జీవన పోరాటం

నాకు చెందిన నా జీవితాన్నీ దాని అదృష్టాన్నీ ఆడిట్‌ చేస్తే మిగిలేది ఏమిటీ? ...ఆత్మగౌరవం పోతున్న వర్తమానం. ...

Published : 09 Apr 2020 12:55 IST

గంటి భానుమతి

నాకు చెందిన నా జీవితాన్నీ దాని అదృష్టాన్నీ ఆడిట్‌ చేస్తే మిగిలేది ఏమిటీ? ...ఆత్మగౌరవం పోతున్న వర్తమానం. 

దేవుళ్లందరికీ నామీద ఏదో కోపముందని కాదు, నా పూర్వీకుల శాపాల ఫలితం అని కూడా నేననుకోను. మనిషి హృదయంలోని కల్మషమిది.

షేక్‌స్పియర్‌ అన్నట్లు... ట్రాజిక్‌ హీరోలందరూ ఒంటరివాళ్ళు, మరి ఆయన మాక్‌బెత్, ఒథెల్లో, లియర్, హామ్లెట్‌లంతా అంతే కదా!

కానీ నాకు ఒంటరిగా ఉండటం ఇష్టంలేదు. నేను సంఘజీవిని. నలుగురి మధ్యా ఉండాలని అనుకుంటాను. కానీ ఇంట్లో పరిస్థితి అలా లేదు. ఏం చేయాలి? ఏం చేయగలను?

ఈ జీవితాన్ని ఇలాగే కొనసాగించాలా? ఏమిటిది అని గొంతెత్తాలా?

అర్ధరాత్రి దాటినా నిద్ర రావటంలేదు. కిటికీ పక్కనే నా పడక. కిటికీ తెర కదిలినప్పుడల్లా, బయటి వీధిలైటు వెలుగు కంటిరెప్పల్ని అంటిపెట్టుకున్న నీటిబొట్ల మీద ప్రతిఫలిస్తూ ఉటోపియా లాంటి ఇంద్రధనుస్సులని చూపిస్తోంది.

ఏం నిర్ణయించుకోవాలి?

కళ్ళు తెరవదలుచుకోలేదు.

తెరిస్తే... కన్నీళ్ళు చెంపల మీదుగా కారిపోతాయి. రెప్పల చివరన దోబూచులాడుతున్న సప్తవర్ణాలు జారిపోతాయి.

జరిగింది ఇది-

ఇవాళ శంకరమఠంలో... లలితా సహస్రనామ పారాయణం ఉంటే వెశ్లాను.

ఎప్పుడూ దసరాల్లో వెశ్తాను. ఎవరూ పాత స్నేహితులుకానీ, తెలిసినవాళ్ళుకానీ కనపడేవారు కాదు. కానీ, ఇవాళ విజయకుమారి కనపడింది. ఆమెను ఇంటికి తీసుకొచ్చాను. అదే నేను చేసిన పెద్ద నేరం.

‘‘వెళ్ళండి, మీ ఫ్రెండ్‌తోపాటే ఆశ్రమంలో ఉండండి. నేను చెప్తే చాలు... మళ్ళీ మీ అబ్బాయి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు...’’ ఇది మొదటిసారికాదు సునంద ఇలా అనడం. అయితే ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇవాళ అలాకాదు. ఆలోచించాలి. భావిజీవితం గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది.

ఒకే స్కూలు, ఒకే క్లాసు, పక్కపక్క ఇళ్లు. విజయతో మాట్లాడకుండా ఎలా ఉంటాను?

గబగబా దగ్గరికెళ్ళి భుజం మీద చేయి వేశాను.

ఉలిక్కిపడి పక్కకి తిరిగి నన్ను చూసింది. గుర్తుపట్టింది. ఆ కళ్ళల్లోని భావాలకి భాషలేదు.

‘‘మా ఇల్లు ఇక్కడే’’ అంటూ దాన్ని ఇంటికి తీసుకెశ్ళాను.

నా స్నేహితుల్ని ఇంటికి తేకూడదు. అది నా కోడలి ఆజ్ఞ. కానీ ఉల్లంఘించాను.

ముప్ఫై ఏళ్ళ తర్వాత కనపడ్డ స్నేహితురాల్ని అలా వదిలేయలేకపోయాను. ఏదో మొండితనం...

ఇంటికి తాళం వేసి ఉంది. మనసులో ఆనందం... నిర్భయంగా ఊపిరి పీల్చుకున్నాను.

వంటింట్లో గారెలు, ఆవడలు ఉంటే టిఫిన్‌ పెట్టాను. కాఫీ ఇచ్చాను. మా ఇద్దరిమధ్యా వ్యక్తిగత విషయాలు రాలేదు. రాకుండా జాగ్రత్తపడ్డాం అన్నది నిజం.

స్కూలు, కాలేజీ, ఫ్రెండ్స్‌ గురించి ఎన్నో మాట్లాడుకున్నాం. అంతా నోస్టాల్జియా. మూడు అవుతూండగా లేచింది. ఆటో ఎక్కిస్తున్నప్పుడు అడిగాను ‘‘ఎక్కడ ఉంటున్నావ్‌?’’ అని.

‘‘మదర్స్‌ ఓల్డేజ్‌ హోం’’ అంటూ అడ్రసు ఆటోవాడికి చెప్పినప్పుడు నా ప్రశ్నకి జవాబు దొరికింది.

కోడలు వచ్చాక ఏం గొడవ జరుగుతుందో అని భయపడుతూనే ఇంట్లోకి అడుగుపెట్టాను.

‘‘వంటింట్లో పెట్టిన గారెలు, ఆవడలు తగ్గాయి’’ నిలదీసింది.

‘‘నా స్నేహితురాలు, పాపం- ఆశ్రమంలో ఉంటోంది... దాదాపు ముప్ఫై ఏళ్ళ తర్వాత కనిపిస్తే...’’ నాన్చాను.

‘‘ఇదేం ధర్మసత్రం కాదు. తీసుకొచ్చి టిఫిన్‌లూ కాఫీలూ ఇచ్చి మర్యాదలు చేయడానికి...’’

సిగ్గు, అవమానం... ఇది నా ఇంట్లోని నా స్టేటస్‌.

‘‘పండగరోజులని గారెలు, ఆవడలు చేశాను కానీ... పిల్లలు హడావుడిగా అన్నం తిని సినిమాకి వెశ్లారు. గారెలు తిననేలేదు. మీ అబ్బాయి ఆఫీసుకెళ్లే సమయానికి పిండివంట అవనేలేదు.

నేను కాస్త అటూ ఇటూ వెళ్లేటప్పటికి, వంటింట్లోకి వెళ్ళడం, వెతకడం, తినేయడం. అందులోనూ అది నూనె సరుకు. రాత్రికి ఖళ్ళు ఖళ్ళుమంటూ దగ్గుతారు. మీది మీకే తెలియాలి. రేప్పొద్దున దగ్గూ ఆయాసం ఎక్కువైపోతే, ఈ చాకిరీ ఎవరు చేస్తారు? ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. మీ అబ్బాయిని రానీయండి... సంగతి తేలనీండి. మీరో, నేనో ఉండాలి ఇంట్లో.

పైగా మీ ఫ్రెండు ఆశ్రమంలో ఉందని అన్నారు. మీరూ పొండి, అక్కడే ఉండవచ్చు’’.

ఒంట్లోని శక్తి అంతా పోయింది. అలాగే జారి నేలమీద కూచుండిపోయాను. సునంద ఇంకా ఏదో అంటూనే ఉంది. కళ్ళు మూసుకుని కూర్చున్నాను.

నా భర్త వెంకట్రావు గుర్తొచ్చాడు. అప్పుడు నేనెలా ఉన్నాను... ఇప్పుడెలా ఉన్నాను? వెంకట్రావు ఒక్క మాటన్నా పడలేదు. ‘ఎందుకన్నారు, నన్ను అవమానించారు’ అంటూ దెబ్బలాడేదాన్ని.

మరి, ఈ రోజున కొడుకుని ఒక్కమాట కూడా అనలేకపోతున్నానెందుకు? ఏవిఁటి అడ్డొస్తోంది? మొగుడిని అనొచ్చు, కానీ కొడుకుని అనకూడదా? ఎంత వ్యత్యాసం! భర్తకివ్వని విలువని కొడుకు కిచ్చానా?

భార్యాభర్తల బంధంలో దగ్గరతనం... తల్లీకొడుకుల బంధంలో అగాథాల లోయలు..

ఇవాళ ఇదో పాఠం. రోజూ పాఠాలే. ఏదో ఒక తప్పు- సునంద దృష్టిలో- చేస్తుంటాను. పాఠం నేర్చుకుంటుంటాను.

ఇంటికి వచ్చిన వాళ్లతో నేను మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడినా ఇంటి విషయాలు చెప్పకూడదు.

బాల్కనీలో ఆరేసిన బట్టలు గాలికి కింద పడ్తుంటే తీయమని పిల్లలకి చెప్పకూడదు. అసలు పిల్లలకి ఏ పనీ చెప్పకూడదు.

ఫోన్‌ వస్తే నేను తీయకూడదు. ఎందుకంటే ఫోన్‌లు వాళ్ళకే వస్తాయి కాబట్టి.

పేపరు రాగానే, నేను దానికేసి చూడకూడదు. కొడుకూ కోడలూ పిల్లలూ చదివాకే నేను చదవాలి.

నాకు డెబ్భై ఏళ్లు. గబగబా నడవలేను, ఒంగలేను. అయినా సరే, నేను చెయ్యగలిగితే చెయ్యాలి. కానీ వాళ్ళకి మాత్రం ఏ పనీ చెప్పకూడదు.

అప్పటికీ ప్రతీ విషయం వాళ్ల కోణంలోంచే చూస్తాను. వాళ్ల బుర్రలో నా బుర్ర ఉంచి ఆలోచిస్తాను. నాదే తప్పు, వాళ్లే రైటు- అనుకుని సర్దుకుపోతాను.

జీవితం అంటే సర్దుకుపోవడం అన్న డెఫినిషన్‌ పెట్టుకున్నాను. నాకు పెన్షన్‌ ఉంది. ఒకనాటి నా గవర్నమెంటు స్కూలు ఉద్యోగం, ఈ వయసులో నా పరువు నిలబెడ్తోంది. అదే నా ధైర్యం. ఆశ్రమంలో చేరాలని అనుకున్నాను. ఆత్మగౌరవం ముఖ్యం.

నచ్చితే- ఆశ్రమంలో చేరిపోవచ్చు. కానీ నచ్చకపోతే- దీనికి జవాబు ఆలోచించలేదు.

పొద్దున్నే తయారైపోతూంటే సునంద చూస్తూనే ఉంది. ఏదో గుడికో, భజనకో వెళ్తున్నానని అనుకుంటుంది. అదే ఆలోచనలో ఉండనీ...

ఆశ్రమం ఎక్కడుందో ఆటోవాడికి చెప్తూంటే విన్నాను. విజయ ఎలా చెప్పిందో అలాగే చెప్పి ఆ ఆశ్రమం చేరుకున్నాను.

చుట్టూరా బోల్డు స్థలం, పచ్చని పచ్చిక, దట్టంగా చెట్లు, మధ్యలో పర్ణశాల లాంటి స్ట్రక్చర్‌ని ఊహించుకున్నాను.

అది ఎవరిదో రెండంతస్తుల ఇల్లు. కాంపౌండు ఉరుకు పరుగుల సివిలిజేషన్‌ మధ్యలో ఉంది ఆ ఇల్లు.

గేటు తీసుకుని లోపలికెశ్ళాను. ఓ వాచ్‌మెన్‌ నేను వచ్చిన పని కనుక్కుని ముందు గదిలో కూర్చోపెట్టాడు. అది విజిటర్స్‌ రూం అని వరసగా గోడకి ఉన్న కుర్చీలని చూసి అనుకున్నాను.

విజయ సంభ్రమంగా వచ్చింది. ఆ మాటా ఈ మాటా చెప్పుకున్నాం.

‘‘ఎందుకున్నావ్‌ అని అడగను కానీ, ఇది ఎవరి ఆలోచన?’’ అడిగాను. ముఖంలో అప్పటిదాకా ఉన్న సంతోషం అంతా మాయమైపోయింది. ఒక్కసారి నీడలు కమ్ముకున్నాయి. రెండునిమిషాలు మాట్లాడలేదు. ఎడంచేతి వేళ్ళతో కింద పెదవిని నలుపుతూ కిందకు చూస్తూండిపోయింది.

‘‘ఎవరిదీ... అంటే అందరిదీ. కొడుకూ కోడలూ ఉద్యోగాలు, పిల్లలిద్దరూ స్కూలు, తర్వాత ట్యూషన్‌. పొద్దున్న మొదలుకుని సాయంత్రం వరకూ ఒక్కదాన్ని ఉంటాను. కాబట్టి, ఎవరైనా ఇంటికి వస్తే, నా పీకû•క్కి, ఇంట్లోని నగా నట్రా, డబ్బూ దస్కం పట్టుకుపోతే... అని చాలాదూరం ఆలోచించి ఇక్కడుంచారు. నాకు ఆ మధ్యన ఒంట్లో బాగాలేదులే. ఇంట్లో అయితే అటూ ఇటూ తిరగాల్సి వస్తుందని, ఇక్కడే నయం అని అన్నారు’’.

ఆమె కళ్లల్లోకి చూడటానికి ప్రయత్నించాను.

తల వంచుకుంది.

‘‘నీకు నిజంగా ఇక్కడే నయంగా ఉందా..? సంతోషంగా ఉందా?’’ నేను కూడా తల వంచి దాని మొహంలోకి చూడటానికి ప్రయత్నించాను.

‘‘నాకా...’’ తలెత్తి నవ్వడానికి ప్రయత్నించింది. ‘‘నాకు ఛాయిస్‌ లేదు. సంతోషం, దుఃఖం... అన్నింటికీ అతీతంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. అయినా మహారాజులకే తప్పలేదు. కోరి మరీ వెళ్ళేవారట వానప్రస్థానికి. అలాంటిది...’’

అది అబద్ధం. వేదాంతం పులిమిన అబద్ధం.

వాస్తవానికీ అవాస్తవానికీ వంతెన కడ్తున్నారు పిల్లలు. అందుకే మనోశూన్యత మిగిలిపోతోంది.

మాట మార్చడానికి ‘‘దిన చర్య ఏమిటి?’’ అని అడిగాను.

‘‘పొద్దున్నే లేవడం... ధ్యానం, నడక, కాఫీ, టిఫిన్, అధ్యాత్మిక పఠనం, మధ్యాహ్నం భోజనం, పడక, ఆధ్యాత్మిక పారాయణం... టీ, టిఫిన్, భజన, నడక, భోజనం, నిద్ర... మధ్యమధ్యలో టీవీ’’.

నీరు కారిపోయాను.

‘‘ఇదేమిటీ? ఇంత చప్పగానా! మనకిష్టం లేకపోయినా అంతేనా!’’

‘‘ఏమోనే, ఇష్టాయిష్టాలు అంటే ఏమిటో మర్చిపోయాను. ఏదో అందరూ చేస్తున్నారు- నేనూ వాళ్ళలో ఒకదాన్ని’’.

‘వయసైపోతేనేం... మానసికంగా కూడా ఏమాత్రం ఉత్సాహంలేని ఈ ఆశ్రమ జీవితం నాకొద్దు, నేను చేరను’ అనుకున్నాను.

‘‘పద, నా గదిలో కూచుందాం’’ అంటూ లోపలికి తీసుకెళ్ళింది.

లోపల ఓ గదిలో టీవీ చూస్తున్నారు ఓ పదిమంది. వాళ్ళంతా ఏ నేతచీరలో, ఖద్దరు చీరలో కట్టుకోలేదు. మంచి జరీ చీరలు కట్టుకుని ఆరోగ్యంగానే కనపడ్డారు.

పక్కనే ఉన్న గదిలోకి వెశ్ళాం.

మంచంమీద కూర్చున్నాం. చుట్టూ చూశాను. ఏమిటో పాతపాతగా, దుమ్ముదుమ్ముగా ఉంది. ఏదో దయతలిచి గది ఇచ్చినట్లుగా ఉంది.

ఒంటరిగా... ఈ గదిలో... ఒళ్లు జలదరించింది.

పదిమంది పెద్దవాళ్ళూ పదిమంది చిన్నపిల్లలూ గలగలమంటూ ఉండేది వాళ్లిల్లు. ఇప్పుడిలా ఒంటరిగా...

‘‘నాకు మా ఇల్లు గుర్తొస్తూంటుంది. ప్రతీ గోడ, ప్రతీ గదితో ఏదో అనుబంధం. మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి, చేదు అనుభవాలూ ఉన్నాయి. రంగుల కలలున్నాయి, వెలసిపోయిన కలలుకూడా ఉన్నాయి. కానీ ఈ రోజు అవన్నీ చెప్పుకోడానికే మిగిలిపోయాయి’’.

‘‘నిన్ను చూడటానికి వస్తారా!’’

నిట్టూర్చింది, తలూపింది.

‘‘ఓసారి, ఇలాగే ఇదే సమయంలో, అంటే దసరా రోజుల్లో జ్వరం వచ్చింది. కొడుకూ కోడలూ ఉద్యోగాలు కదా, మరి నన్నెవరు చూస్తారు? ఓ నర్సింగ్‌ హోంలో చేర్పించారు. ఓ పదిహేను రోజులున్నాను. ఇంట్లోవాళ్ళు రోజూ వచ్చినా రాకపోయినా మందులూ మాత్రలూ పాలూ భోజనం అన్నీ టైముకి ఆస్పత్రివాళ్లే అందించేవారు.

ఆ తర్వాత ఇంట్లో కుదరదనీ ఒక్కదాన్నీ ఇంట్లో ఉంచడం కష్టం అనీ ఇదిగో ఇక్కడ ఉంచారు’’.

గొంతులో చిన్న జీర.

‘‘కోడలికి బాగాలేకపోతే కొడుకు చేయడా! కొడుక్కి బాగా లేకపోతే కోడలు చేయదా! పిల్లలకి బాగాలేకపోతే, వంతులు వేసుకుని, సెలవులు పెట్టుకుని, జాగారాలు చేస్తూ కంటికి రెప్పలా చూసుకుంటారు. కానీ, నా విషయం వచ్చేసరికి బాధ్యత వదిలించుకోవాలనుకున్నారు’’ మశ్లా తనే అంది.

డబ్బు పారేసి, బాధ్యతల్ని వదిలించుకోడం చాలా తేలిక. కానీ, ఆ తల్లి మనసుకి అది చాలా కష్టం.

‘‘ఎంత ఆధ్యాత్మికంగా వెళ్ళినా, వెలితి... పూడ్చలేని వెలితి- మనసు కుదుటపడ్డంలేదు’’.

విజయ తన కుటుంబ విషయం చెప్తుంటే, నాకు గణపతి, సునంద గుర్తొచ్చారు.

రేపు నా విషయంలో వాళ్లూ ఇలాగే ప్రవర్తిస్తారు. మెటీరియలిస్టిక్‌ మనుషులు. వాళ్ళకి మనసుతో పనిలేదు.

నేనేం చేయాలి?

‘‘ఇక్కడ అందరూ ఒకే రకమైన బాధితులా!’’ అడిగాను.

నవ్వింది.

ఎంతసేపటికి నవ్వింది. అవును మరి ఇంతవరకూ బాధగా ఉంది.

‘‘కాదు. కోడళ్లని రాచిరంపాన పెట్టిన అత్తలున్నారు. కట్నం కోసం వేధించిన మామలున్నారు. పెత్తనం చెలాయించిన పెద్దమనుషులున్నారు.

కానీ... ఇప్పుడు... అందరూ ఒకటే. పలకరింపుకి ముఖంవాచిన వాళ్ళు, ఎవరి కన్నీళ్ళు వారే తుడుచుకోవలసినవాళ్ళు.

కొంతమంది...అంటే పిల్లలు లేనివాళ్ళు, పిల్లలు ఎక్కడో ఉన్నవాళ్ళు తప్పితే, మనస్ఫూర్తిగా వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. ఎ మ్యాటర్‌ ఆఫ్‌ క్వయట్‌ యాక్సెప్టెన్స్‌’’.

దోమలు కుట్టేస్తున్నాయి. గోక్కుంటూ కిటికీలవైపు చూశాను.

‘‘కిటికీకి మెష్‌లు లేవు. పదహారు వందలు తీసుకుంటున్నారు. నాక్కావాలంటే నేను పెట్టించుకోవాలట’’ అంది.

‘‘మరి ఈ ఆశ్రమాలు అన్నం పెట్టడానికా! ఇలా చప్పగా జీవితాలు గడపడానికా! కనీస సదుపాయం కూడా చూడరా!’’ కోపంగా అన్నాను.

‘‘ఎక్కువ డబ్బు ఇస్తే మంచి ఫెసిలిటీస్‌ ఉంటాయి. నా శక్తికి ఇదే...’’

‘‘మరి ఇందులో సేవ ఏముంది?’’

‘‘ఎవర్నని ఏం లాభం? నా జీవితంలో విలన్‌ అంటూ ఎవరైనా ఉన్నారంటే అది దేవుడు... నాకింత ఆయిష్షు ఇచ్చినందుకు’’.

అయిపోయిన ఆనందమయ జీవితం, సరిపెట్టుకోలేని వర్తమానం, భయంకరమైన భవిష్యత్తు... ఎంతలా ఆ మాటల్లో దొర్లిపోతున్నాయో...

ముసలితనం అంటే గతించినవి గుర్తుతెచ్చుకోడమేనా? అంతదానికోసం ఆశ్రమానికే రావాలా?

అయోమయంలో పడ్డాను.

నాకొచ్చే పెన్షన్‌కి ఇలాంటి ఆశ్రమం సరిపోతుంది. కానీ, నాకు ప్రతీక్షణం జరిగిపోయినవి తలుచుకుంటూ గతంలోనే జీవించాలని లేదు.

ఏం చేయాలో తెలియడం ఎంత జ్ఞానమో, ఏం చేయకూడదో తెలియడం అంతకుమించిన విద్వత్తు.

జీవితానికి మరోసారి అర్థం మారిపోతుంది.

జరగరానిది జరగడానికి అవకాశం ఉన్నదే జీవితం. ఇదే సూత్రాన్ని ప్రస్తుతం నా జీవితానికి అన్వయించుకుంటున్నాను.

లేచాను.

‘‘ఇంటికెశ్ళాలి’’.

‘‘అదృష్టవంతురాలివి. ఈ వయసులో...’’

‘‘నేనూ నీలాంటి పడవలోనే ప్రయాణిస్తున్నాను. ఆలోచిస్తున్నాను... ఇక్కడ చేరాలా... లేకపోతే ఏం చేయాలి? రాత్రింబవళ్ళూ జీవితాన్ని ఇదిగో ఇలాంటి ఆలోచనలే ఏలుతున్నాయి’’ శుష్కహాసం చేశాను. అర్థమై ఉండవచ్చు. ఇంక ఏం అనలేదు.

నాలుగు గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాను. నా గదిలోకి వెశ్ళాను.

ఒకప్పుడు అది బాల్కనీ. పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యేసరికి, బాల్కనీ మూయించి, అది నాకిచ్చారు.

అందులో ఓ సన్నటి మంచం. దానికింద నా పెట్టె. ఓ స్టూలు, దానిమీద దేవుడి పుస్తకాలు. షెల్లీ అన్నట్లు... జీవితానికి అవతల ఏముందో తెలుసుకునే ప్రయత్నానికి అడుగులు ఆ పుస్తకాలు. ‘దసరా అయిపోయాక గణపతితో మాట్లాడాలి’ అనుకున్నాను.

ఆ రోజు రానే వచ్చింది.

‘‘గణపతీ! నీతో మాట్లాడాలి’’ ఓ మధ్యాహ్నం గణపతి, సునంద టీవీ చూస్తుంటే అక్కడికి వెళ్ళి అన్నాను.

ఇద్దరూ నావైపు చూడలేదు. ఏమిటీ అని అడగలేదు. గొంతులో ఏదో ఉండ అడ్డుకుంటోంది.

‘‘ఈ దశ నేను కోరుకున్నది కాదు, నా కిష్టమైనదీ కాదు. కానీ మనిషన్న ప్రతివాడూ ఈ దశలోంచి వెశ్ళాలి. ఇవాళ నేను, రేపు మీరు కావచ్చు. నాలుగైదేళ్ళుగా సునంద నన్ను ట్రీట్‌ చేసే విధానం నీకు తెలుసో లేదో నాకు తెలీదుకానీ, నన్ను లిటరల్‌గా ఇంట్లోంచి పొమ్మంటోంది’’.

సునంద ఠక్కున టీవీ ఆపేసింది.

‘‘చెప్పండి... మీ అబ్బాయికి అన్నీ చెప్పండి. నేనేం అంత కానిమాట అనలేదే. మన వీధిలో చూడండి ఎంతోమంది ఆశ్రమాల్లో ఉంటున్నారు. మీరేవిఁటో మరీ ఇదైపోతారు. అయినా విదేశాల్లో పిల్లలు పెద్దవాళ్ళని చూడరట. మన వీధిలో చాలామంది అనుకుంటూంటే విన్నాను. ఆ సంగతి మీకు తెలుసా!’’

పరపరా రంపంతో కోస్తున్నట్లుగా ఉంది.

మెల్లగా గణపతిని చూశాను. వాడు అయిష్టంగా చూస్తున్నాడు.

‘‘తెలుసు- ఆ విదేశాల్లోనే, ఆ పెద్దవాళ్లు పిల్లల్ని చదివించరు అన్న సంగతి నీకు తెలుసా!

జీవితానికి ఉపయోగపడేవీ మంచివీ అయితే ఏ దేశం నుంచి అయినా నేర్చుకోవచ్చు. కానీ, ఇదేమయినా నేర్చుకునే విషయమా!

ఇంకో విషయం సునందా! అక్కడి పెద్దవాళ్ళు డబ్బు దాచుకుంటారు. పెద్దయ్యాక, ఆ పిల్లలు చూడరన్న సంగతి వాళ్ళకి తెలుసు. పైగా ఓల్డేజ్‌ హోంలోనే ఉండాలి అని వాళ్లకి మొదట్నుంచీ తెలుసు. అందుకే అన్నింటికీ మానసికంగా తయారైపోతారు. దానికోసం డబ్బు దాచుకుంటారు.

కానీ, నేను... ఈ ఇల్లు కొనడానికి నాలుగు లక్షలిచ్చాను. పైసా దాచుకోలేదే. నాకొచ్చే పెన్షన్‌ కూడా నీకే ఇస్తున్నాను. మనం, మన ఇల్లు, మనకోసం అనుకున్నాను. అందుకే ఏమీ దాచుకోలేదు.

గణపతీ, నువ్వు పుడుతూనే ఇంజినీరువై పోయావా, ఆక్స్‌ఫర్డ్‌లోనో, హార్వర్డ్‌లోనో చదివించకపోయినా, నిన్ను మా శక్తికి మించినదే చదివించాం. డబ్బు దాచుకోలేదే!

ప్రేమించి పెళ్ళి చేసుకుంటానంటే, కట్నం మీది ఆశతో కాదనలేదే. ఎందుకంటే, డబ్బుకి ఎక్కువ విలువ ఇవ్వలేదు కాబట్టే.

మన బంధాలు ఆర్థిక బంధాలని అనుకోలేదు. అందుకే ఇలా ఉన్నాం. అవునూ సునందా, మన వీధిలోని చాలామంది ఆశ్రమాల్లో ఉన్నారని అన్నావు కదా, అది ఫ్యాషనా? నాగరికతా? అదంతా ఓ ముసుగు అంటాను నేను. ఇంట్లో ముసలమ్మలుంటే స్వేచ్ఛ పోతుందని ఆ ముసుగు. ఎన్నో సంప్రదాయాలు చరిత్రలో కలిసిపోయాయి. ఆశ్రమాల సంప్రదాయం కూడా ఇక్కడితో ఆగిపోతే మంచిది. ఎందుకంటే నిజానికి ఇది సంప్రదాయం కాదు, సమస్య. సాంఘిక సమస్య, సామాజిక సమస్య. వృద్ధాప్యాన్ని శాపం చేస్తున్న సమస్య.

గణపతీ, సునందా... వినండి. మీరు ఇన్నేళ్ళుగా పొమ్మంటున్నా నేను ఇల్లొదిలి వెళ్లలేదు. కారణం..? నేను ఓ క్రిమినల్‌ని కాదు, మీ స్వార్థం కోసం నాకు శిక్ష వేసి సమాజం నుంచి దూరం చేస్తే నేనెలా వెళ్లిపోతాను? సమాజాన్నుంచి వెళ్లిపోయేంత తప్పు నేనేం చేశాను?

నైతిక విలువలు లేని మనిషి పశువుతో సమానం. ఆ స్థితికి చేరుకోకముందే మేలుకోండి. అనుబంధాల విలువ తెలీకపోతే అంతకన్నా విషాదం మరోటి ఉండదు.

ఓ సునామీనో భూకంపమో వస్తే ఏం మిగుల్తుంది? ఈ ప్రశ్నని ఒక్కసారి వేసుకోండి. జవాబు వెతకండి. మీరు ఉన్న ఈ రెండు గజాల మేర మట్టిని కూడా వెంట తీసుకెళ్లలేరు.

జీవితం చాలా చిన్నది. దాన్ని మనం ఓ వరంగా అనుకోవాలి. గాజు ముక్కలోంచి ఓ తెల్ల కిరణం వెళ్తే, అవతలి వైపున ఏడు రంగుల ఇంద్రచాపం మనకోసం ఎదురు చూస్తున్నట్లుగా ఉంటుంది. అది ఈ గారెలు, గొడవలు, ఆశ్రమ జీవితంకన్నా వింతైనదీ విలువైనదీ.

కుటుంబం అంటే పిల్లలతోపాటు తల్లిదండ్రులుకూడా అన్నది మీ పిల్లలు కూడా తెలుసుకునేలాగా మీరు ప్రవర్తించాలి. జంతువుల్లో అనుబంధాలుండవు. ఇక్కడే మనకీ జంతువులకీ తేడా. అదే మానవ సంస్కారం. మీ సంస్కారం తెలుసుకునే సమయం వచ్చింది’’ అనేసి, నా గదిలోకి వచ్చి, కిటికీలోంచి బయటికి చూస్తూ నుంచున్నాను.

పడమర ఒంటరి నక్షత్రం బిక్కుబిక్కుమంటూ, ఆకాశపు ఎరుపు రంగులో కలిసిపోకుండా, అస్తిత్వం నిలుపుకోడానికి పోరాడుతోంది. నక్షత్రం గెలుస్తుంది. ఎందుకంటే, ఆవలించిన సంధ్యాదేవి వాలిన రెప్పలపైన ముద్దుపెట్టుకుంటూ నిశాసుందరి వస్తోంది మరి...

చిక్కపడుతున్న చీకటికి ఆవల మందార మొగ్గలాంటి ఉదయం ఉందని తెలుసు. అందులో గణపతి, సునందల మార్పు ఉంటుందనీ నాకు నమ్మకం! 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని