మరో స్నేహం

అకస్మాత్తుగా అహల్య తిరిగి కలిసింది. ఒకరినొకరు చూసుకున్న మరుక్షణంలోనే గుర్తుపట్టి నవ్వుకున్నారు. దగ్గరగా వచ్చాక పలకరించుకున్నారు.

Published : 09 Apr 2020 17:56 IST

 వి.రాజారామమోహనరావు

అకస్మాత్తుగా అహల్య తిరిగి కలిసింది. ఒకరినొకరు చూసుకున్న మరుక్షణంలోనే గుర్తుపట్టి నవ్వుకున్నారు. దగ్గరగా వచ్చాక పలకరించుకున్నారు.

‘‘ఇదివరకటికన్నా బాగున్నావు...’’ అంది అహల్య.

‘‘ఇదివరకటికన్నా నువ్వూ చాలా బావున్నావు...’’ అన్నాడు కిరణ్‌.

ఆ ఫైవ్‌స్టార్‌ హోటల్‌ లాబీలోంచి రెస్టారెంట్‌ వైపు నడిచారు.

ఇద్దరికీ ఒళ్లొచ్చింది. ఒంటితోపాటు మెరుపు... ఆదాయం బాగుండటంవల్ల. అలవాటుగా మారిన అలంకరణ ఇద్దర్నీ నవీనంగా తీర్చిదిద్దింది.

ఆఫీసు తాలూకు మీటింగ్‌ కోసం, ఉదయం ఫ్లైట్‌లో హైద్రాబాద్‌ నుంచి మద్రాసు వచ్చాడు కిరణ్‌. మద్రాస్‌లోనే ఉద్యోగం చేస్తున్న అహల్యా ఆఫీసు పనిమీదే ఆ హోటల్‌కి వచ్చింది.

రెస్టారెంటులో కూర్చున్న పది నిమిషాల్లోనే ఎవరేం చేస్తున్నారో... ఏ పొజిషన్‌లో ఉన్నారో ఒకరికొకరు చెప్పేసుకున్నారు. 

గడిచిన అయిదారేళ్ళ కాలంలో ఒకరినొకరు కలుసుకోని సమయంలో జరిగిన ముఖ్య సమాచారాల మార్పిడి జరుగుతుండగానే... కబుర్లు సాగుతుండగానే ఒకరినొకరు పరీక్షగా చూసుకున్నారు. ‘నువ్వు బాగున్నావు. నువ్వూ బాగున్నావు...’ అన్న మాటలు గుర్తొచ్చాయి.

‘బాగుండటం...’ అన్న భావన విషయంలో విలువలు మారుతున్నాయా? ముందుగా ఈ ఉద్దేశం అహల్యకే కలిగింది. శరీరాన్నిదాటి దృష్టి అసంకల్పంగానే లోపలికి, అంతరాంతరాల్లోకి ప్రయాణించింది. మరుక్షణంలోనే రెస్టారెంట్‌లోకి తిరిగివచ్చి, బిక్కపట్టుకున్న మనసుతో ‘‘ఇంటి విషయాలేమిటి?’’ అనడిగింది.

‘‘పెళ్ళయింది... తన పేరు నవీన... రెండేళ్ళ బాబు... ఈమధ్యే ప్లేస్కూల్లో వేశాం. మా అమ్మా నాన్నా ఊళ్లోనే ఉండిపోయారు. హైద్రాబాద్‌లో నేనూ నవీనే. తనూ మంచి పొజిషన్‌లోనే ఉంది. సిక్స్‌ ఫిగర్‌ శాలరీకి దగ్గర్లో ఉంది. డబ్బుకి లోటులేదు. నీకు తెలియనిదేముంది. బిజీ లైఫ్‌. రోజూ పరుగే. ఏ రోజు ఏ ఊళ్లో ఉంటామో తెలియదు. ఊళ్లో ఉన్నా భార్యాభర్తలం కలుస్తామో, కలిసినా దగ్గరగా ఉంటామో లేదో. ఎప్పుడూ ఏదో స్ట్రెస్‌. అన్నీ ఉన్నాయి... కావాలనుకున్నవి కొనుక్కోగలుగుతున్నాం. అయినా ఉత్సాహం లేదు. ఆనందం లేదు. తీరికలేని అలసట. జీవితంలో అసలైంది ఏదో మిస్‌ అవుతున్నామన్న ఆరాటం. అయినా ఏం చెయ్యగలం చెప్పు... రోజుల్ని వీలుగా మార్చుకుని గడిపేయటమే’’ అన్నాడు కిరణ్‌ నవ్వుతూ. ‘‘మరి నీ సంగతి?’’ అనడిగాడు ఆ తర్వాత.

‘‘నాకూ పెళ్ళయింది. నాలుగేళ్ళ పాప. మూడేళ్ళయింది మేం విడిపోయి. అప్పట్నించీ ఒంటరితనమే... అతను మాత్రం వేరే పెళ్ళి చేసుకున్నాడు’’ అంది అహల్య తలొంచుకుని. ఆ క్షణంలో చాలా దిగులుగా కనిపించింది అహల్య- కిరణ్‌కి.

రెస్టారెంట్‌లోనే మరో అరగంట గడిపారు. అహల్య తల్లిదండ్రులు చిన్నతనంలోనే పోయారు. స్కూలు రోజుల్నుంచీ ఇద్దరూ కలిసే చదువుకున్నారు. అప్పటి కబుర్లూ జ్ఞాపకాలూ పరస్పరం ఇష్టమో ప్రేమో మోహమో స్నేహమో అన్నింటి కలగలుపో తెలియని అప్పటి అనుభవాలు... ఇద్దరిలో ఎవరూ చొరవ చూపించలేని అప్పటి పిరికితనం, బెరుకు అన్నింటినీ కలబోసి గుర్తుతెచ్చుకున్నారు. ఇద్దరికీ మళ్ళీ ఇలా కలవటం ఉత్సాహంగా ఉంది.

అవకాశం కుదరటంవల్ల కొంత... మనసుకి మధురంగా ఉండటంవల్ల మరికొంత... మొత్తానికి మరో రెండురోజులు మద్రాసులోనే ఉండిపోయాడు కిరణ్‌. ఒకపూట అహల్య ఇంట్లోనే భోంచేశాడు. పాపతో కలిసి షాపింగ్‌ చేశారు. లంచ్, డిన్నర్‌ ఇద్దరూ కలిసి చేసేలాగా ఏర్పాటుచేసుకున్నారు ఆ రెండురోజులు.

హైద్రాబాద్‌కి తిరిగివచ్చేటప్పుడు ‘‘వీలున్నంత తొందరగా మళ్ళీ మద్రాసు వస్తా’’ అన్నాడు కిరణ్‌.

‘‘నేను ఎదురుచూస్తుంటా’’ అంది అహల్య.

* * *

ఆ నెలలోనే మరో రెండుసార్లు మద్రాసు వెశ్ళాడు కిరణ్‌. మూడోసారి కొంచెం ఆలస్యమైతే, రోజూ ఫోన్‌లో మాట్లాడుతున్న అహల్య ‘తొందరగా రా’ అని నాలుగుసార్లు చెప్పింది.

ఇద్దరికీ కలిసున్న సమయం ఎలా గడిచిపోతోందో తెలియకుండా ఉంది. ఒంటరిగా ఉన్నప్పుడు ‘కిరణ్‌ వస్తాడుగా’ అనుకుంటోంది అహల్య. హైద్రాబాద్‌లో ఉన్నప్పుడు ‘మద్రాసు వెశ్తానుగా’ అనుకుంటున్నాడు కిరణ్‌. ఏం జరుగుతోందో తెలియని ఉత్సాహం ఆవరించినా, మనసు కోరుకుంటున్నదేదో జరగటంలేదన్న వెలితి ఇద్దరిలోనూ ఉంది. చనువుగానే ఉంటున్నారు... దగ్గరగానే మసలుతున్నారు. చేతుల స్పర్శ, భుజాలమీద చేతులు... ఏ ఇబ్బందీ లేకుండా ఒకర్నొకరు ముట్టుకోవడం... చాలా విషయాలు మాట్లాడుకుంటున్నా, మనసులు పరస్పరం పూర్తిగా తెలుపుకోలేకపోతున్నారు. చదువుకునే రోజుల్నాటి తమకం ఉంది... ఓ రకం తాదాత్మ్యం ఉంది... ఆరాటం ఉంది. వీటితోపాటు వయసూ గడచిన జీవితం అందించిన పెద్దరికం... నేనూ ఉన్నానంటోంది.

అహల్యంటే ఎంతో ఇష్టం ఉంది కిరణ్‌కి. ప్రేమ ఉంది... స్నేహం ఉంది. అందుకే ఏ పొరపాటు మాట వచ్చినా అహల్య బాధపడుతుందనీ నొచ్చుకుంటుందనీ ఎంతో ఎంతో భయం. అతనెరిగిన అహల్య జీవితంలో అన్నీ ఒడిదుడుకులే. అహల్యకి తననుంచి సుఖమేతప్ప బాధ ఉండకూడదు.

కానీ మరోవైపు ఆశ, కోరిక... తమిద్దరి శరీరాలు కూడా పూర్తిగా దగ్గరైపోతే... కలిసిపోతే... ఆ జీవితం ఇంకా బావుంటుందన్న ఆరాటం. అహల్య జీవితంలోని ఒంటరితనపు బరువుని దూరంచేసి, తమకి తెలియకుండా ఓ పరుగులా గడుస్తున్న కాలాన్ని, తిరిగి జీవనానుభవంలా మార్చుకోవచ్చన్న కాంక్ష.

అహల్యకీ ఉద్విగ్నంగానే ఉంది. ఏది మంచో ఏది చెడో తెలియనట్టుగా అసహనంగా ఉంది.

ఇద్దరి ఆరాటాల వెనుకా కొన్ని సత్యాలున్నాయి, కొన్ని ఆప్యాయతలున్నాయి, గాఢమైన ప్రేమలున్నాయి.

తన కూతురికిప్పుడు నాలుగేళ్ళు. ఇంతవరకూ తండ్రి లేడనేతప్ప, ఏమయ్యాడో స్పష్టంగా చెప్పలేదు. మరో నాలుగేళ్ళకైనా ఆ పసిపిల్లకి వాస్తవం చెప్పకతప్పదు. తండ్రి గురించి స్పష్టంగా తెలియజేయక తప్పదు. అంతేకాదు, అప్పటికి తనున్న పరిస్థితీ తన జీవనవిధానం... ఆ అమాయక మనసుకి ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ కలిగించకూడదు. అలా ఉండాలంటే తను ఇలాగే ఉండిపోవాలి. జీవితాన్నీ ఒంటరితనాన్నీ శరీరాన్నీ... అన్నింటినీ అదుపుచేసుకుంటూ ఇలాగే ఉండిపోవాలి. కానీ స్థిరంగా అలాగే ఉండిపోయేలా బయటి పరిస్థితులూ జీవన వాస్తవాలూ లేవు. తనలాంటివాళ్ళు, తనకి తెలిసున్నవాళ్ళే చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో చాలామంది తనలా మిగిలిపోలేదు. తరవాతి జీవితం తర్వాత.. ప్రస్తుతం నీరసపడిపోకూడదు. సుఖంగా ఉండాలి. డబ్బు సంపాదించాలి. అదే అసలైన శక్తి. బాధా దిగులూ వల్ల ప్రయోజనం లేదు. ఎప్పుడో నాలుగేళ్ళ తర్వాతో నలభైయేళ్ళ తర్వాతో ఏదో అవుతుందన్న ఆలోచన లేకుండా రకరకాల సంబంధాలు. రోజుకో గంటా లేదా వారానికో రాత్రి... అన్నీ సబబుగానే. ఈనాటి పరిస్థితులకి తగినవాటిలాగే. తప్పులేనట్టుగానే ఉన్నాయి. ఇప్పటి ఈ జీవితంలా అన్నీ పోగొట్టుకోవటమా? ఎంతో కొంతైనా, తనకి కావాల్సిన వ్యక్తిగత జీవితాన్ని దగ్గర చేసుకోవటమా? ...అహల్యలో ఎన్నెన్నో సందేహాలు.

ఎంత వద్దనుకున్నా తప్పుడు ఆలోచనలొస్తున్నాయి. అవి నిజంగా తప్పేనా? ఈ పోటీ జీవితంలో డబ్బు సంపాదించాలి. సుఖపడాలంటే అది తప్పనిసరి. తనూ భార్యా బాగానే సంపాదిస్తున్నారు. కానీ సుఖం... ఇదివరకటి సుఖంలేదు. సౌకర్యాలన్నవీ సుఖాలని అందరూ అనేవీ అన్నీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అలాంటి అనుభవాల్లో, సమయం మరోరకంగా గడపటంతప్ప నిజమైన సుఖం, తృప్తి లేవు. నిజమైన సుఖం లేనప్పుడు ఈ సంపాదన ఎందుకు? సంపాదించటం మానేస్తే? ...అది సరికాదు. సంపాదించటానికి పడుతున్న శ్రమని మరచిపోయేలా సుఖపడాలి. అనుబంధంలేందే సుఖంలేదు. భార్యకీ తనకీ మధ్య అకారణంగానే దూరం పెరిగిపోయింది. పరస్పరం కలవాలన్న ఆరాటం లేదు. ఎన్నో రాత్రిళ్ళు తను వేరే ఊళ్ళల్లో విడిగా ఉంటున్నాడు... భార్యా అలాగే ఉంటోంది. ఒకే ఇంట్లో ఉన్నా తమమధ్య దూరమే. సామాజిక బంధమే తప్ప మానసిక అనుబంధం లేదు. కలిసి ఉండాలన్న బాధ్యతే తప్ప కలవక ఉండలేమన్న భావోద్వేగం లేదు. అయినా, ఈ రోజుల్లో ఈ సమస్య లేనిదెవరికి! తన మిత్రులు ఎంతమంది ఇంటిగొడవలున్నా సుఖపడటంలేదు? ఆఫీస్‌ స్పౌజ్‌... జాయింట్‌ టూర్స్‌... కేవలం ఏమాత్రం బాదరబందీలేని శారీరక సంబంధాలు... ఇవన్నీ వాడుకలోకి వచ్చేశాయి. ఎందుకు..? ఆడా మగా మరింత సుఖంగా బతకటంకోసం. మరింతగా శ్రమపడి సంపాదించటం కోసం. ఇప్పుడు తనకి అహల్య కావాలి. ఆమెతో తనకి అనుబంధం ఉంది... కావాల్సింది సంబంధం మాత్రమే. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అహల్య బాధపడకూడదు. ఈ వ్యవహారం వల్ల అహల్య జీవితం ఇబ్బందిగా ఉండకూడదు. సుఖంగా ఉండాలి... కిరణ్‌లో ఏవేవో ఆలోచనలు.

మరోనెల గడిచింది... కిరణ్, అహల్య కలుస్తూనే ఉన్నా... ఎవరూ చొరవ చూపించలేకపోతున్నారు. ఏ అద్భుతమో జరిగి, ఏ బలహీనతో కమ్ముకుని, ఏ శక్తో శరీరాల్ని అదుపుతప్పేలా చెయ్యాలి. కానీ అలా జరగటం లేదు.

తరచుగా మద్రాసు వెళ్ళటం, రకరకాల ఒత్తిడిని పెంచింది కిరణ్‌కి. కిరణ్‌ వచ్చినప్పుడల్లా అతనికి వీలుగా దినచర్యని సర్దుకోవటం వల్ల అహల్యకీ శ్రమ పెరిగింది. ఇద్దరి కోరికా పరస్పరం తెలియనిది కాదు. అప్పటికీ కిరణ్, ఈనాటి సమాజంలోని శృంగార సంబంధాల గురించి పరోక్ష ధోరణిలో చాలాసార్లు చెప్పాడు. అహల్య విన్నదేగానీ అవునూ కాదూ అనలేదు. కిరణ్‌కి ఇక ఓర్చుకోలేని స్థితి వచ్చేసింది. చివరికి ధైర్యం కూడగట్టుకుని.. ‘‘నువ్వు నాకు కావాలి అహల్యా’’ అన్నాడు ఓరోజు.

‘‘నువ్వూ నాకు కావాలి కిరణ్‌’’ అంది అహల్య.

‘‘మరి...’’ అన్నాడు కిరణ్‌. అలా అన్నాడేతప్ప అతని శరీరం తొందరపడలేదు. అహల్య అతనికి కేవలం ఓ శరీరమే కాదు.

అహల్య ఏం మాట్లాడకపోవటంతో నెమ్మదిగా లేచి ఆమె భుజంమీద చెయ్యివేశాడు కిరణ్‌.

‘‘వద్దు కిరణ్‌...’’ అంది నెమ్మదిగా.

వెంటనే చెయ్యి తీసేశాడు. ఆశ్చర్యంగా ఉంది... నిరాశగా ఉంది... ఆశగానూ ఉంది.

‘‘నువ్వంటే ఇష్టం, కోరికా లేకకాదు. నాకు ఆ అవసరంలేకా కాదు కిరణ్‌. మనిద్దరం ‘ఊ’ అనుకుంటే ఒక్క అరగంటలో కలిసిపోతాం. కానీ ఆ తర్వాత..? హైద్రాబాద్‌ నుంచి నాకోసం వచ్చి వెళుతుంటావు. మరీ అయితే, మీ ఆవిడకి ఏవో వంకలు, అబద్ధాలు చెప్పి రెండుమూడు రోజులు మద్రాసులోనే ఉంటావు. ఆ తర్వాత నీ రాకపోకల సంఖ్య పెరగొచ్చు, తగ్గొచ్చు. అంతేగా. దీనివల్ల నీకేం ఇబ్బంది ఉండదు. అంతా సుఖంగా సాగిపోతుంది. మహా అయితే మీ ఆవిడకి అనుమానం రావచ్చు... గొడవ చెయ్యొచ్చు. అబద్ధాలాడో మొండికెత్తో సర్దుబాటు చేసుకుంటావు. కానీ నా పరిస్థితి అదికాదు కిరణ్‌. నాతోపాటు నా కూతురికీ ఓ జీవితం కావాలి. ఎన్నో రకాలుగా ఆలోచించాను కిరణ్‌... అది మన ఈ సంబంధంవల్ల సాధ్యపడదు.

నామీద నీకున్న ఇష్టాన్ని వాడుకుని, నీ భార్యతో తెగతెంపులు చేసుకోమనవచ్చు... కానీ అదీ సరైందికాదు. ఒక్కటి గమనించు కిరణ్‌... మన సంబంధంవల్ల కొన్నేళ్ళకి... నీకోసం మీ బాబు దిగులుగా చూస్తూ, 

ఎవరికీ ఏమీ చెప్పుకోలేని యాతనతో, తనలోకి తను ముడుచుకుపోతే... నిన్ను చూసి నా కూతురు, ఏదో అసహనంతో ఆందోళనతో నలిగిపోతే... మన మనసులకి ఎంత నరకమో ఒక్కసారి ఊహించు కిరణ్‌.

మనంపడే మానసిక, శారీరకశ్రమ... సుఖం కావాలనిపించేలా చేస్తోంది. నిజం. ఈనాటి మారిన పరిస్థితుల్లో చిత్రమైన శిక్ష అనుభవిస్తున్నాం. కానీ మనకి అన్నింటికన్నా ముఖ్యమైన సంతోషం ఏమిటో తెలుసా..? మనవాళ్ళని సుఖపెట్టటం. వారిని వేరుగా, మన సుఖాన్ని వేరుగా చూసుకునే మనస్తత్వాలు కావు కిరణ్‌ మనవి. మనం పెరిగినగడ్డ అలాంటిది’’ నింపాదిగా చెప్పింది అహల్య.

కొద్దిక్షణాల్లో వేరే లోకంలోకి వెళ్ళినంత అయోమయంగా ఉంది కిరణ్‌కి. 

అతనున్న పరిస్థితి అర్థమైనట్టు, ఓదార్పుగా అతని రెండు చేతుల్ని, తన చేతుల మధ్యకి తీసుకుంది అహల్య.

ఇద్దరికీ సంతోషంగా లేదు. బాధగానే ఉంది. కాదనుకోలేని నిజాలు, మారిన విలువలు... వారి మనసుల్ని దొలుస్తున్నాయి. ప్రశ్నిస్తున్నాయి.

‘‘మనిద్దరి బతుకు ఇక ఇంతేనా’’ అనడిగాడు కిరణ్‌ మరికాసేపటికి.

‘‘ప్రస్తుతానికి ఇంతే కిరణ్‌. కానీ నాకు నువ్వు కావాలి. నేనేమిటో తెలిసిన, నా జీవితమేమిటో తెలిసినవాడివి. నీ స్నేహం, నీ అండదండలు నాకు కొండంత ధైర్యం’’ అంది అహల్య తలొంచుకుని.

అసహాయంగా తలదించుకున్న చిన్నపిల్లలా అనిపించింది అహల్య... కిరణ్‌కి ఆ క్షణం. 

ఆ పసితనం కిరణ్‌లోని ప్రేమని మరింతగా పెంచింది. ఇదివరకంత తరచుగా కాకపోయినా మద్రాసు వెళుతూనే ఉన్నాడు కిరణ్‌. ఫోన్‌లో రోజూ అహల్య, కిరణ్‌ మాట్లాడుకుంటూనే ఉన్నారు. అహల్య కూతురికి జబ్బుచేసి, బాగా కంగారుచేస్తే, ఓసారి నాలుగురోజులు మద్రాసులో అహల్యకి సాయంగా ఉన్నాడు. ఆ పిల్ల ఆరోగ్యంగా కోలుకున్నందుకు ఇద్దరూ ఎంతగానో ఆనందపడ్డారు.

తామిద్దరి స్నేహం ఆ రకంగా నిలుపుకోవటం కొంచెం భారంగానే ఉంది కిరణ్‌కి. అయినా ఓ రకం తృప్తిగా, ప్రత్యేకమైన మానవధర్మంగా, హాయిగా ఉంది. ఇద్దరిలోనూ కోరిక అణుమాత్రం కూడా లేదంటే అది అబద్ధమే అవుతుంది. పరిస్థితుల్లో మార్పులు జరిగితే, ఏం జరుగుతుందో ఇద్దరికీ తెలియదు. అయినా వాస్తవాల్నీ తమలోని బలహీనతల్నీ అంతకన్నా తమవారి జీవితాలతో పెనవేసుకున్న బంధాల విలువనీ అర్థం చేసుకున్న ఆ దగ్గరితనం... ఇద్దరికీ ధైర్యంగా ఉంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు