పాఠం

‘‘ఏవిటోనే అమ్మడూ, నిన్ను కారడవికి అంపకం పెడుతున్నట్టుందిగానీ కాపురానికి పంపుతున్నట్టుగా అనిపించట్లేదు నాకు’’ నిట్టూరుస్తూ అంది వరమ్మ.

Published : 09 Apr 2020 14:50 IST

వలివేటి నాగచంద్రావతి

‘‘ఏవిటోనే అమ్మడూ, నిన్ను కారడవికి అంపకం పెడుతున్నట్టుందిగానీ కాపురానికి పంపుతున్నట్టుగా అనిపించట్లేదు నాకు’’ నిట్టూరుస్తూ అంది వరమ్మ.

‘‘అదేవిటే అమ్మా అలా అనేశావ్‌?’’ 

బిక్కమొహం పెట్టింది వసుధ.

‘‘మరింకెలా అనమంటావ్‌? అత్తగారు, ఆడపడుచు, మామగారు, మరిది..ఇంత పటాలమున్న ఇంటికి కొత్తకోడల్ని కాపురానికి పంపటమంటే తోడేళ్ళుండే అడవిలోకి నెట్టడమేగా...’’

‘‘అతనికి వాళ్ళంతా ఉన్నారని మనకి పెళ్ళికి ముందరే తెలుసునుకదే!’’ 

సందేహంగా అడిగింది వసుధ.

‘‘తెలవకపోవటమేం, తెలుసు. తెలీందల్లా దారినపోయే తద్దినమా మా ఇంటికి రమ్మనీ... అతగాడు పిలిచి మరీ వాళ్ళందర్నీ తలకెత్తుకుంటాడని. అతను ఇలాంటి పిచ్చిమాలోకమని తెలిసుంటే చస్తే నిన్ను ఇచ్చుండేదాన్నికాదు’’ రుసరుసలాడింది వరమ్మ.

అవును పాపం, ఆ మాట మాత్రం నిజం. కూతురికి ఎటువంటి వరుణ్ణి తేవాలీ అన్న అంశంమీద ఆవిడకు కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉండేవి.

అందగాడు, ఆర్జనపరుడు, అణకువ కలవాడు లాంటి ఉండాల్సిన లక్షణాలు సరే- అమ్మా చెల్లీ తమ్ముడూ లాంటి ఉండకూడని లంపటాలులేని వరుడి కోసం తెగ ప్రయత్నం చేసింది కూడా. ప్చ్, కుదిరింది కాదు.

ఎన్ని సంబంధాలు చూసినా ఏ ఒక్కదానికీ హండ్రెడ్‌ పర్సెంట్‌ క్వాలిటీ లేనేలేదు. చివరికి భానుమూర్తి- అదే వసుధకి చేసిన వరుడు- అతని విషయంలో రాజీపడాల్సొచ్చింది.

తన అల్లుడికుండాలని వరమ్మ కోరుకున్న అన్ని క్వాలిఫికేషన్లూ భానుమూర్తికున్నాయ్‌. ఒక్క అతని కుటుంబపు తలనొప్పి తప్ప.

‘సరేలే, ఆ తండ్రి ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్నాడు. సంసారమంతా అతనితోపాటే ఉంటుంది. నా కూతురికి ఆ సెగ తగలదులే’ అని మనసుకి నచ్చచెప్పుకుని ఆ సంబంధానికి ఒడబడింది వరమ్మ.

తీరాజేస్తే ఆ అల్లుడు ఏం చేశాడూ- కూతుర్నింకా కాపురానికి పంపనేలేదు. ఆవిడ అంచనాల్ని కాస్తా తలకిందులు చేసిపారేశాడు. తండ్రి రిటైరవగానే, ‘మీరిక నాతోపాటుండాల్సిందే’ అంటూ ఆ పరివారాన్నంతా తెచ్చి నెత్తిమీద పెట్టుకున్నాడు.

ఇది వరమ్మ ఊహించలేదు. సొంత ఊరుంది, సొంత ఇల్లుంది. అక్కడికే వెళ్ళి స్థిరపడతారనుకుంటే జరిగిందిదీ. 

వసుధని కాపురానికి పంపేందుకు ముహూర్తం నిర్ణయించిన దగ్గర్నించీ వరమ్మ మనసు మనసులోలేదు. ‘‘పిచ్చి సన్నాసి, వాళ్ళతో ఎలా వేగుతావో ఏమిటోనే’’ అంటూ తెగ ఫీలయిపోతూ చెమ్మగిల్లాయేమో అన్న అనుమానంతో తల్లి మాటిమాటికీ కళ్ళు ఒత్తుకుంటూంటే, వసుధ ‘‘ఏమిటమ్మా నువ్వు మరీనూ- వాళ్ళు మాత్రం మనుషులు కారూ... అయినా ఇంకా ఈ రోజుల్లో కోడరికం పెట్టేవాళ్ళెవరున్నారు చెప్పు? పోనీ వాళ్ళు మరీ చెడ్డవాళ్ళు అనుకున్నా, నేనూ అంత తెలివితక్కువదాన్నీ చెల్లాయిలా అమాయకురాల్నీ కాదుగా’’ అని నచ్చచెప్పబోయింది.

‘‘అందుకే నిన్ను వెర్రిమొహమా అన్నది. వాళ్ళు నిన్ను కొడతారూ తిడతారూ అని కాదు నా భయం’’.

‘‘మరి?’’

‘‘మీ ఆనందానికి అడ్డవుతారని’’.

‘‘ఆ..?’’

‘‘ఆ..! కూర్చో చెబుతా’’.

అక్కణ్ణించీ మొదలైంది బోధన.

‘‘చక్కగా చిలకా గోరింకల్లా మీరిద్దరే ఉంటే అది కొత్తకాపురంలా ముచ్చటగా ఉంటుందిగానీ, చుట్టూరా వాళ్ళందరూ గుమిగూడుంటే ఎలా ఉంటుంది. పబ్లిక్‌ పార్కులో డ్యూయెట్టు పాడుకునే సినిమా షూటింగులా ఉంటుంది. అవునా?’’

‘‘అవును’’ ఆ సీను ఊహించుకుంటూ దిగాలుగా తలూపింది వసుధ.

‘‘మీ ఆయన ఆఫీసునించొస్తూ రెండు మూరల పూలమాల తెచ్చాడనుకో- అమ్మకీ చెల్లికీ వాటాపోనూ నీకు మిగిలేదెంత- బెత్తెడు. సరదాగా ఏ సినిమాకో పోగ్రాం వేసుకున్నారనుకో- మేమూ వస్తామంటూ చెల్లీ తమ్ముడూ తయారు. ఎలా ఉంటుంది నీకు- తట్టుగాలి రేక్కురాదూ?’’

‘‘ఎందుకు రాదూ?’’

‘‘వస్తుంది కదూ! ఇవే కాదు, ఇంకా చిన్నచిన్న ముచ్చట్లు మీరిద్దరే జంటగా ఉన్నప్పుడు తీర్చుకునేవి బోలెడుంటాయ్‌. అవి నీకెలా తీరతాయ్‌. అవలా ఉంచు. ఏడాదికి లక్షలు లక్షలు సంపాయిస్తున్నాడా అల్లుడు... మీరిద్దరే అయితే ఎంత వెనకేసుకోవచ్చును. నాలుగేళ్ళు తిరిగేసరికి ఓ ప్లాటు కొనుక్కోవచ్చు, ఓ కారు కొనుక్కోవచ్చు. ఇంకాపోతే పుట్టేవాళ్ళ చదువులకీ సంధ్యలకీ ఏ ఇన్సూరెన్సో కట్టుకోవచ్చు. ఈ తైనాతీలందరూ చేరితే ఇక మిగిలేదేముంటుంది? ఆ చెల్లెలికి పెళ్ళంటారు, ఆపైన పండగలూ పురుళ్ళూ, ఆ తమ్ముడికి చదువూ ఉద్యోగం, ఈలోగా ఆ ముసలివాళ్ళకి రోగాలూ రొచ్చులు. ఇక మీ గురించి మీరు ఆలోచించుకుందామనుకునేసరికి మీ తలలు నెరిసిపోతాయ్, నడుములు వంగిపోతాయ్‌. ఇది ఖాయం’’.

‘‘అబ్బ, మరీ భయపెట్టేస్తున్నావే’’.

‘‘ఉన్న సంగతి చెప్పాను’’.

‘‘నన్నేం చెయ్యమంటావే, ఆయనకి వాళ్ళంటే ప్రాణం. వాళ్ళు మన దగ్గర ఉండటానికి వీల్లేదూ, పంపించెయ్యండని చెప్పడానికి నాకెన్ని గుండెలుండాలి?’’

‘‘పిచ్చిదానా, ఇలాంటివాళ్ళని నోటితో పొమ్మనగూడదు... పొగబెట్టాలి’’.

‘‘ఎలానే?’’

‘‘ఒసే అమ్మడూ, శతకోటి సమస్యలకి అనంతకోటి పరిష్కారాలన్నారు. ఆలోచించు’’.

‘‘ముందు మచ్చుకి ఒక్కటి చెప్పవే అమ్మా ప్లీజ్‌...’’

‘‘నాకుమాత్రం ఏం తెలుసే. నాకా అవసరం రాకుండా ముందే మా అత్తమామల్ని తన దగ్గరికి రప్పించుకుని మేల్జేశాడా దేవుడు. సర్లే, విన్నవేవో చెబుతాగానీ ముందు ఒక్కటి గుర్తుపెట్టుకో. అత్తారింటికి వెళ్ళగానే ప్రతి ఆడపిల్లా మొదట చెయ్యాల్సిన పని మొగుణ్ణి కొంగుకి కట్టేసుకోవటం. ‘నావాళ్ళందర్నీ వదిలేసి, కేవలం నీకోసం వచ్చినదాన్ని. నీకిక నా తరవాతే మిగతావాళ్ళు సుమీ’ అని ప్రతిక్షణం అతని బుర్రని బ్రెయిన్‌వాష్‌ చేస్తుండాలి. ఇది ముఖ్యం’’.

‘‘ఇది లెసన్‌ నంబర్‌ ఒన్నా అమ్మా..?’’ ఉత్సాహంగా అడిగింది వాణి.

వాణి- వరమ్మ రెండోకూతురు. కొంచెం అమాయకురాలు. పన్నెండేళ్ళున్నా వయసుకు తగ్గట్టుగా బుద్ధి వికసించని పిల్ల. ఒకసారి ఆరిందలాగా ఒక్కోసారి కొంచెం తెలివి తక్కువగా మాట్లాడుతుంటుంది.

‘‘ఆసి భడవా, నువ్విక్కడేం చేస్తున్నావ్‌? వెళ్ళిక్కడనించి’’ ఉరిమింది వరమ్మ.

‘‘విననీవే అమ్మా. నీకు రెండోసారి చెప్పే శ్రమ తగ్గిస్తోందిలేగానీ నువ్వు చెప్పు’’ చెల్లెల్ని మురిపెంగా దగ్గరకు తీసుకుంటూ అన్నది వసుధ.

‘‘ఒకళ్ళు చెప్పేదేమిటే, సొంత తెలివితేటలుండాలిగానీ- ఈ ఇంట్లో పుట్టిన ఆడపిల్లే మీ అత్త దమయంతి. ఎంత గడుసుదో తెలుసా? 

కాపురానికి వెళ్ళిన మూడునెలల్లో అత్తమామల్ని గడప దాటించేసింది. ఇల్లు సొంతం చేసుకుంది. ఆఁ...’’

‘‘ఏం చేసిందటా..?’’

‘‘ఏం చేసిందా...’’

నాలుగురోజుల్లో కాపురానికి వెళ్ళబోయే కూతురికి, ఆ నాలుగురోజులూ తన ఆడబడుచు లీలలు వర్ణిస్తూనే ఉంది వరమ్మ- ఒక్కొక్క పనీ చేసుకుంటూనే. ‘‘అమ్మాయ్, ఏ పనైనా రాణింపుకు రావాలంటే చాతుర్యం ఉండాలి. ఈ విషయంలో మీ అత్త చాలా ఘటికురాలు. బట్టలు ఆరేస్తానని చెప్పి అత్తగారి చీరలుమటుకు మేకులకి కొర్రుపట్టించి, చింపి పారేసేదట. ఆ పని చేయటంలో గొప్పదనంలేదు. చిరిగిన ఒక్కొక్క చీర పట్టుకొచ్చి, ‘పొరపాటయిపోయిందత్తా’ అని కళ్ళనీళ్ళు పెట్టుకునేదట. నాలుగురోజులకొకసారి ఇదే తంతు. కావాలనే చేస్తోందని తెలిసిపోతున్నా ఏడుస్తోన్న పిల్లని ఏమనగలరు? అదీ చమత్కారం...’’ తడిబట్టలు దులిపి దండేన ఆరేస్తూ చెప్పిన మొదటి ఉపాయానికి సూచన ఇది.

‘‘ఇబ్బందులకి గురిచెయ్యాలని గట్టిగా సంకల్పించాలేగానీ తెలివిగలవాళ్ళకి దారులు కొదవా. దమయంతి మామగారు ఆరోగ్యం బాగాలేక చేసేచేసే చిన్న వ్యాపారంకాస్తా కట్టిపెట్టి ఇంట్లోనే ఉండేవాడట. వేరే పనేంలేదు, ఇరవైనాలుగ్గంటలూ పేపరొకటి పట్టుక్కూర్చునేవాడట. అలాటి వ్యాపకం లేనివాళ్ళకి పేపరొక కాలక్షేపం- కాదు వ్యసనం. అది లేకపోతే పిచ్చెత్తినట్టు ఉంటుంది. ఒక మనిషి బలహీనత తెలిశాక ఆడుకోవడం తేలిక.

మీ అత్త ఆ ఇంటికి వెళ్ళటమేమిటి, ఆయనకి తిప్పలు మొదలయ్యాయి. పేపరు ఉంటే కళ్ళజోడు కనబడేదికాదట... కళ్ళజోడు కనబడితే పేపరు మాయమయ్యేదట. లేదా పక్కింటివాళ్ళు పట్టుకెళ్ళి ఎంతకీ ఇవ్వరు. ఇచ్చినా ‘వాళ్ళ పాప చింపేసిందట మామయ్యా, ఏమనుకోవద్దన్నారు’ అని పేపరుముక్కలు ముందుపెట్టి ముక్తాయింపు.

తనతోపాటే పేపరుకోసం, కళ్ళజోడు కోసం తెగ వెతికేస్తూ ఆపసోపాలుపడే కోడల్నీ, చిరిగిపోయిన పేపర్ని పట్టుకుని, తనకంటే ఎక్కువగా విచారిస్తోన్న కోడల్ని పట్టుకుని ‘నువ్వు వచ్చాకే ఇలా అవుతోం’దని ఎలా 

అనగలడా పెద్దమనిషి. ప్రాణం విసిగి పేపరు కోసం ఎదురుచూడ్డం మానేసి, గుళ్లోకి వెళ్ళి కూర్చోవడం మొదలుపెట్టాడటాయన. లక్ష్యం చేరే ప్రయత్నంలో ఇది రెండో మెట్టెక్కడమేగా’’ సాయంత్రం టిఫినుకి పకోడీలు వేస్తూ ప్రవచించిన రెండో ఉపాయమిది.

‘‘పొద్దుటిపూట అత్తగారు కాఫీ కలిపేవేళకు ‘నే చేస్తా అత్తయ్యా’ అంటూ తయారయిపోయి, వాళ్ళిద్దరికీ మాత్రం నీళ్ళగా కాఫీ కలిపి పోయటం... మొగుడటు ఆఫీసుకు వెళ్ళగానే మరే పనీ ముట్టుకోకుండా మంచమెక్కేయటం... అత్తగారు దేవుడి ముందర కూర్చుని, ఏ లలితా సహస్రమో చదువుకుంటూంటే టీవీనో స్టీరియోనో పెద్ద వాల్యూంతో ఇల్లెగరగొట్టెయ్యటం, ఇవన్నీ చిట్టీపొట్టీ మొట్టికాయల్లాంటివి. సిసలైన దుడ్డుకర్ర దెబ్బ లాంటి ప్రయోగం ఇంకొకటి చేసిందట మీ అత్త’’.

కూతుళ్ళిద్దరూ ఆసక్తిగా నోళ్ళు తెరిచి వింటూండగా చిద్విలాసంగా చిరునవ్వొకటి విసిరి తిరిగి కొనసాగించింది వరమ్మ.

‘‘అబ్బే అదేం గొప్ప ఎత్తేంకాదు. చిన్న యుక్తి. కానీ పవర్‌ఫుల్‌ అంతే, ఏంలేదు.. సరసాలాడ్తూ కబుర్లు చెబుతూ ఆఫీసుకువెళ్ళే మొగుడికి దగ్గర కూర్చుని వడ్డించేసి, ఆ చేత్తోనే తనూ తినేసి, ఆమైన మిగిలిన కూరలోనూ పులుసులోనూ రెండు చెంచాల ఉప్పు, రెండు చెంచాల కారం కలిపేసి, ఏమీ ఎరగనట్టు లేచి వెళ్ళిపోవటం. అంతే’’.

‘‘ఆ తరవాత?’’

‘‘ఆ తరవాతేముందీ, ఆ మామగారు ఓసారి గుండె నొప్పొచ్చిన మనిషి. అత్తగారికీ హై బ్లడ్‌ప్రెషరు. నెల తిరక్కుండా రెండో కొడుకింటికి మకామెత్తేశారట. మీ అత్త అదృష్టమేమిటంటే వాళ్ళు వాదన పెట్టుకునే బాపతు కాకపోవటం’’.

‘‘ఒసే వసూ, ఇంకొక్కమాట. మనం చేస్తున్న పనులు కావాలనే చేస్తున్నామన్న సంగతి తెలియాల్సిన వాళ్ళకి మినహా మిగతావాళ్ళకి వాసనన్నా రాకూడదు. తెలిసిందా..? ఇక నువ్వెలా రాణించగలవో ఆలోచించుకో’’.

తరిగిన కూర చిల్లుల గిన్నెలో వేసి కత్తిపీట దగ్గర్నించి లేచింది వరమ్మ.

‘‘అమ్మా, సిలబస్‌ మొత్తం అయిపోయింది కదూ’’ బెరుకుబెరుకుగా అక్క వెనక్కి జరుగుతూ అడిగింది వాణి.

‘‘నిన్నూ...’’ చెయ్యెత్తబోయింది వరమ్మ.

తుర్రుమన్నది వాణి.

కూతురి సౌఖ్యంకోసమంటూ ఏవేవో దిక్కుమాలిన వ్యూహాలూ పథకాలూ పన్నే ఈ ధోరణి సరిగ్గా వ్యతిరేక దిశలోకి మళ్ళేదెప్పుడంటే... కాలం గడవాలి... రోజులు మారాలి.

* * *
కాలం గడిచింది... రోజులు మారాయి..

ఈరోజు వరమ్మ మనస్సు కుమ్మరి ఆవంలా పైకి కనిపించకుండా కుములుతూ ఉంది. అవును- రాత్రి కొడుకు బాబ్జీ మెత్తగా ఝుళిపించిన కొరడాదెబ్బ అలాంటిది మరి.

‘‘అమ్మా, బిందూ నేనూ ఇవాళ రిజిస్టరాఫీసులో మ్యారేజ్‌ చేసుకున్నాం. ముందు చెబితే నువ్వొప్పుకోవు. అందుకే అలా చేయాల్సొచ్చింది. నన్ను క్షమించమ్మా’’ అని చల్లగా చెప్పేసి, ప్లేట్లో చెయ్యి కడిగేసి మెల్లగా 

వెళ్ళిపోతుంటే తల తిరిగిపోయిందావిడకి.

‘ఔరా, నోట్లో వేలుపెడితే కొరకటం తెలియనట్టుండేవాడు, ఉన్నట్టుండి ఎంతపని చేశాడు..?’

బిందూని మొదటిసారి ఇంటికి తీసుకువచ్చినప్పుడే అనుమానించింది. ‘అమ్మా, తను బిందు. నాలాగే తనూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరే. నిన్ను చూస్తానంటే తీసుకొచ్చాను’ అని చెబుతున్నప్పుడు- కవిత్వ ధోరణిలో చెప్పాలంటే- బాబ్జీ కళ్ళలో విద్యుల్లతల వెలుగులు. ఆ బిందు మొహంలో ఇంద్రధనుస్సు మెరుపులు.

అప్పుడే అర్థమైంది... వాళ్ళిద్దరిమధ్యనా సహోద్యోగుల సంబంధమే కాదు మరింకేదో అనుబంధమున్నదని. ఆ తరవాత బాబ్జీతో నిక్కచ్చిగా చెప్పేసింది- తన తమ్ముడి కూతురు కమలే ఈ ఇంటికోడలని.

కమల అణకువగల పిల్ల. డిగ్రీలు లేవుకానీ ఇంటిపనీ అదీ చక్కగా చేస్తుంది. తనకు అనుగుణంగా నడుచుకుంటుంది అని, ఎప్పుడో తన కోడలిగా నిర్ణయించేసింది.

తనీమాట చెప్పినప్పుడు బాబ్జీ మొహం చిన్నబుచ్చుకున్నాడు తప్ప మారుమాటాడలేదు. వాడే సమాధానపడతాడులెమ్మనుకున్నదిగానీ నాలిముచ్చులా ఇంతపని చేస్తాడనుకోలేదు.

ప్రాణప్రదంగానే కాదు ఎంతో కట్టుదిట్టంగా కూడా పెంచింది బాబ్జీని. వాడు కూడా తన కనుసన్నలు దాటిపోకుండా తన నోటిమాట మారిపోకుండా ఎంతో బుద్ధిమంతనంగానే ఉన్నాడు ఇన్నాళ్ళూ.

ఇంజినీరయి అయిదంకెల జీతం తెస్తున్నా, ఇప్పటికీ తను ఎంచి తెచ్చిన బట్టలే వేసుకుంటాడు. ఫస్టు తారీఖునాడు జీతం పెట్టుకొచ్చిన కవర్ని కవరుగానే తన చేతికందించేస్తాడు. ఏ విషయంగానైనా సరే, తన మాటే వేదం వాడికి.

బాబ్జీ ఎప్పటికీ ఇలాగే తన కొంగుచాటు బిడ్డడిగా ఉండాలని కోరుకున్నది. ఇలాగే తనతోడిదే లోకంగా ఉంటాడని ఆశపడ్డది. తన మాటని కాదని సొంత నిర్ణయం తీసుకోగలడని కల్లో కూడా అనుకోలేదు.

ఉన్నట్టుండి బాబ్జీ ఇలా మారటానిక్కారణమేమిటి? తన చేతిపట్టు సడలిందా? ‘ప్రతిదానికీ ఈవిడ పెత్తనమేమి’టని అనిపించిందా వాడికి?

రాత్రంతా ఇదే మథన వరమ్మకి. నిద్రపోలేదు. తెల్లారి లేచేసరికి నీరసం, తలనొప్పి.. ఇది చాలదన్నట్టు ఆఫీసుకు వెళ్తూవెళ్తూ ఇంకో పిడుగు నెత్తినేసి వెశ్ళాడు బాబ్జీ.

‘అమ్మా, ఈరోజు మంచిదట. బిందూని వాళ్ళ అమ్మగారూ నాన్నగారూ ఇక్కడ దిగబెట్టి వెశ్తారు. వాళ్ళు రాగానే నాకు ఫోను చెయ్యి’ అని.

ఇంకేం రెట్టింపయింది తలనొప్పి. ఇక నీరసమయితే వెంటనే ముసుగుతన్ని పడుకోమంటున్నది. మనసు మాత్రం అల్లకల్లోలంగా ఎడతెరపిలేని ఆలోచనలతో విశ్రాంతి లేకుండా ఉంది.

ఈరోజుదాకా ఈ ఇంట్లో ఏకఛత్రాధిపత్యం తనది. కమలగానీ వచ్చుంటే ఆ ఆధిపత్యం అట్లాగే కొనసాగేది. ఇప్పుడు వచ్చేది బిందు. రేపిక్కడ తన స్థానమెక్కడ?

అసలే ఆ బిందు మహా అందగత్తె. పెద్ద చదువు చదువుకుంది. మొగుడితో సమానంగా ఉద్యోగం చేస్తోంది. సంపాయిస్తోంది. ఇన్ని అదనపు అర్హతలున్నవయ్యె, ఆ గీర్వాణం ఎక్కడకుపోతుందీ. పొగరు చూపించి 

తలెగరేస్తుందేమో. ఉహుఁ... అస్సలు ఊరుకోకూడదు. పోనీలెమ్మని ఊరుకున్నామా, రేపు ఆ అలుసు చూసుకుని బెడ్‌కాఫీ అందించమనొచ్చు. క్యారేజీలు అమర్చమనొచ్చు. ఇంటి కాపలాదారులా వంటమనిషిలా పనిమనిషిలా మార్చెయ్యొచ్చు.

అమ్మో అది భరించగలదా... ఉహు, ఆ లోకువ ఆ పిల్లకి ఇవ్వనేకూడదు. ‘అమ్మాయ్, నీకెన్ని కొమ్ములున్నా ఈ ఇంటికి ముందొచ్చినదాన్ని నేను. యజమానురాలనయింది నేను. చెర్నాకోల ఇంకా నా చేతిలోనే ఉంది. 

నా తరవాతే నువ్వు సుమా, జాగ్రత్త!’ అని తలకెక్కేలా గట్టిగా చెప్పాలి.

పెశ్ళానికి వ్యతిరేకంగా ఏమన్నా అంటే బాబ్జీకి నచ్చుతుందా? వలచి వరించి తెచ్చుకున్న ముద్దుల ప్రియురాలాయె. 

ఇదేమిటమ్మా అంటూ వెనకేసుకురాడూ.

కాదులే... బాబ్జీ అటువంటివాడు కాదు. తనంటే ఎంతో ప్రేమ, అభిమానం, గౌరవం. తనకిమాత్రం వాడంటే పంచప్రాణాలు కాదూ. ఆడపిల్లలకంటే మగపిల్లవాడు ఉద్ధరిస్తాడని వాణ్ణెంత అపురూపంగా పెంచిందనీ- వాడు పెద్ద చదువులు చదవాలనీ పెద్ద ఉద్యోగస్తుడవ్వాలనీ ఎంత తపించిందీ... అందుకే గదా ఆయన తన్నొదిలి పైలోకాలకి వెళ్ళిపోయినా వెనకడుగేయకుండా ఉన్నదంతా ఊడ్చి, నగల దగ్గర్నించి అమ్మిపారేసి వాణ్ణి చదివించిందీ... వాడికి క్యాంపస్‌ సెలక్షనొస్తే శ్రమ ఫలించినందుకు ఎంత సంబరపడిందీ... ఇవన్నీ వాడెరగనివా? ఇన్ని కష్టనష్టాలకోర్చి పెంచి ఇంత వాణ్ణి చేసినవాళ్ళకంటే, ఇవాళ వచ్చిన పెశ్ళామే ముఖ్యమని తనను లోకువ చేస్తాడా?

ఏమో, ఏం చెప్పగలం? తనని అడక్కుండా అడుగు కదపనివాడు, అటు ఏడుతరాలూ ఇటు ఏడుతరాలూ చూసి మరీ ఇంటికి తీసుకురావాల్సిన కోడల్ని చెప్పాచేయకుండా నీ లెక్కేమిటన్నట్టు ఇంటికి తీసుకువస్తున్నాడు. వాణ్ణెలా నమ్మగలం? తల్లిని మన్నించటం మానేసి, పెశ్ళానికి విధేయుడవడని ఎలా చెప్పగలం?

మొగుడి వత్తాసు చూసుకుని ఆ నెరజాణ ‘నా ఆజ్ఞకి లోబడి ఉంటే సరే, లేకపోతే మీదారి మీది’ అంటుందేమో!

దేవుడా, అలాటి సందర్భమే వస్తే తనకేది దారి? ఇంత బతుకు బతికి ఇంటివెనకాల చచ్చినట్టు- కోడలికి లోబడి బతకటమేనా..? లేకపోతే ఈ వయసులో ఏ ఆధారం లేకుండా ఎక్కడికిపోతుంది? తను దూరే సందులేకే ఏడుస్తూంటే తన మెడని పట్టుకు వేలాడుతూ ఈ వెర్రిబాగులపిల్ల ఒకటి. వీళ్ళు కాదంటే దీన్ని దరి చేర్చేవారెవరు?

కాస్త సహనంగానే ఉండాలి తప్పదు. అలాని మొదట్లోనే ఈ భయాన్ని బయటపెడితే ఇప్పట్నించే చులకన అయిపోవచ్చు. మేకపోతు గాంభీర్యమే అయినా బింకంగా ఉన్నట్టే ఉందాం. ‘నేను ఔనంటేనే ఈ ఇంట్లో నీకు మనుగడ’ అన్నట్టు బెదిరింపుగానే మాట్లాడదాం. చూద్దాం... ఏం జరుగుతుందో. భగవంతుడా నీట ముంచుతావో పాల ముంచుతావో.. ‘‘అమ్మా, వదినా వాళ్ళు వచ్చేశారు’’ 

అరుస్తూ పరుగెత్తుకొచ్చింది వాణి. నిటారుగా అయింది వరమ్మ.

‘‘మీ అనుమతి తీసుకోకుండా పిల్లలు తొందరపడ్డారు. వాళ్ళది తప్పే. పెద్ద మనసుతో వాళ్ళని మీరు మన్నించాలి, దీవించాలి’’.

వచ్చినవాళ్ళని లాంఛనంగా ఆహ్వానించి ముభావంగా కూర్చున్న వరమ్మని కదిలించి అర్థింపుగా అన్నది బిందు తల్లి భ్రమరాంబ- ‘‘మీరు మీ మేనకోడల్ని కోడల్ని చేసుకుందామనుకున్నారట. మీ ఇంటి వాతావరణం, 

మీ మనస్సూ పద్ధతులూ అలవాట్లూ తెలిసిన అయినవాళ్ళ పిల్లని తెచ్చుకోవాలనుకోవటం సమంజసమే. కానీ పిల్లల అభిమతాన్ని కూడా కాదనకూడదు కదా’’.

బిగుసుకు కూర్చున్న వరమ్మ పలకలేదు.

‘‘నా కూతురని కాదు, బిందు కూడా మంచిపిల్ల. దాని చదువు దానికి నలుగురినీ కలుపుకుపోవటం నేర్పింది. బిందు మీతో సులువుగా కలిసిపోతుంది. పెద్దల విలువేమిటో, వారి గౌరవానికి భంగం రాకుండా ఎంత భద్రంగా చూసుకోవాలో చిన్నప్పటినించే చెప్పేదాన్ని నేను. బిందు మిమ్మల్ని గౌరవిస్తుంది, అభిమానిస్తుంది. మీ మనసు తెలుసుకుని మసలుకుంటుంది. మీ ఇష్టానుసారమే ప్రవర్తిస్తుంది’’ హామీ ఇస్తున్నట్లుగా చెప్పిందావిడ.

బిందు వరమ్మగారి దగ్గరగా వచ్చి కూర్చుంది. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంది. ‘‘అమ్మా, ఇకనుండీ మీరు బాబ్జీకి మాత్రమే అమ్మ కాదు, నాకు కూడా అమ్మే. మిమ్మల్ని అమ్మా అనే పిలుస్తాను. మీరు కూడా నన్ను వేరేగా చూడకండి. మూడో కూతుర్ననుకోండి. మీరు మోస్తున్న బరువుని సగం పంచుకోవడానికొచ్చిన ఆత్మీయురాలిననుకోండి. మీ వేలు నిర్దేశించినవైపే నేనెప్పుడూ నడుస్తాను. సందేహించకండి. నన్ను నమ్మండి. వాణిని గురించి కూడా మీకు బెంగవద్దు. నేను తనని తీర్చిదిద్దుతాను. తనకి మంచి భవిష్యత్తు కల్పించడంలో మీకు తోడుంటాను’’.

బిందు స్వరంలో సౌమ్యత ఉట్టిపడటమేకాక ఒక భరోసా, ఒక సాంత్వన కూడా వినిపించి ఊరటపడింది వరమ్మ. ఆవిడ బెట్టు సడలుతూ సడలుతూ ఉంది. బిందు చేతిలో ఉన్న తన చేతిని మృదువుగా విడిపించుకుని బిందు చేతిని తన చేతిలో ఉంచుకుని మెల్లగా వత్తింది.

బిందు తేలిగ్గా ఊపిరిపీల్చుకుంటూ నవ్వింది.

‘‘అమ్మా మీరు వంట చేసేసి ఉంటారు. నేను స్వీటు మాత్రం చేస్తాను మన అందరికీ’’.

బాబ్జీ వచ్చాడు. ఇంటి వాతావరణంలో పొద్దుటి తీక్షణత లేదు. చల్లబడింది. 

ఆహ్లాదంగా కూడా ఉంది.

అరగంట తరవాత అందరూ భోజనానికి కూర్చున్నారు. మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ కొబ్బరి మామిడికాయ పచ్చడి రంజుగా ఉన్నదంటూ... సాంబారు పసందుగా కుదిరిందంటూ... వరమ్మగారి చేతివంటని మెచ్చుకుంటూ... బిందు చేసిన పాయసంలో మటుకు సగ్గుబియ్యంకంటే పంచదారే ఎక్కువగా ఉన్నదంటూ... రుచులెంచుకుంటూ నవ్వుకుంటూ తింటూండగా, హఠాత్తుగా వాణి ‘‘అమ్మా, వదినా వాళ్ళమ్మగారు మంచి టీచర్‌ కాదు’’ అంది.

ఒక్కసారి అందరూ తలెత్తిచూశారు- ఆ అమాయకపుపిల్ల వంక.

‘‘పులుసులో ఉప్పెక్కువెయ్యమని చెప్పాలిగానీ పాయసంలో పంచదారెక్కువెయ్యమని చెప్పొచ్చా?’’

ఒక్కసారిగా వరమ్మకి పొలమారింది. కళ్ళల్లోకి నీళ్లొచ్చాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు