిచింది... చెప్పు మరి!’’

‘‘పిన్ని ఉద్దేశ్యం ఏమైనాగానీ మూడేళ్ళుగా అక్కడ ఉంటున్నాను కాబట్టి నాకు తెలిసిన విషయాలు చెప్పాల్సిన బాధ్యత నాకూ ఉంది. అమెరికా లైఫ్‌ బావుంటుందనటానికి ఎన్ని ప్లస్‌పాయింట్స్‌ ఉన్నాయో, బావుండదనటానికీ అన్ని మైనస్‌ పాయింట్సూ ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కోలా అనిపించవచ్చుగానీ నాకయితేమాత్రం మైనస్‌పాయింట్సే ఎక్కువ కనిపిస్తాయి. అందుకే ఎపుడెపుడు ఇండియా వచ్చేస్తామా, మనవాళ్ళందరిమధ్యా ఉండే అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తుంటాను తెలుసా?’’

‘‘మంచి భవిష్యత్తుకోసం ఎంత దూరమైనా ఎక్కడికైనా వెళ్ళాలి. కెరీర్‌ గురించి ఆలోచించకుండా ఉన్నచోటనే ఉండాలనుకోవటం...నాకస్సలు నచ్చదు. నాకీ సంబంధం ఇష్టంలేకపోవటానికి కారణం కూడా ఇదే...’’

‘‘మనం ప్రాధాన్యం ఇచ్చే విషయాల్నిబట్టి మన ఉద్దేశాలూ ఉంటాయి. అక్కడి శాలరీ కొన్ని సౌకర్యాలూ ఎక్కువే అనుకో, కాదనను... కాకపోతే చెప్పానుగా, ఒక్కొక్కరికి ఒక్కోలా అనిపిస్తుందని. అదిసరేగానీ, ఈమధ్య జరిగిన సంఘటన చెబుతానన్నాకదా...’’ అంటూ ఒక క్షణం ఆగి మళ్ళీ మొదలుపెట్టింది సరళ.

‘‘మాకు దగ్గర్లోనే ఉండే ఏరియాలోకి ఒక తెలుగువాళ్ళ కుటుంబం వచ్చింది. ఆమెని అతనెక్కడికీ తీసుకువచ్చేవాడు కాదు. ఒకసారి నేనూ నా ఫ్రెండూ పరిచయం చేసుకుందామని వెళ్ళాం. నా ఫ్రెండు వాళ్ళాయన పనిచేస్తున్న ఆఫీసులోనే అతనూ చేస్తున్నట్లు ఆ అమ్మాయి మాటలవల్ల తెలిసింది. అతను నెలకి ఇరవైరోజులు క్యాంపుల్లోనే ఉంటాడని చెప్పేసరికి నా ఫ్రెండు ఆశ్చర్యపోతూ ఆ ఆఫీసులో అసలు క్యాంపులే ఉండవని చెప్పింది. దాంతో ఆ అమ్మాయి తర్వాత వాకబు చేసేసరికి తేలిందేమిటంటే... అతనికి ఆల్రెడీ పెళ్ళయింది. పిల్లలు కూడా ఉన్నారు. ఆ విషయం దాచి ఈ అమ్మాయిని మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడన్నమాట. ఈ విషయం బయటపడేసరికి అసలే అంతంతమాత్రంగా ఉన్న ఆ అమ్మాయి కాపురంలో కష్టాలింకా ఎక్కువయ్యాయి. శాడిస్టులా హింసించటం మొదలుపెట్టాడట. ఒక ఫంక్షన్‌కి పిలుద్దామని మేం ఇద్దరం మళ్ళీ వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి అతను కొట్టిన దెబ్బలకి స్పృహతప్పి కార్పెట్‌మీద పడివుంది. తర్వాత మేం అందరం ఎలాగో కష్టపడి ఆ అమ్మాయిని ఇండియా పంపించే ఏర్పాటుచేశాం. వాళ్ళూ వాళ్ళూ తర్వాత ఏదో తేల్చుకుంటారనుకో... అమెరికా సంబంధమనగానే మనవాళ్ళు కొంతమంది ఆ మోజులో పూర్వాపరాలు సరిగ్గా విచారించకుండానే హడావుడిగా పెళ్ళిచేసి పంపించెయ్యటంతో ఇలా కొంతమంది అమ్మాయిలు అన్యాయమైపోతున్నారు. ఇలాంటివి అప్పుడప్పుడూ అక్కడక్కడా జరుగుతున్నట్లు వింటూనే ఉన్నాం. ఇంకా...’’

నీరజ మధ్యలోనే అడ్డంవచ్చి సరళ వైపు సూటిగా చూస్తూ అంది ‘‘అక్కా, నిన్నొకటి అడగనా? ఇక్కడ కూడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయిగా, కాదనగలవా? కట్నాలకోసమో ఇంకే కారణాలతోనో రకరకాలుగా భార్యల్ని వేధించటం... కిరసనాయిలుపోసి తగలబెట్టడం లాంటి వార్తల్ని పేపరులో మనం ఎన్ని చూడలేదూ? అదంతాపోనీ, బావగారి సంబంధం మనకు తెలిసినవాళ్ళదేంకాదు, అయినా నువ్వు అక్కడ హ్యాపీగానే ఉన్నావు కదా?’’

సరళ నవ్వేసింది. ‘‘నేను అమెరికాలో లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తూ నీకు మాత్రం నీతులు చెబుతున్నట్లుగా నీకనిపిస్తోంది కాబోలు. పూర్తిగా తెలియని అమెరికా సంబంధంకంటే బాగా తెలిసిన అన్ని విషయాలూ బాగున్న ఇక్కడి సంబంధమే బెటరు కదా అనే ఉద్దేశ్యంతో మాట్లాడానంతే. సరేలే, నీ ఇష్టప్రకారమే జరగటం మంచిది. ఇక్కడి సంబంధం చేసుకుంటే అమెరికా వెళ్ళలేకపోయానన్న అసంతృప్తి నిన్ను ఆనందంగా ఉండనివ్వదు కూడా. కాకపోతే, కిషోర్‌ వాళ్ళు వచ్చివెళ్ళినందువల్ల నష్టం ఏముందీ? అమెరికా వెళ్ళటమనేది నీ తప్పనిసరి కోరికని అతనికి తెలియజేయి. నీపట్ల మరీ మక్కువ ఉంటే తన ఉద్దేశ్యం మార్చుకుని అమెరికా వెళ్ళటానికి అంగీకరిస్తాడేమో. లేకపోతే ఈ సంబంధాన్ని వాళ్ళే కాన్సిల్‌ చేసుకుంటారు. అంతేగా!’’

ఆలోచనలోపడినట్లుగా నీరజ రెండు నిమిషాలు మౌనంగా ఉండిపోయి తర్వాత మెల్లగా ‘‘సరే, అలాగే చేద్దాంలే’’ అంది.

అప్పుడే కాఫీ కప్పులతో వచ్చిన పార్వతమ్మతో సరళ ‘‘పిన్నీ... ఈ సంబంధాన్ని చేసుకోవటానికికాదుగానీ వాళ్ళు రావటానికి మాత్రం నీరజ ఒప్పుకుంది’’ అని చెప్పింది.

‘‘పోనీలే... మాటపోకుండా అంతవరకైనా ఫర్వాలేదు. సరళా, ఇంటికి ఫోనుచేసి చెబుతాను, వాళ్ళు వచ్చి వెళ్ళేవరకూ నువ్వూ ఇక్కడే ఉండు’’ అంది పార్వతమ్మ మనసు తేలికపడినట్లుగా.

‘‘అలాగే పిన్నీ. వాళ్ళకోసం చేసే స్పెషల్స్‌ అన్నీ నాకిష్టమైనవే అయివుండాలి మరి’’ అంది నవ్వుతూ.

పార్వతమ్మ కూడా చిన్నగా నవ్వి ‘‘తప్పకుండా. నాకు తెలుసుగా... జీడిపప్పు పకోడీ, గులాబ్‌జామ్‌, క్యారట్‌ హల్వా... అంతేగా’’ అంది.

* * *

ఆ సాయంకాలం పార్వతమ్మ తమ్ముడూ మరదలూ కిషోర్‌నీ అతని తల్లిదండ్రుల్నీ వెంటబెట్టుకుని వచ్చారు.

అందరూ కలిసి కాసేపు కూర్చున్నారు. కాఫీ ఫలహారాల మర్యాదలయ్యాక నీరజనీ కిషోర్‌నీ మాట్లాడుకోవటానికి వీలుగా ఒంటరిగా వదిలిపెట్టారు.

వెళ్ళేముందు కిషోర్‌ తల్లి ‘‘మాకైతే ఏ అభ్యంతరమూ లేదు. ఇక మీ అంగీకారమే తరువాయి’’ అంది పార్వతమ్మతో.

ఆమె అలా వెంటనే అడుగుతుందని వూహించని పార్వతమ్మ ఏం చెప్పాలా అని మనసులోనే తత్తరపడుతూండగా ఆమే మళ్ళీ ‘‘మేం ఈ వూళ్ళొ ఎల్లుండి వరకూ ఉంటాం. ఆలోచించుకుని చెప్పండి. తొందరేం లేదు’’ అంది.

దాంతో ‘హమ్మయ్యా’ అనుకుంటూ పార్వతమ్మ స్థిమితపడింది.

వాళ్ళు వెళ్ళిపోయాక అందరూ హాల్లోనే కూర్చుని మౌనంగా ఉండిపోయారు.

శంకర్రావే ముందుగా నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ పార్వతమ్మతో ‘‘అక్కయ్యా, మా ఆఫీసులో చలపతిరావు అని ఒకాయన ఉన్నాడు. ఆయనకు స్టేట్స్‌లో బంధువులు చాలామందే ఉన్నారు. నీరజకు సంబంధం చూడమని ఆయనకు చెబుతాలే’’ అన్నాడు.

పార్వతమ్మ ‘అలాగే’ అన్నట్లుగా తలూపి, సరళ వైపు చూస్తూ ‘‘అక్కడికి వెళ్ళాక నువ్వూ చూడవే’’ అంది.

‘‘నువ్వు వేరే చెప్పాలా పిన్నీ, తప్పకుండా చూస్తాను’’ అంది సరళ.

నీరజ వెంటనే ‘‘ఏం చూడక్కర్లేదు’’ అంది.

‘‘ఎందుకనీ? నీ మనసులో ఎవరైనా ఉన్నారా? చెప్పవేం మరి?’’ అడిగింది సరళ.

‘‘అదేంకాదు’’ అంది నీరజ ముక్తసరిగా.

‘‘మరి..?’’ ప్రశ్నార్థకంగా చూసింది సరళ.

‘‘ఎందుకంటే... ఈ సంబంధానికే నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను కాబట్టి’’ కొంచెంగా తలవాల్చి చిరునవ్వుతో చెప్పింది.

‘‘నిజంగానా..?’’ అందరూ ఒక్కసారే అడిగారు.

నీరజ అవునన్నట్లుగా తలూపింది.

‘‘ఓహ్‌’’ అంటూ సరళ పెద్దగా నవ్వింది. ‘‘అయితే నా కౌన్సిలింగ్‌ బాగానే పనిచేసిందన్నమాట. అమెరికా లైఫ్‌కి మైనస్‌ పాయింట్సే ఎక్కువని నీకూ అనిపించింది కదూ!’’

అదే కాదన్నట్లుగా నీరజ తలూపింది.

‘‘ఓ... అర్థమైందిలే. అతనే మనసు మార్చుకుని అమెరికా వెళ్ళటానికి అంగీకరించాడన్నమాట’’.

అదీ కాదన్నట్లుగా తలూపేసరికి కొంచెం అసహనంగా ‘‘సస్పెన్స్‌లో పెట్టక, అసలు విషయం చెప్పవే బాబూ తొందరగా’’ అంది సరళ.

చిరునవ్వుతో నీరజ చెప్పుకొచ్చింది.

‘‘ఈ రోజుల్లో అందరూ అమెరికా వెళ్ళాలని ఆరాటపడుతోంటే, మీకెందుకు వెళ్ళాలనిపించటం లేదూ అని కిషోర్‌ని అడిగాను. చదువయ్యాక ఉద్యోగంలో చేరినాగానీ అమెరికా వెళ్ళటానికి అతనూ ప్రయత్నాలు చేశాడట. ఇక కొద్దిరోజుల్లోనే వెళ్ళాలని అనుకుంటూండగా జరిగిన సంఘటన అతని అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసిందని చెప్పాడు. వాళ్ళ నాన్నగారికి హార్ట్‌ఎటాక్‌ వస్తే హాస్పిటల్‌లో చేర్పించారట. రెండుమూడు రోజుల్లోనే ఆపరేషను చేయాలని చెప్పేసరికి వాళ్ళమ్మగారు కిషోర్‌కి ఫోనుచేసి తమ సొంత వూరికివెళ్ళి కౌలు ఇవ్వాల్సిన రైతుల దగ్గర్నుండి డబ్బు వసూలుచేసి తీసుకురమ్మని పురమాయించారట. కిషోర్‌కేమో తండ్రిని వెంటనే చూడాలనిపించటంతో వూరికి వెళ్ళకుండా డబ్బు ఏర్పాటుపని ఫ్రెండ్స్‌కు అప్పజెప్పి వచ్చేశాడట. తండ్రికి ఆ విషయం చెప్పినప్పుడు ఆయన కిషోర్‌ చేయి పట్టుకుని చాలా ఆనందంగా ‘డబ్బుదేం ఉందిరా, ఇక్కడే ఎవరో ఒకరిదగ్గర తీసుకుని తర్వాత ఇచ్చెయ్యవచ్చులే, నువ్వు వెంటనే వచ్చేశావు, నిన్ను చూడగానే కొండంతబలం వచ్చేసినట్లుగా చాలా రిలీఫ్‌గా ఉందిరా’ అన్నారట. ఆ ఒక్కమాటా అతన్ని ఆలోచనలోపడేసి, అమెరికా వెళ్ళాలనే కోరికను పూర్తిగా తుడిచిపెట్టేసిందని చెప్పాడు.

పెద్దవాళ్ళయిన తల్లిదండ్రులకి ఏ అనారోగ్యం వచ్చినా చూసుకోవటానికి తనకేమో తోడబుట్టినవాళ్ళెవరూ లేరు. అటువంటి పరిస్థితుల్లో డాలర్లు సంపాదించి పంపించటంకంటే వాళ్ళకు అండగా ఇక్కడుండటమే అవసరమని బాగా అనిపించటంతో, మంచి కెరీర్‌ కోసం, డబ్బు సంపాదించటంకోసం ఏ ప్రయత్నాలైనా ఇక్కడే చేయాలని నిర్ధారించేసుకున్నాడట.

ఇదంతా చెప్పాక అతను ఇంకొక మాటా అన్నాడు... ‘మీరూ ఒక్కరే కాబట్టి ఈ సంబంధం మీకిష్టమై మన పెళ్ళి జరిగితే మీ అమ్మగారూ మనతోనే ఉండొచ్చు. నాకేం అభ్యంతరం లేదు’ అని. ఆ మాట కొరడాదెబ్బలా తగిలి నాకు కనువిప్పు కలిగించింది. అవునుమరి... నాన్న చనిపోయినప్పటినుండీ అమ్మ ఒక్కతే కుటుంబభారాన్ని మోస్తూ నన్ను కష్టపడి పెంచి పెద్దచేసింది. ఇప్పుడు నేను అమెరికా వెళ్ళిపోతే అమ్మకి ఎటువంటి అనారోగ్యం వచ్చినా బంధువుల, స్నేహితుల దయాధర్మంమీద ఆధారపడాల్సిందే. అదే ఇండియాలో ఉంటే, ఒకవేళ అమ్మ మా దగ్గర ఉండటానికి ఇష్టపడకపోయినా, తనకి బాగాలేనప్పుడు నేనైనా వెంటనే వెళ్ళగలను, లేకపోతే అమ్మనైనా నా దగ్గరకు తీసుకురాగలను. ఇప్పటివరకూ ఇలా ఎందుకు ఆలోచించలేదా అని సిగ్గుపడ్డాను. ఆపైన కిషోర్‌ తన తల్లిదండ్రుల గురించే కాకుండా నావాళ్ళ గురించీ ఆలోచించటం నాకు బాగా నచ్చింది. అతనిదెంత మంచి మనసో అర్థమైంది. అందుకే ఈ సంబంధానికే...’’ సిగ్గుపడుతున్నట్లుగా చివరిమాటను ఆపేసింది.

నీరజ మాటలకు అందరి మొహాలూ వికసించాయి.

సరళ నీరజ చేయి పట్టుకుని ఉత్సాహంగా వూపేస్తూ ‘‘అందరూ చేస్తున్నారని కాకుండా, మన పరిస్థితుల్నిబట్టి మనకేది మంచిదో ఆలోచించుకుని నిర్ణయించుకోవాలి. ఏమైనాగానీ చివరకు మంచి నిర్ణయం తీసుకున్నావ్‌... కంగ్రాట్స్‌!’’ అంది నవ్వు మొహంతో.

పార్వతమ్మ కళ్ళు ఆనందంతో చెమర్చాయి. తల్లి మొహంలోని సంతృప్తినీ ఆనందాన్నీ గమనించిన నీరజ తను తీసుకున్న నిర్ణయం సరైనదేననుకుంటూ తృప్తిగా లోపలికి నడిచింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని