సారీ.. సారీ.. లిటిల్‌ స్టార్‌!

మొబైల్‌మీంచి అప్పుడే తనకేసి చూపులు తిప్పుతూ ‘‘ఆవిడే... సుజిత మదర్‌... ఫోన్‌ మీద ఫోన్‌ చేస్తోంది. పెద్ద మొత్తంలో బాకీ చేశావా ఏంటి?’’ అన్నాడు వినోద్‌ నవ్వుతూ.

Updated : 09 Apr 2020 15:32 IST

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

టేబుల్‌మీది మొబైల్‌ మరోసారి రింగయ్యింది.

వంటింట్లో పనిమీదున్న సౌదామిని ఒక్కక్షణం కళ్ళెత్తి హాల్లోకి చూసింది.

మొబైల్‌మీంచి అప్పుడే తనకేసి చూపులు తిప్పుతూ ‘‘ఆవిడే... సుజిత మదర్‌... ఫోన్‌ మీద ఫోన్‌ చేస్తోంది. పెద్ద మొత్తంలో బాకీ చేశావా ఏంటి?’’ అన్నాడు వినోద్‌ నవ్వుతూ.

అతనికేసి గుర్రుగా చూసి విసవిసా వెళ్ళి ఫోన్‌ కట్‌ చేసింది.

నవ్వుకుంటూ టవల్‌ భుజానేసుకుని స్నానానికి వెశ్ళాడు వినోద్‌.

మొబైల్‌ స్విచాఫ్‌ చేద్దామనేంత చిరాకేసింది సౌదామినికి.

ఒక్క సుజిత తల్లేకాదు, ఇలాంటి ఎందరో తల్లులు తన ప్రాణం తోడేస్తున్నారు.

టౌన్‌ మొత్తానికి నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్న ఇంగ్లిషు మీడియం స్కూల్‌కి హెడ్‌ మిస్ట్రెస్‌గా తానీ పరిస్థితి ఎదుర్కోక తప్పటంలేదు. లోలోపల ఎంత అసహనమున్నా పైకి చిరునవ్వులు చిందించాల్సిందే. మనసులోని భావాలేవీ మాటల్ని స్పర్శించకుండా అనుక్షణం జాగ్రత్తపడటమనేది కత్తిమీద సాములాంటిదే.

స్కూల్‌డే దగ్గరపడుతోన్నకొద్దీ పేరెంట్స్‌ నుంచి రకరకాల ఒత్తిళ్ళు. ప్రతిఒక్కరూ తమ పిల్లలు స్టేజీమీద కనబడాలని కోరుకుంటారు. అందుకే ఎక్కువగా గ్రూపు డాన్సులు ఉండేలా జాగ్రత్త తీసుకొని, ఒక్కో గ్రూపులో ఇరవైమంది పిల్లలకు తక్కువ కాకుండా చూసినా కష్టంగానే ఉంది.

అన్నిటికంటే తలనొప్పి వ్యవహారం- క్లాసుకో బెస్ట్‌ స్టూడెంట్‌ను ఎంపికచేయటం. వాళ్ళు స్టార్‌ ఆఫ్‌ ద చిల్డ్రన్‌గా స్టేజీమీద ఓ వెలుగు వెలుగుతారు కాబట్టి పేరెంట్స్‌ ఒత్తిళ్ళ మధ్య ఎంపిక సమస్యాత్మకంగానే ఉంది.

దాదాపు అన్ని క్లాసుల్నుంచీ స్టార్లను ఎంపికచేసినట్లే- ఒక్క థర్డ్‌క్లాసు తప్ప. సుజిత, ప్రశాంతి అనే అమ్మాయిల మధ్య ముడిపడి ఎంపిక ఆగిపోయింది. చదువులో ఇద్దరూ అటూఇటుగా పోటీపడుతూ వస్తున్నారు. పరిశుభ్రతలో కూడా అంతే. సుజిత ప్లస్‌పాయింట్‌ ఏమిటంటే- ఒక్కరోజు కూడా మానకుండా బడికి హాజరుకావటం. జ్వరంతో వణుకుతూ కూడా ఆ పిల్ల క్లాసులకు అటెండ్‌ అయ్యింది. అటు ప్రశాంతికి వారంరోజులదాకా ఆబ్సెంట్లున్నాయిగానీ, సుజితలో లేని ప్రత్యేకత ఒకటి ఈ పిల్లలో ఉంది. సహ విద్యార్థులతో, టీచర్లతో హాయిగా కలిసిపోతుంది. వీళ్ళిద్దరిలో ఎవర్ని స్టార్‌గా ఎంపికచేయాలో అర్థంకాకుండా ఉంది. 

సాయంత్రానికల్లా ఓ నిర్ణయానికి వచ్చి పేరెంట్స్‌కి తెలపాలి. ఎల్లుండి స్టేజీమీద స్టార్‌లా వెలిగిపోవాలంటే కొత్త బట్టలూ వగైరాల్ని సిద్ధం చేసుకోవాలిగదా!

తమ డోలాయమానస్థితి ఇద్దరి పేరెంట్స్‌కీ తెలిసింది కాబోలు... తనమీద ఒత్తిడి తెస్తున్నారు.

సుజిత తల్లి అయితే మరీ ఇబ్బంది పెడుతోంది. వంట కార్యక్రమం ఓ కొలిక్కిరావటంతో మొబైల్‌ చేతిలోకి తీసుకొని బెడ్‌రూమ్‌లోకి వెళ్ళింది సౌదామిని.

అటాచ్డ్‌ బాత్‌రూం తలుపు తెరచుకుని బయటికొస్తోన్న వినోద్‌ వైపు చూడకుండానే స్విచ్‌బోర్డు దగ్గరున్న చార్జర్‌కేసి చేయి చాచింది.

అప్పుడే ఫోన్‌ రింగయ్యింది.

అరచేతివైపు చూడాల్సిన ఆమె చూపు అప్రయత్నంగానే అతని ముఖంవైపు మళ్ళగానే- అల్లరిగా నవ్వుతూ నొసలు ఎగరేసి ‘‘ఆవిడేనా?’’ అన్నాడు.

‘‘నీకు నవ్వులాటగా ఉంది’’ గొంతు బిగించి ఉక్రోషంగా అంది. ‘‘ఏదైనా సలహా ఇవ్వొచ్చుగదా, మనిషిని ఉడికించకుంటే’’.

చిన్నగా నవ్వాడు అతడు. ‘‘నాకు తెలిసి ఆ పిల్ల చదువులో స్టారవుతుందో లేదోగానీ... మంచి గృహిణి అవుతుంది’’ చెప్పాడు. 

‘‘అందుకైనా సుజిని స్టార్‌ని చేయాలి’’.

‘అదేంటి?’ అన్నట్లుగా మొహం ఓ వైపుకు వంచి బుగ్గన వేలుంచుకుంది.

‘‘జ్వరం వచ్చినా సెలవు పెట్టకుండా బడికి రాగలిగిందంటే- రేపు గృహిణిగా కూడా ఎన్ని ఇబ్బందులెదురైనా వంటగదికి సెలవుపెట్టదు గదా!’’

‘‘అంటే, మేమంతా వంటగదికి సెలవు పెడుతున్నట్లు..?’’

‘‘కాదా మరి!’’ కొంటెగా అన్నాడు.

‘‘అంటే, నాకు హెల్త్‌ బాగాలేనపుడంతా మీరు పస్తులే ఉంటున్నారా?’’

‘‘పచ్చడి మెతుకుల అన్నం పస్తులుగాక మరేమిటో?’’

అతడి కళ్ళల్లోకి లోతుగా చూసింది సౌదామిని. సెల్‌కు చార్జింగ్‌ పెట్టి హాల్లోకి నడిచింది.

అప్పటికే జరిగిన ప్రమాదం అర్థమైంది వినోద్‌కు.

‘‘సారీ సౌదా, ఏదో ఫన్నీగా...’’

‘‘అదేంకాదులే...’’ చెప్పింది. ‘‘అందరు 

మగాళ్ళలాగే నువ్వూ ఆలోచించావు. అందుకే 

ఆ చంటిపిల్ల ప్రవర్తనలో కూడా నీకు భవిష్యత్‌ గృహిణి లక్షణాలే కన్పించాయి’’.

‘‘అదికాదు సౌదా... అంత లోతుగా ఆలోచిస్తే ఎట్లా?’’ సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తూ ఆమె వెంట వంటగదిలోకి నడిచాడు. బడికి బయలుదేరి, బైక్‌మీద కూర్చున్న తర్వాత కూడా ఏదో వివరణ ఇస్తూనే ఉన్నాడు.

స్కూల్లో అడుగుపెట్టగానే ఇంటి విషయాలన్నీ మరచిపోయింది సౌదామిని.

పేరెంట్స్‌ వస్తున్నారు. స్కూల్‌డే సెలబ్రేషన్స్‌లో తమ పిల్లల పాత్ర గురించి చర్చిస్తున్నారు. బెస్ట్‌ స్టూడెంట్‌ అవార్డు రేసులో వెనకబడిన పిల్లల పేరెంట్స్‌ కొందరు కాస్త ఇబ్బందిపెట్టి కూడా వెశ్ళారు.

పెదాలమీది చిరునవ్వు చెదరకుండా ఉండేందుకు చాలా శక్తి ఖర్చు చేయాల్సివచ్చింది ఆమెకు.

సుజిత తల్లి మళ్ళీమళ్ళీ రింగ్‌ చేస్తోంటే, ఓసారి ఫోనెత్తి చెప్పింది- ‘సాయంత్రానికి ఏ విషయం పాపచేత చెప్పి పంపగల’మని. క్లాసులు జరగటం లేదు. రిహార్సల్స్‌ ఓవైపూ ఆటల పోటీలు మరోవైపూ స్కూలంతా 

కోలాహలంగా ఉంది.

లంచ్‌టైంలో తన క్లాస్‌మేట్, ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుగ్రహీత సుధాకర్‌ ఫోన్‌ చేశాడు. కుశలప్రశ్నల తర్వాత అడిగాడు- ‘‘స్కూల్‌డేకి నన్ను చీఫ్‌గెస్ట్‌గా పిలవకూడదా’’ అని.

‘‘నాదేముంది సుధా! మేనేజ్‌మెంట్‌కి కొన్ని కమిట్‌మెంట్స్‌ ఉంటాయి. చూస్తుంటావు గదా - ప్రతి ఫంక్షన్‌కీ ఎవరో ఒక రాజకీయ నాయకుణ్ణే పిల్చుకొంటుంటారు వీళ్ళు’’ చెప్పింది.

‘‘వాళ్ళ ఖర్మ’’ సుధాకర్‌ అన్నాడు.

అతను తనకు క్లాస్‌మేట్‌ మాత్రమే కాకుండా తన బాల్యమిత్రురాలు తరంగిణికి భర్త కూడా కావటంతో చనువెక్కువ. అతని ప్రత్యేకత ఏమిటంటే- గత నాలుగేళ్ళుగా ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా పాఠశాలకు వెళ్ళటం. ఆ కారణంగానే ఎన్నో అవార్డులు అందుకొన్నాడు. మరెందరు ప్రముఖులచేతనో ప్రశంసలు పొందాడు. జిల్లా దాటి, రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా కూడా అవార్డు అందుకొన్నాడు. ప్రస్తుతం నేషనల్‌కు ప్రయత్నిస్తున్నాడు.

సుజిత, ప్రశాంతిల మధ్య నలిగే స్టార్‌ గొడవ గురించి చెప్పి, అతని సలహా అడిగింది ఆమె. వెంటనే స్పందించాడు సుధాకర్‌.

‘‘సుజితకే అవార్డు ఇచ్చేయి సౌదా! పదిమందికీ మార్గదర్శకంగా ఉంటుంది. భవిష్యత్తులో టీచర్‌ అయితే నాలాగే సెలవుపెట్టకుండా విధుల్ని నిర్వర్తిస్తుంది. నా రికార్డులను కూడా బద్దలుకొడుతుంది’’ ఒకింత ఆవేశంగా విన్పించింది అతని కంఠం.

వినోద్‌ గుర్తొచ్చాడు సౌదామినికి. సుజితలో అతనికి భవిష్యత్‌ ఆదర్శ గృహిణి కనిపించింది. సుధాకర్‌కేమో ఆదర్శ ఉపాధ్యాయురాలు దర్శనమిచ్చింది.

వినోద్‌ మాటల్నిబట్టి చూస్తే సుజితను ఎంపికచేయకపోవటమే ఉత్తమంగా తోస్తోంది. కానీ సుధాకర్‌ సూచన ఆలోచింపజేస్తోంది.

తరంగిణితో ఈ విషయం చర్చించాలనిపించింది.

రింగ్‌ చేయగానే ఫోనెత్తింది తరంగిణి ‘‘ఏమే మెరుపూ?’’ అంటూ.

‘‘నీ హబ్బీ ఫోన్‌ చేశాడు’’ చెప్పింది 

సౌదామిని. ‘‘తనను చీఫ్‌గెస్ట్‌గా పిలవాలంట’’ అంటూ స్కూల్‌డే గురించీ బెస్ట్‌ స్టూడెంట్‌ సమస్య గురించీ సుధాకర్‌ సూచించిన సొల్యూషన్‌ గురించీ వివరించింది.

ఒక నిమిషం నిశ్శబ్దం తర్వాత, ఒక నిట్టూర్పు అనంతరం అవతల్నుంచి వినిపించింది ‘‘ఇంతకీ నువ్వేమనుకుంటున్నావే?’’ అని.

‘‘సుధా చెప్పిందే కరెక్టనిపిస్తోంది’’.

‘‘అది మగాళ్ళకు కరెక్టేగానీ ఆడవాళ్ళకు సాధ్యపడుతుందంటావా?’’

‘‘ఇందులో జెండర్‌ ప్రశ్న ఏముందే అలల సుకుమారీ!’’

‘‘ఎందుకు లేదు... అనుభవానికొస్తేగానీ తెలియదు’’.

‘‘నాకర్థంకాలేదు’’.

కొంతసేపు మౌనం తర్వాత గొంతు విప్పింది తరంగిణి. ‘‘నువ్వు బెస్ట్‌ఫ్రెండ్‌వయినా కొన్ని నిజాలు చెప్పకూడదనుకొన్నా. తప్పట్లేదు. 

ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా బడికి పోవాలనే ఆలోచన మంచిదేగానీ అది చాదస్తంగా మారకూడదు. ...ఇంట్లో చంటిపిల్లాడికి సడన్‌గా జ్వరమొస్తుంది. పల్లెవైద్యం జ్వర తీవ్రతను తగ్గించలేకపోతుంది. టౌనుకు వెశ్ళాలి. ఆయనకేమో సెలవు పెట్టకూడదనే నియమం ఒకటుండె. సాయంత్రం బడి వదిలేదాకా కొడుకు దగ్గర కూర్చుని, వాడికి జ్వరం పెరిగేకొద్దీ ఆ తల్లిపడే మానసిక వేదన ఊహించగలవా? ...రాత్రే ఆయన ముసలితండ్రి చనిపోతాడు. మర్నాడు మధ్యాహ్నానికిగానీ బంధువులంతా రారు. నియమం తప్పకూడదు కాబట్టి ఆయన బడికి పోతాడు. 

కర్మకాండలు కూడా బడి వదిలిన తర్వాత జరపటమంటే ఎంత అసహజంగా ఉంటుందో ఊహించగలవా? ...ఉన్నట్టుండి భార్యకు భరించరాని తలనొప్పి. టౌన్‌ డాక్టర్లు ఆపరేషన్‌ చేయాలంటారు. సిటీకి వెళ్ళితీరాలి. బంధువొకర్ని తోడిచ్చి పంపుతాడు. ఆమెకు ఆపరేషన్‌ తప్పనిసరి అవుతుంది. భర్త సంతకం చేయాలి. కానీ ఈ ఉత్తమ ఉపాధ్యాయుడు నియమాన్ని వదులుకోలేడు గదా! ఆదివారానికి ఆపరేషన్‌ పోస్ట్‌పోన్‌ చేయిస్తే... ఆ నాలుగురోజులూ ఆ పెశ్ళాం అనుభవించే మానసిక వేదనను నువ్వూహించు. ఆదర్శ ఉపాధ్యాయుడి స్థానంలో నువ్వుండి ఆలోచించు. నువ్వయితే జ్వరంతో బాధపడే కొడుకును విడిచి బడికి వెళ్ళగలవా? అట్లా వెళితే నీ భర్త సహించగలడా? మిగతా రెండు సంఘటనల్లో కూడా ఏ మగాడూ సహించలేడు. ఆడది మాత్రమే సహించగలుగుతుంది కాబట్టి, వాళ్ళు ఆదర్శ ఉపాధ్యాయులవుతున్నారు. పేరుకోసమో పేపరుకోసమో రికార్డులూ రివార్డులకోసమో తయారయ్యే చాదస్తపు ఆదర్శ ఉపాధ్యాయినిగా ఆ పిల్ల మారకుండా ఉండేందుకయినా సుజితను స్టార్‌ చెయ్యొద్దు. అయినా రోజూ బడికి రావటం మంచి అలవాటేగానీ జ్వరంతో బడికి రావటమేమిటి? ఏం వినగలదు? ఏం నేర్చుకోగలదు? వినే పిల్లల్ని కూడా డిస్టర్బ్‌ చేయటం తప్ప’’ చెప్పింది. ‘‘ఇంకో విషయం... ఈ ఉత్తమ ఉపాధ్యాయుడు అంత గొప్పవాడయితే తన పిల్లల్ని తనవద్దే చదివించుకోక స్సెక్కించి టౌన్లోని ఇంగ్లిషు మీడియం స్కూల్‌కు ఎందుకు పంపిస్తున్నట్లు? పాఠశాల పిల్లల్లో సగానికి సగంమంది ఈయనను వదిలి వేరే టీచర్ల దగ్గర ట్యూషన్‌కెందుకు 

వెళ్తున్నట్లు?’’ కొంత ఆవేశంగానే అంది. ఆవేశం వెనుక నుంచి సన్నని వేదన ఒకటి ఆమె గొంతులో ప్రతిధ్వనిస్తూ సౌదామిని గుండెల్నిపట్టి మెలిబెట్టింది. చాలాసేపటిదాకా ఆ ప్రభావం నుంచి బైటపడలేకపోయింది ఆమె.

రిలాక్స్‌ అయిన తర్వాత మొట్టమొదట చేసినపని ప్రశాంతి పేరును ‘టిక్‌’ చేయటం. గ్రౌండంతా అట్లా ఓసారి తిరిగొచ్చి కుర్చీలో కూర్చున్న తర్వాత ఎందుకో- తను చేసినపని సబబుకాదేమోననిపించింది సౌదామినికి. తరంగిణి ప్రభావం వల్ల తనూ ఆమెలాగే ఆలోచించి సుజితకు అన్యాయం చేయటంలేదు గదా!

మరోసారి థర్డ్‌క్లాస్‌ డీల్‌చేసే టీచర్లనూ డ్రిల్‌ మాస్టర్, ప్యూన్‌ వగైరాల్ని పిలిపించుకొని వాళ్ళముందు కొన్ని ప్రశ్నల్ని పరిచింది. సుజిత, ప్రశాంతిల గురించిన సమాచారం సేకరించింది. సోదాహరణలతో కూడిన వారందరి అభిప్రాయాల్ని జాగ్రత్తగా విశ్లేషించసాగింది.

స్లిప్‌టెస్ట్‌ రాసేటపుడు పక్క విద్యార్థి పెన్సిల్‌ ములికి విరిగిపోతే, తన దగ్గర అదనంగా పెన్సిల్‌ ఉన్నప్పటికీ సుజిత ఇవ్వదట. ‘అమ్మో, మమ్మీ కొడుతుంది. నా పెన్సిల్‌ విరిగితే ఇది అడిషనల్‌’ అంటుందట. గ్రౌండ్‌లో ఆడుకొనేటపుడు చిన్నపిల్లలు జారిపడితే చేయి అందించి లేపి దుమ్ముదులపదట. ‘మైగాడ్‌! ఆ డస్టంతా నాకంటుకోదా! డ్రస్‌ డర్టీ అవుతుంది. మమ్మీ తిడుతుంది’ అంటుందట. లంచవర్లో ఒక్కతే ప్రత్యేకంగా కూర్చుని, ఎవరికీ ఏమీ పెట్టకుండా, తనూ ఎవరివద్దా తీసుకోకుండా భోంచేస్తుందట. ప్రశాంతి మాత్రం వీటన్నిటికీ వ్యతిరేకమట.

బడి వదిలేముందు సుజిత తల్లి వచ్చింది.

ఎదురుగా కుర్చీలో కూర్చుని సౌదామినికేసి చూస్తూ అడిగింది ‘‘బెస్ట్‌ స్టూడెంట్‌గా ఎవర్ని డిసైడ్‌ చేశారు మేడం?’’ అని.

‘‘ఇంకా ఓ నిర్ణయానికి రాలేదండీ’’ చెప్పింది.

‘‘అంత స్ట్రగులయి నిర్ణయం తీసుకొనే సీన్‌ ఏముంది మేడం? చదువులో మా పాపే బెస్ట్‌... శుభ్రతలో మా పాపే బెస్ట్‌... ముఖ్యంగా అటెండెన్స్‌లో మా పాపే వెరీవెరీ బెస్ట్‌... ఇవే గదా మీ మెజర్‌మెంట్స్‌!’’

‘‘అఫ్‌కోర్స్, అవన్నీ మాకు తెలుసు. మేమంతా కలిసి ఓ నిర్ణయం తీసుకోవాలిగా?’’

కాస్త అసహనంగా సౌదామినికేసి చూసింది ఆమె.

‘‘చూడండి మేడం, నాకు అంతా తెలుసు. అందుకే చివరిసారిగా చెప్పిపోదామని వచ్చాను. మా పాపను బెస్ట్‌ స్టూడెంట్‌గా చూడాలని నేను సంవత్సరమంతా కష్టపడ్డాను. ఏ తల్లీ నాలా స్ట్రగులయి ఉండదు. పాపకు ఒక్కరోజు కూడా ఆబ్సెంట్‌ పడకూడదని ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నాననీ! ఎంత కఠినంగా వ్యవహరించాననీ? జ్వరం వచ్చి బాధపడుతూ స్కూల్‌కు వెళ్ళనని ఏడుస్తున్నా బలవంతంగా ఆటోలో తీసుకొచ్చి స్కూల్లో వదలిపోయాను. ఎప్పుడూ డ్రస్‌ మాపుకోకుండా, తల చెదిరిపోకుండా శుభ్రంగా ఉండేలా ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నానో! ఇక పాప చదువు గురించి నేను చెప్పాల్సిన పన్లేదు. మీకు తెలుసు. ఇన్ని తెలిసి కూడా ఏవో 

ప్రలోభాలకు లొంగి మరో అమ్మాయిని బెస్ట్‌ స్టూడెంట్‌గా సెలక్ట్‌ చేస్తున్నారని తెలిసింది. ఇది మంచి పద్ధతికాదు మేడం. నా బాధను మీరు అర్థంచేసుకోండి’’ అంటూ ఓ నమస్కారం పెట్టి బైటకు వెళ్ళిపోయింది.

వింటోన్న సౌదామినికి నిలువుగుడ్లు పడ్డాయి.

జ్వరంతో బాధపడుతూ ఏడ్చి మొత్తుకొంటోన్న కూతుర్ని బలవంతంగా పాఠశాలకు ఈడ్చుకొచ్చే తల్లిరూపం ఆమె కళ్ళముందు నుంచి చాలాసేపటిదాకా కరిగిపోలేదు.

సుజితకు అవార్డిస్తే- అది సాధించేందుకు తనుపడ్డ కష్టాన్ని గురించి ఆమె తల్లి ఇరుగుపొరుగు వాళ్ళకు చెప్పి మరికొందరు తల్లుల్ని తనదారిలో నడిచేట్టు చేస్తుంది. సందేహం లేదు.

ఒక చిన్న అవార్డు సాధించేందుకు ఒక తల్లి అంతటి క్రూరత్వాన్ని అలవాటు చేసుకోవటాన్ని ఎవరుమాత్రం ప్రోత్సహించగలరు..?

సుజితకు అవార్డిస్తే మరో సుధాకర్‌ను తయారుచేసినట్లే!

తన నిర్ణయం కరెక్టే. రిలీఫ్‌గా ఊపిరి వదులుతూ ‘సారీ సుజితా!’ అనుకుంది సౌదామిని. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని