తోట దాటినపరిమళం

అంతా స్తబ్దంగా ఉంది... గుండె గతుల్లో ఏర్పడిన కల్లోలం మినహా... ఛాతీపైన తల ఆనించి పడుకుంది పాప..నా మనసులోని కల్లోలం పాపకు వినబడుతోందా?

Published : 09 Apr 2020 18:17 IST

 బెజ్జారపు వినోద్‌కుమార్‌

అంతా స్తబ్దంగా ఉంది... గుండె గతుల్లో ఏర్పడిన కల్లోలం మినహా. ఛాతీపైన తల ఆనించి పడుకుంది పాప. నా మనసులోని కల్లోలం పాపకు వినబడుతోందా?ఈ కల్లోలం కమ్మని ఆటగా మారే క్షణాల కోసం ఎదురుచూస్తోందా?

కిటికీలోంచి వెన్నెల సరాసరి పాప మొహంపైన పడుతోంది.

పాప నిద్రపోయిందంటే నిలువెల్లా ఒంటరితనం ఆవరించినట్లవుతుంది నాకు.

పాప మొహంపైన పరుచుకున్న వెంట్రుకలను కాస్త పక్కకు జరిపాను. వెన్నెలలో మరింతగా మెరిసిపోతూ కనిపించింది.

జేబులో ఉన్న స్లిప్‌ను ఒకసారి తడుముకున్నాను.

స్పర్శ గుండెకు తగిలినట్లుగా అనిపించింది.

అది పాప రాసిన కాగితం.

నా చిట్టితల్లి చిన్ని చేతుల నుండి జారిన అక్షరాల హరివిల్లు.

ప్రశ్నార్థక ఆకారంలోకి మారిపోయిన కార్త వీర్యార్జునుని బాణాల సముదాయం.

నిజంగా నేనొక సమాధానాన్ని అందించగలనా?

నన్ను నేను విస్ఫోటించుకుని వెనవేల ఆకారాలుగా విచ్చిపోయి నా చిట్టితల్లి లాంటి ఎందరో పిల్లల ప్రశ్నలకు సమాధానంగా నిలువగలనా?

* * *

బందిఖానాలోంచి బయటపడిన పావురంలా ఉంది నా పరిస్థితి.

మా ఇంట్లో ఒకప్పుడు రెండు పావురాలు ఉండేవి. ఎన్నో రోజులపాటు వాటిని ఎంతో శ్రద్ధగా పెంచాను. వాటిమీద నాకు విశ్వాసముండేది, నన్ను వదిలి అవి ఎటూ వెళ్ళిపోవని. నా నమ్మకానికి తగ్గట్టుగానే అవి కొంతదూరం వెళ్ళి మళ్ళీ గూడులోకి చేరేవి. ఒకసారి మాత్రం ఆ రెండు పావురాలూ కొంత ఎక్కువ దూరం ఎగిరాయి. వాటికేమనిపించిందో మళ్ళీ తిరిగిరాలేదు. అవి వెళ్ళిపోయిన దృశ్యం నాకింకా జ్ఞాపకమే. అవి ఎలా బతుకుతున్నాయో? వాటిని ఎవడైనా చంపి ఉంటాడేమో. వాటికి సరైన తిండి దొరుకుతుందో లేదో అని - డిఎస్సీలో సెలెక్టయి, ప్రైవేటు స్కూలు వదిలేసి గవర్నమెంట్‌ టీచర్‌గా చేరాకగానీ నాకా పావురాలమీద బెంగ పోలేదు. ఇప్పుడు నాకు చాలా స్వేచ్ఛ ఉంది. పిల్లలపై ఎన్నో ప్రయోగాలు చేయగల స్వేచ్ఛా దొరికింది. పిల్లల మానసిక స్థితిగతులూ ఉద్వేగాలూ సామర్థ్యాలకూ సంబంధించిన అవగాహనా పరిజ్ఞానం నాకు ఉందనే అనుకుంటాను.

డిఎస్సీ సెలెక్షన్‌ లిస్టు పెట్టగానే అమృత అంది- ‘నువ్వు పనిచేసే పాఠశాల అందమైన ప్రయోగశాల అవుతుంది కృష్ణా’ అని.

మరొకరిపై ఆధారపడటంలోని ఆనందాన్ని అమ్మ తరవాత నాకు నేర్పింది అమృతే.

మల్లెతీగ మీద విచ్చుకున్న వెన్నెల పువ్వునూ...

కిటికీ కర్టెన్ల చాటునుండి తొంగిచూసే కోయిల పాటనూ...

కంటిపాపల్లో కాపురముండే కలల తేనెపట్టునూ...

బతుకు పయనంలో అంతులేని ఎడారి బాట పక్కనే సమాంతరంగా ఉండే పచ్చని పచ్చికబయళ్ళనూ... నాకు చూపించింది అమృతే.

నా జీవితంలో రెండే దశలు..

అమృత లేని జీవితం..

అమృతతో గడిపిన జీవితం.

పావ్‌లోవ్, థార్న్‌డైక్, టోల్మన్, కోహిలర్, గెస్టాల్ట్‌... ఆపరాంట్, క్లాసికల్‌ కండిషనింగ్, లేటెంట్, ట్రయల్‌ అండ్‌ ఎర్రర్‌ లెర్నింగ్‌..

ప్రైవేట్‌ పాఠశాలలో నా ప్రయోగాలకు అవకాశం తక్కువగా ఉన్నా అడపాదడపా ప్రయత్నించేవాడిని. స్కూలు నుండి మహాబలిపురం టూర్‌ వెళ్ళినప్పుడు సూర్యాస్తమయ సమయంలో నా పక్కనే కూర్చుని అంది అమృత- ‘ఏదైనా నేర్చుకోవడానికి సంబంధించి జంతువులపై ప్రయోగాలు చేసి, వాటి ఫలితాలను సాధారణీకరించారు సైకాలజిస్టులు. కానీ పిల్లాడు మనిషి కదా... అతని మనస్సు, అనుబంధాలు, ఉద్వేగాలు... ఆర్థిక, సామాజిక, కుటుంబ స్థితిగతులు, ప్రాంతానికీ ప్రాంతానికీ మధ్య పరిసరాలలో జీవనస్థితిలో ఉండే వైరుధ్యాలు... వీటన్నింటిని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి’.

అప్పటివరకూ నాకామె కొలీగ్‌ మాత్రమే. ఆ టూర్‌లో అమ్మ తరవాత నన్ను పరిపూర్ణంగా ఎరిగిన రెండోవ్యక్తి ఆమే అనిపించింది. గవర్నమెంట్‌ టీచర్‌గా జాబ్‌లో జాయినైన తొలిరోజే రెండు సంతకాలు చేశాను. ఒకటి అటెండెన్స్‌ రిజిష్టర్‌లో, రెండోది మ్యారేజి రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లో. 

పెళ్ళయిన ఏడాదిన్నరలోపే మాకు దొరికిన వరం పాప.

అమ్మ, అమృత, పాప - ముగ్గురూ సాక్షాత్కరింపజేసిన లోకాలు వేరువేరు. వేటికవే పూర్తిగా భిన్నమైనవి కానీ... తరచిచూస్తే పూదండలోని దారంలా అంతస్సూత్రం ఒకటే కనిపించేది.

పాప కొద్దికొద్దిగా పెరుగుతున్నకొద్దీ అమృతలో బయల్పడుతున్న ఉద్వేగాలూ అభిరుచులూ సంఘటనలకు స్పందించే తీరూ నన్నెంతో ఆశ్చర్యానికి గురిచేయసాగాయి.

అమృత ఎప్పుడో చిన్నప్పుడే ప్రాక్టీస్‌ చేసి వదిలేసిన పెన్సిల్‌ ఆర్ట్‌ను తిరిగి మొదలుపెట్టింది. పాపకోసం... కేవలం పాపకోసం. పాప బొమ్మ గీయడంలో ఆమె పొందే ఆనందాన్ని నేను స్పష్టంగా గమనించాను. తెల్లని కాగితంపై పెన్సిల్‌ రేఖల్లో పాప రూపం ప్రత్యక్షం అవుతున్నకొద్దీ ఆమె మొహంలో కదలాడే తన్మయత్వాన్ని ఎంతో అపురూపంగా వీక్షించేవాడిని.

ప్రతి సంవత్సరం పాప బర్త్‌డే రోజున పాప బొమ్మ గీసేది. ఏడాదికేడాది పాపలోని మార్పును తన పెన్సిల్‌ వర్క్‌లో ఎంతో అందంగా చూపించేది. అమృత జగిత్యాలలోనే ఓ ప్రైవేట్‌ స్కూలులో జాబ్‌ చేయడంతో పాప కూడా అదే స్కూలుకు వెళ్ళేది. నేను జగిత్యాల నుండి 20 కి.మీ.ల దూరంలో ఉండే బడికి రోజూ వెళ్ళివచ్చేవాడిని.

* * *

మారుమూల ఊరిలో ఉన్న మా బడిని మొదటిసారిగా చూసినప్పుడు నాకు ఆనందమేసింది. చాలా బావుంటుంది మా బడి.. పరిసరాలు.. బడిలో రెండు తరగతి గదులు, విశాలమైన ఆటస్థలం... రెండు గుల్‌మొహర్, రెండు వేపచెట్లు. బడికి పడమరవైపున పచ్చని పచ్చికబయళ్ళూ వాటిమధ్యలో నాలుగు గోగుపూల చెట్లూ ఓ ఇప్పచెట్టూ... వర్షాకాలంలో అదీ కొద్దిరోజులు మాత్రమే కనిపించే వాగు.. సుదూరంగా గుట్టపైన తెల్లగా కనిపించే నర్సింహస్వామి ఆలయగోపురం... అందమంతా ఒకచోట కేంద్రీకృతమైనట్లుగా అనిపించేది.

వసంతకాలంలో గోగుపూలు విచ్చుకుని వనానికి కొత్త అందాలను అద్దేవి. అప్పుడప్పుడు నెమళ్ళు గుంపులుగా వచ్చి చాలాసేపు ఉండేవి. ఒక్కోసారి కమ్మని ఇప్పపూల వాసన తేలివచ్చి మత్తులో ముంచెత్తేది. ఉత్తరం వైపు పంటపొలాల మీదుగా శైశవ సమీర హరిణాలు అల్లరల్లరిగా దూసుకొచ్చేవి. ఎండ ఎక్కువ ఉన్నప్పుడు పొలంపనికొచ్చిన ఆడపడుచులు మా బళ్లోకి వచ్చి బోరింగ్‌ దగ్గర తురాయి చెట్టుకింద కూర్చుని ముచ్చట్లాడుకుంటూ సద్ది తిని వెళ్ళిపోయేవారు.

పాపకు ఎప్పుడైనా స్కూలుకు సెలవిస్తే ఇక్కడికి తీసుకొచ్చేవాడిని. ఇంత అందమైన ప్రకృతిలో భాగంగానే బడిపిల్లలూ అనిపించేవారు.

* * *

గిజుబాయ్‌ ‘పగటికల’, టెట్సుకో కురోయనాగి ‘రైలుబడి’ నన్ను చాలా ప్రభావితం చేసిన పుస్తకాలు.ఎందుకూ పనికిరాదనుకున్న టోటోచాన్‌ లాంటి పిల్లలను కొబయాషి తన రైలుబడిలో చేర్చుకుని (పాడుబడ్డ రైలు బోగీలే రైలుబడిలో తరగతి గదులు) వాళ్ళను తీర్చిదిద్దిన తీరు నాకెంతగానో నచ్చింది.

నా బడిలో ఒకటి నుండి అయిదో తరగతి వరకు మొత్తం 35 మంది పిల్లలు. అందరూ మంచు ముసుగుమాటున ముసిముసి నవ్వులు చిందించే ముద్దబంతి పూలలా కనిపించారు. వారి నవ్వులనూ కేరింతలనూ వారికి మాత్రమే పరిమితం కాకుండా పాఠశాల మొత్తానికి వ్యాపింపజేయాలని మొదటిరోజే అనుకున్నాను.

పిల్లలు తమ చదువును అత్యంత సహజంగా కొనసాగించాలి. అప్పుడే వాళ్ళకు చదువుపైన ప్రేమ, ఇష్టం పెరుగుతాయి. దానికోసం వారికి సహజ అభ్యసనా ప్రక్రియలను కల్పించాలి. సహజ అభ్యసనా ప్రక్రియలు అంటే... ప్రతి వ్యక్తీ తన జీవితంలో ఎన్నో విషయాలు నేర్చుకుంటాడు. కానీ ఎప్పుడు నేర్చుకున్నాడో, ఎలా నేర్చుకున్నాడో తెలియదు. సందర్భం ఎదురైనప్పుడు తనకు తానుగా, తన ఇష్టంతో, ఫలానాది నేర్చుకుంటున్నాను అనే స్పృహ లేకుండానే నేర్చేసుకుంటున్నాడు. అలాంటి సందర్భాల్ని కల్పించడం ద్వారానే నేను పిల్లలకు బోధన కొనసాగించసాగాను.

పిల్లలు నన్ను ఏనాడూ ఉపాధ్యాయునిగా భావించలేదు. నేనూ వాళ్ళతో కలిసి ఆడుకునేవాడిని. నేనూ, 35 మంది పిల్లలు, స్వీపర్‌ అంతా ఒక కుటుంబంలా ఉండేవాళ్ళం. నా బడి, చుట్టూ కాంపౌండ్‌వాల్, నా పిల్లలు... ఇది మాత్రమే నా ప్రపంచం, ఇది మాత్రమే నా జీవితం. బడికి రావడం, వెళ్ళడం ఇది మాత్రమే నా దినచర్యగా మారిపోయింది.

చదువుపరంగా పిల్లల్లో గణనీయమైన మార్పు కనబడినా వాళ్ళల్లో సర్వతోముఖాభివృద్ధి జరుగుతోందా లేదా అనే విషయంలో నాలో కొంత సందిగ్ధత ఉండేది. కానీ ఉపాధ్యాయునిగా నా బాధ్యత పిల్లలకు చదువు చెప్పడం. అది మాత్రం నేను ఎలాంటి పొరపాటూ చేయకుండా నిర్వర్తించసాగాను. కానీ ఉపాధ్యాయునిగా నేను నిర్వచించుకున్న పరిధిని పునర్నిర్వచించుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది శారద విషయంలో.

* * *

శారద.. 
చిన్నిపాప... చదువుల తల్లి. తెల్లని బార్బీడాల్‌ ఆకారంలో ప్రాణంపోసుకుని వచ్చినట్లుగా అనిపిస్తుంది. చూడగానే ఎత్తుకుని ముద్దుపెట్టుకోవాలని అనిపిస్తుంది ఎవరికయినా. ఊళ్లో అంగన్‌వాడి కేంద్రం ఉన్నా చాలామంది ప్రీప్రైమరీ పిల్లలు నా బడికి రావడానికి ఇష్టపడతారు.

అలా వచ్చిన నాలుగేళ్ళ పాప శారద. చాలా తెలివితేటలుగలది. పెద్ద తరగతులకు నేను చెప్పే పాఠాలను తిరిగి తన ముద్దుముద్దు మాటలతో అప్పజెప్పేది. పిల్లలంతా అభినయగేయాలు పాడుతూంటే తానూ కలిసి పాడేది, ఆడేది. బాగా అలసిపోయినప్పుడు నిస్సంకోచంగా వచ్చి, నా ఒడిలో నిద్రపోయేది.

మా పాప నాలుగో తరగతిలో ఉన్నప్పుడు శారద ఒకటో తరగతి.

పాప ఎప్పుడైనా స్కూలుకు వచ్చినప్పుడు శారదతోనే గడిపేది. శారదంటే మా పాపకు అమితమైన ఇష్టం ఏర్పడిపోయింది. ఇంటికొచ్చాక కూడా అప్పుడప్పుడు శారద గురించి అడిగేది. శారద గురించిన సంగతులు అమృతకు చెప్పేది. వేసవి సెలవులకు రెణ్ణెళ్ళముందు బడికి వచ్చాడొక వ్యక్తి.

‘‘సార్, నా పేరు రాజం... శారద నా బిడ్డ’’ అన్నాడతను రాగానే.

‘‘చెప్పండి’’

చాలాసేపు మౌనంగా ఉండి పెదాలు విప్పాడు.

‘‘సార్, నేను దుబాయ్‌కు పోతున్నాను’’ అన్నాడు.

‘‘అవునా... కంపెనీ వీసానా?’’ అడిగాను.

‘‘కాదు సార్, టూరిస్ట్‌ వీసా’’.

‘‘డబ్బులు రెడీ చేసుకున్నారా?’’

‘‘ఆఁ... నగలమ్మాను, కొన్ని మిత్తికి తెచ్చాను. మిగిలినవి మైక్రో ఫైనాన్స్‌లో లోను తీసుకున్నాను’’.

నేను మౌనంగా ఉండిపోయాను.

‘‘సార్, శారదకు వాళ్ళమ్మ దగ్గరకన్నా 

నా దగ్గరే ఎక్కువ అలవాటు. దిగులు పెట్టుకుంటుందేమో, కొంచెం మంచిగా చూడండి’’.

వెళ్ళిపోయాడతను.

నాకిప్పటివరకూ అతను తెలియదు. శారద పేరు నమోదు చేయించడానికి ఆమె తల్లే వచ్చింది. రోడ్డుపైన దిగి రెండు కిలోమీటర్లు నడిస్తే ముందుగా వచ్చేది బడే. నా లోకం కూడా బడే కావడంతో నేను ఊరిలోకి చాలా తక్కువగా వెళ్ళేవాణ్ణి.

శారద తండ్రి రాజం వెళ్ళేంతవరకూ అలాగే చూస్తుండిపోయాను.

టూరిస్ట్‌ వీసా, వడ్డీ, మైక్రో ఫైనాన్స్‌- ఆ మూడు మాటలూ కలిసి నాగుపాము బుసలాగా వినిపించసాగాయి.

అయినా అతని చర్యలకు అతనే బాధ్యత వహిస్తాడు. అది నాకు సంబంధంలేని విషయం. మళ్ళీ నా పనుల్లో పడిపోయాను.

కానీ నా అనుమానమే నిజమైంది.

వెళ్ళిన నెలరోజులకే మోసపోయి తిరిగివచ్చాడు రాజం.

ఇంతలో వేసవి సెలవులు వచ్చాయి.

* * *

ఆర్నెల్ల తరవాత నేను నా బడికి వెశ్ళాను... పాపతో సహా.

వారంరోజులనుండి పాప పైన కంప్లెయింట్స్‌- సరిగా చదవడంలేదని, చెప్పిన పని చేయడంలేదని, జడలు సరిగా వేసుకోవడంలేదని, టీచర్‌లపై తిరగబడుతుందని. అందుకే పాపను నా బడికి తీసుకుని వచ్చాను.

చాలా తేడాగా అనిపించింది.

బడి ఆవరణ అంతా పిచ్చిమొక్కలతో నిండిపోయింది. ఇప్పచెట్టు ఎవరో కొట్టేశారు... గోగుపూల చెట్లు ఎండిపోయాయి.

పిల్లలు మాత్రం నన్ను చూడగానే అల్లరిచేస్తూ నా చుట్టూ గుమిగూడారు.

నా దృష్టి మూలగా కూర్చుని ఉన్న శారదపై పడింది.

చాలా చిక్కిపోయి ఉంది.

పగిలిన చెంపలు, లోతుకుపోయిన కళ్ళు, మట్టిగొట్టుకుపోయిన వెంట్రుకలు. వెళ్ళి దగ్గరకు తీసుకున్నాను. రాలేదు. మరింత మూలకు ఒదిగి కూచుంది. మళ్ళీ దగ్గరకు తీసుకోబోయాను.

చేతిలో ఉన్న పలకతో గట్టిగా నా చేతిని కొట్టి, నాకేసి తీక్షణంగా చూసింది. చేతికి తగిలిన దెబ్బకన్నా ఆ పాప చూపులు నన్ను కలవరానికి గురిచేశాయి.

‘ఏమయి ఉంటుంది?’ నాకు నేనే ప్రశ్నించుకున్నాను.

మా పాపను కూడా దగ్గరకు రానివ్వలేదు శారద.

అదేరోజు మా పాపను మా స్కూలులోనే అడ్మిట్‌ చేసుకున్నాను.

మధ్యమధ్యలో శారదను పరిశీలించాను. అన్ని మర్చిపోయి శూన్యంలా మిగిలిపోయినట్లనిపించింది. ఆడదు, పాడదు, వినదు, నేర్చుకోదు, సరికదా అంతకుముందు నేర్చుకున్నవి కూడా మర్చిపోయింది... 

లేదా మర్చిపోయినట్లు నటిస్తోంది.

అంత చిన్నపాప కళ్ళల్లో ఎందుకంత తాత్వికత కనిపిస్తోంది నాకు.

ఆలోచించడానికే భయమేసింది.

* * *

సహజ అభ్యసన ప్రక్రియల్లో భాగంగా నేను సృష్టించిన కృత్యాలలో ఒకటి... ‘ఆకలిగా ఉంది’ అనే డబ్బా. ఒక డబ్బాపై జోకర్‌ బొమ్మ నోరు తెరిచి ఉంటుంది. పిల్లలు చిట్టీలపైన తమకు ఏదితోస్తే అది రాసి ఆ నోటిలో వేయాలి.

బడి టైం అయిపోగానే వాటిని చదివి మర్నాడు పిల్లలతో ముచ్చటిస్తాను. ఆరోజు రాత్రి ఎప్పటిలాగే స్లిప్స్‌ చదువుతుంటే మా పాప చేతిరాతతో ఉన్న ఉత్తరం కనిపించింది. ఆత్రంగా చదివాను.

‘శారద వాళ్ళ డాడీ చచ్చిపోయాడు. 

ఆమె ఇంక ఎప్పటికీ చదవదు... అసలెందుకు చదవాలి?’

నిద్రలో ఉన్నా పాప ప్రశ్నిస్తున్నట్టుగానే అనిపించింది.

రాత్రంతా నిద్రపోలేదు నేను.

తెల్లవారగానే శారద ఇంటికి వెశ్ళాను.

వరండాలో కూర్చుని బావి దగ్గరున్న 

మొండిగోడకేసి తదేకంగా చూస్తూ కనిపించింది శారద.

నన్ను చూడగానే శారద తల్లి బయటకొచ్చింది. ఆమె ఆకారం కూడా దయనీయంగా ఉంది.

‘‘అమ్మా, మీ ఆయన చచ్చిపోయాడని తెలిసింది... శారద కోసమని వచ్చాను’’.

‘‘అది కూడా తొందర్లో చచ్చిపోతుంది... చచ్చిపోనీయండి దాన్ని’’.

‘‘అదేంటమ్మా...’’ షాక్‌తో అడిగాను.

‘‘అదిగో ఆ మొండిగోడ మీద కూచోబెట్టి రోజూ అన్నం తినిపించేవాడు వాళ్ళ నాన్న. ఆయన చచ్చిపోయినప్పట్నించీ తిండి మానేసి, ఆ గోడకేసి చూస్తూ కూచుంటోంది. తినమని దగ్గరకెళితే కొరుకుతుంది... గీరుతుంది’’.

హఠాత్తుగా నాకు నా పాప గుర్తొచ్చింది.

పాప శారద గురించి రాసిందా... తన గురించి రాసిందా?

గుండెలవిసిపోయాయి.

‘‘ఎలా చనిపోయాడమ్మా?’’

‘‘అన్నంలో పురుగులమందు కలుపుకుని’’.

నేనడిగిన ప్రతిదానికీ ఒక మిషన్‌లా సమాధానం చెబుతోందామె.

లేచి ఇంటికి వచ్చాను.

ఇన్ని రోజులూ ఏదైతే నా ప్రపంచమనుకున్నానో ఆ గోడలు కూలుతున్నట్లు అనిపించింది.

కేవలం బడి మాత్రమే నా ప్రపంచం కాదనిపించింది.

రాజం మోసపోతాడని నాకు తెలుసు. అయినా నేనెందుకు అతడిని వారించలేదు? ఎందుకు అతడిని హెచ్చరించలేదు? అతని పరిస్థితుల గురించి ఆలోచించే బాధ్యత నాది కాదు అనుకున్నప్పుడు అతడి పరిస్థితులతో ముడిపడి ఉన్న శారద చదువుకు నేనెలా బాధ్యత వహించినట్లు?

బడికి కేవలం పిల్లలు మాత్రమే రారు. వారివెంట వారి పరిసరాలూ పరిస్థితులూ ఉద్వేగాలూ ఉద్రేకాలూ సుఖాలూ దుఃఖాలూ అనుబంధాలూ ఆత్మీయతలూ అన్నింటినీ తీసుకుని మరీ బడికి వస్తారు. వాటన్నింటినీ న్యూట్రలైజ్‌ చేస్తూ చదువు అనే ట్రాక్‌ పైకి ఎక్కించడమే నా పని. నేను కేవలం వాటిని మాత్రమే స్వీకరించి మిగతావాటిని వదిలేస్తే ఎలా?

శారదను నేను మళ్ళీ మామూలు మనిషిలా, ఇంతకుముందు శారదలా మార్చగలను. 

ఆ నమ్మకం నాకుంది. కానీ శారద లాంటి పరిస్థితి మరొకరికి ఎదురవ్వకూడదంటే నేను నా పరిధుల్ని విస్తృతపర్చాలి.

నా బడిలోని ప్రతి విద్యార్థికి సంబంధించిన పరిపూర్ణ సమాచారం నా దగ్గర ఉండాలి. వారి వికాసంపై ప్రభావాన్ని చూపే ప్రతి అంశాన్ని నేను నిరంతరం అధ్యయనం చేస్తూ ఉండాలి. నా బడిలోంచి పిల్లల మనుసుల్లోకీ వారి కుటుంబాల్లోకీ సమాజంలోకీ వెళ్ళిపోవాలి. 

పిల్లలకు ఎదురయ్యే, ఎదురుకాబోయే సమస్యలను పరిష్కరిస్తూ ఉండాలి.

అందుకోసం ముందుగా ప్రతి విద్యార్థి పర్సనల్‌ రికార్డ్‌ ఒకటి తయారుచేయాలి. దానిలో విద్యార్థి పూర్తి వివరాలతోపాటు, కుటుంబ, సామాజిక చరిత్రతోపాటు వాళ్ళకు ఎదురయ్యే, ఎదురవ్వబోయే సంఘటనల వివరాలు నిరంతరం నమోదు అవుతూ ఉండాలి.

నేను ఈ బడిలో ఉన్నా, లేకున్నా... పిల్లలు పైచదువులకై ఈ పాఠశాలను వదలివెళ్ళినా ఆయా ఉపాధ్యాయులకు ఆ రికార్డ్‌ చూడగానే ఆ విద్యార్థి సామాజిక, ఆర్థిక, మానసిక, శారీరక స్థితిగతులు... స్పందనలూ ద్వేగాలూ శక్తులూ సామర్థ్యాలూ అన్నీ అర్థమైపోవాలి. అప్పుడే ఉపాధ్యాయులు బోధించడం, పిల్లలు నేర్చుకోవడం సులువవుతుంది.

అందరి వివరాలూ లోతుగా అధ్యయనం చేస్తుంటే... ఇన్ని రోజులుగా నా బడిపిల్లల గురించి నాకు తెలిసింది అతి తక్కువ అనిపించింది- ఒక్క మా పాప గురించి తప్ప.

పాప రికార్డ్‌ రాస్తుంటే... చేయి హఠాత్తుగా ఆగిపోయింది.

పాప తల్లి అనే కాలమ్‌లో అమృత అని రాశాక పెన్‌ ముందుకు కదల్లేదు. అయిదు నెలలక్రితం గోదావరిలో జరిగిన పడవ ప్రమాదంలో అమృత చనిపోయిందనీ ఆమె ప్రవాహంలో కొట్టుకుపోతున్నప్పుడు పాప స్వయంగా చూసిందనీ అప్పట్నుంచీ పాప ప్రవర్తన పూర్తిగా మారిపోయిందనీ.. రాద్దామంటే ఎడంచేయి నిద్రిస్తున్న పాప తలపైన, కుడిచేయి రికార్డ్‌పైన నిశ్చలంగా నిలిచిపోయాయి.

అమృత గీస్తూ వదిలేసిన అసంపూర్ణ పెన్సిల్‌ రేఖల్లా. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని