ఎవరిది అదృష్టం?

పెళ్ళివారి దగ్గర సెలవు తీసుకుని కల్యాణ మండపం బయటకు వచ్చాడు విశ్వనాథం. అప్పటికే పార్కింగ్‌ ప్లేసు నుంచి కారు తీసుకువచ్చి ఎంట్రన్స్‌ మెయిన్‌గేటు ...

Updated : 09 Apr 2020 16:53 IST

వలివేటి నాగచంద్రావతి

పెళ్ళివారి దగ్గర సెలవు తీసుకుని కల్యాణ మండపం బయటకు వచ్చాడు విశ్వనాథం. అప్పటికే పార్కింగ్‌ ప్లేసు నుంచి కారు తీసుకువచ్చి ఎంట్రన్స్‌ మెయిన్‌గేటు ముందు ఉంచాడు మాధవరావు. విశ్వనాథాన్ని చూడగానే డోరు తెరిచి స్నేహితుణ్ణి చిరునవ్వుతో లోనికి ఆహ్వానించాడు. విశ్వనాథం ఎక్కి కూర్చోగానే కారు స్టార్టు చేశాడు.

‘‘నిన్నిలా కలుసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉందిరా విశ్వం. ఈ మాటలు ఫార్మాలిటీగా ఎంతమందితోనో చెప్పుంటాను. కానీ ఈసారేరా మనస్ఫూర్తిగా అంటున్నదీ’’ విశ్వనాథం భుజంమీద చెయ్యేసి ఆత్మీయంగా అన్నాడు మాధవరావు.

మాధవరావు చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా వత్తాడు విశ్వనాథం- నాకు తెలుసు అన్న భావాన్ని వ్యక్తంచేస్తూ.

తన ఊరి ప్రెసిడెంటుగారి అబ్బాయి పెళ్ళి- ఇక్కడ ఓ మిలటరీ ఆఫీసరుగారి కూతురితో. ప్రెసిడెంటుగారి బలవంతం మీద మగపెళ్ళివారితో కలిసి ఇక్కడకు వచ్చాడు.

సిటీకి ప్రయాణమనగానే మాధవరావు గుర్తుకొచ్చాడు. బాల్యంనుంచీ ఓ వయసు వచ్చేదాకా తన మనసుకి అతి దగ్గరగా వచ్చిన మిత్రుడతను. కాలం తమని దూరంచేసినా ఆ చెలిమి తాలూకు కమ్మదనం మరుపుకు రాలేదింతవరకు.

వచ్చేముందర పాత డైరీలన్నీ వెతికి మాధవరావుకి ఫోన్‌ చేశాడు మొహమాటపడుతూ. ‘నిన్ను చూడాలని ఉందిరా మాధవా. మన ఊరిపక్క ఉన్న టౌన్‌ తప్ప మరో ప్రదేశం ఎరగనివాణ్ణి. ఆ మహానగరంలో నిన్ను వెతుక్కుంటూ రాలేను. వీలయితే కల్యాణ మండపానికి నువ్వోసారి రాగలవా?’ అని.

తను చెప్పిన టైముకంటే ముందే పెళ్ళి మండపంలో వాలాడు తన స్నేహితుడు. ఓపిగ్గా తను వచ్చేవరకూ కాచుకునున్నాడు. కారెక్కించి తన ఇంటికి తీసుకువెళుతున్నాడు. అరవై రకాల పదార్థాలతో తిన్న పెళ్ళి భోజనంతోకాదు- మిత్రుడి అభిమానంతో కడుపు నిండిపోయింది విశ్వనాథానికి.

‘‘మన చిన్నతనం రోజులు గుర్తున్నాయా విశ్శూ?’’ అడిగాడు మాధవరావు- ఆలోచనల్లో ఉన్న విశ్వనాథాన్ని కదిలించి.

‘‘మరిచిపోయే కాలమా అది’’ మంద్రస్వరంతో అన్నాడు విశ్వనాథం.

ఇద్దరి మనసుల్లోనూ చిన్ననాటి తీపి జ్ఞాపకాలు, ఆ పల్లెటూరు, ఆ వీధిబడి, తమ చెలిమి... జతగా చేసిన అల్లర్లు... అలలు అలలుగా మెదిలాయి.

ఆ జ్ఞాపకాలని తిరగతోడుకుంటూ ఆ పునశ్ఛరణలోని మధురిమని ఆస్వాదించటంలో సమయమెలా గడిచిందో ఇద్దరికీ తెలీలేదు. 

ఇల్లొచ్చేసింది. ఇల్లû•చ్చునా దాన్ని! ఉహూ... బంగశా అనో భవనమనో అనాలేమో. కోట గోడకున్నట్టు అందమైన పెద్దగేటు, హారన్‌ కొట్టగానే గేటు బార్లా తెరిచి సెల్యూట్‌ చేసి పక్కకు తప్పుకున్న వాచ్‌మన్, సరాసరి పోర్టికోలో ఆగిన కారు, ఇక్కడ స్విచ్‌ నొక్కితే లోపలెక్కడో సంగీతం పాడిన అలారం... అన్నీ అపురూపంగా అనిపించాయి విశ్వనాథానికి. పల్లెటూర్లో తమ ఇంటి కర్రగేటూ పేడతో కల్లాపి జల్లిన వాకిలీ తలుచుకుంటే మరీను.

తలుపు తీసిన భార్యను ‘‘నీ చెల్లెలు భువనేశ్వరి’’ చిరునవ్వుతో పరిచయం చేశాడు మాధవరావు.

‘‘రండి అన్నయ్యా, మీ ఫోన్‌ వచ్చిన దగ్గర్నించీ మీ ఫ్రెండ్‌ భూమ్మీద నిలవటంలేదు... నన్ను నిలబడనీయటం లేదు’’ మందహాసం చేస్తూ స్వాగతం పలికింది భువనేశ్వరి.

తెల్లటి సాటిన్‌ నైటీ, బాబ్డ్‌హెయిర్, చక్కటి వర్చస్సు... యాభయ్యోపడిలో కూడా ఇంత ఆకర్షణీయంగా ఉండొచ్చని ఆమెను చూశాకే తెలిసింది విశ్వనాథానికి.

* * *

ఏసీ గదిలో మెలకువ వచ్చింది విశ్వనాథానికి- తెల్లవారుజాము నాలుగ్గంటలకు కోడికూతతో కాదు- ‘‘గుడ్‌ మాణింగ్‌ విశ్శూ, బెడ్‌కాఫీ అలవాటుందా?’’ అంటున్న మాధవరావు మేలుకొలుపుతో ఎనిమిది గంటలకు.

బుద్ధితెలిసి ఇంత ఆలస్యంగా లేవటం ఇదే ప్రథమం. ఏసీ చల్లదనం మహత్యం. అబ్బురపడుతూనే మిత్రుడితో బెడ్‌కాఫీ అక్కర్లేదని చెప్పి ఎటాచ్డ్‌ బాత్‌రూమ్‌కేసి నడిచాడు విశ్వనాథం.

పడగ్గది సౌందర్యం హాయిగా తోస్తే బాత్‌రూమ్‌ సామగ్రి పజిలనిపించింది ఆయనకి. ‘గోడంతా పరుచుకున్న ఆ అద్దమేమిటీ... 

ఆ బాత్‌టబ్‌ ఏమిటీ... షవరు, షేవరు, గీజరు, లోషన్లు, క్రీములు... అబ్బబ్బబ్బ... బాత్‌రూముక్కూడా ఇంత వైభవమా’ అని విస్తుపోయాడు.

‘పెరట్లో దూరంగా ఓ మూలన సిమెంటు రాళ్ళతో కట్టిన తమ స్నానాలగదెక్కడ... ఇదెక్కడ? ఓహోహో’ అని కూడా అనుకున్నాడు.

ఆ ఒక్కసారే కాదు- ఎన్నో అత్యంతాధునిక సదుపాయాలున్న వాళ్ళ వంటగది... అదే... కిచెన్‌ని చూసినప్పుడూ... కశాత్మకంగానే కాదు ఖరీదైన అలంకారాలున్న డ్రాయింగ్‌రూమ్‌ని చూసినప్పుడూ... మరీమరీ ముగ్ధుడైపోయాడాయన.

ఆ హాలు ఊరంత ఉంది. హాల్లో ఆ ఉయ్యాలబల్ల లక్ష రూపాయలట. ఆ ఊగే కుర్చీ, ఆ సోఫా సెట్టు, కూర్చుంటే అడుగులోతు పూలగుట్టలోకి దిగిపోతున్నట్టుంది. అవెన్ని లక్షలు చేస్తాయో!

ఇల్లంతా పాలరాయి. ఇంటిముందు రెండు కార్లు. ఇంటిచుట్టూ గార్డెను. ‘ఇన్ని అమర్చుకోవాలంటే ఎంత సంపాదించాలి? దానికి ఎంత కష్టపడి ఉండాలి’ తెగ ముచ్చటపడిపోయాడు విశ్వనాథం- స్నేహితుడి ప్రయోజకత్వానికి.

బ్రేక్‌ఫాస్ట్‌కి అప్పటికప్పుడు బ్రెడ్‌ స్లైసెస్‌ని టోస్ట్‌ చేసి, నైస్‌గా నైఫ్‌తో బటర్‌ అప్లయ్‌చేసి, పింగాణీ ప్లేటులో పెట్టి, జామ్‌వేసి భర్తకీ విశ్వనాథానికీ ఇచ్చింది భువనేశ్వరి.

ఒళ్ళు అలవకుండా కట్టినబట్ట నలక్కుండా, అంత నీటుగా, అంత టేస్టుగా ఫలహారం తయారైపోవడం తెగ నచ్చేసింది విశ్వనాథానికి. పదింటికల్లా గాగుల్సూ, హైహీల్సూతో తయారైపోయింది భువనేశ్వరి. ‘‘సారీ అన్నయ్యా, నాక్కూడా మీతో స్పెండ్‌ చేయాలనే ఉంది. కానీ నేనివ్వాళ తప్పకుండా అటెండవ్వాల్సిన బోర్డు మీటింగుంది. తొందరగా రావటానికి ట్రై చేస్తాను. సరేనా, బై, సీయూ’’ విశ్వనాథం నొచ్చుకోకుండా క్షమాపణలు చెప్పేసి వెళ్ళిపోయింది.

‘‘నేను మాత్రం నా ప్రోగ్రామ్స్‌ అన్నీ కాన్సిల్‌ చేసేయమని మా ఆఫీసుకి ఫోన్‌ చేసేశానురా విశ్శూ. ఈ రెండ్రోజులూ నిû•్నదిలిపెట్టను’’ చెప్పాడు మాధవరావు. 

కృతజ్ఞతగా చూశాడు విశ్వనాథం.

* * *

మర్నాడు భువనేశ్వరి కూడా ఇంట్లోనే ఉండిపోయింది. భార్యాభర్తలిద్దరూ ఆ రోజంతా విశ్వనాథానికి పూర్తి కంపెనీ ఇచ్చారు. ఉదయాన్నే భువనేశ్వరి సింపుల్‌గా వెజిటబుల్‌ పలావ్, టొమాటో సూపు తయారుచేసింది. బ్రేక్‌ఫాస్ట్‌ చేసేటప్పుడే మాధవరావు తాము విడిపోయిన దగ్గర్నించీ ప్రారంభించి, తన చదువూ ఆ తరవాత అందివచ్చిన అవకాశాలూ పైపైకి ఎగిసిన తన అంతస్తూ క్లుప్తంగానే అయినా దాపరికం లేకుండా చెప్పుకొచ్చాడు.

ఆపైన కాలేజీ రోజుల్లో భువనేశ్వరితో పరిచయం, ప్రణయం, పరిణయాలను... మధ్యమధ్య భువనేశ్వరి విసిరే చెణుకులకు తన ఛలోక్తులు జోడిస్తూ రసవత్తరంగా వినిపించాడు.

విశ్వనాథాన్ని ఆకర్షించినవి ఆ విశేషాలు కాదు. ఆ దంపతుల అన్యోన్యత. ఇంకా ప్రేమికుల్లానే ఉన్నారు వాళ్ళు. నవ్వుకుంటూ జోక్స్‌ వేసుకుంటూ... చాలా ఆశ్చర్యంగా ఉందాయనకి.

ఆయన ఇల్లాలు- మేనమామ కూతురే- ఇప్పటికీ ఆయన్ని చూడగానే భుజం చుట్టూ చెంగు లాక్కుంటుంది మరి. ఆరోజు మధ్యాహ్నం భోజనాలయ్యాక కంప్యూటర్‌కి వెబ్‌కామ్‌ కనెక్ట్‌ చేసి విశ్వనాథాన్ని అమెరికాలో డాక్టర్‌గా ఉన్న కొడుకు దగ్గరికీ కెనడాలో రీసెర్చి చేస్తున్న కూతురు దగ్గరికీ తీసుకెశ్ళాడు. వాళ్ళతో మాట్లాడించాడు. అల్లుణ్ణీ కోడల్నీ పరిచయం చేశాడు. మనుమలతో ‘హాయ్‌’ చెప్పించాడు. అనుకున్న వెంటనే మీటనొక్కితే చాలన్నమాట. పిల్లల్ని చూసుకోవచ్చు. ఎదురుబొదురు కూర్చుని మాట్లాడుకోవచ్చు. దగ్గరలేరన్న చింతేముంటుందిక.

అరటిపండు వొలిచి అరచేతిలో పెట్టుకున్న చందాన జీవితాన్ని ఇంత సమర్థంగా మలుచుకోగలిగిన తన స్నేహితుడివంక ప్రశంసగా చూశాడు విశ్వనాథం. ఆ రాత్రికే తిరుగు ప్రయాణం. భార్యాభర్తలిద్దరూ స్టేషన్‌కి వచ్చారు. ట్రైన్‌ కదిలేదాకా అవీ ఇవీ మాట్లాడుకుంటూనే ఉన్నారు ముగ్గురూ.

 సిగ్నల్‌ పడింది. కిటికీలోంచి మాధవరావు చెయ్యందుకుని ‘‘సెలవు మాధవా’’ అన్నాడు విశ్వనాథం.

‘‘మంచిది విశ్శూ’’ అంటూనే హఠాత్తుగా గుర్తొచ్చినట్టు ‘‘అన్నట్టు నన్ను మీ ఇంటికి రమ్మని పిలవనేలేదు నువ్వు’’ అన్నాడు మాధవరావు నిష్ఠూరంగా.

ఉలిక్కిపడ్డాడు విశ్వనాథం. సమాధానం కోసం వెతుకుతూ పేలవంగా నవ్వి ఏదో అనబోయాడు. ట్రైన్‌ కదిలింది.

స్టేషన్‌ వదిలింది రైలు. కార్నర్‌ సీట్లో కూర్చుని చీకట్లోకి చూస్తూ ‘ఏమని ఆహ్వానించను నిన్ను మాధవా - ఏమున్నదని నా ఇంట్లో. వాకిట్లో మట్టి, పెరట్లో గొడ్లు’ విరక్తిగా అనుకున్నాడు విశ్వనాథం.

కానీ వద్దనుకున్నది జరగ్గూడదనేమీలేదుగా.

* * *

కర్రగేటు తెరుచుకుని ఆ ఇంటి ముంగిట్లోకి అడుగుపెట్టాడు మాధవరావు. గేటు దగ్గర్నుంచి ఇంటిముందున్న మెట్లదాకా పశ్ళాలనిండా పూలు నింపుకుని ఆహ్వానించటానికి సిద్ధంగా ఉన్న కన్నెపిల్లల్లా ఉన్నాయి దారికి రెండుపక్కలా విరబూసి ఉన్న బంతిచెట్లు.

పచ్చమట్టితో అలికిన వాకిలి కాన్వాసు మీద పేరు తెలీని చిత్రకారిణెవరో శ్రద్ధగా చిత్రించినట్టుంది రంగవల్లిక. నాలుగడుగులు ముందుకు వేశాడు. ఎదురుగుండా పాతబడినా దిట్టంగా ఉన్న మండువా లోగిలి. పసుపు, కుంకుమలు పెట్టిన మండిగంతో పవిత్రంగా కనబడుతోంది సింహద్వారం. ఇంటిముందున్న వరండాలో కూర్చుని పాలేరు ఏదో చెబుతుంటే వింటున్నాడు విశ్వనాథం. అనుకోకుండా ప్రత్యక్షమైన స్నేహితుణ్ణి చూసి ఆశ్చర్యంతో ఆనందంతో తలమునకలయ్యాడు.

‘‘ఓరి... ఓరి... నువ్వే... నువ్వేనా...’’ అంటూ మాటలు పెగలనంత సంభ్రమంతో ఎదురువెళ్ళి పొదవి పట్టుకుని మిత్రుణ్ణి వరండా మెట్లెక్కించాడు. ఏదో కంగారు - చెప్పాచెయ్యకుండా దర్శనమిచ్చిన ఈ అతిథి దేవుణ్ణి ఏ ఆసనం మీద ఆసీనుణ్ణి చెయ్యటమా అని.

ఈలోపల మాధవరావు గుమ్మంపక్కనే వేసున్న సింహాసనం లాంటి పాతకాలం వాలుకుర్చీలో కూర్చుంటూ ‘‘ఇది మీ నాన్నగారిది కదూ. 

చిన్నప్పుడు దీన్లో కూర్చోవాలని మహా కోరిగ్గా ఉండేది సుమా’’ అన్నాడు హాయిగా నవ్వుతూ. అప్పటికి స్థిమితపడి కుశలప్రశ్నలు వేశాడు విశ్వనాథం. ఆ తర్వాత ‘‘వంశీ, వంశీ’’ అని లోపలున్న కొడుకుని కేకేసి, ‘‘మన మాధవరావు మావయ్యరా’’ అని వంశీకీ, ‘‘వీడు మా వంశీ’’ అని మాధవరావుకీ ఒకరికొకర్ని పరిచయం చేశాడు.

వంశీ మాధవరావుతో మర్యాదపూర్వకంగా రెండు నిమిషాలు మాట్లాడి, ‘‘నాన్నా, మావయ్య వచ్చారుగా. మీరు ఇంట్లో ఉండిపొండి, తోటకి నేను వెళతాలెండి. పొలంలో మందు రేపు కొట్టించొచ్చు. తొందరలేదు’’ అని తండ్రితో చెప్పి, లోపలికి వెళ్ళి తల్లికి కబురందించి, పాలేరుని వెంటబెట్టుకుని బయటకు వెళ్ళిపోయాడు.

‘‘వీణ్ణి బాగా చదివించి పెద్ద ఉద్యోగస్తుణ్ణి చెయ్యాలనుకున్నానురా మాధవా. ఉహూ, మిమ్మల్నొదిలి వెళ్ళనని భీష్మించుక్కూచున్నాడు. ప్చ్, సముద్రాలు దాటించాలని నాకున్నా పొలిమేర దాటని గీత వాడి నుదుటరాసుంటే ఏం చెయ్యగలం. అగ్రికల్చర్‌ బియస్సీ చదివి నా దగ్గరే ఉండిపోయాడు’’ వెళుతున్న కొడుకుని చూస్తూ కొంచెం నిరాశగా అన్నాడు విశ్వనాథం.

సరిగ్గా అదే సమయంలో ‘నువ్వుండు నాన్నా, నే చేసుకొస్తాను’ అని సమయానికి అందాసరా అయ్యే కొడుకు అందుబాటులో ఉండటం ఎంత భాగ్యం అనుకుంటున్నాడు మాధవరావు. విశ్వనాథం మాటలు విని నవ్వుకున్నాడు.

ఇంతలో మంచినీళ్ళ గ్లాసు తీసుకుని వచ్చింది విశ్వనాథం భార్య సుమతి. నేత చీర, పసుపు రాసిన మొహం, కుంకంబొట్టు, భుజం చుట్టూ కొంగు, సౌమ్యమయిన చూపు... ‘పార్వతీదేవిలా ఉంది’. నమస్కారం చేశాడు మాధవరావు.

పరిచయాలూ పరామర్శలూ పూర్తయ్యాయి. ‘‘ఇక్కడే కూర్చోబెట్టేశారేమిటి? లోపలికి రండి, ఫలహారం చేద్దురుగాని’’ భర్తని హెచ్చరించి వెళ్ళింది సుమతి. ‘‘పద, మిగతావాళ్ళని కూడా చూద్దువుగాని’’ లోపలికి దారితీస్తూ అన్నాడు విశ్వనాథం.

సావడి వెనకాలున్న వంటింటిలోంచి ఆడపిల్లల నవ్వులూ కబుర్లూ వినబడుతున్నాయి. విశ్వనాథం రెండడుగులు అటుగా వేశాడు. ‘‘శార్వాణీ...’’ అన్న ఆయన పిలుపు పూర్తవలేదు- తూనీగలా వచ్చేసింది శార్వాణి. ‘‘మా కోడలు’’ అని పరిచయం చేయకుండానే, ‘‘నమస్కారం బాబాయిగారూ, బాగున్నారా’’ అని పలకరించి, ‘‘మా మావయ్య మీ ఇంటికి వెü•్ళచ్చిన దగ్గర్నించీ మీ గురించీ మీ ఇంటి గురించీ పొగడని రోజు లేదంటే నమ్మండి. అంతెందుకూ, మీ ఇంట్లో ఏ మూల ఏమున్నదో మాకంతా కంఠోపాటమయిపోయిందనుకోండి’’ అంది నవ్వేస్తూ.

అలా గలగల మాట్లాడేస్తూనే పక్కనున్న చిన్న టేబిల్‌ సర్ది, కుర్చీలు రెండూ దగ్గరగా లాగి, నీళ్ళ జగ్గూ రెండు గ్లాసులూ పెట్టేసి వాళ్ళు టిఫిన్‌ తినడానికి రెడీ చేసేసింది. ఆ అమ్మాయి చురుకుతనం, ఇప్పుడు చూసిన తనని ‘బాబాయ్‌’ అంటూ ఆత్మీయంగా వరుసలు కలిపేసి కల్లాకపటం లేకుండా మాట్లాడేయటం మాధవరావునెంతో ఇంప్రెస్‌ చేశాయి.

ఆ క్షణంలో శార్వాణిని, తన కొడుకు భార్యతో పోల్చకుండా ఉండలేకపోయాడు. ఒక పెద్ద కార్పొరేట్‌ సంస్థలో ఉన్నత పదవిలో ఉన్న తార తమతో కూడా రిజర్వుడుగా ఉంటుంది. తననీ భువననీ పేరుపెట్టే సంభోదిస్తూ ఉంటుంది. కాకపోతే పేరు చివర ‘అంకుల్‌’ అనీ ‘ఆంటీ’ అనీ చేరుస్తుంటుంది.

అయినా ఆ అమ్మాయిని తప్పెంచటమెందుకు? వాళ్ళక్కడ, తామిక్కడ. తాము దగ్గరయ్యే ఆస్కారమెక్కడ? ఫలహారం ప్లేట్లు వచ్చేశాయి. ఆలోచనలు ఆగాయి.

పెసరట్టు, జీడిపప్పు ఉప్మా, చందమామల్లాంటి ఇడ్లీలు, చిన్న గిన్నెతో ఘుమఘుమలాడే నెయ్యి.

అల్లం పచ్చడి - చూడగానే ఆకలి విజృంభించింది మాధవరావుకి. ‘ఎన్నాళ్ళయింది ఇలాంటి టిఫిన్‌ తిని’.

‘‘ఇక్కడ కరీం టీకొట్లో బన్ను తప్ప బ్రెడ్డు దొరకదురా’’ అంటున్నాడు విశ్వనాథం బిడియపడుతూ.

మళ్ళీ నవ్వొచ్చింది మాధవరావుకి.

గ్లాసులతో కాఫీ సుమిత్ర తెచ్చింది. నడికట్టుతో, పసుపు నలుగు పెట్టుకున్న ఒంటితో, చెవుల్లో దూది పెట్టుకుని, సిగ్గుపడుతూ తలదించుకుని వచ్చే కూతుర్ని ఆపేక్షగా చూపించి ‘‘మా అమ్మాయి సుమిత్ర. బాలింతరాలు. బాబుకి నెల వెళ్ళింది’’ అన్నాడు విశ్వనాథం.

ఇంటికి అతిథులొస్తే పసివాళ్ళని చేతికివ్వటం పల్లెటూరి ఆనవాయితీ. సుమిత్ర కొడుకుని విశ్వనాథం ఎత్తుకువచ్చి జాగ్రత్తగా మాధవరావు ఒలోపడుకోబెడుతూ ‘‘ఇడుగో, మా బుజ్జి మనవడు’’ మురిపెంగా అన్నాడు.

అంత పసిగుడ్డును ఎత్తుకోవటం కాస్త గాభరాగానే ఉన్నా మూసుకుని ఉన్న ఆ పసివాడి అమాయకపు కనురెప్పల్ని ముద్దాడటం, సుకుమారమైన వాడి బుగ్గల్ని వేలితో నిమరటం ఎన్నడూ ఎరగని ఆనందాన్నిచ్చిందాయనకి.

అవును, కొత్తే. కూతురికి పురుడుపోయటం, మనుమలనెత్తుకు ఆడించటం, ఆ ముచ్చట్లు తనకేమి తెలుసునని? వాళ్ళంతా అమెరికాలో పుట్టారు. పనుల వత్తిడి తీరి తాము వెళ్ళేవేళకి ‘హాయ్, గ్రాండ్‌ పా... హాయ్, గ్రాండ్‌ మా’ అని చెయ్యూపే స్టేజికొచ్చేశారు వాళ్ళు.

ఆయన ఆలోచనల్ని చెదరగొడుతూ వచ్చేసింది యøÁదమ్మ. విశ్వనాథం తల్లి ఆవిడ. తోటకి వెళ్ళి కూరగాయలు కోయించుకుని అప్పుడే వచ్చిందింటికి. ‘‘నువ్వు సత్యం బాబు కొడుకువా, నిక్కర్లేసుకుని తిరిగేవాడివి కళ్ళముందర. ఎంత పెద్దవాడివయ్యావురా’’ పొంగిపోతూ చెంపలు నిమిరి మెటికలు విరిచింది యøÁదమ్మ.

వయస్సెంత మీదపడినా తల్లి లాలన పసివాళ్ళని చేస్తుంది ఎవరినైనా. తల్లి లాంటి యøÁదమ్మ స్పర్శ... అమ్మ మాత్రమే తీసుకోగల ఆ చనువు... కళ్ళలో చెమ్మ చేరింది మాధవరావుకి.

యøÁదమ్మ అతని యోగక్షేమాలడిగింది. కుటుంబ బాగోగులు విచారించింది. 

ఇటుగా వచ్చిన కారణాన్ని ఆరా తీసింది.

కారణం చిన్నదే, అతని తాతగారి ఆస్తి... స్వల్పమైనదే. దాన్ని ఇప్పటివరకూ తన చిన్నాన్నే అనుభవిస్తూండేవాడు. పిల్లలుగలవాడు. దేనికో అవసరమయి దాన్ని అమ్మకానికి పెట్టాడు. దానికి తన సంతకం అవసరమయిందట, పినతండ్రి ఒత్తిడివల్ల ఇటురాక తప్పలేదు.

నిన్ననే ఆ పని పూర్తయింది. ఇంతదూరం వచ్చి మిత్రుణ్ణి చూడకుండా వెళ్ళబుద్ధికాలేదు. దానికి తగ్గట్టే కారు ట్రబులిచ్చింది. చీకటిలో డ్రైవర్ని స్పేరు పార్టుల కోసం టౌన్‌కి పంపి, తను ఇటు వచ్చాడు.

‘‘మంచిపని చేశావు’’ మనస్ఫూర్తిగా అంది యøÁదమ్మ. ‘‘ఈపూట నా చేతివంట రుచి చూద్దువుగాని. నీకు పెసర పూర్ణాలూ ఆవపెట్టిన పులిహోరా ఇష్టం... నాకు తెలుసు’’ అంటూ లేచింది. ఆవిడ జ్ఞాపకశక్తికీ ఓపిక్కీ విస్తుపోతూ ‘‘మీకెందుకమ్మా శ్రమ’’ అని మాధవరావు వారించినా వినిపించుకోలేదావిడ.

‘‘చూశావుగా అదీ వరస. ఒక్కక్షణం ఖాళీగా ఉండదు. అమ్మదే పెద్ద బెంగయిపోయిందిరా మాధవా. నాన్న పోయాక ఆరోగ్యం బాగా దెబ్బతింది. రెండు రోజులు లేస్తే నాలుగురోజులు పడక పెడుతుంది. అమ్మ పడుకుంటే నాకు పిచ్చెత్తినట్టుగా ఉంటుందనుకో. కాస్త విశ్రాంతి తీసుకోమ్మా అంటే వినదు’’ విశ్వనాథం విసుగులో తల్లిమీద అంతులేని అభిమానమే కనిపించింది.

అమ్మానాన్నల సంరక్షణలో నిశ్చింతగా ఎదగటం, ముదిమిలో వారిని తన సంరక్షణలో సేదదీర్చటం మనిషికి గొప్ప తృప్తినిస్తుంది.

ఆ తృప్తి విశ్వనాథం మొహంలో ప్రస్ఫుటంగా కనిపించి అసూయగా అనిపించింది మాధవరావుకి. ఆ భాగ్యం తనకు దక్కలేదు. చిన్నప్పుడే చదువుపేరిట వారికి దూరంగా పెరిగాడు. తను ఎంబీయే చేస్తూ అమెరికాలో ఉన్నప్పుడు వారిని పూర్తిగా పోగొట్టుకున్నాడు.

జీవితంలో ఎన్ని విజయాలందుకున్నా ఆ లోటు ఏ మూలనుంచో తన్ని వెక్కిరిస్తూనే ఉంటుంది.

అన్నట్టుగానే అరిటాకు నిండా ఆధరువులు నింపి భోజనానికి పిలిచింది యøÁదమ్మ. చల్లటి నూతి నీళ్ళతో కాళ్ళు కడుక్కుని, వాల్చి ఉన్న పీటమీద పాత పద్ధతిలో బాసింపట్టు వేసుక్కూర్చున్నాడు.

ముందున్న ఆకులో అన్నీ తనకిష్టమైనవే. తిని ఎన్నాళ్ళు... కాదు కాదు... ఎన్నేళ్ళయిందో. బ్లడ్‌ప్రెషరూ షుగరూ, పత్యం, డైటింగూ లాంటి అభ్యంతరాలన్నీ ఆరోజుకి పక్కకి పెట్టేసి, యøÁదమ్మ పక్కనే కూర్చుని కొసరికొసరి వడ్డిస్తుండగా పదార్థాల మీదకి దాడిచేశాడు మాధవరావు.

సహ పంక్తినే ఉన్న విశ్వనాథం మటుకు ఏం తింటున్నాడో ఏమిటో అంతుపట్టడంలేదు. ఒüÁ్ళనేమో మనవరాలు, వీపు మీద ఉప్పుబస్తా ఊగుతూ మనవడు. చేతికి తీసుకున్న ముద్ద నోటిదాకా రానీటంలేదు వాళ్ళు. పులుసులో ముక్క పెట్టమని ఒకరూ పులిహోరలో జీడిపప్పు పెట్టమని ఒకరూ మారాం. అవన్నీ ఏరిఏరి వాళ్ళకి మార్చిమార్చి తినిపించటంతోనే సరిపోతుంటే ఇంకెక్కడి తిండి.

అయినా విసుగంటూ కనిపించదేం విశ్వనాథం మొహంలో. పైగా ఎంతో ఇష్టమైన పనిచేస్తున్నట్టు చిర్నవ్వు.

అతి కమనీయంగా ఉన్న ఆ దృశ్యాన్ని పదేపదే చూడబుద్ధయింది మాధవరావుకి. ఆధునిక జీవితం, సున్నితంగా మనసును ఆహ్లాదపరిచే ఇలాంటి ఆనందాలెన్నిటినో తనకి మిస్‌ చేసింది. ఎవరూ చూడకుండా నిట్టూర్చాడు మాధవరావు.

సాయంత్రమలా తోటలకేసి వెశ్ళారు. కొబ్బరిబోండాలు దింపించి నీళ్ళు తాగారు.

రాత్రికి పడమటివైపు గదిలో స్నేహితులిద్దరికీ పక్కలు పరిచింది శార్వాణి.

డబుల్‌కాట్‌ లేదు, డన్‌లప్‌ పరుపులు లేవు, ఏసీ అసలే లేదు. ఉన్న ఒక్క ఫ్యానూ గర్రుమంటూ పెద్దగా శబ్దం చేస్తూంటే, అది కూడా ఆపుచేయించాడు మాధవరావు.

పారిజాతం పూలమీంచి సుగంధాలు మోసుకొచ్చి, పడమటివైపున్న కిటికీలలోంచి విసిరివిసిరి రువ్వుతోంది గాలి. సావిడి పక్కగదిలోంచి పసిపాప ఉంగా ఉంగా వూకుళ్ళు. ఉయ్యాల ఊపుతూ సన్నని స్వరంతో అమ్మమ్మ పాడే రామాలాలీ జోలపాట, సన్నగా సాంబ్రాణి వాసన.

పక్కమీద వాలిన పది నిమిషాల్లోనే విశ్వనాథం చెబుతున్న కబుర్లు వినిపించటం మానేశాయి మాధవరావుకి.

* * *

మెలకువ వచ్చేసరికి ‘‘కారు వచ్చేసింది మావయ్యా’’ చెబుతున్నాడు వంశీ.

గంటలో తయారయిపోయాడు. అతన్ని సాగనంపడానికి ఇంటిల్లిపాదీ కారు దగ్గరకు వచ్చారు. పేరుపేరునా అందరితో వెü•్ళస్తానని చెప్పాడు మాధవరావు. అరిసెలూ సున్నుండలూ ప్యాక్‌ చేసి కార్లో పెట్టింది శార్వాణి.

‘‘అమ్మాయిని మా పిండివంటలు రుచి చూడమను నాయనా’’ చెప్పింది యøÁదమ్మ. నవ్వి కారెక్కాడు మాధవరావు.

కారు కదిలింది. తల బైటపెట్టి చెయ్యి ఊపుతూ ‘‘వెü•్ళస్తానురా విశ్వం’’ అన్నాడు మాధవరావు. డగ్గుత్తికపడి మాటరాక తల ఊపాడు విశ్వనాథం.

మాధవరావు కళ్ళముందునుంచి మమతల కోవెల లాంటి ఆ ఇల్లు, మమకారాలు పంచటం తప్ప మరే డాంబికాలూ ఎరగని ఆ కుటుంబం, ప్రశాంతమైన ఆ ఊరు మెల్లమెల్లగా జరుగుతూ కనుమరుగవుతున్నాయి.

‘ప్రేమానురాగాలు పంచిపెట్టే ‘నా’ అన్నవాళ్ళంతా చుట్టూరా ఉంటే అష్టైశ్వర్యాలెందుకు? ఉన్నదాన్లో తృప్తిగా ప్రశాంతంగా బతకటంకంటే సుఖమెక్కడుంది. వాటిని శాశ్వతంగా పొందగలిగిన విశ్వనాథం ఎంత అదృష్టవంతుడు’ అనుకున్నాడు మాధవరావు.

దూరమయిపోతున్న కారును చూస్తూ ‘ఈ దుమ్ము ధూళీ మోటుతనం అనాగరికం వీటన్నిట్నీ వదిలించుకుని, స్పాంజి పరుపులూ పట్టు తివాచీలూ ఉన్న మేడల్లోకీ కంప్యూటర్లూ నెట్టూ లాప్‌టాప్‌లూ విమానయానాలూ ఉన్న అద్భుతలోకంలోకీ సాగిపోతున్న నా స్నేహితుడు మాధవరావెంత అదృష్టవంతుడు’ అనుకున్నాడు విశ్వనాథం. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు