యే మేరా ఇండియా

‘‘కిరణ్, ఏం చేస్తున్నావు?’’ వంటగదిలోంచి అడిగింది లలిత. అది.. ఆరోఎక్కం అప్పగించలేదని మాస్టారు విద్యార్థిని నిలదీసినట్టుంది. నేను పలకలేదు...

Published : 09 Apr 2020 14:27 IST

 సీహెచ్‌.సీత

‘‘కిరణ్, ఏం చేస్తున్నావు?’’ వంటగదిలోంచి అడిగింది లలిత. అది.. ఆరోఎక్కం అప్పగించలేదని మాస్టారు విద్యార్థిని నిలదీసినట్టుంది. నేను పలకలేదు. కాసేపయ్యాక చేతిలో గంటతో హాల్లోకి వచ్చింది మా ఆప్రాన్‌ సుందరి. ‘‘నేను పిలిచాను, వినబడలేదా?’’ అంది.

‘‘చెవులు వింటున్నాయి లల్లీ. కానీ అవి పలుకలేవు గదా’’ అన్నాను నవ్వుతూ.

‘‘అలాగా, ఇకమీదట ఆకలేస్తే పొట్టకోసి భోజనం నింపు. నోటితో తింటే ఊరుకోను’’ అంది.

నా కళ్ళు టీవీ మీదే.

‘‘అసలు ఎలా చూస్తారు టీవీ?’’ అంది.

‘‘అదా నీ డౌటు? క.క.క.కే.క... అదే దానికి జవాబు’’ అన్నాను.

‘‘అంటే?’’

‘‘టీవీ చూడాలంటే కావాల్సినవి... కళ్ళు, కరెంటు, కలర్‌ లేదా బ్లాక్‌ అండ్‌ వైట్‌ టీవీ, కేబుల్‌ కనెక్షను. ఇవి ఉంటే చాలు... ఎంచక్కా టీవీ చూడచ్చు’’.

నన్ను చురచురా చూస్తూ వంటగదిలోకి వెళ్ళింది. రెండు నిమిషాల్లో మళ్ళీ వచ్చి ‘‘కొంపదీసి నువ్విప్పుడు ‘మిస్సమ్మ’ సినిమాగానీ చూడ్డంలేదు గదా?’’ అంది.

‘‘ఎవరి కొంపా తీయకుండానే ‘మిస్సమ్మ’ సినిమా చూడొచ్చు. లేదా మిస్సమ్మ చూసేముందు ఎవరి కొంపా తీయనక్కర్లేదు’’ అన్నాను చిరునవ్వుతో.

‘‘జోకు బాలేదు. హిహిహి...’’ అంది. ‘‘అదే పాత సినిమా... యాభైఏళ్ళనాటి నటులు... అవే పాటలు. మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మకథ... అన్నీ అంతే. అయినా, సీడీలు వేసుకొని చూస్తావుగా. టీవీ 

కక్కుర్తి ఎందుకు?’’

‘‘సీడీలు జీతపురాళ్ళయితే ఇలా టీవీల్లో వచ్చేవి బోనస్‌లు. పైగా నాకు సహ ప్రేక్షకులుంటారు’’.

‘‘అవునా? ఎవరున్నారిప్పుడు 

నీ సహప్రేక్షకులు’’.

‘‘అఖిలాంధ్రకోటి’’

‘‘ఎవరూ చూడరు, నువ్వు తప్ప’’.

‘‘పోనీ అలానే అనుకున్నా యాడ్స్‌ ఇన్‌ఛార్జ్, ఛానల్‌ ఆపరేటరూ ప్రోగ్రాం మేనేజరూ ఎక్కడో అక్కడ ఉంటారు గదా. వాళ్ళు చాలు... నా సహప్రేక్షకులుగా’’.

‘‘కృష్ణా’’ అంది లలిత చెవులు మూసుకుని తలపైకెత్తి. అంతలో స్మిత... మా ఆవిడ ప్రాణసఖి వచ్చింది. మా ఆవిడా నేనూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లం. కంపెనీలు వేరు. 

ఆవిడ టి.ఎల్‌., నేను పి.ఎల్‌. స్మిత మా ఆఫీసులో పనిచేస్తుంది. ఆవిడే మాకీ సంబంధం సెటిల్‌ చేసింది. కూరగాయలు తీసుకువస్తానంటూ బైటపడి రెండు గంటలయ్యాక ఇంటికి వెశ్ళా. స్మిత వెళ్ళిపోయింది అప్పటికే. ‘‘స్మిత నామీద ఏం చెప్పిందని అడగవేం?’’ నన్ను కవ్విస్తూ అంది లలిత.

‘‘మీరు ఏదైనా చెప్పుకోవాలనేగా నేను బైటికి వెళ్ళింది’’ అన్నాను.

‘‘నిన్ను అమెరికా వెళ్ళమంటే వెళ్ళనన్నావనీ అందుకోసం ప్రమోషన్‌ ఆపారనీ చెప్పింది’’.

‘‘ఔను లల్లీ, ఈ దేశాన్ని విడిచి ఒక్కరోజు కూడా ఉండలేను. అందుకే వెళ్ళనన్నాను’’.

‘‘ఏముందిక్కడ? ఎందుకని విదేశాలకి వెళ్ళవు?’’

‘‘నాక్కావాల్సినవి అన్నీ ఉన్నాయి’’.

‘‘ఔను, ఉన్నాయి. చెత్తా చెదారం, మురికిగుంటలు, గోతులు, ఆకాశాన్నంటే ధరలూ అరాచకాలూ కుళ్ళు రాజకీయాలూ స్కాంలూ బాంబులూ ఉగ్రవాదం, తీవ్రవాదం, అధిక జనాభా, లంచగొండితనం, బంధుప్రీతి, ముసలినేతలు, మురుగు కాలువలు... ఇవి ఉన్నాయి. ఇవి మాత్రమే ఉన్నాయి’’.

‘‘ఇవి అన్ని దేశాలలోనూ ఉన్నాయి’’.

‘‘కానీ మనదేశంలో ఎక్కువగా ఉన్నాయి’’.

‘‘కావచ్చు. అక్కడ ఎవరో ఒకరు తెలివైనవారుంటారు. వారు మిగిలినవారిని శాసిస్తారు. ఇక్కడ అందరూ తెలివైనవారే. అందుకే ఈ రగడ’’.

‘‘నీ దేశపు యువత అంతా విదేశాలకి ఎగిరిపోతున్నారు. నీ దేశపు డబ్బంతా స్విస్‌బ్యాంకులోకి వెళ్ళిపోతోంది. నీక్కావాల్సింది ఏముందిక్కడ?’’

‘‘తెలివితేటలు. రోడ్లూడ్చేవారినుండి రాకెట్లు చేసేవారిదాకా అందరికీ పుష్కలంగా ఉన్నవి అవే. అది చూసి పొంగిపోతాను’’.

‘‘ఇది పిచ్చి...’’

‘‘కావచ్చు. కానీ ఒక్కటి లలితా, నేనొక వ్యక్తిని ప్రేమిస్తే వారి బలహీనతలతోసహా వారిని ఇష్టపడతాను. ఇక నాదేశం సంగతంటావా- ఇందాక నువ్వు చదివావే లిస్టు... చెత్తా చెదారంతో సహా వాటన్నింటినీ ఇష్టపడతాను. ప్రతీ వ్యతిరేకాంశంలోనూ అనుకూలాంశాన్ని వెదుక్కుంటాను. లంచం ఇచ్చేవాడి అవసరాన్నీ తీసుకునేవాడి బలహీనతనీ అర్థంచేసుకునే ప్రయత్నం చేస్తాను. ఇది నా బలహీనత. వదిలెయ్‌’’.

‘‘కిరణ్, మంచి మార్కులతో పాసయ్యావ్‌. ఆఫీసులో ఒళ్ళు దాచుకోకుండా పనిచేస్తావ్‌. తీరిక సమయాల్లో లేటెస్ట్‌ సాఫ్ట్‌వేర్‌ కోర్సులు నేర్చుకుని నాలెడ్జ్‌లో అందరికన్నా ముందుంటావ్‌. అందుకు, ఇక తప్పని స్థితిలో నీకీ పోస్టిచ్చారుగానీ... ‘పెద్ద ఐటమ్‌గాడురా బాబూ’ అని ఎన్నిసార్లు మనసులో అనుకుంటారో కదా!’’

‘‘నేనిలా ప్రవర్తిస్తే అలా అనుకోవడం సహజమే కదా’’.

‘‘నాకు బుద్ధి లేదు. ఇక పద, వాకింగ్‌కి వెశ్దాం’’.

* * *

‘‘సర్, పిలిచారట’’ అడిగాను మా బాస్‌ని. కుర్చీ చూపించాడు. కూర్చున్నాక ‘‘కిరణ్, ఎలాగైనా నువ్వు అమెరికా వెశ్ళాల్సివస్తుంది, తప్పదు’’ అన్నాడు.

‘‘సర్‌... నేను...’’ నా మాటల్ని మధ్యలోనే తుంచి ‘‘పైవాళ్ళనుండి నాకు ఒత్తిడి పెరుగుతోంది. నన్నిప్పుడు ఏం చేయమంటావో చెప్పు’’.

‘‘కాదన్నానని చెప్పండి. కాదూ కూడదంటే తీసేయమని చెప్పండి’’.

‘‘కిరణ్, సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో నంబర్‌ వన్‌ మనది. ఇంత జీతం నీకు బైట రాదు’’.

‘‘తెలుసు సర్‌’’.

‘‘అయినా వెళ్ళనంటున్నావే?’’

‘‘అమ్మా నాన్నా అత్తగారూ మామగారూ పెద్దవాళ్ళు. వాళ్ళకి నా భార్యా నేనూ తప్ప మరో సంతానం లేరు. వాళ్ళ బాధ్యత మా ఇద్దరిదీ. పైగా ఈ గడ్డని విడిచి ఉండలేను’’.

‘‘ఈ దేశంమీద ఇంత ప్రేమేంటి నీకు?’’

‘‘ఆరడుగుల పొడవూ రెండడుగుల వెడల్పూ లేని మనుషులంటేనే మనకింత ప్రేమ కదా. సువిశాలమైన ఈ దేశంమీద ఎంత ప్రేమ ఉండాలి! ఈ గాలి శ్వాసనిచ్చింది. ఈ తిండి పోషించింది. ఈ మట్టిలో కలిస్తే చాలు. అదే నా కోరిక’’.

‘‘అంత ధర్మసూత్రాలు చెప్పేవాడివి, నెలకో సాఫ్ట్‌వేర్‌ కోర్సూ, గ్రీకు, లాటిన్‌ లాంటి భాషలు ఎందుకు నేర్చుకుంటున్నావ్‌?’’

‘‘అది విద్య సర్‌. దానికి ఎల్లలు లేవని నా అభిప్రాయం’’.

ఆయన లేచివచ్చి నా చేతులు పట్టుకున్నాడు. ‘‘బాబ్బాబు, ఇవి కాళ్ళనుకో. నువ్వు వెళ్ళకుంటే నా ఉద్యోగం ఉండేట్టు లేదు. 

ఆరునెలలు వెళ్ళిరా చాలు. నిన్ను త్వరగా రప్పించమని ఒత్తిడి తెస్తాను. నీలా పనిచేసేవాళ్ళు నాకూ దొరకరు. నా పనులు కూడా సగభాగం నువ్వే చేసిపెట్టి, నా ప్రమోషన్‌కి కారణమయ్యావు. నువ్వు పక్కనుంటే నాకు పని గురించిన భయం ఉండదు. నేను సెలవులో ఉన్నా ఆఫీసు గురించిన దిగులుండదు. దయచేసి నాకోసం వెళ్ళిరా. నీ వీసా, పాస్‌పోర్ట్‌ లాంటివి నేను చూసుకుంటాను’’.

‘‘సర్, నన్ను ఆలోచించుకోనివ్వండి’’.

‘‘ఎంతైనా ఆలోచించుకో. కానీ వెళ్ళడం తప్పనిసరి’’.

అత్తగారూ మామగారూ ఏడ్చేశారు. ‘‘అమ్మా, మీ కూతుర్ని నేను. నేను వెళ్ళట్లేదు కదా. ఆయన వెళ్తుంటే కూడా మీరు ఏడుస్తారేంటి?’’ అంది లలిత.

‘‘అమ్మా, అతను అల్లుడైతే ఏడ్చేవాళ్ళంకాదు. కానీ అతను ఆత్మబంధువు. అందుకే ఈ కన్నీళ్ళు’’ అంది అత్తగారు.

ఫ్లైట్‌ ఎక్కేముందు లలిత కూడా ఏడ్చింది.

‘‘అప్పుడప్పుడూ ఉత్తరం రాస్తాను లల్లీ’’ అన్నాను.

‘‘నీ పాత చింతకాయపచ్చడి ఉత్తరాలు నాకొద్దు. రోజూ రాత్రికి ఫోన్‌ చేయి’’ అంది.

‘‘అలాగే’’ అన్నాను.

అమెరికా వెశ్ళాను.

లలిత కోరినట్టు రోజూ ఫోన్‌ చేస్తున్నాను. ఫోన్లో ఎక్కువగా ‘ఇంకేంటి విశేషాలు’, ‘చెప్పాలి నువ్వే’, ‘ఇంకేంటి సంగతులు’... ఇలాంటి సొల్లు తప్ప పెద్దగా మాట్లాడింది లేదు. ఓనాడు ‘‘నువ్వు లేకపోతే భయంగానూ బాధగానూ ఉంది’’ అంది లలిత.

‘‘అమ్మా నాన్నా, అత్తగారూ మామగారూ...’’

‘‘...అంతా ఇక్కడే ఉన్నారు. అయినా...’’

‘‘...అది భయమూ బాధా కాదు. జ్ఞాపకాలు. మనుషుల విలువని తెలియజేసేది అవే. నా లోటుని నీ జ్ఞాపకాలు బాధలుగా తెలుపుతున్నాయి. అందువల్ల వచ్చిన దిగులుని నువ్వు భయం అనుకుంటున్నావు. తెల్లవారుజామునా ఇంకా ఆఫీసునుండి వచ్చాకా ఎక్కువగా ప్రకృతితో గడుపు. మనసు ప్రశాంతంగా ఉంటుంది’’.

‘‘భలే చెప్పావులే. మనది అపార్ట్‌మెంట్‌. సిమెంట్‌ గోడలు తప్ప ఏముందిక్కడ?’’

‘‘అపార్ట్‌మెంట్‌ టెర్రెస్‌ పైకి వెళ్ళు. ఉదయం ఉత్తరం నుండి దక్షణానికీ సాయంత్రం దక్షిణం నుండి ఉత్తరానికీ పక్షుల గుంపులు వెశ్తాయి. వాటిని చూడు. ముఖ్యంగా రామచిలుకలు కొద్దిపాటి ఎత్తులో వెశ్తాయి. అవి చేసే కిలకిలారావాలు విను. మనసు పులకరిస్తుంది’’.

రెండురోజులయ్యాక ‘‘కిరణ్, ఎలాగైనా నువ్వు గ్రేట్‌. పక్షులూ చిలుకలూ వాటి కిలకిలలూ బాగున్నాయి. రాత్రంతా నా కలలో చిలుకలే’’ అంది. నాలుగురోజులయ్యాక ఫోన్‌ చేసి ‘‘నువ్వు చాలా చెడ్డవాడివి’’ అంది.

‘‘నిజమేనా’’ అన్నాను.

‘‘నోరు మూసుకుని విను. ఎన్నడూ లేనిది, నిన్న ఉదయం దేవుడికి పూజ చేయాలనిపించి వాచ్‌మెన్‌కి డబ్బులిచ్చి పూలు తెమ్మన్నాను. ‘ఎందుకమ్మా, బాబుగారు పెంచిన మొక్కలు విరగబూసి ఉన్నాయి. మీరు ఎప్పుడూ చూడలేదుగా, రండి’ అంటూ కిందకు తీసుకువెశ్ళాడు. అపార్ట్‌మెంట్‌ పక్కనున్న చిన్న ఖాళీస్థలాన్ని తోటగా మార్చావే!’’ అంది.

‘‘పేరు నాది. శ్రమ... పాపం వాచ్‌మెన్‌ది’’.

వారం రోజులకి ఫోన్‌చేసి ‘‘ఏయ్, దుర్మార్గుడా’’ అంది. నేను పలకలేదు. ‘‘ఈరోజు ఉదయం వాకింగ్‌కని వెశ్ళాను. అక్కడ మున్సిపాలిటీవాళ్ళు కనిపించారు. 

‘‘ఏం చెప్పారో తెలుసా?’’

‘‘తెలుసు. రోజూ నేను వెళ్ళేది జాగింగ్‌కి కాదు. మున్సిపాలిటీవాళ్ళతో కలిసి మన ఏరియాని శుభ్రంగా ఉంచేందుకు సాయపడ్డానికి’’.

‘‘వాళ్ళకి బహుమతులూ అవీ ఇవ్వడానిక్కూడా. అది లంచం కాదూ?’’

‘‘కాదు. వాళ్ళు నాలుగో తరగతి ఉద్యోగులు. మనలా సంవత్సరానికి లక్షల్లో జీతాలు రానివాళ్ళు. మననుండి కొద్దిగా ఆశిస్తారు. ఒళ్లొంచి పనిచేసేవారికి చిన్నచిన్న బహుమానాలు- టానిక్కులు లల్లీ’’ అన్నాను.

* * *

అమెరికాలో, మా ఆఫీసులో, నా సెక్షన్‌లో గౌరి అనే గుంటూరు అమ్మాయి ఉంది. ఆరేళ్ళక్రితం భర్తతో ఇక్కడికి వచ్చింది. అన్యోన్యంగా ఉండేవారట. పాప పుట్టాక అతను పోయాడు. గ్రీన్‌కార్డ్‌ ఉంది. పాపతో ఆమె ఇక్కడే ఉండిపోయింది. అందమైన ఆమెతో పరిచయంకోసం ఆఫీసులో అంతా తహతహలాడేవారు. ఓరోజు ఆఫీసునుండి వెళ్తుండగా ఆమె పలకరించింది. ‘‘మీరు సహజంగానే అలా ఉంటారా? లేక నటిస్తున్నారా?’’ అంది.

‘‘మీకు నటన అనిపిస్తే బహుశా నటించే ఉంటాను’’ అన్నాను.

నా జవాబుకి అదిరిపడి ‘‘ఏ విషయంలో అడిగాననుకున్నారు?’’ అంది.

‘‘ఏదో విషయంలో మీకు అనుమానం కలిగితేనే కదా... ఇలా నన్ను నిలదీస్తారు’’ అన్నాను.

ఆమె నవ్వి వెళ్ళిపోయింది. ఇరవైరోజులయ్యాక ఎదురై పలకరించి ‘‘మీ గురించి ఆఫీసులో ఏమేమో అనుకుంటున్నారు’’ అంది.

‘‘తెలుసు’’ అన్నాను.

‘‘ఏమనుకుంటున్నారు’’ అంది.

‘‘అది తెలీదుకానీ ఏదో అనుకోకపోతే మీరిలా వచ్చి చెప్పరు కదా’’.

‘‘మరి తెలుసన్నారు?’’

‘‘మా లల్లి చెప్పింది. ‘పెద్ద ఐటమ్‌గాడురా బాబూ’ అనుకుంటారని. బహుశా అలాగే అనుకుని ఉంటారు’’ అన్నాను.

అంతే, మర్నాటినుండి ఆమె మంచి స్నేహితురాలయింది. ఎక్కువగా మాట్లాడేది కాదు. వినడానికి ఇష్టపడేది. నాకు ఏ విషయం మీద కచ్చితమైన అభిప్రాయాలున్నాయో అవి చెప్పేవాడిని. ఆమె వినేది. ఓరోజు వాళ్ళింటికి ఆహ్వానించింది. వెశ్ళాను. వాళ్ళ పాప బాగుంది. తల్లీ కూతుళ్ళు ఇంట్లో తెలుగులోనే మాట్లాడుకుంటారు. 

పాప నన్ను ‘అంకుల్‌’ అంది.

‘‘పాపా, మీ అమ్మ ఫ్రెండ్స్‌ ఎవరు ఇంటికొచ్చినా ఆడవాళ్ళని ‘అత్తయ్యా’ అనీ మగాళ్ళని ‘మామయ్యా’ అనీ పిలువు’’ అన్నాను.

‘‘అలాగే మామయ్యా’’ అంది పాప.

అయిదునెలలు పోయాక గౌరి అంది- ‘‘ఇక మనం కలుసుకోవడానికి కుదర్దు’’ అని.

‘‘సరేనండి’’ అన్నాను.

‘‘ఎందుకని అడగరేం?’’ అంది.

‘‘చెప్పవల్సిందైతే మీరే చెబుతారు’’ అన్నాను.

‘‘మీ మాటల ప్రభావంవల్ల నేనూ ఇండియాని ప్రేమించడం మొదలెట్టాను. అందుకే హైదరాబాద్‌ వెళ్తున్నాను. శాశ్వతంగా. అక్కడ ఇదే ఆఫీసులో, ఇదే ఉద్యోగం ఇస్తామన్నారు. పాపతో సహా అక్కడే ఉంటాను’’.

‘‘మంచి నిర్ణయం. అభినందనలు అందుకోండి’’ అన్నాను.

ఆమె వెళ్ళిపోయింది. ఎందుకనో ఆరోజు లలిత చాలా గుర్తొచ్చింది. రాత్రంతా కూర్చుని తనకి ఉత్తరం రాసి పోస్ట్‌ చేశాను. రోజూ ఫోన్‌ చేస్తున్నా, ఈ విషయం నేను చెప్పలేదు. ఉత్తరం అందినరోజు ‘‘నీ ఉత్తరం చదవలేదు. తీరిగ్గా చదువుతాలే’’ అంది. మరుసటి వారమే నేను ఇండియా వచ్చేశాను. ఫ్లైట్‌ దిగగానే నేలని చేత్తో తాకాను. 

ఇది నా దేశం... ఎంత ఆనందం!

* * *

ఆరునెలలు పోయాక... ‘‘కిరణ్, నాకు అమెరికా వెళ్ళే ఛాన్సు వచ్చింది. నీలా నాకు సెంటిమెంట్స్‌ లేవు. వెశ్తాను’’ అంది లలిత. అంతలోనే ‘‘మరి నిన్ను విడిచి ఎలా ఉండను?’’ అని అడిగింది.

‘‘విరహము కూడా సుఖమే కాదా?’’ అంటూ పాడాను. వెళ్ళింది. రోజూ ఫోన్లు. మూడునెలలు గడిచాయి.

ఓ రోజు ఆఫీసునుండి వచ్చాను. అమ్మ ఉత్తరం అందించింది. గదిలోకి వెళ్ళి చించితే లలిత రాసిన సుదీర్ఘ లేఖ. ఓ సెలవురోజు ఏమీ తోచక అమెరికా నుండి నేను రాసిన ఉత్తరం చదివిందట. ఇకపై వారానికో ఉత్తరం రాయమంది. ‘ఉత్తరాల గురించి ఫోన్లో ప్రస్తావించొద్దు’ అంది. ‘కొత్తగా రెపరెపలాడే ఉత్తరం. అందులో మనకోసం అమరిన అక్షరాలు, మనల్ని ఉద్దేశించిన భాష, మనం లక్ష్యంగా సాగిన భావన, ఎంత వింతైన అనుభూతినిస్తున్నాయో చెప్పలేను. నీ పాత చింతకాయపచ్చడే నా మానసిక అనారోగ్యానికి పథ్యపు భోజనం’ అంటూ రాసింది.

సంవత్సరం తరవాత ఇండియా వచ్చింది. రిసీవ్‌ చేసుకోవడానికి నేను ఎయిర్‌పోర్ట్‌కి వెశ్ళాను. ఇంటికి వస్తుండగా కార్లో అంది- ‘‘కిరణ్, ఫ్లైట్‌ దిగగానే నా ఆనందానికి అవధుల్లేవు. బ్యాగ్‌ని కావాలని కిందకి జార్చి తీసుకునే నెపంతో ఈ నేలని తాకాను. అప్పటికిగానీ నా ఉద్వేగం చల్లారలేదు’’.

అంతలో నా ముందున్న కారు ఆగిపోయింది. హారన్‌ కొట్టాను. కారు అలాగే ఉంది. చిన్న క్రాస్‌ రోడ్డది. కూడలిలో కారు ఆగడంవల్ల ట్రాఫిక్‌ ఆగిపోయింది. ‘కుఁయ్యి కుఁయ్యి’మని హారన్ల మోత. అంతలో కారులోనుండి ఓ యువకుడు దిగాడు. అతని వెనకే ముందుసీట్లో నుండి ఓ యువతీ వెనక సీట్లోనుండి ఇద్దరు పిల్లలూ దిగారు.యువకుడికి చెమటలు పడుతున్నాయి. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ లేడు. ఓ చేత్తో స్టీరింగ్‌ తిప్పుతూ మరోచేత్తో కారు తోయడానికి చూస్తున్నాడు. కానీ అది పెద్ద కారు. అంగుళం కూడా జరగలేదు. ఆ యువతి కూడా తోయడానికి చూసింది. వాళ్ళవల్ల కావట్లేదు. ఓపక్క వాహనాల మోతతో కంగారు. మరోపక్క కారుకేమైందోనని ఆరాటం. అతను చెమటతో తడిసిపోయాడు. అప్పుడు వచ్చాడు ఒకతను. తెల్లని ఖద్దరుబట్టల వ్యక్తి. చిన్న రాజకీయ నాయకుడు కాబోలు. ఎత్తుగా, లావుగా, నల్లగా, రెండుచేతులకూ వేళ్ళనిండా ఉంగరాలతో దిగాడు తన కారులోనుండి. ఆయన మనుషులూ దిగారు వెనకాలే. ఆగిపోయిన కారతనితో ఏదో మాట్లాడాడు. మళ్ళీ తనవారితో ఏదో అంటున్నాడు. ఈలోగా మరో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. మరొకతను స్కూటరు పక్కన ఆపి వచ్చేశాడు. ఓ ఆటోవాలా వచ్చాడు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ట్యాగ్‌ మెడలో ధరించిన ఓ కుర్రాడూ వచ్చాడు. అంతా కలిసి, తలో చెయ్యివేసి కారుని ఆ పక్కనే ఉన్న పెట్రోల్‌బంకుదాకా నెట్టారు.

నా పక్కనే ఉన్న కెమెరా తీసుకుని కారులోనుండే ఫొటోలు తీశాను. మర్నాటి పేపర్లో.. విదేశాల్లో ఇలా కార్లు పాడవవు. ఒకవేళ అయినా ఇలా నెట్టుకుంటూ వెళ్ళరు. వెళ్ళినా దారినపోయే వాళ్ళెవరూ ఇలా సాయం చేయరు. ‘ఇట్‌ హ్యాపెన్స్‌ ఓన్లీ ఇన్‌ ఇండియా’ అంటూ ‘క్లిక్‌... క్లిక్‌’ ప్రచురించబడింది. అది చదివిన లలిత అనుమానంగా నన్ను చూస్తూ ‘‘నిజం చెప్పు, ఈ శీర్షికకు రోజూ ఫొటోలు పంపేది నువ్వే కదూ?’’ అంది.

నేను కళ్ళు చికిలించి నవ్వాను. శృతి కలిపింది లలిత. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని