అమ్మ ఒడి

‘‘అక్కా, ఏమయింది, ఎందుకు ఏడుస్తున్నావు?’’ ‘‘ఏం లేదు, నువ్వు పడుకో’’. ‘నువ్వేడిస్తే నాకు భయంగా ఉంది’. 

Published : 09 Apr 2020 13:43 IST

 పూర్ణిమ

‘చిట్టిపాపని జాగ్రత్తగా చూసుకుంటావు కదూ!’

‘అమ్మా’ ఉలిక్కిపడి లేచాను. అమ్మ గొంతు ఇంకా వినపడుతున్నట్టుగానే ఉంది. 

ఎదురుగా ఫొటోలో నవ్వుతున్న అమ్మ. అయితే, ఇది కలే! అమ్మ లేదు, నాన్న రారు. 

తల్చుకుంటే దుఃఖం గుండెల్లోంచి తన్నుకువచ్చింది. ఒక్కసారి కాలం వారంరోజులు వెనక్కి వెళితే ఎంత బాగుండును. అమ్మానాన్నల్ని బయటకు వెళ్ళనివ్వకపోతే యాక్సిడెంట్‌లో వాళ్ళు చనిపోరు కదా. తల్చుకుంటే దుఃఖం ఆగట్లేదు. నా వెక్కిళ్ళ శబ్దానికి కాబోలు చిట్టిపాప లేచింది.

‘‘అక్కా, ఏమయింది, ఎందుకు ఏడుస్తున్నావు?’’

‘‘ఏం లేదు, నువ్వు పడుకో’’.

‘నువ్వేడిస్తే నాకు భయంగా ఉంది’. 

చిట్టిపాప ఒక్కసారిగా ఏడుపు మొదలెట్టింది.

చిత్రంగా మొదటిసారి చిట్టిపాప మీద నాకు కోపం రాలేదు.

‘‘లేదమ్మా, భయపడకు... నేనున్నాగా, పడుకో’’ చిట్టిపాపని పడుకోబెట్టి జోకొట్టాను. రెండు నిమిషాలలో నిద్రలోకి జారుకుంది.

నేనూ పడుకుంటూ అమ్మ ఫొటోకేసి చూశాను.

అమ్మ మొహం సంతృప్తిగా ఉన్నట్లనిపించింది నాకు.

*  *  *

చిన్నప్పట్నుంచీ చిట్టిపాప అంటే నాకున్న ఫీలింగ్‌ ఏంటో నాకే తెలీదు. వయసు ఎదిగినా మనసు ఎదగని పసిపాప తను. నాకన్నా ఆరేళ్ళు పెద్దదయిన చిట్టిపాప అసలు పేరు శిల్ప. కానీ తన పేరుతో ఎవ్వరం పిలవం. నేను సెకండ్‌ స్టాండర్డ్‌ చదువుతున్నప్పుడు ఎదురింటి చిన్నపాప నన్ను ‘అక్కా’ అని పిలవటం చూసి తను కూడా నన్ను ‘అక్క’ అని పిలవటం మొదలుపెట్టింది. మొదట్లో అది నన్ను అక్కా అనడమేమిటని ఏడ్చేదాన్ని. ఆరోజు అమ్మ చెప్పిన మాటలు నాకిప్పటికీ గుర్తే.

‘చిట్టిపాప వయసులో పెద్దది కావచ్చు. 

కానీ అది ఎప్పటికీ నీకన్నా చిన్నపిల్లేనమ్మా. భగవంతుడు తనని ఎప్పటికీ చంటిపాపగానే ఉంచాడు. అది నిన్ను ‘అక్కా’ అని పిలిచినా తప్పులేదు. మానసికంగా దానికన్నా నువ్వెప్పుడూ పెద్దదానివే. దాన్ని జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత నీకుంది’.

ఆ రోజుదాకా చిట్టిపాప నార్మల్‌ మనిషికాదని నిజానికి నాకు తెలీదు. అయితే ఏడుస్తున్న నన్నూరడించడం మానేసి చిట్టిపాపనే అమ్మ సపోర్ట్‌ చేయడం నా పసిమనసుకి నచ్చలేదు.

ఊహ తెలుస్తున్నకొద్దీ ఇంట్లో చిట్టిపాప లాంటి మనిషి ఉండటం ఎంత ఇబ్బందో అనుభవపూర్వకంగా తెలిసింది. నా ఫ్రెండ్స్‌ ‘మీ అక్క పిచ్చిదట కదా’ అన్నప్పుడల్లా ఎంతో బాధ కలిగేది. అందుకే తర్వాత్తర్వాత ఎవ్వరినీ ఇంటికి పిలిచేదాన్ని కాదు. వాళ్ళు ఇంటికి వస్తామన్నా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేదాన్ని. అందరి బర్త్‌డే పార్టీలకు వెళుతున్నప్పుడు నాకు కూడా నా బర్త్‌డే జరుపుకోవాలనీ ఫ్రెండ్స్‌ అందరినీ పిలిచి పార్టీ ఇవ్వాలనీ మనసులో ఎంతో కోరిక కలిగినా చిట్టిపాప గుర్తుకువచ్చి ఆగిపోయేదాన్ని. దీనికంతటికీ కారణం చిట్టిపాపే కదా అని చిరాకు కలిగేది.

చిట్టిపాప మీద నా కోపానికి ఇంకో కారణం అమ్మ. అమ్మ ఎంతసేపూ చిట్టిపాప ధ్యాసలోనే ఉండేది. నాకు దక్కాల్సిన ప్రేమ తనవల్ల నాకెప్పుడూ దక్కలేదనే అనిపిస్తుంటుంది నాకు. అమ్మ చిట్టిపాపని వదిలి ఎక్కడకూ వచ్చేదికాదు. అందరిలాగే అమ్మా నాన్నలతో కలసి సినిమాలకీ షికార్లకీ బయటకీ తిరగాలనే నా కోరిక ఎప్పుడూ తీరలేదు. ఎక్కడకు వెశ్ళాలన్నా నాన్న తీసుకువెళ్ళేవారు. కానీ, నాకు అమ్మ కూడా వెంట రావాలని చాలా అనిపించేది. స్కూల్‌డే ఫంక్షన్లకీ పేరెంట్స్‌ మీటింగ్‌లకీ కూడా రాకపోవడంతో అందరూ అమ్మ గురించి అడిగేవాళ్ళు.

అయితే నాకు అమ్మని చూస్తే చాలా జాలేసేది. పాపం తనకి పొద్దున్న లేచినప్పటినుండి చిట్టిపాపతోనే సరిపోయేది. 

చిట్టిపాప మానసిక ఎదుగుదల రెండు, మూడు సంవత్సరాల దగ్గరే ఆగిపోయింది. చంటిపాపకు చేసినట్లు అన్ని పనులూ చేయవలసి వచ్చేది. స్నానం చేయించడం, బట్టలు వేయడం, భోజనం తినిపించడం... అన్ని పనులూ అమ్మే చేసేది. ఒక ఆయాను పెట్టుకోమని నాన్న ఎంతచెప్పినా వినేదికాదు. పెళ్ళిళ్ళూ ఫంక్షన్లూ వేటికీ అమ్మ రావడానికి కుదిరేదికాదు. ఇంట్లో ఈ పరిస్థితి నాకు చాలా విసుగు కలిగించేది. ఒకసారి అమ్మతో ఈ విషయమై పెద్ద ఆర్గ్యుమెంట్‌ జరిగింది. ఆరోజు ఇంకా బాగా గుర్తే.

ఇంటర్మీడియట్‌లో కాలేజ్‌ టాపర్‌గా వచ్చానని తెలిసి ఎంతో హ్యాపీగా ఇంటికి వచ్చాను. పేపర్లో మా కాలేజీవాళ్ళు నా ఫొటో కూడా వేయించారు. కాలేజీలో పేపర్‌ చూసి ఇంటికి పరుగుపరుగున వచ్చాను. వస్తూనే అమ్మ సంతోషంగా ఎదురొచ్చింది. అమ్మ మొహంలో అంత సంతోషం నేనెప్పుడూ చూడలేదు. అమ్మకి ఆల్‌రెడీ ఈ విషయం తెలిసిపోయిందన్నమాట. ‘అమ్మా’ అంటూ నోరు తెరిచేలోపే అమ్మ నా నోట్లో స్వీటు కుక్కింది. ‘నీకో గుడ్‌న్యూస్‌ తెలుసా! చిట్టిపాప అ, ఆలు తప్పుల్లేకుండా రాయటం నేర్చుకుంది. ఈరోజు అచ్చులన్నీ రాసేసింది’. అమ్మ మొహంలో ఎవరెస్ట్‌ ఎక్కినంత సంతోషం.

‘‘మంచిది. చాలా బాగుంది. పేపర్లో ఫొటో వేయిద్దాం- ఇరవైరెండేళ్ళకే అ, ఆలు నేర్చుకున్న చిట్టిపాప అని’’ నా గొంతులో ఆపుకోలేని ఉక్రోషం ధ్వనించింది.

ఆ మాటలకి అమ్మ చాలా బాధపడింది. ‘‘ఏంటీ ఆ మాటలు. ఏడాది నుండి కష్టపడి నేర్పిస్తున్నా. ఈ రోజుకి రాయగలిగింది. మన అమ్మాయి గురించి మనం సంతోషపడటం కూడా తప్పేనా. నీ అక్క గురించి నువ్వు ఇలాగేనా మాట్లాడేది’’ అమ్మ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

తన కన్నీళ్ళు చూసి ఇక మాట్లాడకుండా నా గదిలోకి వెళ్ళిపోయాను. నాకూ దుఃఖం పొంగుకొచ్చింది. అది ఉక్రోషమో పశ్చాత్తాపమో నాకు ఇప్పటికీ తెలీదు. అమ్మ నెమ్మదిగా వచ్చి నా పక్కన కూర్చుంది. 

నన్ను తన ఒడిలో పడుకోబెట్టుకుంది. 
‘‘ఏమయిందిరా తల్లీ, ఇవాళ ఎందుకలా ఉన్నావు?’’ 

‘‘ఇవాళ నా రిజల్ట్స్‌ వచ్చాయి. నేను కాలేజీ ఫస్ట్‌ వచ్చాను. కానీ నువ్వు కనీసం నా రిజల్ట్స్‌ గురించి అడగను కూడా లేదు. నీకెప్పుడూ చిట్టిపాప ధ్యాసే. అది ఏం చేసినా నీకపురూపమే. నాకొక్కసారి అనుమానం వస్తుందమ్మా- నేనసలు నీ కూతుర్నేనా అని’’ ఎన్నేళ్ళనుంచో నా మనసులో పేరుకుపోయిన అక్కసంతా బయటకు వచ్చింది.

అమ్మ మౌనంగా నా తల నిమురుతూ వింటోంది.

‘‘అయినా నీ గురించి నువ్వెప్పుడయినా ఆలోచించుకుంటున్నావా? నీ జీవితంలో ఏం కోల్పోతున్నావో నీకు తెలుసా? నువ్వు సరదాగా బయటకొచ్చి ఎన్నేళ్ళయ్యింది? బంధువులనీ నీ ఫ్రెండ్స్‌నీ కలుసుకుని ఎన్ని రోజులయింది? ఎప్పుడూ ఇల్లూ, చిట్టిపాపే లోకం. నేను చాలాసార్లు చెప్పాను- ‘చిట్టిపాప లాంటి వాళ్ళకోసం ప్రత్యేకమైన హోమ్‌లుంటాయి. అందులో దాన్ని జాయిన్‌ చెయ్యి అని’. విన్నావా? 

నా బాధ నా గురించి కాదమ్మా... నువ్వూ నాన్నా కూడా సంతోషంగా ఉండాలనే’’. 

నా మనసులో ఉన్న బాధంతా బయటకు చెప్పేసరికి నా మనసు తేలికపడింది.

‘‘అయిపోయిందా... ఇంకా చెప్పాల్సింది ఏమయినా ఉందా?’’ అమ్మ నవ్వింది.

‘‘నీకు జోక్‌గా ఉందా..?’’

‘‘లేదురా, నువ్వు మాట్లాడుతుంటే వినాలనుంది. నా గురించి ఇంతగా ఆలోచించే కూతురు ఉందని గర్వంగా ఉంది. కానీ నా జీవితాన్నేదో కోల్పోయానని నేను అనుకోవడంలేదు. నీకూ తెలుసు, చిట్టిపాప ఎప్పటికీ చంటిపాపేనని. చంటిపాపని సాకటంలో తల్లికి ఆనందం ఉంటుంది. నేనెంత అలిసిపోయినా దాని స్వచ్ఛమైన నవ్వు, అమాయకమైన చూపు, నిష్కల్మషమైన ప్రేమ... నా అలసటని మరిపిస్తాయి. ఏ జన్మ కర్మఫలమో దాన్ని దేవుడు అలా పుట్టించాడు. పాపం దానికి విడిగా ఏం కోరికలుంటాయమ్మా. బంగారం, నగలు, కార్లు, మేడలు, ఏమీ అక్కర్లేదు. షాపింగ్‌లూ హాలిడే ట్రిప్‌లూ తీసుకువెళ్ళినా తనకి తెలీదు. ఓ చిన్న చాక్లెట్‌ ఇస్తే సంతోషం. ‘అబ్బో’ అని మెచ్చుకుని ముద్దుపెట్టుకుంటే దాని మొహం పువ్వులాగా వికసిస్తుంది. ఆ సంతోషం దాని మొహంలో చూస్తే నా శ్రమంతా మర్చిపోగలను.

నీ రిజల్ట్స్‌ గురించి అడగనే లేదన్నావు. 

నీకు కాలేజీ ఫస్ట్‌ గ్యారంటీ అని నా నమ్మకం. నిన్ను అడగాల్సిన అవసరం ఉందని కూడా నాకనిపించలేదు. కానీ నువ్వు మా గురించి ఇంత ఆలోచిస్తున్నావని మాత్రం ఇప్పుడే తెలిసింది. నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను’’.

అమ్మ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

*          *         *

ఆ రోజు అనవసరంగా అమ్మతో గొడవపడినందుకు నాకు చాలా బాధ కలిగింది. ఆ తర్వాత ఇంజినీరింగ్‌ కోసం హాస్టల్‌లో చేరటం, క్యాంపస్‌ ఇంటర్వ్యూలో సెలెక్ట్‌ అయి, చదువు అవుతూనే బెంగుళూరులో జాయిన్‌ అవ్వడం జరిగింది. ఎప్పుడైనా హాలిడేస్‌లో ఇంటికి వెళ్ళటం తప్ప, ఈ అయిదారేళ్ళనుండి నాకు విడిగా ఒక జీవితం ఏర్పడింది. నాన్నగారు రిటైరై, మా సొంత ఊరికి షిఫ్ట్‌ అయిపోయారు. అక్కడ మా దూరపుబంధువైన జగదాంబ పిన్నిని కూడా వాళ్ళతోనే ఉంచుకున్నారు. తనకూ ఎవరూ లేరు. చిట్టిపాప ఆలనా పాలనా తనకీ అలవాటవ్వడంతో అమ్మకీ కొంచెం సౌకర్యంగా ఉండేది.

*          *         *

అనుకోకుండా నా పెళ్ళి సెటిల్‌ అవ్వడంతో అమ్మా నాన్నా నా దగ్గరకు రావలసివచ్చింది. నా కొలీగ్‌ చైతన్య మ్యారేజ్‌ ప్రపోజల్‌ తెచ్చాడు. నాకూ ఏ అభ్యంతరమూ కనిపించలేదు. వాళ్ళ పేరెంట్స్‌తో మాట్లాడటానికి అమ్మా నాన్నా వచ్చారు. నెలరోజుల తర్వాత ముహూర్తం కూడా కుదిరింది. అమ్మ మొదటిసారిగా చిట్టిపాపను వదిలి బయటకు వచ్చింది. మ్యారేజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసుకుని రెండు రోజులలో వెళ్ళిపోదామనుకున్న వాళ్ళని నేనే బలవంతంగా వారంరోజులుంచేశాను. వాళ్ళకి మైసూర్, హంపి, బెంగుళూరులో చూడాల్సినవన్నీ చూపించాను. అమ్మ ఇన్నేళ్ళ తర్వాత ఇంటి నుంచి బయటకువచ్చి అన్నీ చూస్తుంటే నాకెంత సంతోషంవేసిందో. అయితే అమ్మ మాత్రం చిట్టిపాపని తలుస్తూనే ఉండేది. రోజూ పొద్దున్న, సాయంత్రం పిన్నికి ఫోన్‌చేసి చిట్టిపాప గురించి కనుక్కుంటూనే ఉండేది. వారం తర్వాత మాత్రం ఇక అమ్మా వాళ్ళు వెళ్ళిపోతామని మొండికేశారు. సరే ఇక తప్పదని మర్నాటికి రిజర్వేషన్‌ చేయించాను. ఆరోజు రాత్రి చివరిసారిగా అమ్మఒడిలో పడుకున్నాను. అప్పుడు కూడా అడిగాను- ‘‘అమ్మా, ఇంకో నాలుగు రోజులుండొచ్చు కదా, ఊటీ కూడా వెళ్లొద్దాం. తర్వాత వెళ్లొచ్చు’’.

‘‘లేదు శ్వేతా, ఇప్పటికే చిట్టిపాపని వదిలి వారం అయింది. ఇంతవరకు ఎప్పుడూ తను నన్ను వదిలి ఉండలేదు. అది బెంగపెట్టుకుంటుంది. అయినా పెళ్ళి కూడా నెలరోజులలో ఉంది. పెళ్ళిపనులు మొదలెట్టుకోవాలి కదా’’.

‘‘అమ్మా, ఇప్పుడే చెప్తున్నాను... పిన్ని దగ్గర చిట్టిపాపకి కాస్త అలవాటైంది కనుక నువ్వూ నాన్నా ఆర్నెల్లకోసారైనా ఇక్కడికి రావాలి. ఇప్పుడైనా నువ్వు కొంచెం రిలాక్స్‌ అవ్వాలి. ఆరోగ్యంగా ఉన్నప్పుడే కాస్త బైట ప్రపంచం చూడాలి’’.

నేను చెప్తూంటే అమ్మ నవ్వింది.

‘‘అలాగే తల్లీ, చూద్దాంలే. అన్నట్టు... రేపు పొద్దున్న షాపింగ్‌కి వెశ్దాం. చిట్టిపాపకి ఏమైనా బొమ్మలూ బట్టలూ కొనాలి. నేను వెళ్ళేసరికి కచ్చితంగా అలిగి కూర్చుంటుంది. అవన్నీచూస్తే కాస్త మొహం వికసిస్తుంది’’.

‘అమ్మకెప్పుడూ దాని ధ్యాసే’ కొంచెం కినుకగా అనిపించింది.

‘‘రేపు మార్నింగ్‌ ఆఫీసులో నాకు కొంచెం పనుందమ్మా. మీ ఇద్దరూ షాపింగ్‌కి వెళ్లొచ్చెయ్యండి. నేను లంచ్‌టైమ్‌కి వచ్చేస్తాను. మూడుగంటలకే ట్రైన్‌. లంచ్‌ అవ్వగానే స్టేషన్‌కి బయలుదేరుదాం’’.

‘‘చాలా రాత్రయింది. ఇక పడుకో’’ అమ్మ జోకొడుతుంటే నిద్రలోకి జారుకున్నాను.

*          *         *

మర్నాడు ఆఫీసులో పర్మిషన్‌ తీసుకొని బయలుదేరుతుండగా ఫోన్‌... ‘అమ్మా వాళ్ళ టాక్సీకి యాక్సిడెంట్‌ అయ్యింది, వెంటనే అపోలోకి రమ్మని’. నాకు షాక్‌తో మెదడు మొద్దుబారిపోయింది. చైతన్య నన్ను 

హాస్పిటల్‌కు తీసుకువెశ్ళాడు. నేను వెళ్ళేసరికి నాన్న ఈ ప్రపంచాన్నే వదిలి వెళ్ళిపోయారు. ఒళ్ళంతా కట్లతో, కళ్ళలో ప్రాణాలతో అమ్మ నాకోసమే ఎదురుచూస్తోంది.

‘‘అమ్మా..’’ నాకు దుఃఖంతో మాట రావటంలేదు.

‘‘శ్వేతా.. నేను చెప్పేది విను. నువ్వొచ్చేవరకు ఉంటానా లేదా అని భయపడ్డాను’’.

‘‘అమ్మా, నీకేం కాదు’’.

‘‘నా పరిస్థితి నాకు తెలుసమ్మా. నా బెంగంతా చిట్టిపాప గురించే. దానికి ఇకనుంచి అన్నీ నువ్వే. ఇదివరకు అది నిన్ను ‘అక్కా’ అన్నందుకు ఏడ్చావు. కానీ ఇకనుంచి నువ్వు దానికి అమ్మవి’’.

అమ్మ మాట్లాడలేక ఒక సెకను ఆగింది. 

‘‘నాకు తెలుసు. నాకు నువ్వెన్నో చెయ్యాలనుకున్నావు. చిట్టిపాపను జాగ్రత్తగా చూసుకుంటానని మాట ఇవ్వు. అంతకన్నా నాకింకేమీ అక్కర్లేదు. నేను తృప్తిగా కన్నుమూస్తాను’’ అమ్మ కష్టం మీద చెయ్యి చాపింది.

అమ్మ చేతిలో చెయ్యి వేస్తుండగానే తన ప్రాణం పోయింది. ఏడుపు కూడా రానంత డీప్‌షాక్‌లో ఉండిపోయాను.

*          *         *

రెండువారాలు గడిచిపోయాయి. చిట్టిపాపని, పిన్నిని నాతోపాటు బెంగుళూరు తీసుకువచ్చేశాను. కొత్త పరిసరాలు, అమ్మా నాన్నా లేకపోవడంతో చిట్టిపాప బాగా బెంగపెట్టుకుంది. నన్ను అస్సలు వదిలిపెట్టడంలేదు. నాకు తెలీకుండానే దానిమీద కోపం కరిగిపోయింది. చిట్టిపాప అచ్చం అమ్మ పోలికే. అమ్మనే చూస్తున్నట్టనిపిస్తోంది నాకు. అమ్మ అన్నట్టుగా... దాని స్వచ్ఛమైన నవ్వు, అమాయకమైన మొహం చూస్తుంటే నాకు తెలీకుండానే దానిమీద ప్రేమ కలుగుతోంది. ఇక రేపట్నుంచి ఆఫీసులో జాయిన్‌ అవ్వాలి. నేననుకున్న పని కూడా మొదలెట్టాలి.

*          *         *

‘‘చెప్పు చైతన్యా, ఏదో మాట్లాడాలన్నావు’’ ఆఫీసు నుండి బయలుదేరుతుండగా నాతో మాట్లాడాలని పార్కుకి తీసుకువచ్చాడు చైతన్య.

‘‘ఈ టాపిక్‌ మాట్లాడే టైమ్‌ ఇదికాదని తెలుసు శ్వేతా. కానీ తప్పదు. ఇవాళ మా బాస్‌ పిలిచి, నేను నెక్ట్స్‌మంత్‌ యు.ఎస్‌. వెశ్ళాలని చెప్పారు. టు ఇయర్స్‌ ప్రాజెక్ట్‌. మధ్యలో వెనక్కిరావటం కుదరకపోవచ్చు. మామూలుగా అయితే మన మ్యారేజ్‌ ఇంకో టూవీక్స్‌లో జరిగేది. ఇప్పుడేం చేద్దామో నీతో మాట్లాడదామని...’’.

‘‘ఈ విషయంలో నేనే నీతో మాట్లాడదామనుకుంటున్నా చైతన్యా. ప్రస్తుతం నాకు పెళ్ళి ఆలోచన లేదు. మా ఊర్లో ఉన్న ప్రాపర్టీస్‌ అన్నీ అమ్మేసి, ఇక్కడ చిట్టిపాప లాంటి వాళ్ళకోసం ఒక హోమ్‌ స్టార్ట్‌ చేద్దామనుకుంటున్నాను. ప్రస్తుతం నా దృష్టంతా దానిమీదే’’.

‘‘ఆర్‌ యు క్రేజీ’’ అప్రయత్నంగా చైతన్య నోట్లోంచి వెలువడింది.

‘‘నో, అయాం నాట్‌. అమ్మ వెళ్ళిపోతూ నేనున్నాననే ధైర్యంతో చిట్టిపాపను నాకు అప్పచెప్పింది. ఒకవేళ అదే యాక్సిడెంట్‌లో నేనూ ఉంటే తన పరిస్థితి ఏమయ్యేది. అందుకే ఎవరిమీదా ఆధారపడకుండా తన బతుకు తను బతకడానికి శిక్షణ అవసరం. అయితే చిట్టిపాపని నేనే జాగ్రత్తగా చూసుకుంటానని మాట ఇచ్చాను. అందుకని నేనే ఒక హోమ్‌ స్టార్ట్‌ చేస్తే చిట్టిపాపతోపాటు తనలాంటి ఇంకొంతమందికి కొత్త జీవితం లభించవచ్చేమో’’.

చైతన్య మౌనంగా ఉండిపోయాడు.

‘‘ఈ ప్రపంచంలో సురక్షితమైన స్థలం ఏదో తెలుసా చైతన్యా, ‘అమ్మ ఒడి’. అమ్మ ఒడి అంటే ఒక రక్షణ, ఒక భరోసా. అమ్మ పోయే ముందురోజు అమ్మ ఒడిలోనే నేను నిద్రపోయాను. ఆ మాధుర్యం ఇప్పటికీ నా మనసులో పదిలంగా ఉంది. చిట్టిపాపకి అమ్మా నాన్నలను నేనే దూరం చేశానని ఒక్కోసారి నాకు అనిపిస్తోంది. నేనే కనుక వాళ్ళని ఇక్కడకు పిలవకపోతే తను హాయిగా ఉండేదేమో. ఏదైనా చిట్టిపాపకి నేను ఏ లోటూ రానివ్వను. నా హోమ్‌ పేరు కూడా నిర్ణయించుకున్నాను. ‘అమ్మ ఒడి’. నా కళ్ళనుండి అప్రయత్నంగా నీళ్ళు వస్తూనే ఉన్నాయి.

అందుకే చైతన్యా, నాకిప్పట్లో పెళ్ళి ఆలోచనే లేదు. పైనుంచి అయినా అమ్మ నన్నూ చిట్టిపాపనీ చూసి సంతోషంగా ఉండాలన్నదే నా ధ్యేయం. ఇకనుంచైనా చిట్టిపాప ‘శిల్ప’గా మారాలి. ప్లీజ్, నువ్వింక నా గురించి 

ఆలోచించకు. నీ జీవితం గురించి నువ్వే ఒక నిర్ణయం తీసుకో’’.

‘‘నా దృష్టిలో మన జీవితాలు రెండూ ఎప్పుడో కలిసిపోయాయి శ్వేతా. నువ్వు పెళ్ళిచేసుకుని సంతోషంగా ఉండాలన్నది కూడా మీ అమ్మగారి కోరికే. అయితే నీకూ కొంత టైమ్‌ కావాలి. నేను తిరిగొచ్చాకే మనం పెళ్ళి చేసుకుందాం. ‘అమ్మ ఒడి’ని మనిద్దరం కలిసే చూసుకుందాం. ఇది నీకు ఓకేనా’’ చైతన్య అడిగాడు.

నన్నర్థంచేసుకునే జీవిత భాగస్వామి దొరికినందుకు సంతోషంతో చైతన్య భుజంమీద తలవాల్చి కళ్ళు మూసుకున్నాను. మూసిన కనురెప్పల వెనక అమ్మ కనిపించింది.

అమ్మ సంతృప్తిగా నవ్వుతోంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని