మనసు

మంగళవాయిద్యాలు మోగుతున్నాయి. పెళ్ళిపీటల మీద కూర్చున్న నాకు ఇది నిజమా అనిపిస్తోంది. నాకేనా పెళ్ళి జరిగేది అనిపిస్తోంది. కానీ అది అక్షరాలా నిజమని నా పక్కన కూర్చున్న వ్యక్తిని చూస్తేనే అర్థమవుతోంది...

Published : 09 Apr 2020 13:19 IST

గుడిపాటి కనకదుర్గ

మంగళవాయిద్యాలు మోగుతున్నాయి. పెళ్ళిపీటల మీద కూర్చున్న నాకు ఇది నిజమా అనిపిస్తోంది. నాకేనా పెళ్ళి జరిగేది అనిపిస్తోంది. కానీ అది అక్షరాలా నిజమని నా పక్కన కూర్చున్న వ్యక్తిని చూస్తేనే అర్థమవుతోంది. కల్యాణవేదిక మీద ఎవరూ లేరు. హాల్లో దూరంగా ఒకరిద్దరు కన్పిస్తున్నారు. నిజానికి అది హాలు కూడా కాదు. మా ఇంటి దగ్గర్లో ఉన్న గుడి. నా మనసు అక్కడ జరుగుతున్న తంతుమీద లేనేలేదు. నా కొడుకు చిన్ను మీద ఉంది. వాడేం 

చేస్తున్నాడో... ఏమైనా పెట్టారో లేదో కనీసం పాలైనా ఇచ్చారో లేదో... లేవగానే నాకోసం వెదుక్కుంటున్నాడో ఏమో! ఎవరి హడావుడిలో వారున్నారు. అడుగుదామంటే ఎవరూ దరిదాపుల్లో కనపడటంలేదు. పురోహితుడు చెప్పింది యాంత్రికంగా చేస్తున్నాను. ఈ పెళ్ళితంతు నాకూ నా పక్కనున్న వ్యక్తికీ కూడా మొదటిసారి కాదు. ఆ వ్యక్తి కొడుకు మాత్రం అక్కడే కూర్చుని ఏదో తింటున్నాడు. పిల్లాడు తెల్లగా బావున్నాడు. వాడికి నేను అమ్మ స్థానంలో వెళ్తున్నాను. వాడి పేరేమిటో? నిండా మూడేళ్ళు కూడా ఉండవేమో. అయినా జీన్సు ప్యాంటు వేసుకుని తిరుగుతున్నాడు. నా పక్కన కూర్చున్న వ్యక్తి పురోహితుడు చెప్పింది శ్రద్ధగా చేస్తున్నాడు. అతన్ని చూస్తే నాకెందుకో ప్రేమ కలగటంలేదు. ఎందుకని..? ఏమో! అసలు నాకిప్పుడు రెండోపెళ్ళి అవసరమా? నా జీవితం ఎటుపోతోంది?? నా భావాల్నీ ఆలోచనల్నీ ఎవరైనా పట్టించుకున్నారా? నేనొక మనిషినని అనుకుంటున్నారా? జీవితంలో ఎప్పుడూ స్వతంత్రం లేదు. అనుకోకుండా 

నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నిజమే, చిన్నప్పటినుంచీ కట్టుబాట్లే. డిగ్రీ కాగానే అందరూ ‘చదివింది చాల్లే, ఉద్యోగాలు చెయ్యాలా ఊళ్ళేలాలా’ అని వెనక్కిలాగినవాళ్ళే. తనకి పక్క ఊరికి వెళ్ళి పీజీ చెయ్యాలని ఉండేది. ఊరుదాటి చదువంటే అమ్మా నాన్నా ఇద్దరూ ఇష్టపడలేదు. మేమున్న ఊళ్లో పీజీ లేకపోవటం ఒకటి, డబ్బు ఇబ్బంది ఒకటి... మొత్తానికి నా చదువు మూలపడింది. నాన్నకి నా పెళ్ళి ఎప్పుడు చేసేద్దామా, ఎప్పుడు బాధ్యత తీర్చుకుందామా అని తహతహ మొదలైంది. ఆ ఆలోచన ఆయన్ని నిలవనివ్వలేదు. నాకు చదువు కోరిక తీరలేదు. 

నా మాటకి ఎవరైనా విలువిస్తే కదా. చివరికి వివాహానికి తలవంచాల్సి వచ్చింది. పెళ్ళికొడుకుది ఏదో టెంపరరీ ఉద్యోగమన్నారు. పెళ్ళిళ్ళ పేరయ్య కుదిర్చాడు. నాన్న జాతకాలు తిరగేసి ముహూర్తం పెట్టించారు. 

పెళ్ళి ఎలా జరిగిందో ఏమో నాకే గుర్తులేదు. ఫొటోలు కూడా పెద్దగా లేవు. నాన్న పొదుపుగా పెళ్ళి చేసేశారు. కారణం నాన్నకి సరైన ఉద్యోగం లేదు. జాతకాలు చెప్తే వచ్చే ఆదాయమే మా కుటుంబానికి ఆధారం. 

నా భర్త నెలలోపు వచ్చి తీసుకెశ్తానని చెప్పాడు. కానీ నెలలోపే స్కూటర్‌ యాక్సిడెంట్‌లో మరణించిన వార్త పిడుగులా వచ్చిపడింది. అమ్మా నాన్నా కంటికి మంటికి ఏకధారగా ఏడ్చారు నన్ను పట్టుకుని. దురదృష్టం నా మొహాన రాసిపెట్టుందని ఆ బాధలో నన్ను తిట్టిపోశారు నాన్న. ఆయన జాతకాలు చెప్పే పాండిత్యం ఏమయిందో నా జాతకంలో గ్రహాలు ఎదురుతిరిగాయి.

చిత్రంగా నాకు ఏడుపు రాలేదు. అసలు నా భర్తతో నాకెలాటి అనుబంధం లేనేలేదు. దేన్ని తలుచుకుని ఏడవాలి? ఇద్దరం కలిసి ఏ హనీమూన్‌కీ వెళ్ళలేదు. ఏళ్ళతరబడి సహజీవనం చేయలేదు. ఇద్దరిమధ్యా తీపిగుర్తులేం లేవు. మరి ఏడుపెలా వస్తుంది. అయినా, ఏడవకపోతే బాగుండదేమోనని మొహం విచారంగా పెట్టుకుని మాత్రం కనపడేదాన్ని. కానీ గర్భవతినని తెలిసినప్పుడు మాత్రం మొదటిసారిగా విపరీతంగా ఏడ్చాను. నా జీవితానికే ఓ గమ్యంలేదు. మరో పసిప్రాణాన్ని ఈ లోకంలోకి తీసుకొచ్చి ఎలా పెంచాలి? ఇప్పుడేం చేయాలి?? అమ్మా నాన్నా జీవచ్ఛవాలమాదిరి అయిపోయారు. చుట్టుపక్కలవారు నన్ను చూస్తేనే అశుభంలా భావించి తప్పుకు తిరిగేవారు. చుట్టూ ఉన్నవారివల్ల చచ్చిపోతానేమోనన్న భయంకూడా కలిగేది. ఆ వాతావరణం తట్టుకోవటం కష్టమైపోయింది.

నాకు పుట్టిన కొడుకుని చూసుకున్న తర్వాత నా కన్నీళ్ళింకిపోయాయి. వాడెంత అందంగా ఉన్నాడు! తెల్లటి తెలుపు. పాలబుగ్గలు, మొహాన్ని కప్పేసే జుట్టు, గుప్పెట్లు మూసుకుని నిద్రలోనే నవ్వుకునే నా కొడుకుని చూస్తూ గంటలు గంటలు గడిపేదాన్ని.

నేను వద్దు వద్దంటుంటే పెళ్ళి చేశారు. 

ఆ పెళ్ళి పెటాకులయ్యింది. ఆ ప్రభావమో ఏమో నాన్న పట్టుదలలూ రూల్సూ సంప్రదాయాలూ అన్నీ మాయమైపోయాయి. అంత చిన్నవయసులో నేనున్న పరిస్థితి చూసి నాన్న కుమిలికుమిలి ఏడ్చిన రోజులున్నాయి. బిఈడీ చెప్పించి ఎవరెవరినో పట్టుకుని నన్ను టీచర్‌గా వేయించేదాకా ఆయన నిద్రపోలేదు. నా చదువుకోసం ఆయన అప్పులు కూడా చేశారు. అమ్మ అప్పడాలమ్మీ ఊరగాయలమ్మీ కొంత డబ్బు సంపాయించింది. 

ఎప్పుడైనా నేను దిగులుగా ఉంటే నాన్న నాకు ధైర్యం నూరిపోసేవారు. ‘నీ కాళ్ళమీద నువ్వు నిలబడాలమ్మా. ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు. ఇప్పుడు మాటలనేవారు ఓ రూపాయి కూడా సహాయం చెయ్యరు. నువ్వు టీచర్‌వి అయితే రిటైరైన తర్వాత కూడా పెన్షను వస్తుంది’ అని చెప్తూ ఉండేవారు. నిజంగా నాకు ఉద్యోగం రాగానే ఆయనకి మరణం కూడా వచ్చేసింది. నా అత్తగారు... నా భర్త పోయినప్పుడొచ్చి చుట్టంచూపుగా నా జాతకం మంచిదికాదని నాలుగు తిట్టి వెళ్ళిపోయింది. దాంతో నాన్న నాకు కొడుకు పుట్టినప్పుడు కూడా వాళ్ళకి తెలియనివ్వలేదు. అమ్మ చాదస్తంగా ‘వాళ్ళకి తెలియజెయ్యటం మన ధర్మం కదా’ అంటూ ఏదో చెప్పబోతే నాన్న బాగా కేకలేశారు. ‘పోయినవాడు ఎలాగూ పోయాడు. మనమ్మాయితో వాళ్ళబ్బాయి నెలన్నా కలిసి ఉన్నాడా? ఇంకా ఈ వయసునుంచీ వాడి జ్ఞాపకాలతో చచ్చేవరకూ బతకాలా? మనవడిని చూసి మురిసిపోయి వాళ్ళు వస్తూపోతూ ఉంటారు. ఆఖరికి మనమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళింట్లో పనిమనిషిని చేస్తారు. అర్థమయిందా’ అన్నారు. వాళ్ళు రాకూడదని ఆయన కోరిక. అలాగే జరిగింది కూడా. వాళ్ళు రానేలేదు. నాన్న నా భవిష్యత్తు గురించిన దిగులుతోనే మరణించారు. 

అమ్మా నేనూ నా కొడుకూ మిగిలిపోయాం. నా కొడుక్కి పేరు కూడా లేదు. ‘చిన్నీ’ అని పిలవటం అలవాటైపోయింది. వాడిని వదిలేసి స్కూలుకెళ్ళేదాన్ని. నేను వచ్చేవరకూ వాడిని అమ్మ చూసుకునేది.

కానీ అమ్మ ఎందుకో మరీ దిగులుగా ఉంటోందీ మధ్య. డబ్బు ఇబ్బందులు కూడా అంతగా లేవు. అయితే అమ్మకి మైల్డ్‌గా హార్ట్‌ఎటాక్‌ వచ్చి ఎలాగో కోలుకుంది. ‘నేను కూడా పోతే నీ బతుకెట్లాగో’ అని చీటికీమాటికీ బాధపడేది. ఆవిడ మనసులో ఏముందో తెలీదుకానీ చుట్టుపక్కలవారితో పరిచయాలు పెంచుకుంది. వాళ్ళల్లో శ్రీలక్ష్మి అనే ఆవిడ తరచూ మా ఇంటికి వస్తూ ఉండేది. మంచీ చెడ్డా మాట్లాడి సలహాలిస్తూ గంటల తరబడి కూర్చునేది. నాకు మళ్ళీ పెళ్ళి చెయ్యాలని అమ్మ సంకల్పమేమో తెలీదుగానీ శ్రీలక్ష్మి నాకో సంబంధం తెచ్చింది. నేను తెల్లబోయాను. ఏదో అనేటంతలోనే-

‘‘నేనున్నన్నాళ్ళూ నీకు తెలీదు శాంతీ. నీకు తోడు కావాలి. రేపు నీ కొడుకు భవిష్యత్తు బాగుండాలి కదా. నీకు మళ్ళీ పెళ్ళి తప్పకుండా చేస్తాను’’ అంది దృఢంగా.

నాకు నవ్వొచ్చింది.
‘‘మూడేళ్ళ పిల్లాడి తల్లిని పెళ్ళిచేసుకునేంత విశాలహృదయం ఉన్న మగవాళ్ళెవరమ్మా’’ అన్నాను అమ్మ మాటలు కొట్టిపారేస్తూ.

‘‘లేదు లేదు. శ్రీలక్ష్మి ఆంటీ అన్నీ చెప్పింది. తనకి తెలిసినబ్బాయి ఉన్నాట్ట. తల్లీతండ్రీ ఈమధ్యే పోయారట. భార్య బిడ్డని కని ఏదో జబ్బుచేసి పోయిందట. బ్యాంకులో ఉద్యోగం. చాలా మంచివాడని చెప్పింది. నెమ్మదస్తుడట. కొడుకుని చూసేవాళ్ళులేక మళ్ళీ పెళ్ళికి సిద్ధపడ్డాడట’’.

‘‘అమ్మా, అతనికి కొడుకున్నాడు. వచ్చినమ్మాయి చూస్తుంది, బానే ఉంది. నాలాగా కొడుకున్నమ్మాయిని చేసుకుని అతను ఆ పిల్లాడినీ బాగా చూడాలిగా?’’

అమ్మ నా మాటల్ని పట్టించుకోలేదు. నన్ను ఫార్మాలిటీగా చూపించింది. అసలు పెళ్ళిచూపులని నాకు తెలీదు. అమ్మ చెప్పలేదు. ఇల్లంతా శుభ్రంగా ఉంది ఒకరోజు స్కూలునుంచి వచ్చేసరికి. శ్రీలక్ష్మి ఆంటీ కూర్చుని ఉంది. మరో కొత్తవ్యక్తి కనపడ్డాడు. ఎవరో కొత్త వ్యక్తి అనుకున్నానుగానీ పెళ్ళికొడుకన్న ఆలోచన రాలేదు. నేనంత పరిశీలనగా చూడనేలేదు. అసలు నా అవతారమే భయంకరంగా ఉంది. స్కూల్లో వాగివాగి బాగా అలసిపోయి ఉన్నాను. రేగిపోయిన జుట్టు... పసుపు, ఎరుపు కలిసిన కాటన్‌చీర... జిడ్డు కారుతున్న మొహం. అమ్మ ఏదో చెబితే నమస్కారం అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయాను. అతను నన్ను ఏ ప్రశ్నలూ అడగలేదు. వెళ్ళిపోయాడు. అతనే పెళ్ళికొడుకని అమ్మ తర్వాత చెప్పింది. తెల్లమొహం వేశాను నేను. తర్వాత స్కూలు ఇన్‌స్పెక్షను. ఆ హడావుడిలో అన్ని విషయాలూ మర్చిపోయాను. ఈలోపు అమ్మ నా పెళ్ళికి ముహూర్తం పెట్టించేసింది.

‘‘అబ్బాయి ఇష్టపడ్డాడు చాలు- ఈరోజుల్లో ఓ బిడ్డతల్లిని చేసుకోవటానికి ఎవరు ఇష్టపడతారు చెప్పు’’ అంటూ నాకు నచ్చజెప్పటం మొదలుపెట్టింది. మొదటిసారిగా అమ్మతో ఘర్షణపడ్డాను. నాకు ఎన్నో అనుమానాలు... నన్ను చేసుకుంటాడు నిజమే. నా బిడ్డని కూడా చూడాలిగా ప్రేమగా. అది తేల్చుకోకుండా నేను పెళ్ళి చేసుకున్నా సుఖపడగలనా!? 

అదే ప్రశ్న అమ్మని అడిగాను.

‘‘అమ్మా, చిన్నీని కూడా చూడాలి కదా. వాడిని బాధపెడితే నేను సహించగలనా?’’

అమ్మ తేలిగ్గా నవ్వేసింది. ‘‘వాడి గురించి దిగులు నీకెందుకే. అతను చూసినా చూడకపోయినా నేను లేనా? వాడిని నా కళ్ళల్లో పెట్టుకుని చూసుకోనూ?’’

‘‘వాడిని చూసుకున్నప్పుడు నన్ను కూడా అలాగే చూసుకో. ఈ పెళ్ళెందుకిక’’.

అమ్మ మొహం ఉదాసీనంగా అయిపోయింది. ‘‘ఆడపిల్ల ఒంటరిగా బతకలేదమ్మా. నేను చెప్పినట్లు విను’’ అంది.

‘‘పోనీ నేనతనితో చిన్నీ విషయం మాట్లాడనా?’’ అడిగాను.

‘‘నీ పిచ్చిగానీ ఇప్పుడేం చెబుతాడే... చక్కగా చూస్తానంటాడు. అదేమైనా పేపర్‌మీద సంతకమా? తర్వాత చూడకపోతే? 
నీ పెళ్ళయిపోనీ, చిన్నీకేం భయంలేదు. నా దగ్గర ఉంచుకుంటాను. అప్పుడప్పుడూ తీసుకొచ్చి చూపించి వెళ్తూ ఉంటాను. మెల్లిగా అలవాటుచేద్దాం. ముందే నువ్వు పిల్లాడితో వెళ్తే అతనికి కూడా ఇష్టం కావాలిగా’’.

‘‘మనం అంత భయపడుతున్నాం - అతని కొడుకుని నేనే పెంచాలికదమ్మా’’.

అమ్మ రెండు నిమిషాలు మాట్లాడలేదు. తర్వాత మెల్లగా ‘‘ఇదేనమ్మా మన సంప్రదాయంలో ఉన్న లోపం. మగవాడికున్న స్వేచ్ఛ ఆడదానికి లేదు. పిల్లాడికోసం పెళ్ళి చేసుకుంటున్నట్లు అతను ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. నీ బిడ్డకీ ఓ తండ్రి కావాలి, కానీ అది గట్టిగా చెప్పలేని పరిస్థితి. ఏదైతేనేంలే, నేనున్నన్నాళ్ళూ వాడిని చూస్తాను. తర్వాత చదువులకి అవేవో రెసిడెన్షియల్సు ఉన్నాయిగా అందులో పడెయ్యి’’.

నాకు ఏడుపొచ్చింది. ‘‘నువ్వు నీ కూతురి గురించి ఆలోచిస్తున్నావు. మరి నా కొడుకు గురించి ఆలోచించకుండా నా దారి నేనెలా చూసుకోనమ్మా’’.

‘‘ముందు ఈ పెళ్ళి కానీ, తర్వాత ఆలోచిద్దాం’’ అంటూ అమ్మ నా నోరు నొక్కేసింది.

అప్పటినుంచీ నాకు మనశ్శాంతి కరువైంది. రోజూ అమ్మతో ఘర్షణపడేదాన్ని. భూమి గుండ్రంగా ఉన్నట్లు నా పెళ్ళి దగ్గరకువచ్చి సంభాషణ ఆగిపోయేది. కోపం వచ్చి అన్నం కూడా మానేసేదాన్ని. అమ్మ అదేమీ పట్టించుకోకుండా పెళ్ళి ఏర్పాట్లలో పడిపోయింది.

పెళ్ళి ముహూర్తం సమీపిస్తోంది. ఎంత సింపుల్‌ అనుకున్నా మేశాలు తప్పలేదు. 

నా మనసంతా చిన్నీ చుట్టూ తిరుగుతోంది. వాడిని పెళ్ళికి తీసుకురావటానికి ఇష్టపడలేదు అమ్మ. వద్దంటున్నా వినకుండా తెలిసినవాళ్ళింట్లో అట్టిపెట్టింది. వాళ్ళు వీణ్ణి పట్టించుకుంటున్నారో లేదో... నా మనసంతా ఒకటే పీకేస్తోంది. పెళ్ళి ఎలా జరిగిందో నాకే తెలీదు. పక్కన కూర్చున్న మనిషిని 

చూద్దామన్న కుతూహలం కూడా నాకు లేదు. నా కొడుకు గురించే ఆలోచిస్తున్నాను.

మెడలో మంగళసూత్రం పడింది. మొహాన బొట్టుతో నా మొహం నాకే కొత్తగా కనపడుతోంది. మాటిమాటికీ అద్దం చూసుకుందామనిపిస్తోంది. పెళ్ళి కార్యక్రమాలు కాగానే నా భర్త సెలవులేదనీ బ్యాంకులో ఇన్‌స్పెక్షననీ వెళ్ళిపోయాడు. త్వరలో వచ్చి తీసుకెళ్ళిపోతానని అమ్మతో చెప్పాడు.

ఆ రోజు సాయంత్రం చిన్నీని కాళ్ళమీద ఉయ్యాల ఊపుతున్నాను. వాడు చిన్న బనీను వేసుకున్నాడు. వాడు నాకు ప్రతి నిమిషం ముద్దుగానే ఉంటాడు.

‘‘అమ్మా, నువ్వు బావున్నావు’’ అన్నాడు ఉన్నట్లుండి వాడు.

నేను వాడిని గాఢంగా ముద్దుపెట్టుకున్నాను.

‘‘అమ్మా నువ్వెక్కడికైనా వెశ్తావా? నేను అమ్మమ్మ దగ్గర ఉండాలా?’’ వాడు పెద్ద ఆరిందలా అడిగాడు. నాకు ఆశ్చర్యంవేసింది. అమ్మ వీడిని అప్పుడే మానసికంగా ప్రిపేర్‌ చేస్తోందన్నమాట.

‘‘నిన్ను వదిలి నేనెక్కడికి వెశ్తాను? నువ్వు కూడా వస్తావు’’ అన్నాను దృఢంగా.

అమ్మ అక్కడే ఏదో సర్దుతోంది. ‘‘నువ్వలా నేర్పకు. నా దగ్గర ఉంచుకునేందుకు వాడిని సిద్ధంచేస్తున్నాను. కొన్నాళ్లవనీ, నేను తీసుకొస్తానని చెప్పాగా’’ అంది విసుగ్గా.

‘‘అబ్బాయి నిన్ను ఎల్లుండి తీసుకెశ్తాడట’’ అంది మళ్ళీ.

‘‘ఎల్లుండేనా..?’’

‘‘అవును. ఆడదిక్కులేని ఇల్లు. ఎన్నాళ్ళుంటాడు. నువ్వు స్కూలుకి వెళ్ళటానికి అక్కడినుంచి కూడా వీలేనట. సిటీబస్సు సౌకర్యం కూడా ఉందట’’.

నేనేమీ వినలేదు. చిన్నీతో క్యారమ్స్‌ ఆడుతూ కూర్చున్నాను. వాడికి ఇంకా చేతకాదు. స్ట్రైకర్‌తో కాయిన్ని కన్నందాకా తోసుకొస్తాడు. చిన్నీని వదిలి వెశ్ళాలంటే క్షోభగా ఉంది నా మనసు.

పోనీ అతనితో ముందే చెప్పేస్తే- చిన్నీతో సహా వస్తానని.

ఏదో జంకు నన్ను వెనక్కి లాగుతోంది. ఒక వివాహం దెబ్బతిన్న కారణంగా వచ్చిన భయమా ఇది... ఏమో! ఈ భయపడే జబ్బు నాకేనా, ప్రతి భార్యకీ ఉంటుందా..? భర్తకి ప్రతి విషయంలోనూ ‘ఎస్‌ బాస్‌’ అనకూడదని తోటి టీచర్లతో వాదించే నేను... ఇవాళ నా కొడుకు నాతోనే ఉంటాడని అడగటానికి సంకోచిస్తున్నాను. అతని మనసులో మాటేమిటో తెలీదు. అతను నా కొడుకుని చూసే ఉంటాడు. కానీ ఏ అభిప్రాయం చెప్పలేదు. దగ్గరకి పిలవలేదు. ప్రేమగా ఆప్యాయంగా పేరన్నా అడగలేదు. రేపు వాడి భవిష్యత్తు ఏమిటి, ఎలా ఉండబోతోంది? ...ఇదీ నా మనసును వేధిస్తున్న ప్రశ్న.

‘నువ్వు ప్రతి ఆదివారం వచ్చి చిన్నీతో గడపొచ్చు. ఎక్కడో దూరాన ఉన్నాడని బాధపడక్కర్లేదు’ అమ్మ తన కూతురి గురించి తాపత్రయపడుతుంటే, నేను నా కొడుకు గురించి తాపత్రయపడుతున్నాను.

వాడికి అమ్మ ప్రేమను ఇప్పటినుంచే దూరంచెయ్యాలా?

అనుకున్న ఎల్లుండి గిర్రున తిరిగొచ్చింది. అమ్మ రెండు సూట్‌కేసులు, ఓ బుట్ట రెడీ చేసింది. నానా హైరానాపడి పచ్చళ్ళు, ఏవో తినుబండారాలు, చలిమిడి అన్నీ చేసింది. 

నా భర్త అన్న టైముకి వచ్చేశాడు. అతనితోపాటు ఇంకెవరూ రాలేదు. తల్లీతండ్రీ లేరు. బంధువుల్లో ఉన్న ఆడపిల్లలని చేసుకోనన్నాడని అందరూ దూరమయ్యారు. ఇంట్లో ఓ పనిపిల్ల సహాయంతో కొడుకుని చూసుకుంటున్నాడు.

అతను రాగానే కొడుకుతో ‘‘అదిగో అమ్మ’’ అని చూపించాడు.

నాలో ఉన్న సహజ సంకోచం వాడిని ఎత్తుకొనేటట్లు చేసింది. అతనేమైనా అనుకుంటాడేమోనని వాడిని ముద్దుపెట్టుకున్నాను. 

నా భర్తని ఆనందపరచటం ప్రారంభించానా? నాలో ఎందుకీ బలహీనత? నాకున్న మొహమాటం అతనికి లేదు. ‘అదిగో అమ్మ’ అని ధైర్యంగా కొడుకుకి చూపించాడు. ‘అడుగో మీ నాన్న’ అని చెప్పే ధైర్యం నాకుందా? ఎందుకిలా నా నోరు మూతబడిపోయింది? ...నా మనసులో ఏవేవో ఆలోచనలు.

అతని కొడుకు చాలా బావున్నాడు. తెల్లటి తెలుపు. వత్తయిన జుట్టు. ముద్దుగా ఉన్నాడు. గోళ్ళు కూడా నీట్‌గా కత్తిరించి ఉన్నాయి. వాడు, చిన్నీ ఒకటే వయసుకావచ్చు బహుశా.

‘‘నీ పేరేంటి?’’ అడిగాను ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని.

‘‘చాకేత్‌’’ అన్నాడు.

‘‘సాకేత్‌’’ నా భర్తనుంచి వచ్చింది సమాధానం.

అతను అప్పుడు కూడా నా కొడుకు పేరడగలేదు.

భోజనానికి ముందు వాష్‌బేసిన్‌ దగ్గర సోప్‌తో చెయ్యి కడుక్కుని మరీ వచ్చాడు సాకేత్‌. ‘మంచి అలవాటే’ అనుకున్నాను మనసులో.

భోజనం చేయగానే ఇద్దరూ గదిలో పడుకున్నారు.

నేను చిన్నీకి అన్నం తినిపించాను. ఎలాగో ఏడుపు ఆపుకుని కళ్ళు తుడుచుకున్నాను. మెల్లగా దొడ్లోకి తీసుకెళ్ళి ‘‘నాన్నా, అమ్మమ్మని ఏడిపించకుండా వేళకి అన్నం తినెయ్యి. 

అల్లరి చెయ్యకు. నేను మళ్ళీ వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోతాను’’ అని వాడికి ఏవేవో చెప్పాను.

వాడు ఏవో చేగోడీలు తింటున్నాడు. వాడికేం తెలుస్తుంది నా బాధ! అన్నిటికీ తలూపుతున్నాడు. వాడిని విడిచి ఇప్పటిదాకా ఒకరోజు కూడా లేను. వాడుండగలడా..? నేనుండగలనా..?

‘‘అమ్మా, మనింటికి వచ్చినాయన పేరేమిటి?’’

‘పేరా...’ అనుకున్నాను. నాకే గుర్తులేదే. ‘‘ఆ... కమలాకరరావో ఏదో. కమల్‌ అంటారట’’ చెప్పాను వాడికి.

నేను ఫ్రెష్‌ అయి వచ్చేసరికి చిన్నీ, సాకేత్‌ టీవీలో డిస్కవరీ ఛానల్‌ చూస్తున్నారు.

‘‘అమ్మా వీడికి కూడా టీవీలో ఇదే ఇష్టంట’’ చిన్నీ సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు.

వాడూ వీడూ అంటే కమల్‌ ఏమనుకుంటాడోనని భయపడ్డా. కానీ అతను మౌనంగా టీవీ చూస్తున్నాడు. బహుశా ఎక్కువ మాట్లాడడు అనుకుంటా. మర్యాదకైనా చిన్నీని పలకరించవచ్చు కదా. ఏమిటీ మనస్తత్వం? నా కొడుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోగలనా? 

ఆలోచిస్తూనే రెడీ అయిపోయాను. కమల్‌ ఎప్పుడు రెడీ అయ్యాడో తెలీదు. వరండాలో పచార్లు చేస్తున్నాడు.

అతను కారు పిలిపించాడు. సూట్‌కేసులు పెట్టాం. అమ్మ చాదస్తంగా డిక్కీ అంతా సామాను నింపింది.

నా మొహంలో సంతోషం లేదు. కొత్త కాపురానికి, కొత్త జీవితానికి స్వాగతం పలుకుతున్నానన్న ఆనందం లేదు. చిన్నీ ఒంటిమీద చొక్కా కూడా లేదు. బనీనుతోనే ఉన్నాడు.

చిన్నీ, అమ్మ గేటు దగ్గర నిలబడ్డారు. నేను కారు దగ్గరకి అడుగేశాను.

సడన్‌గా అతను వెనక్కితిరిగి చూసి మొహం చిట్లించాడు. నావంక కోపంగా చూశాడు. నాకు అర్థంకాలేదు.

‘‘ఏమిటిది?’’ అన్నాడు తీవ్రంగా.

అమ్మ భయపడిపోయింది. ‘‘ఏమయింది బాబూ?’’ అంది కంగారుగా.

‘‘చిన్నీని రెడీ చెయ్యలేదేం? వాడు రావటంలేదా?’’ అంతే తీవ్రంగా అడిగాడు.

అమ్మా నేనూ మొహాలు చూసుకున్నాం. ఒక్కక్షణం ఏం మాట్లాడాలో తెలీలేదు.

‘‘మీది కొత్త కాపురం కదా బాబూ... వాడిని నా దగ్గర ఉంచుకుందామని...’’

‘‘అయితే సాకేత్‌ని కూడా ఉంచుకుంటారా? కొత్తకాపురం కదా వాడు మాత్రం దేనికి?’’

అమ్మ తెల్లబోయింది. ఏమీ మాట్లాడలేదు.

‘‘మీరు ఇలా చెయ్యొచ్చా. చిన్నీ తల్లిని విడిచి ఉండగలడా? నువ్వయినా వాడిని వదిలి ఎందుకొస్తున్నావు శాంతీ? ఉండగలవా? లేకపోతే నా కొడుకులో నీ కొడుకుని చూసుకుంటూ గడిపేస్తావా, సినిమాల్లో మాదిరి’’.

నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. కానీ ఏమీ మాట్లాడలేకపోయాను.

‘‘నా కొడుకుని చూడాల్సిన బాధ్యత నీకెంతుందో చిన్నీని చూడాల్సిన బాధ్యత కూడా నాకు అంతే ఉంది. మన పెళ్ళి ఎప్పుడయిందో అప్పటినుంచే మనకి ఇద్దరు పిల్లలు. వాళ్ళు అన్నదమ్ములు. మనం లేకపోయినా వాళ్ళిద్దరూ ఒకరికొకరు తోడు. గుర్తుపెట్టుకో. వాడిని అయిదు నిమిషాల్లో రెడీ చెయ్యి. చిన్నీ... అన్నయ్య వేసుకున్న లాంటి జీన్సు వేసుకుని కారెక్కు త్వరగా’’ అన్నాడు.

చిన్నీకి ఏమర్థమయిందో తూనీగలా రెడీ అయ్యి వచ్చాడు. నా భర్త వాడిని ఎత్తుకుని కార్లో కూర్చోబెట్టాడు. అమ్మ కళ్ళనిండా నీళ్ళతో నమస్కరించబోతుంటే అతను వారించాడు. ‘‘మీరు కూడా రండి’’ అన్నాడు. అమ్మ తర్వాత వస్తానంది.

అందరం కార్లో కూర్చున్నాం. మా మధ్యలో మా పిల్లలిద్దరు. నా చెయ్యి సాకేత్‌ మీదా నా భర్త చెయ్యి చిన్నీ మీదా ఉన్నాయి. ఆగిపోతుందనుకున్న నా గుండె తిరిగి ఉత్సాహంగా పనిచెయ్యటం మొదలుపెట్టింది భవిష్యత్తును తలుచుకుంటూ. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని