కొడుకు చూపినబాటలో..

రెండ్రోజుల్నించీ ఒకటే వర్షం. ఆ పూటే కొంత తెరిపిచ్చింది. అయినా ఆకాశం ఇంకా మేఘావృతంగానే ఉంది. ఏ క్షణంలోనైనా వర్షం వస్తుందేమోనన్పిస్తోంది. ... 

Published : 09 Apr 2020 18:57 IST

విన్నకోట సుశీలాదేవి

సాయంత్రం అయిదుగంటల సమయం... బాబా గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి, గుళ్లోకెళ్ళి బాబా పాదాలకు నమస్కారం చేశాను. ఆరోజు గురువారం కాకపోవడంతో గుళ్లో జనం లేరు. అందులోనూ రెండ్రోజుల్నించీ ఒకటే వర్షం. ఆ పూటే కొంత తెరిపిచ్చింది. అయినా ఆకాశం ఇంకా మేఘావృతంగానే ఉంది. ఏ క్షణంలోనైనా వర్షం వస్తుందేమోనన్పిస్తోంది. నా స్నేహితుడు భాస్కరరావుకి ఒంట్లో బాగాలేదంటే వాడిని చూద్దామని బయలుదేరాను - ముందుగా దేవుడిని దర్శించుకుని ఆ తర్వాత రెండు వీధులవతల ఉన్న వాడింటికి వెశ్ళాలని. ‘దైవదర్శనం అయింది... ఇక వాడింటికి వెశ్ళాలి’ అనుకుంటూ పూజారిగారిచ్చిన ప్రసాదాన్ని నోట్లో వేసుకుని గుడి ముందున్న అరుగుమీద క్షణంసేపు కూర్చున్నాను.

బయట మా అబ్బాయి కిరణ్‌ మోటార్‌సైకిలు హారను మోగిస్తున్నాడు. ఇక లేద్దామనుకుంటుండగా, ‘బాబూ!’ అన్నమాట వినబడి తలెత్తాను. ఎదురుగా యాభై ఏళ్ళ స్త్రీ నిలబడి ఉంది. సాధారణమైన రూపం... సన్నగా, పొట్టిగా ఉంది. 

‘‘ఏమిటమ్మా’’ అనడిగాను.

‘‘మాది నూజివీడు బాబూ. కోర్టు పనిమీద వచ్చాను. మా ఊరెళ్ళడానికి డబ్బులు తక్కువయ్యాయి. చీకటిపడిపోతోంది. కాస్త సహాయం చేస్తే...’’ అంది.

నేను చిరాగ్గా చూశాను.

ఈ దేశంలో అడుక్కోడానికి వెయ్యి మార్గాలు. అందులో ఇదొకటి. ఊరికే ‘ధర్మం చెయ్యి’ అంటే ఎవరూ చెయ్యరు. ఇలా బస్సుకు డబ్బు చాల్లేదనో లేకపోతే మావాళ్ళు హాస్పిటల్లో ఉన్నారనో అంటే- సానుభూతి పెరుగుతుంది. డబ్బులు రాల్తాయి. అడుక్కోవడంలో ఇదొక రాజమార్గం.

‘‘అడుక్కోవడానికి ఇంకా కారణం కనబడలేదా? ఊరెశ్ళాలని అబద్ధాలు కూడానా? 

నీ మాటలు నమ్మడానికి నేనేం వెర్రివెధవను కాను. మామూలుగా అడిగితే ఓ రూపాయి ఇచ్చేవాడినేమో కానీ నీ అబద్ధాలు వింటుంటే అది కూడా ఇవ్వబుద్ధికావడంలేదు. ఫో, ఫో...’’ అంటూ కసిరాను.

ఆవిడ వెళ్ళిపోయింది.

బయట కిరణ్‌ మరోసారి హారన్‌ మోగించాడు. నేను లేచి చెప్పులేసుకుని గబగబా కిరణ్‌ దగ్గరకెశ్ళాను.

‘‘ఏరా, లోపలికొచ్చి దేవుడికి దణ్ణం పెట్టుకోవచ్చుగా’’ అన్నాను కిరణ్‌తో.

‘‘నిన్ను అంకుల్‌ వాళ్ళింటి దగ్గర దింపేసి గుడికొస్తాలే. తొందరగా ఎక్కు నాన్నా’’ అన్నాడు బండి స్టార్ట్‌ చేస్తూ.

నేను వెనకాల కూర్చున్నాను.

పది నిమిషాల్లో భాస్కరరావు ఇంటిముందు ఆపాడు.

‘‘నేను మళ్ళీ పావుగంటలో వస్తాను నాన్నా. మబ్బు కూడా పడ్తోంది. వర్షం రాకముందే ఇంటికెళితే నయం’’ అన్నాడు.

‘‘అలాగేలే’’ అన్నాను.

కిరణ్‌ నన్ను దింపేసి వెళ్ళిపోయాడు.

నేను వెళ్ళేసరికి భాస్కరరావు గదిలో మంచంమీద దుప్పటి కప్పుకుని పడుకుని ఉన్నాడు.

మేమిద్దరం ఒకేసారి ఉద్యోగంలో చేరాం. 

ఏ క్షణాన కలిశామో అప్పటినుండి మాది విడదీయరాని స్నేహం అయింది. దాదాపు పాతికేళ్ళు ఒకేచోట కలిసి పనిచేశాం. సంవత్సరం తేడాతో రిటైరయ్యాం. వాడికొక కూతురు - ఈమధ్యనే పెళ్ళి చేశాడు. తమ్ముళ్ళ, చెల్లెళ్ళ బాధ్యతలుండటంతో స్థలం కొనుక్కున్నా రిటైరైన తర్వాతగానీ ఇల్లు కట్టుకోలేకపోయాడు. నేను ఉద్యోగంలో చేరిన వెంటనే కట్టుకున్నాను.

‘‘అన్నయ్యగారూ, అలా నిలబడిపోయారేం... కూర్చోండి’’ లోపలినుండి కామేశ్వరమ్మ వచ్చింది.

‘‘వీడు నిద్రపోతున్నాడేమోనని...’’

నా మాటలకు కళ్ళు విప్పాడు భాస్కరరావు.

లేచి కూర్చుంటూ ‘‘నిద్రపోవడంలేదురా, ఊరికే కళ్ళు మూసుకున్నా, రా...’’ అంటూ పక్కనున్న కుర్చీ జరిపాడు.

‘‘ఏమిటీ ఇంకా జ్వరం తగ్గలేదా?’’ అనడిగాను కుర్చీలో కూర్చుంటూ.

‘‘తగ్గింది. కానీ నీరసం. వయసు మీదపడుతోంది కదా... కోలుకోడానికి టైం పడ్తుంది’’ అన్నాడు.

వాడి నుదుటిమీద చెయ్యి వేశాను. చల్లగానే ఉంది.

‘‘హఠాత్తుగా వచ్చినట్లుంది. ఏమన్నా దిగులుపడ్డావా?’’ అనడిగాను.

‘‘అబ్బే, అదేం లేదురా. వయసు పెరిగేకొద్దీ రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. కాస్త చలివేసినా ఎండకాసినా తట్టుకోలేం. ఇదిగో ఇలా మంచంలో పడాలి’’ అన్నాడు నీరసంగా నవ్వుతూ. ఇంతలో కామేశ్వరమ్మ భాస్కరరావుకు పళ్ళరసం, నాకు టీ తెచ్చింది.

‘‘అసలు విషయం అన్నయ్యగారి దగ్గర దాస్తారెందుకండీ’’ అంది.

‘‘ఏమిటమ్మా అది’’ అనడిగాను.

‘‘ఈయనగారి పెద్ద చెల్లెలు వాళ్ళ కూతురి పెళ్ళికి డబ్బు సర్దమని ఈయన్ని అడిగింది. మా పరిస్థితి మీకు తెలుసు కదా. ఆ పెన్షన్, ఈ పక్క రెండుగదుల పోర్షన్‌ అద్దె డబ్బులే మాకాధారం. వేరే నిలవేసిందేంలేదు. ఇంటిమీద కొద్దిగా అప్పు కూడా ఉంది. ఈ స్థితిలో చెల్లెలికి ఎలా డబ్బు పంపించాలా అని ఆలోచించి ఆలోచించి ఈ జబ్బు తెచ్చుకున్నారు’’.

కామేశ్వరమ్మ సగం కోపం, సగం నిష్ఠూరంగా అంది.

‘‘ఏరా, నిజమేనా?’’ అనడిగాను.

‘‘ఏదో అడిగింది. నేను అప్పుకోసం ప్రయత్నించాను. అంతే, దానికోసమేమీ దిగులుపడలేదులేరా. ఈవిడ చిన్న విషయానిక్కూడా రాద్ధాంతం చేస్తుంది’’ విసుగ్గా అన్నాడు.

‘‘అయినా భాస్కరం నాకు తెలీకడుగుతాను... చెల్లెళ్ళకు పెళ్ళిళ్ళు చేశావు చాలదా. ఇంకా వాళ్ళ పిల్లలక్కూడా నువ్వే పెళ్ళిళ్ళు చేయాలా? ఇదెక్కడి న్యాయంరా!’’.

‘‘అలా అడగండి’’ అంది కామేశ్వరమ్మ.

‘‘ఏదో అన్నయ్యను కదా అని అడిగింది. నా సంగతి దానికి తెలీదూ’’ అన్నాడు భాస్కరరావు.

‘‘ఇంతకీ డబ్బు దొరికిందా?’’

‘‘దొరికితే ఈయన మంచంలో ఎందుకుంటారన్నయ్యా! హుషారుగా వెళ్ళి చెల్లెలికిచ్చేవారు’’ అంది కామేశ్వరమ్మ.

‘‘అబ్బ, ఇంక ఆ సోది ఆపు. వాడేదో నన్ను చూడటానికి వస్తే నీ వెధవ వాగుడుతో వాడి బుర్ర తినెయ్యకు. నువ్వు లోపలకెళ్ళు ముందు’’ కోపంగా అన్నాడు.

ఆవిడ చురచురా చూస్తూ లోపలకెళ్ళిపోయింది.
‘‘ఎందుకురా అలా విసుక్కుంటావ్‌..!’’

‘‘రోజూ ఇదే గొడవరా... నేనేదో వాళ్ళకు దోచిపెట్టేస్తున్నానని. నాకే లేదు, నేనేం పెడ్తాను. ఏదో పాపం, దానిదీ చిన్న సంసారం. పెళ్ళి కదా, డబ్బు సర్దుతానేమోనని అడిగిందిరా. దానికింత రాద్ధాంతం చేస్తుంది. అయినా మనిషన్నాక ఇతరుల కష్టాల్లో పాలుపంచుకోవాలి. ఒకరికొకరు సహాయం చేసుకోవాలికదరా’’ అన్నాడు.

‘‘మరి ఈ విషయం నాతో చెప్పలేదేం?’’

‘‘ఇప్పటికే నీకు అప్పుపడ్డాను. అది తీరిస్తే చాలు. ఇంక నీ దగ్గర తీసుకోలేనురా’’.

‘‘నా దగ్గర వద్దుకానీ ఇంకెక్కడైనా చూస్తాలే, దిగులుపడకు’’ అన్నాను వాడి భుజంమీద చెయ్యివేసి.

‘‘సరేలే, ఇంకేమన్నా మాట్లాడు. పిల్లలెలా ఉన్నారు?’’

‘‘పెద్దవాడు ఉద్యోగంలో స్థిరపడినట్లే. చిన్నవాడికి ఈ సంవత్సరం క్యాంపస్‌ సెలక్షన్‌ రావొచ్చు’’.

‘‘అదృష్టంతుడివిరా. పిల్లలిద్దరూ రత్నాలు. అన్నట్లు నువ్వెలా వచ్చావు, కిరణ్‌ దింపాడా?’’

‘‘ఆఁ’’

‘‘లోపలకి రాకుండా వెశ్ళాడే?’’

‘‘పనుండి వెశ్ళాడు. పావుగంటలో వస్తానన్నాడు’’ అంటూ వాచీ చూసుకున్నాను.

అప్పుడే నేనొచ్చి అరగంట దాటింది.

కిరణ్‌ ఇంకా రాలేదే! బయట దట్టంగా మబ్బులు కమ్ముకొస్తున్నట్లు బాగా చీకటిపడిపోయింది. పెద్ద వర్షం వచ్చేట్లుంది.

‘‘వర్షం వచ్చేట్లుందిరా. వీడింకా రాలేదే...’’ అనుకుంటుండగా పక్క టేబుల్‌పైనున్న 

ఫోను మోగింది.

భాస్కరరావు తీసి ‘‘నీకేరా, కిరణ్‌’’ అని ఇచ్చాడు.

నేను ఫోనందుకున్నాను.

‘‘నాన్నా, నేను బస్టాండులో ఉన్నాను. 

రావడానికి ఆలస్యం అవొచ్చు. వర్షం వచ్చేలా ఉంది. నువ్వు ఇంటికి వెళ్ళిపో’’ అన్నాడు.

ఫోను పెట్టేశాను.

‘‘కిరణ్‌- ఫ్రెండుని బస్సెక్కించడానికి బస్టాండుకు వెళ్ళినట్లున్నాడు. ఇప్పుడప్పుడే రావడానికి కుదరదట. నేను వెశ్తారా. మళ్ళీ వస్తాలే. డబ్బు కోసం దిగులుపడకు. నీ పెన్షన్‌మీద లోను ఇస్తారేమో కనుక్కుంటాలే’’ అన్నాను మెల్లగా.
‘‘నువ్వామాత్రం సహాయం చేస్తే చాలురా. అస్సలు లేదనేకంటే ఎంతోకొంత ఇస్తే అది సంతోషిస్తుంది. అదే నా తాపత్రయం’’ అన్నాడు.

‘‘సరేలే’’ అని లోపలకెళ్ళి కామేశ్వరమ్మతో చెప్పి బయటికొచ్చాను. నా అదృష్టంకొద్దీ సందు మలుపు తిరగ్గానే ఆటో కనబడింది. ఎక్కి ఇంటికొచ్చాను.

* * *

నేనింటికొచ్చానో లేదో వర్షం మొదలైంది.

‘‘కిరణ్‌ ఇంకా రాలేదు. ఈ వర్షంలో ఎక్కడ చిక్కుకుపోయాడోనండీ’’ లక్ష్మి ఆరాటపడ్తోంది.

ఇద్దరం వాడికోసం ఎదురుచూస్తూ హాల్లో కూర్చున్నాం. మరో అరగంట తర్వాత పూర్తిగా తడిసిపోయి వచ్చాడు కిరణ్‌.

వాడిని చూసి లక్ష్మి కంగారుపడింది. గబగబా లేచివెళ్ళి టవల్‌ తెచ్చింది.

‘‘వర్షం మొదలవకుండానే రావొచ్చు కదా. ఏం రాచకార్యాలు వెలగబెడ్తున్నావ్‌’’ అంది విసుక్కుంటూ.

కిరణ్‌ లోపలకెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చాడు.

టవల్‌తో తల తుడుచుకుంటుండగా లక్ష్మి హార్లిక్స్‌ కలుపుకువచ్చింది.

‘‘ముందు హార్లిక్స్‌ తాగు. తల నేను తుడుస్తాను’’ అంటూ కప్పు అందించింది.

‘‘బస్టాండుకెందుకెశ్ళావ్, ఫ్రెండెవరైనా ఊరు వెళ్తున్నాడా?’’ అనడిగాను.

‘‘లేదు నాన్నా, ఇందాక బాబా గుడి దగ్గర ఒక ముసలావిడ కనబడింది. నూజివీడు వెశ్ళాలట. ఊరెళ్ళడానికి డబ్బుల్లేవట. ఎంత బాధపడిపోతోందో పాపం. ఒకపక్కన వాన వచ్చేట్లుంది. తెలియని ఊరు. అందుకని 

నేనావిడను ఎక్కించుకుని బస్టాండుకెశ్ళాను. నూజివీడు బస్సు వచ్చాక టిక్కెట్టు కొని బస్సు ఎక్కించి వచ్చాను. ఖర్చులకు యాభై ఇచ్చాను. ఎంత ఆనందపడిందో నాన్నా’’ అంటున్నాడు కిరణ్‌.

నేను ఆశ్చర్యంగా వింటున్నాను.

‘‘ఆవిడ చాలామందిని అడిగిందట. ఎవరూ ఇవ్వలేదట. ‘నన్ను బిచ్చగత్తెననుకున్నారేమో బాబూ’ అంది. అసలావిడ పొద్దున వచ్చేటప్పుడు రానూపోనూ ఛార్జీలకు డబ్బు తెచ్చుకుందిట. కానీ కోర్టులో గుమస్తాలూ జవాన్లూ ఆవిడ దగ్గర ఉన్నదంతా ఊడ్చేశారుట. 

ఊరెళ్ళడానికి డబ్బుల్లేక అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని కళ్ళనీళ్ళెట్టుకుంది. నాకు చాలా బాధ కలిగింది నాన్నా’’ అంటూ, ‘‘అవునూ, నాకంటే ముందు గుడికెశ్ళావ్‌ గదా, ఆవిడ నీకు కనబడలేదా?’’ అనడిగాడు.

‘‘కనబడింది’’ సన్నగా గొణిగాను.

‘‘నువ్వూ బిచ్చగత్తె అనే అనుకున్నావా?’’ 

నేను మాట్లాడలేదు.

‘‘ఇరవై ఏళ్ళక్రితం నీకో అనుభవం ఎదురైందని ఒకసారి నాకు చెప్పావ్‌ గుర్తుందా నాన్నా. అయినా కూడా నువ్వు మనిషిని నమ్మలేదు కదూ’’.

దెబ్బతిన్నట్లు చూశాను.

‘‘ఒరేయ్, గొప్ప ఘనకార్యం చేశావ్‌గానీ కబుర్లు ఆపి, హార్లిక్స్‌ తాగు. చల్లారుతోంది’’ అంది లక్ష్మి టీవీ ఆన్‌ చేస్తూ.

కిరణ్‌ టీవీ చూస్తూ హార్లిక్స్‌ తాగుతున్నాడు.

కిరణ్‌ మాటలు నాలో సంచలనం రేపాయి. నా మనోఫలకం మీద ఇరవై ఏళ్ళనాటి సంఘటన మెదిలింది.

*          *        *

అప్పుడు నాకు మా తండ్రి నుండి సంక్రమించిన పొలం అయిదెకరాలు ఉండేది. అది కృష్ణాజిల్లాలోని గుడ్లవల్లేరు దగ్గర్లో ఉన్న పల్లెటూళ్లోఉంది. విజయవాడలో నా ఉద్యోగం. సొంత వ్యవసాయం చేయడం కష్టమని పొలాన్ని కౌలుకిచ్చాను. అప్పుడప్పుడు వెళ్ళి చూసొస్తుండేవాడిని.

ఒకసారి పొలానికి ఎరువులు వేస్తున్నారంటే చూడ్డానికి వెశ్ళాను. పొలానికి కలుపు తీసి ఎరువులు వేశారు. పనంతా ముగిసేసరికి చీకటిపడింది. బస్సెక్కి గుడ్లవల్లేరు వచ్చేసరికి ఎనిమిదిగంటలైంది. మరో అరగంటలో విజయవాడకు బస్సు ఉంది. అదే చివరి బస్సు. దానికోసం ఎదురుచూస్తూ బస్టాండులో కూర్చున్నాను.

‘‘అయ్యా, టీ తాగుతారా?’’ ఫ్లాస్కు, టీ గ్లాసుల్తో వచ్చాడొక కుర్రాడు.

‘‘ఇవ్వు’’ అంటూ జేబులో నుండి డబ్బులు తీశాను.

అంతా చిల్లర..

‘ఇదేమిటీ నోట్లుండాలే, ఏమయ్యాయి?’ అనుకుంటూ చొక్కా జేబు, ప్యాంటు జేబులు వెతికాను.

ఎక్కడా లేవు. చేతిలోని చిల్లర లెక్కపెట్టాను.

ఏడున్నర ఉంది. విజయవాడ వెశ్ళాలంటే బస్సుకు ఎనిమిది రూపాయలు కావాలి. మళ్ళీ జేబులన్నీ వెతికాను. పైసా కూడా తగల్లేదు.

‘నోట్లు ఏమయ్యాయి?’ ఆలోచించాను. అనుకోకుండా కూలి పెరగడంతో తెచ్చిన డబ్బంతా ఇవ్వాల్సొచ్చింది. అయినా నా దగ్గర ఇంకో పది రూపాయలనోటు ఉండాలే.. ఏమయింది..? ఎంత ఆలోచించినా గుర్తురాలేదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది.

అది సరే, ఇప్పుడు విజయవాడ ఎలా వెశ్ళాలి? అర్ధరూపాయి తగ్గిందే, ఎవరిస్తారు?

‘‘అయ్యా, టీ ఇదిగోనండీ’’ కుర్రాడు 

గ్లాసివ్వబోయాడు.

‘‘వద్దు... తీసుకుపో’’ చిరాగ్గా అరిచాను.

మరికొద్దిసేపట్లో బస్సు వచ్చేస్తుందేమో... ఎలా? పైసా తక్కువైనా కండక్టర్‌ ఎక్కించుకోడు. నిర్దాక్షిణ్యంగా మధ్యలో దించేస్తాడు. ఇప్పుడిక్కడ నాకెవరిస్తారు... ఎవరినడగాలి... పిచ్చెక్కినట్లుగా ఉంది.

ఆ పల్లెటూళ్లో అయితే ఎవరన్నా ఇచ్చేవారు. ఇక్కడ గుడ్లవల్లేరులో తనకెవరూ తెలీదే, ఎలా? చుట్టూ చూశాను. ఊరంతా అప్పుడే మాటుమణిగింది. చలికాలం అవడం వలన ఊళ్లో తొందరగా పడుకున్నట్లున్నారు. ఇప్పుడేం చేయాలి? మళ్ళీ చుట్టుపక్కల చూశాను.

కొద్దిదూరంలో ఒక బడ్డీకొట్టు, టీకొట్టు కనబడ్డాయి. ఆ బడ్డీకొట్టువాడినడిగితే అర్ధరూపాయి ఇవ్వడా... ఇవ్వొచ్చు..అనుకుంటూ లేచి బడ్డీకొట్టు దగ్గరికెశ్ళాను.

‘‘ఏం కావాలయ్యా’’ అనడిగాడు.

‘‘ఏం వద్దుగానీ చిన్న సహాయం చేయాలి’’ అన్నాను చిన్నగా.

‘‘సహాయమా!’’

‘‘అవును. నేను విజయవాడ వెశ్ళాలి. 

కానీ బస్సు టిక్కెట్టుకు అర్ధరూపాయి తగ్గింది. నాకు ఆ అర్ధరూపాయిస్తే ఈసారి వచ్చినప్పుడు ఇచ్చేస్తాను’’ సిగ్గుతో సగం చచ్చిపోయి అడిగాను.

బడ్డీకొట్టువాడు నన్ను ఎగాదిగా చూసి, ‘‘బస్సు టిక్కెట్టుకు అర్ధరూపాయి తగ్గిందా. అడుక్కోడానికి భలే మార్గం కనిపెట్టావ్‌లే. ఫో... ఫో...’’ అంటూ కసిరాడు.

సిగ్గుతో అవమానంతో నా తల వొంగిపోయింది. భూమి విచ్చిపోయి నన్ను తనలోకి తీసుకుంటే బాగుండునన్పించింది. నెమ్మదిగా వెనుదిరిగాను.

‘‘చూశావా కోటయ్యన్నా, రోజులు మారిపోయాయి. పదిపైసలు, అయిదు పైసలు అడుక్కోవడం మానేశారు. ఏకంగా రూపాయిలే అడుక్కుంటున్నారు. మళ్ళీ పెద్దోడిలా ఫోజు ఒకటీ... చూడబోతే కన్నాలేసే దొంగలా ఉన్నాడు’’ పక్కనున్న టీకొట్టువాడితోనేమో అరిచి చెప్తున్నాడు.

ఇక అక్కడ నిలవలేకపోయాను. గబగబా నడుచుకుంటూ రైలుస్టేషనుకొచ్చాను. 

రైలుకైతే డబ్బులు సరిపోతాయి. కానీ విజయవాడకు వెళ్ళే రైలు తెల్లారి అయిదింటికుంది. అప్పటివరకూ స్టేషన్లో కూర్చోక తప్పదు అనుకున్నాను.

అదొక చిన్న స్టేషను. పైన ఎటువంటి ఆచ్ఛాదనా లేదు. ఒక మూలగా ఉన్న సిమెంటు బెంచీమీద - చలికి వణుకుతూ రాత్రల్లా కూర్చున్నాను.

అయిదెకరాల పొలం - అయిదు లక్షలు ఖరీదు చేసే ఇల్లు - పదివేల బ్యాంకు బ్యాలెన్సు ఉన్నాయి. కానీ ఈ క్షణంలో అర్ధరూపాయిలేక బిచ్చగాడిలా మారాను. 

చివరికీ చలిలో... ఆకలితో నకనకలాడుతూ కూర్చున్నాను. ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉందా? దుఃఖానికీ బాధకూ అతీతమైన నిర్వేదస్థితి ఆవరించింది నన్ను.

‘ఆ బడ్డీకొట్టువాడు అర్ధరూపాయి ఇవ్వలేకపోయాడు. ఈ లోకంలో దయ, జాలి, మానవత్వం లేవు. ఇక నేను కూడా ఎవ్వరిమీదా జాలి చూపకూడదు. మనుషులు చస్తున్నా సానుభూతి చూపకూడదు’ 

అనుకున్నాను కసిగా.

* * *

అదంతా గుర్తుకొచ్చింది. చిన్నగా నిట్టూర్చాను.

‘‘నాన్నా, అమ్మ భోజనానికి పిలుస్తోంది’’ అంటూ వచ్చాడు కిరణ్‌.

‘‘కిరణ్, ఇందాక నువ్వొక ప్రశ్న వేశావు కదూ. ఇరవై ఏళ్ళక్రితం నాకెదురైన అనుభవం నాకొక పాఠాన్ని నేర్పింది. అదేమిటంటే, 

మనిషిని నమ్మవద్దని... ఎవ్వరికీ సహాయపడకూడదని. నా స్నేహితుడైన భాస్కరరావు దగ్గర కూడా వడ్డీ తీసుకునే అప్పులిచ్చాను. నాకు జాలి, దయ లేవు సరేనా’’ అన్నాను ఉక్రోషంగా.

కిరణ్‌ నా పక్కన కూర్చుని నా చేతిని పట్టుకున్నాడు.

‘‘నాన్నా, నీలో అదే నాకు నచ్చలేదు. ఆరోజు నువ్వు బాధపడ్డావు కాబట్టి, బాధల్లో ఉన్నవాళ్ళను ఆదుకోవాలి. అంతేకానీ కసి పెంచుకోకూడదు. ఈరోజు ఆ ముసలామెకు ఎవ్వరూ డబ్బులివ్వకపోతే ఆవిడ ఏమైపోయేది? ఈ వర్షంలో చలిలో చచ్చిపోయేది. అంతేనా. అలా చేయడం ధర్మమేనా? 

నీకెవరో అన్యాయం చేశారని లోకాన్నంతటినీ నిందించటం మంచిదేనా? నువ్వే ఎన్నోసార్లు చెప్పావు- ధర్మమంటే ఏమిటో... ఇతరులు ఏదిచేస్తే నీకు కష్టం కలుగుతుందో అది ఇతరులకు చేయకపోవడమే ధర్మమని. కానీ నువ్వే ఆచరణలో పెట్టలేదు. నాన్నా, నీలో తప్పులు వెతికేంత గొప్పవాడిని కాదు. నేను నీ కొడుకుని... ఏదో నాకు తోచింది చెప్పాను’’ అంటూ లేచివెశ్ళాడు కిరణ్‌.

ఒంటరిగా కూర్చున్నాను.
కిరణ్‌ మాటలు నాలో సంచలనం కలిగించసాగాయి.

ఇన్నాళ్ళూ నేను ఎంతో సంకుచితంగా ప్రవర్తించాను. నిజమే... డబ్బుకీ ప్రాణానికీ ముడివేసుకుని కారుణ్యం, కనికరంలేని కఠిన హృదయుడనయ్యాను. మానవత్వం మర్చిపోయాను. ఎవరన్నా అప్పు అడిగితే అసహ్యించుకున్నాను. ధర్మం చెయ్యమంటే కసిరికొట్టాను. కానీ నా అనుభవం నుండి నేను నేర్చుకోవాల్సిన పాఠం ఇదికాదేమో!

ఆరోజు అర్ధరూపాయి లేక ఎంతో బాధపడ్డాను. నా బాధ ఎవరూ అర్థంచేసుకోలేదనుకున్నాను. కానీ అర్థం చేసుకోనిది నేను. అవును, నేను ఎదుటి వ్యక్తిని అర్థంచేసుకోలేదు. సాటిమనిషి కష్టాన్ని గుర్తించలేదు.

నేను చేసింది తప్పేనా?
కిరణ్‌ ఎదురుగా నిలబడి ‘నాన్నా, నువ్వు చేసింది ముమ్మాటికీ తప్పే. 

సాటివారిపట్ల నువ్వు ఇంకాస్త కరుణతో ఉండాలి’ అంటున్నట్లు తోచింది.

నా తల వాలిపోయింది.

కిరణ్‌ చిన్నవాడైనా - అనుభవజ్ఞుడిలా ఆదేశిస్తున్నాడు.

కొడుకైనా - తండ్రిలా హితబోధ చేస్తున్నాడు.

నా కళ్ళు తెరిపించాడు.

ఆ క్షణంలో ఏదో ఒక మంచిపని చేసి కిరణ్‌ ముందు తలెత్తుకు తిరగాలన్పించింది. ‘ఏం చేయాలా?’ అని ఆలోచిస్తున్న నాకు స్నేహితుడు భాస్కరరావు గుర్తొచ్చాడు. చెల్లెలికి సహాయం చేయాలని అతను పడే ఆరాటం గుర్తొచ్చింది. రేపే బ్యాంకులో ఉన్న పాతికవేలు డ్రా చేసి భాస్కరానికివ్వాలి. ఆ విషయం కిరణ్‌కి చెప్పి, వాడి ముఖంలో కనబడే సంతోషం చూడాలి. వాడితో ‘నాన్నా, యూ ఆర్‌ గ్రేట్‌’ అన్పించుకోవాలి- అనుకున్నాను. 

బయట వర్షం వెలిసింది. నా మనసులో అలజడి తగ్గింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని