విశ్వం

 ‘‘విశ్వం అన్నయ్య వాలంటరీ రిటైర్మెంటుకు అప్లై చేశారట!’’ చెన్నైలో జరిగిన మా కంపెనీ ట్రైనింగ్‌ ప్రోగ్రాంకు వెళ్ళి ముంబయి తిరిగిరాగానే నా శ్రీమతి అంజలి చెప్పిన విషయం విని ఆశ్చర్యపోయాను. 

Published : 09 Apr 2020 16:16 IST

 సి.ఎన్‌. చంద్రశేఖర్‌

‘‘విశ్వం అన్నయ్య వాలంటరీ రిటైర్మెంటుకు అప్లై చేశారట!’’ చెన్నైలో జరిగిన మా కంపెనీ ట్రైనింగ్‌ ప్రోగ్రాంకు వెళ్ళి ముంబయి తిరిగిరాగానే నా శ్రీమతి అంజలి చెప్పిన విషయం విని ఆశ్చర్యపోయాను.

‘‘నేను నమ్మను. చేతినిండా పనిలేకపోతే ఆఫీసులోనే ఉండలేడు విశ్వం. అటువంటి వ్యక్తి సర్వీసు ఇంకా అయిదేళ్ళుండగానే రిటైరై ఇంట్లో కూర్చుంటాడంటే ఎలా నమ్మేది?’’ అన్నాను.

‘‘వేరెవరైనా చెప్పి ఉంటే నమ్మకపోయేదాన్ని. ఉదయం సులోచనగారే ఫోన్‌ చేసి చెప్పారీ విషయం’’.

‘‘రేపు నేను విశ్వంతో మాట్లాడతాను. అప్లికేషన్‌ విత్‌డ్రా చేసుకోమని చెబుతాను. చిత్తశుద్ధి, ప్రతిభ ఉన్న ఉద్యోగిని మా సంస్థ పోగొట్టుకోవడం నాకిష్టం లేదు’’.

భోజనాలయ్యాక మంచంమీద పడుకుని విశ్వం గురించే ఆలోచించసాగాను. విశ్వంతో నా స్నేహం వయసు ఇరవై ఏళ్ళు. అతనితో నాకు పరిచయం కలిగిన రోజులు గుర్తుకొచ్చాయి.

* * *

నేను పనిచేస్తున్న ప్రముఖ కంపెనీలో డిస్పాచ్‌ సీటుకు పర్చేజస్‌ సెక్షన్‌ నుంచి ఉత్తరాలూ కవర్లూ వచ్చేవి. వాటిపైన ఉన్న అందమైన దస్తూరిని చూసి ‘ఇది పర్చేజస్‌ సెక్షన్‌లో పనిచేస్తున్న ముగ్గురు అమ్మాయిల్లో ఒకరి దస్తూరి కావచ్చు’ అనుకున్నాను. కొద్దిరోజుల తర్వాత ఆ దస్తూరి మగవాడిదని తెలిసి ఆశ్చర్యపోయాను. ఆ సెక్షన్‌కు వెళ్ళి అతనితో పరిచయం చేసుకున్నాను.

‘‘నా పేరు విద్యాసాగర్‌. డిస్పాచ్‌ సెక్షన్‌’’ అన్నాను చేయి చాపుతూ.

‘‘నా పేరు విశ్వనాథ్‌. అందరూ విశ్వం అని పిలుస్తారు’’ అన్నాడు చేయి కలుపుతూ.

‘మనిషి తెల్లగా సుకుమారంగా ఉన్నాడు. అతని అక్షరాల్లాగా మనిషి కూడా అందగాడే’ అనుకున్నాను.

మా పరిచయం జరిగిన కొద్దిరోజులకు నన్ను పర్చేజస్‌ సెక్షన్‌కు బదిలీ చేశారు. త్వరలోనే విశ్వం నాకు ఆప్తమిత్రుడయ్యాడు. విశ్వం పనితీరునూ నడవడికనూ గమనించాక, అతని మనసును చదివాక అతని నుంచి 

నేను నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయనిపించింది.

విశ్వం క్రమశిక్షణకు మారుపేరు. అతను ఏ రోజూ ఆఫీసుకు లేటుగా రావడంకానీ త్వరగా వెళ్ళడంకానీ నేను చూడలేదు. కొలీగ్స్‌తో కబుర్లు చెబుతూ సమయం వృథా చేయడు. అయితే పనిచేస్తూనే తన సీటు 

దగ్గరికి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ జోక్స్‌ వేస్తూ నవ్విస్తూ ఉంటాడు. లేడీ కొలీగ్స్‌తో కూడా జోక్స్‌ కట్‌ చేస్తూ, వారి కుటుంబ విషయాలు తెలుసుకుంటూ వారికి ఆప్తుడయ్యాడు. అతని ప్రవర్తనలోగానీ జోక్స్‌లోగానీ అసభ్యత ఉండకపోవడంతో ఆడవాళ్ళు కూడా ఎలాంటి సంకోచాలూ లేకుండా అతనితో మాట్లాడేవారు. ఆ విధంగా ఎంతో పనిచేస్తూ కూడా అందరితో మాట్లాడుతూ సన్నిహితంగా ఉండటం ఓ కళ అనిపించేది నాకు. ‘ఆడుతూ పాడుతూ పనిచేయడం’ అంటే ఏమిటో విశ్వంను చూశాకే నాకు తెలిసింది.

విశ్వం లీవు పెట్టవలసివస్తే ముందురోజే లీవు లెటర్‌ను సెక్షన్‌ హెడ్‌కు ఇవ్వడం, అనుకోకుండా లీవు పెట్టవలసివస్తే పదిగంటలలోపే ఆఫీసుకు ఫోన్‌చేసి కబురు అందించడం చేసేవాడు. విశ్వం ఆఫీసు ఫోను వాడటం నేను ఎప్పుడూ చూడలేదు. చాలామంది ఉద్యోగులు ఇంట్లో ఫోన్‌కాల్స్‌ ఆదా చేసి, గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చెయ్యడం దగ్గర్నుంచి, పరాయి రాష్ట్రంలో ఉన్న బంధువులతో మాట్లాడటం వరకూ ఆఫీసు ఫోనునే వాడేవారు. అదే విషయం అతన్ని అడిగాను ఓ రోజు.

‘‘ఆఫీసు ఫోను వాడటం తప్పుకాదు. అయితే మనకున్న ఏ సదుపాయాన్నీ దుర్వినియోగం చెయ్యకూడదు. నా భార్యా పిల్లల్లో ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే ఇంటికి ఫోన్‌ చేసి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటాను. సిటీలో గొడవలు జరిగినప్పుడు వారి క్షేమం గురించి విచారిస్తాను. మనిషికి ఫోనుతో అవసరం ఉంది. అయితే ఆఫీసు ఫోను కాబట్టి వీలైనంతవరకూ ఆ అవసరాల్ని తగ్గిస్తాను’’ అన్నాడు.

విశ్వానికి పెళ్ళై ఇద్దరు పిల్లలున్నారన్న విషయం మొదటిసారి విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే విశ్వం చూడ్డానికి నాకంటే చిన్నవాడిలా కన్పిస్తాడు. నాకు అప్పటికింకా పెళ్ళి కాలేదు. వాళ్ళ పాప మొదటి పుట్టినరోజు పార్టీకి విశ్వం కంపెనీలోని దగ్గర స్నేహితుల్ని పిలిచాడు. ఆరోజు అతని భార్య సులోచనని చూశాను. ఆమె చాలా అందంగా ఉంది. చూడగానే మతి పోగొట్టే అందం కాదు ఆమెది. ఆమె నవ్వుతూ ఎదురొస్తే మనం గౌరవంతో చేతులెత్తి నమస్కారం చేసే అందం ఆమెది. అబ్బాయి వివేక్, అమ్మాయి విహిత ముద్దుగా ముచ్చటగా ఉన్నారు.

ఆ పుట్టినరోజు పార్టీకి దాదాపు వందమంది అతిథులు వచ్చారు. ఓ చిన్న ఫంక్షన్‌కు అంతమంది రావడం నాకు ఆశ్చర్యం కలిగించింది. అందరూ విశ్వం దంపతులతో ఆప్యాయంగా మాట్లాడటం చూస్తూంటే ‘అంతమంది మనుషుల్నీ వారి మనసుల్నీ గెలవడానికి విశ్వం వారిపట్ల ఎంత ప్రేమ, కన్సర్న్‌ చూపి ఉండాలి?’ అనిపించింది. ‘నోరు మంచిదైతే ఊరు మంచిదన్న నానుడి ఊరికే రాలేదు’ అనుకున్నాను.

అప్పట్నుంచీ విశ్వం ఇంటికి తరచుగా వెళ్ళసాగాను. విశ్వం ఇంట్లో ఎప్పుడూ బిజీగా ఉండేవాడు. పిల్లలకు పాఠాలు చెబుతూ, భార్యకు ఇంటిపనుల్లో సహాయంచేస్తూ, పుస్తకాలు చదువుకుంటూ కనిపించేవాడు. ఒక్కోసారి పిల్లలకు కథలు చెబుతూ అన్నం తినిపిస్తూండేవాడు. ఆ దృశ్యం ఎంతో ముచ్చటగా అనిపించేది నాకు. ‘మేల్‌ ఇగో లేని వ్యక్తి విశ్వం’ అనుకునేవాణ్ణి. అంతేకాదు, ‘మేడంటే మేడా కాదు, గూడంటే గూడూ కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది’ పాట గుర్తుకొచ్చేది వాళ్ళ కుటుంబం చూస్తున్నప్పుడల్లా. పెళ్ళయ్యాక నేనెలా ఉండాలో విశ్వం నుంచి నేర్చుకున్నాను.

సెలవు రోజుల సాయంత్రాలు నేనూ విశ్వం వాకింగ్‌కు వెళ్ళేవాళ్ళం. దారిలో ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. విశ్వం బంధువులందరూ ఒకే ఏరియాలో అతని ఇంటికి దగ్గరలో ఉండేవాళ్ళు. మేము వాకింగ్‌కు వెళుతూ ఒక్కోసారి అతని బంధువుల ఇళ్ళకు వెళ్ళేవాళ్ళం. విశ్వంను చూడగానే అతని చిన్నాన్నలూ మేనమామలూ లేచి నిలబడేవారు. విశ్వంకంటే వయసులో ఎంతో పెద్దవాళ్ళైనా వారు అలా లేచి నిలబడటం చూసి ఆశ్చర్యపోయేవాణ్ణి. అయితే అందుకు కారణం ఆ తర్వాత వారి మాటల ద్వారానే నాకు తెలిసింది.

విశ్వం తనూ తన కుటుంబం అంటూ గిరిగీసుకుని కూర్చునేవాడు కాదు. తన బంధువులూ మిత్రులూ ఇరుగుపొరుగూ అందరూ బాగుండాలని తపించేవాడు. అతని తమ్ముళ్ళూ బంధువుల పిల్లలూ ఉద్యోగాలు తెచ్చుకోవడానికి విశ్వం ఎంతో సహాయం, ప్రోత్సాహం, స్ఫూర్తి అందజేశాడు. అలాగే తన బంధువుల సర్కిల్‌లోని ఆడపిల్లల పెళ్ళిళ్ళ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. తాను పూనుకుని కొన్ని పెళ్ళిళ్ళు జరిపించాడు. అందుకే బంధువులకు అతనంటే అంత గౌరవం. ఆ గౌరవంతోనే వాళ్ళు విశ్వంను చూడగానే లేచి నిలబడుతున్నారని నాకు అర్థమైంది. అంత చిన్న వయసులోనే అతను అవన్నీ చేయగలగడం నాకు ఆశ్చర్యంతోపాటు ఆనందాన్నీ కలిగించింది.

విశ్వం చాలా సెన్సిటివ్‌. అతన్ని ఎవరన్నా ఓ మాట అంటే విపరీతంగా బాధపడేవాడు. అలా అని ఆ మాట అన్నవాళ్ళను దూరం చేసుకునేవాడు కాదు. మరుసటిరోజు నుంచి వాళ్ళతో మామూలుగా మాట్లాడేవాడు. 

‘మనుషులను సంపాదించడం కష్టం, పోగొట్టుకోవడం తేలిక’ అనేవాడు నాతో. 

విశ్వం సాయంత్రం అయిదుగంటల తర్వాత ఆఫీసులో ఒక్క క్షణం కూడా ఉండేవాడు కాదు. ‘నాకు అఫీషియల్‌ లైఫ్‌ ఎంత ముఖ్యమో పర్సనల్‌ లైఫ్‌ కూడా అంతే ముఖ్యం. ఇక్కడిలాగే అక్కడా నా బాధ్యతలు నెరవేర్చాలి కదా’ అనేవాడు. సాయంత్రాలు భార్యాపిల్లల్ని సినిమాలకూ గుళ్ళకూ బంధుమిత్రుల ఇళ్ళకూ తీసుకెళ్ళేవాడు. అయితే అవసరంపడితే ఆఫీసులో అర్ధరాత్రి వరకూ కూర్చుని పనిచేసేవాడు. అటువంటి అవసరం మామూలుగా ఏన్యువల్‌ క్లోజింగ్‌ అప్పుడు వచ్చేది. విశ్వంకు ఏ పనిచ్చినా చక్కటి ప్లానింగ్‌తో త్వరగా పూర్తిచేసేవాడు. అందుకే అతన్ని అందరూ ‘పి.పి.ఎఫ్‌’ అని పిలిచేవారు. పి.పి.ఎఫ్‌. అంటే ‘ప్లానింగ్, ఫాస్ట్‌ అండ్‌ పర్‌ఫెక్ట్‌’ అని అర్థం.

ఓ సెలవురోజు మేమిద్దరం ‘ఏన్యువల్‌ క్లోజింగ్‌’ పనులు చెయ్యడానికి ఆఫీసుకు స్కూటర్‌పై వెళుతున్నాం. దారిలో బ్లాక్‌ జెల్‌ పెన్స్‌ కొన్నాడు విశ్వం. ఆఫీసులో పెన్నులు ఫ్రీగా ఇస్తారు కదా, మళ్ళీ డబ్బులుపెట్టి పెన్నులు కొన్నావెందుకని అడిగితే, ‘బ్లాక్‌ జెల్‌ పెన్‌తో ఏన్యువల్‌ క్లోజింగ్‌ రిటర్న్స్‌ తయారుచేస్తే జిరాక్స్‌ కాపీలు బాగా వస్తాయి’ అన్నాడు. చేస్తున్న వృత్తిపట్ల అతని కమిట్‌మెంట్‌కు ఈ సంఘటన ఓ చిన్న ఉదాహరణ మాత్రమే.

మా స్నేహానికి ఏడేళ్ళ వయసున్నప్పుడు నా పెళ్ళి జరిగింది. నా భార్య అంజలికి విశ్వం కుటుంబం అంటే ఎంతో ఇష్టం. మాకు పిల్లలు కలిగాక నేను విశ్వం ఇంటికి తరచుగా వెళ్ళడం తగ్గించాను. ఆఫీసులో పనులయ్యాక ఓ అరగంట కూర్చుని మాట్లాడుకుని తర్వాత ఇళ్ళకు బయలుదేరేవాళ్ళం.

మాకు ప్రమోషన్‌ టెస్ట్‌ రాయడానికి అర్హత రాగానే నేను సీరియస్‌గా పరీక్షలకు ప్రిపేర్‌ కాసాగాను. విశ్వం ప్రమోషన్‌ పట్ల అంతగా ఆసక్తి చూపకపోవడం నన్నాశ్చర్యపరిచింది. అతనికి పనిలో పరిజ్ఞానం, తెలివితేటలు ఉన్నాయి. అతను చేతులారా భవిష్యత్తును పాడుచేసుకుంటున్నందుకు బాధ కలిగింది. అదేమాట అతనితో అన్నాను.

‘‘నా సేవలు నా సర్కిల్‌కు చాలా అవసరం. నేను ఈ ఊళ్లో లేకుంటే వాళ్ళు ఇబ్బందిపడతారు. పైగా ఆఫీసరయ్యాక అయిదు గంటలకు ఆఫీసు వదలడం సాధ్యంకాదు. జీవితంలో ఉద్యోగం ఓ భాగం మాత్రమే. మనకు ఆనందాన్నీ అనుభూతుల్నీ ఇచ్చే విషయాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. వాటిని వదులుకుని కేవలం డెస్క్‌వర్క్‌కే పరిమితం కావడం నాకిష్టం లేదు’’ అన్నాడు.

నేను అతని వాదనతో ఏకీభవించలేదు. అలా అని వాదనకూ దిగలేదు. వాదన పెరిగితే అది మా స్నేహాన్ని దెబ్బతీస్తుందేమోనని నా భయం. విశ్వంలాంటి మిత్రుణ్ణి నేను పోగొట్టుకోలేను. నాకు ప్రమోషన్‌ వచ్చింది. ముంబయి బ్రాంచికి పోస్టింగ్‌ ఇచ్చారు. ప్రతిభ ఉన్న నా స్నేహితుడు క్లరికల్‌ క్యాడర్‌లోనే నిలిచిపోవడం నన్ను నిరాశపరిచింది. ఆ నిరాశ నేను ఆఫీసర్‌ని అయ్యానన్న ఆనందాన్ని తగ్గించింది. నేను రిలీవ్‌ అయి వెళుతున్నప్పుడు విశ్వం కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు.

‘‘పార్టింగ్‌ ఈజ్‌ పెయిన్‌ఫుల్‌- అంటారు. అది ఇంత పెయిన్‌ఫుల్‌ అని తెలియదు నాకు’’ అన్నాడు. నేను అతన్ని ఓదార్చడానికి ప్రయత్నించలేదు. ఎందుకంటే అతని అభిమానం నాకూ కళ్ళనీళ్ళు తెప్పించింది.

* * *

ముంబయి నుంచి అప్పుడప్పుడూ విశ్వంతో ఫోనులో మాట్లాడేవాడిని. అయిదేళ్ళ తర్వాత హైదరాబాదు వెశ్ళాను. విశ్వం ఇంటికి వెళ్ళి అతన్ని కలిశాను. మనిషి చాలా తగ్గిపోయాడు. ముఖం పీక్కుపోయి ఉంది. కళ్ళ కింద నల్లటి చారలు. 

‘‘ఏమైంది మీకు, ఎందుకిలా అయిపోయారు?’’ అని అడిగాను ఆదుర్దాగా.

‘‘ఆఫీసులో పనిభారం పెరిగింది. టెన్షన్లూ పెరుగుతున్నాయి. నేను ఆఫీసులో పనిచేయలేకపోతున్నాను సాగర్‌’’ అన్నాడు బాధగా.

‘‘హైదరాబాదు బ్రాంచిలో అత్యంత సమర్థవంతమైన ఉద్యోగి మీరు. మీరే అలా అంటే ఇక బ్రాంచిలో ఎవరు పనిచెయ్యగలరు?’’ అన్నాను.

‘‘అందరూ నాలా సెన్సిటివ్‌ నేచర్‌తోనే ఉండరు కదా. పనికంటే మారిన వాతావరణమే నన్ను ఇబ్బందిపెడుతూంది. అయిదేళ్ళక్రితం వరకూ ఆఫీసులో అందరం ఒక కుటుంబసభ్యుల్లా మెలిగేవాళ్ళం. కష్టసుఖాలు చెప్పుకునేవాళ్ళం. ఆడుతూ పాడుతూ పనిచేసేవాళ్ళం. స్టాఫ్‌ మెంబర్లకు మంచి జరిగినా, చెడు జరిగినా మేమున్నామంటూ పక్కన నిలబడేవాళ్ళం. ఇప్పుడు ఆఫీసులో ఉద్యోగుల సంఖ్య సగానికి పైగా తగ్గిపోయింది. పని మూడింతలు పెరిగింది. ప్రతి ఒక్కరికీ పని ఒత్తిడి. ఇప్పుడు ఆఫీసులో మేం మాట్లాడుకునే ఒకే ఒక పదం ‘గుడ్‌ మార్నింగ్‌’. ఇంటికెళ్ళేటప్పుడు ‘గుడ్‌నైట్‌’ చెప్పేంత ఓపిక కూడా ఎవరికీ ఉండటం లేదు. మరొకరి బాధను వినే తీరికా ఉండటంలేదు’’.

‘‘కంప్యూటర్లు వచ్చాక దాదాపు ప్రతి ఆఫీసులో ఉంటున్న పరిస్థితే ఇది. కంప్యూటరైజేషన్, మెకనైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్‌ లాంటి పదాలు విరివిగా వాడుతున్నాం, వింటున్నాం. కానీ ఇవన్నీ మనుషులకు తెచ్చింది మాత్రం టెన్షన్‌. మరుగునపడిపోతున్నది హ్యూమన్‌ రిలేషన్స్‌’’ అన్నాను.

‘‘మారిన పరిస్థితులలో కంప్యూటర్లూ టెక్నాలజీ అవసరమే. కానీ ఉద్యోగుల్ని తగ్గించడం మంచిపని కాదు. ఇదివరకు ఆఫీసుల్లో ఉద్యోగులకు వయసు పెరిగేకొద్దీ పని ఒత్తిడి తగ్గించేవారు. కుర్రవాళ్ళకు ఎక్కువ పని అప్పగించి సీనియర్లకు వారి అనుభవం, విజ్ఞత అవసరమయ్యే పనులు మాత్రం చెప్పేవారు. కానీ ఇప్పుడు ఖర్చులు తగ్గించడం కోసం రిక్రూట్‌మెంట్లు ఆపేశారు. వి.ఆర్‌.ఎస్‌. పథకాల్ని ఇబ్బడిముబ్బడిగా ప్రవేశపెట్టారు. దీంతో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. వయసుతో నిమిత్తం లేకుండా అందరూ కష్టపడి పనిచెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. నేను ముప్ఫై ఏళ్ళ వయసులో చేసిన పనికి రెట్టింపు పని ఇప్పుడు చేస్తున్నాను. అయితే అంతటి శారీరక శ్రమకూ మానసిక ఒత్తిడికీ ఈ శరీరం తట్టుకోలేకపోతూంది. పైగా రాత్రి ఏడు వరకూ కూర్చుని పనిచేసినా పనులు పూర్తికావడం లేదు. పనిచేసిన తృప్తి ఉండటం లేదు. ‘జాబ్‌ శాటిస్‌ఫాక్షన్‌’ అన్నది మిస్సవుతున్నాను’’.

‘‘తప్పదు విశ్వం. ఈ పోటీ ప్రపంచంలో అందరూ పరుగెత్తాల్సిందే. నిలబడితే పడిపోయే ప్రమాదం ఉంది. మన ఉనికిని కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. పరిస్థితులకు పాజిటివ్‌గా స్పందించాలి. అయితే మన ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఆఫీసులో మీకు చేతనైనంత చేసి వచ్చేయండి. ఇంటికి వచ్చాక ఇక పని గురించి ఆలోచించకండి. ఇప్పటికే సంస్థకు ఎవరూ చేయనంత సేవ మీరు చేశారు. ఆ సేవల్ని భగవంతుడు తప్పక గుర్తిస్తాడు’’ అని అతనికి ధైర్యం చెప్పి బయలుదేరాను.

అయితే విశ్వం గురించి నాకు తెలుసు. ఇచ్చిన పని చెయ్యకుండా అతను ఆఫీసు వదలి రాడు. ఎందుకంటే విశ్వం తన ఆరోగ్యంకంటే తన మనస్సాక్షికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు కాబట్టి.

* * *

ముంబయి వచ్చాక కూడా విశ్వం గురించే ఆలోచించసాగాను. ‘పని రాక్షసుడు’గా పేరుపొందిన అతను పని గురించి భయపడటం, బాధపడటం నన్ను ఎంతో ఆశ్చర్యపరచింది. అయితే తర్వాత తీరికగా అనలైజ్‌ చేస్తే విశ్వం సమస్య ఏమిటో నాకర్థమయింది. ఆఫీసులో పని ఒత్తిడి పెరిగినమాట నిజమే. కానీ అతని అశాంతికి కారణం అదొక్కటే కాదు. ఆఫీసులో మనుషుల మధ్య తగ్గిన సంబంధాలు, పని పూర్తిచేసిన తృప్తి లభించకపోవడం, కుటుంబసభ్యులతో గడిపే సమయం తగ్గిపోవడం, బంధుమిత్రులకు అందుబాటులో లేకపోవడం అతన్ని ఎక్కువగా బాధిస్తున్న అంశాలు. వీటన్నిటికీ కారణం పని పెరగడం. అందుకనే ఇన్నాళ్ళూ కష్టపడి చేసిన పనిని అతను ఇప్పుడు ఇష్టపడటం లేదు.

అతని సమస్యకు పరిష్కారం నా చేతిలో లేదు కాబట్టి అతనిమీద జాలి చూపడం తప్ప ఇంకేం చేయలేకపోయాను. అయితే అతను సంస్థకు చేసిన సేవల్ని భగవంతుడు తప్పక గుర్తిస్తాడన్న నా మాటలు మాత్రం రెండేళ్ళ తర్వాత నిజమయ్యాయి. అతని కొడుకు మంచి కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్న అతని కూతురు కూడా క్యాంపస్‌ ఇంటర్వ్యూలో నెగ్గి ఉద్యోగం తెచ్చుకుంది.

పిల్లలు చేతికొచ్చారనే ధైర్యంతోనే విశ్వం వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడని నాకర్థమైంది.

* * *

మరుసటిరోజు విశ్వం ఇంటికి ఫోన్‌ చేశాను. విశ్వం ఇంట్లో లేడు. వివేక్‌ మాట్లాడాడు.

‘‘నాన్నగారు ముప్ఫై ఏళ్ళు సంస్థకు తన సేవల్ని అందించారు. సంస్థ కూడా ఇన్నేళ్ళూ మా బాగోగుల్ని చూసుకుంది. మేమింతవాళ్ళం కావడానికి మా నాన్నగారెంత కారణమో ఆయనకు జీతమిచ్చిన సంస్థ కూడా అంతే కారణం. అయితే నాన్నగారి ఆరోగ్యం మా ప్రయారిటీ ఇప్పుడు. అందుకే వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకోమన్నాను. మాకోసం అమ్మానాన్నలు ఎన్నో కష్టాలుపడ్డారు. ఇకపై వారికి ఏ కష్టం లేకుండా నేను చూసుకుంటాను’’.

వివేక్‌ మాటలకు ఎంతో ముచ్చటేసింది నాకు. తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటానని అన్నందుకు మాత్రమే కాదు. తమను ఇన్నాళ్ళూ పోషించిన సంస్థకు కూడా అతను కృతజ్ఞతలు చెప్పినందుకు. వివేక్‌కు ఆ సంస్కారం విశ్వం నుంచి వచ్చింది. 

లైక్‌ ఫాదర్‌... లైక్‌ సన్‌.

విశ్వం రిటైర్‌ అయ్యేరోజు ఫోన్‌చేసి నా శుభాకాంక్షలు తెలిపాను. ‘అతను ఇకపై నా కొలీగ్‌ కాదు’ అన్న విషయం మాత్రం నన్ను బాధిస్తూనే ఉంది.

* * *

ఆరునెలల తర్వాత హైదరాబాదు బ్రాంచీని తనిఖీ చేయడానికి వెశ్ళాను. అక్కడ సీటులో కూర్చుని పనిచేస్తున్న విశ్వంను చూసి ఆశ్చర్యపోయాను. అతను అయిదేళ్ళ క్రితం విశ్వంలా ఆనందంగా హుషారుగా కనిపిస్తున్నాడు.

‘‘అదేమిటి, మీరిక్కడ..? మీరు వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకోలేదా?’’ అని అడిగాను.

‘‘తీసుకున్నాను. మళ్ళీ పనిలో చేరాను’’ అన్నాడు నవ్వుతూ.

‘‘అదెలా?’’ అన్నాను మరింత ఆశ్చర్యపోతూ.

‘‘రిటైర్మెంట్‌ తీసుకున్నప్పట్నుంచీ సంస్థకు అయిదేళ్ళు సేవ చేయకుండా ముఖం చాటేశానన్న గిల్టీఫీలింగ్‌ నన్ను వెంటాడసాగింది. అందుకే నేను ఉదయం పది నుంచి మధ్యాహ్నం మూడుగంటల వరకూ ఆఫీసులో పనిచేస్తాననీ అందుకు కంపెనీ నుంచి జీతభత్యాలు ఆశించననీ దయచేసి అనుమతించమనీ కోరుతూ కంపెనీకి ఉత్తరం రాశాను. మన జి.ఎం.గారు అనుమతించారు. స్వచ్ఛందంగా పనిచేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నాపై ఎలాంటి ఒత్తిడీ లేదు. పైగా మన కొలీగ్స్‌ దగ్గర్నుంచి కొన్ని పనులు పంచుకుని వారికి పని ఒత్తిడి కొంతైనా తగ్గించగలుగుతున్నానన్న తృప్తి ఉంది’’.

మాటలకందని ఎన్నో భావాలు నా మదిలో కదలాడాయి. ‘విశ్వం లాంటి మనుషులు ప్రపంచమంతా నిండిపోతే ఎంత బాగుంటుంది!’ అన్న ఆలోచన, ఆశ మనసంతా నిండిపోయింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని