అమ్మ

‘మామయ్యా, అమ్మని ఓల్డేజ్‌హోంలో చేర్చుదామని అనుకుంటున్నాను. నువ్వొకసారి రాగలవా?’ అంటూ వేణు దగ్గర నుండి ఫోన్‌...

Updated : 10 Apr 2020 12:29 IST

శ్రీమతి ఎన్‌. సురేఖా కృష్ణ

‘మామయ్యా, అమ్మని ఓల్డేజ్‌హోంలో చేర్చుదామని అనుకుంటున్నాను. నువ్వొకసారి రాగలవా?’ అంటూ వేణు దగ్గర నుండి ఫోన్‌. ‘ఎందుకు, ఏమిటి’ అని అడిగేలోపే ఫోన్‌ పెట్టేశాడు వాడు. ఇప్పుడు రేవతిని వృద్ధాశ్రమంలో చేర్చాల్సిన అవసరం ఏమొచ్చింది వాడికి అని ఆలోచనలో పడ్డాను.

గతం గుర్తుకొచ్చింది.

వేణు తల్లి లక్ష్మి నాకు తోడబుట్టిన అక్క. బావ ప్రసాదరావు. చాలా మంచివాడు. మా అమ్మానాన్నలు పల్లెటూళ్లో ఉండటంవల్ల నేను అక్కా వాళ్ళింట్లో ఉండి చదువుకునేవాణ్ణి. డెలివరీ టైంలో డాక్టర్ల నిర్లక్ష్యంవల్ల మా అక్క చనిపోయింది. అప్పటికి వేణు ఐదురోజుల పిల్లాడు. బంధువులందరూ బలవంతపెట్టగా బాబుకోసం బావ రేవతిని పెళ్ళిచేసుకున్నాడు. రేవతి ప్రసాదరావుకి దూరపు బంధువుల అమ్మాయి. తల్లీ తండ్రీ లేరు. మేనమామ పెంచాడు. రేవతి నెమ్మదస్తురాలు. పదవ తరగతి వరకూ చదువుకుంది. బావ రెండోపెళ్ళి చేసుకునేసరికి ‘నేనెక్కడ ఉండాలీ’ అన్న ఆలోచనలోపడ్డాను నేను. వచ్చిన అమ్మాయికి నేను ఇక్కడ ఉండటం ఇష్టముంటుందో లేదో, వెళ్ళిపోతే బావ ఏమనుకుంటాడో అని సందిగ్ధంలో పడిపోయాను.

రేవతి వచ్చిన వారంరోజులకు నా గదిలో బుక్స్‌ సర్దుకుంటున్నాను. ‘అన్నయ్యా’ అని వినిపించింది. తలెత్తాను. ఎదురుగా రేవతి. మొహమాటంగా లేచి నుంచున్నాను.

‘అన్నయ్యా, మీరేమీ అనుకోకపోతే ఒక మాట చెబుతాను. మీరు ఇక్కడే ఉండి చదువుకుంటున్నారని మీ బావగారు చెప్పారు. నేను వచ్చినందువల్ల మీరు ఇబ్బందిగా ఫీలవుతున్నారనీ వేరేగా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారనీ కూడా చెప్పారు. అన్నయ్యా, మీరు వెళ్ళిపోవద్దు. నేను కూడా మీ చెల్లినే. మీ చదువు అయిపోయేవరకూ మీరు ఇక్కడే ఉండాలి. మీకు నాపట్ల ఇలాంటి అభిప్రాయం రావటానికి నేనేమైనా తప్పుగా ప్రవర్తించి ఉంటే క్షమించండి. అంతేకానీ మీరు వెళ్లొద్దన్నయ్యా, ప్లీజ్‌’ అంది తడిసిన కళ్ళతో చేతులు జోడిస్తూ.

ఇంత మంచి అమ్మాయిని అపార్థం చేసుకున్నందుకు నన్ను నేనే తిట్టుకున్నాను.

‘అబ్బే అదేంలేదమ్మా. నువ్వు ఇంతగా చెప్పాక కూడా వెళితే నేను మనిషినేకానమ్మా. నేను ఇక్కడే ఉంటాను’ అన్నాను రేవతి తల నిమిరి.

‘చాలా థాంక్స్‌ అన్నయ్యా’ అంటూ సంతోషంగా వెళ్ళిపోయింది రేవతి. ఆ తరవాత మరెప్పుడూ రేవతి పరాయి అమ్మాయి అన్న ఆలోచన కూడా రాలేదు నాకు. అంతలా ఆప్యాయతానుబంధాలు నెలకొన్నాయి మామధ్య. బాబుని చాలా ప్రేమగా చూసుకునేది రేవతి.

‘అమ్మలేని లోటు నాకు బాగా అనుభవం అన్నయ్యా. బాబుకు ఆ లోటు తెలియకూడదు. అసలు నేను సవతితల్లిననే విషయమే వాడికి తెలియకూడదు’ అని బావ దగ్గరా నా దగ్గరా మాట తీసుకుంది రేవతి. మా అక్క ఉన్నా కూడా అంత బాగా చూసుకునేదికాదేమో అనిపించేది ఒక్కోసారి. మా అమ్మానాన్నలకు కూడా కూతురులేనిలోటు తీర్చటంలో సఫలీకృతురాలయింది రేవతి.

ఇంటికి వచ్చిన బంధువులందరితో కూడా రేవతి ఆప్యాయంగా మెలిగేది. ఇరుగు పొరుగువారి దగ్గరకానీ చుట్టాల దగ్గరకానీ రేవతికి చాలా మంచి అమ్మాయి అని పేరు వచ్చింది. రెండేళ్ళు గడిచాయి. బాబు రేవతిని వదిలి క్షణం కూడా ఉండేవాడు కాదు. వాళ్ళ నాన్నకన్నా అమ్మ దగ్గరే మాలిమి ఎక్కువ వాడికి.

నాకు చదువు అయిపోయి జాబ్‌ కూడా అనుకోకుండా అక్కడే దొరికింది. రేవతి, బావ, నేను కూడా చాలా ఆనందించాం అందుకు. నేను అప్పుడప్పుడూ జాబ్‌ పనిమీద క్యాంపులకు వెళ్ళవలసి వచ్చేది. ఒకసారి అలా ఢిల్లీ వెళ్ళి పదిరోజుల తరవాత వచ్చాను. అప్పటికి రేవతి హాస్పిటల్‌లో ఉంది. రెండేళ్ళుగా చూస్తున్నా ఏ రోజూ కనీసం తలనొప్పి కూడా ఎరుగని రేవతిని హాస్పిటల్‌లో చేర్చేంతగా ఏమైందో తెలియలేదు. అడిగినా బావ చెప్పలేదు. ఏదో దాస్తున్నాడనిపించింది. రేవతికి సాయంగా ఉండటానికి అమ్మ వచ్చింది. అమ్మ ఒక నెల ఉండి వెళ్ళింది. తనను బస్‌ ఎక్కించివచ్చి ఆఫీసుకు వెళ్ళిపోయాను.

సాయంత్రం నేను ఆఫీసు నుండి వచ్చేసరికి రేవతి ఒక్కతే ఉంది. నేను ఫ్రెష్‌ అయి వచ్చేసరికి రేవతి కాఫీ ఇచ్చింది. సభ్యతకాదని అనిపించినా తనని అడగకుండా ఉండలేకపోయాను. ‘రేవతీ, నీకెప్పుడూ కొద్దిపాటి నీరసంకూడా రాదుకదా. హాస్పిటల్‌లో చేరేంత పెద్ద అనారోగ్యం ఏం వచ్చింది. నీకిష్టమైతేనే చెప్పమ్మా. బావని అడిగినా చెప్పలేదు. అందుకని నిన్ను అడుగుతున్నాను’ అన్నాను.

ఒక నిమిషం మౌనంగా ఉండి తరవాత ‘ఇందులో దాచేదేముందన్నయ్యా, నాకు పిల్లలు పుడితే బాబును ప్రేమగా చూసుకోలేనేమోనని నా భయం. అందుకని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్‌ చేయించుకుంటానని ఈయనతో చెప్పాను. మొదట ఆయన ఒప్పుకోలేదు. బలవంతంచేసి మరీ నేనే ఒప్పించాను. నాకు పిల్లలు లేకపోయినా ఫరవాలేదు. వాణ్ణి నేను ప్రేమగా పెంచుకుని ప్రయోజకుణ్ణి చేయగలిగితే చాలు’ అంది రేవతి.

అప్పటినుండి రేవతిపై ఉన్న అభిమానం రెట్టింపవటమేకాక తనపై గౌరవం కూడా కలిగింది నాకు.

నా పెళ్ళయ్యాక, నా భార్యకు కూడా రేవతితో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. రేవతి గురించి పూర్తిగా తెలుసుకున్నాక వారి స్నేహం ఇంకా గట్టిపడింది.

పెళ్ళైన సంవత్సరానికి నాకు వైజాగ్‌ ట్రాన్స్‌ఫర్‌ అయింది. రేవతినీ బావనూ విడిచివెశ్ళాలంటే చాలా బాధ కలిగింది. అయినా విడిచివెళ్ళక తప్పలేదు. వీలైనప్పుడల్లా గాయత్రి, నేను వచ్చివెళ్ళేవాళ్ళం. అలాంటి పరిస్థితుల్లో బావ యాక్సిడెంట్‌లో అకస్మాత్తుగా మరణించటం మా అందరికీ కోలుకోలేని దెబ్బ అయింది. 

రేవతిని చూసి కంటతడి పెట్టనివారు లేరు. బావ దినకర్మలు అన్నీ అయిపోయి బంధువులందరూ వెళ్ళిపోయాకగాని నాకు రేవతితో ప్రశాంతంగా మాట్లాడటానికి కుదరలేదు. ఆమెకు ధైర్యం చెప్పి మళ్ళీ మామూలు మనిషిగా తిరగగలిగేలా చేయాల్సిన బాధ్యత నాదే. అందుకే రేవతిని పిలిచి ‘చూడమ్మా, నీకు జరిగిన అన్యాయం ఎవరూ తీర్చలేనిది. నువ్వు బాబు కోసమైనా ఈ బాధనుండి బయటపడాలి’ అంటూ నాకు తోచినన్నివిధాలుగా రేవతిని ఓదార్చాను. రెండురోజుల తరవాత నేనూ గాయత్రీ వైజాగ్‌ వచ్చేశాం.

అమ్మా నాన్నలను తనకు తోడుగా అక్కడే ఉండమన్నాను. నేను నెలకొకసారి వెళ్ళి వాళ్ళను చూసివచ్చేవాణ్ణి. బాబును స్కూల్లో జాయిన్‌ చేశాము. వాణ్ణి స్కూల్‌కు పంపటం, లంచ్‌ తీసుకెళ్ళటం, స్కూల్‌నుండి తేవటం... ఈ పనుల వలన రేవతికి నలుగురిలోకి రావటం కాస్త అలవాటై, చిన్నచిన్నగా బావ పోయిన దుఃఖంలోనుంచి కోలుకోసాగింది.

వేణు ఫస్ట్‌క్లాస్‌కొచ్చేసరికే మాకు ఇద్దరు పిల్లలు పుట్టారు. ఉద్యోగంలో ప్రమోషన్‌ రావటంతో అక్కడకూడా బాధ్యతలు ఎక్కువయ్యాయి. అయినా వీలుచూసుకుని గాయత్రీ నేనూ రేవతిని చూసివచ్చేవాళ్ళం. రేవతి కూడా ఊరికే ఉండకుండా టైలరింగ్‌ చేసేది, నేర్పేది. ‘నీకెందుకమ్మా ఈ శ్రమ, ఆస్తి ఉంది కదా’ అంటే ‘నాకు బోరుకొట్టకుండా ఉంటుంది కదా అన్నయ్యా’ అనేది.

తను అలా ఏదో ఒక వ్యాపకంలో ఉంటే తనకు మనసు ప్రశాంతంగా ఉంటుంది అనిపించి ఊరుకున్నాము.

రేవతికి రాబడి బాగానే ఉండేది. పనికూడా ఎక్కువగానే ఉండేది. అంత బిజీలో కూడా రేవతి బాబుని క్షణం మరిచిపోయేదికాదు. వాడికి అన్నీ అమర్చిపెట్టేది. స్కూల్‌కు పంపాలన్నా, తేవాలన్నా తను వెశ్ళాల్సిందే. నా సహకారం, సలహాలు తీసుకుంటూ వేణుని ప్రేమగా పెంచి, చదివించి మంచి ఉద్యోగస్తునిగా నిలబెట్టింది రేవతి. తల్లిని దేవతలా భావించేవాడు వేణు. తనతోపాటు ఆఫీసులో పనిచేసే సరితను ఇష్టపడ్డాడు. అది తెలిసిన రేవతి నన్ను పిలిపించి సరితావాళ్ళ అమ్మానాన్నలతో మాట్లాడించి వాడికి సరితనిచ్చి పెళ్ళికూడా చేసింది. ఇప్పుడు వాళ్ళకు ఒక బాబు కూడా. మూడునెలలక్రితం రేవతికి హార్టు ఆపరేషన్‌ అయింది. అప్పుడు సరిత అత్తగారిని ఎంతో బాగా చూసుకుంది. ఇక వేణుకయితే తల్లంటే ప్రాణం. అంతా బాగానే ఉన్నారు. మరి ఇప్పుడు హఠాత్తుగా వేణు ఇలా ఫోన్‌ చేశాడేమిటో. కారణం ఏమై ఉంటుందని ఎంత ఆలోచించినా ఏమీ తోచకపోవటంతో, వాడితో మాట్లాడితేకానీ విషయం తెలియదులే అని నిట్టూర్చి ఇంటికి బయలుదేరాను. మధ్యలో బస్‌ టికెట్స్‌ రిజర్వేషన్‌ చేయించుకుని వెశ్ళాను.

ఇంట్లోకి వెళ్తూనే ‘‘గాయత్రీ, త్వరగా బట్టలు సర్దు. హైదరాబాద్‌ వెళ్తున్నాం’’ అన్నాను.

‘‘ఏంటండీ, ఇంత సడెన్‌గా ప్రయాణం’’ ఆశ్చర్యంగా అంది గాయత్రి.

‘‘తలనొప్పిగా ఉంది, ముందు కాస్త కాఫీ ఇవ్వు. నీకు అన్నీ వివరంగా చెబుతాను’’ అన్నాను.

కాఫీ తెచ్చి ఇచ్చి కూర్చుంది గాయత్రి ‘‘చెప్పండి’’ అంటూ.

వేణు ఫోన్‌ చేసిన విషయం చెప్పి, ‘‘వాడు వాళ్ళమ్మని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఇలా ఎందుకన్నాడో అర్థంకావటంలేదు. అది ఆలోచించే నాకు తలనొప్పి వచ్చింది. ఏదిఏమైనా మనం అక్కడకు వెళ్ళి వాడితో మాట్లాడితేకానీ అసలు విషయం తెలియదు. త్వరగాకానీ వెశ్దాం’’ అన్నాను.

నేను చెప్పింది విని నిశ్చేష్టురాలిలా నిలబడిపోయింది గాయత్రి.

వెంటనే కోపంగా ‘‘అదేంటండీ, ఆ అబ్బాయికి మతిగానీ పోయింది ఏంటి? రేవతిలాంటి తల్లి ఉంటుందా. అలాంటి ఆమెను హోంలో చేర్చుతానంటాడా. వెళ్ళి అదేంటో తేల్చుదాం. వాళ్ళకిష్టంలేకపోతే రేవతిని మనం తెచ్చుకుందాం’’ అంది.

మేము హైదరాబాద్‌లో వేణు ఇంటికి వెళ్ళేటప్పటికి తెలతెలవారుతోంది.

కాలింగ్‌బెల్‌ కొట్టిన కాసేపటికి తలుపు తెరుచుకుంది. తలుపు తెరచిన రేవతి ముఖంలో ఆనందంతోపాటు ఆశ్చర్యం. ‘‘ఏంటి అన్నయ్యా, ఈ అనుకోని రాక’’ అంటూ ఇంట్లోకి దారితీసింది. రేవతి ముఖం చూస్తే ఈ విషయం తెలిసినట్లులేదు. రేవతి కాఫీలు తెచ్చింది. అంతలో వేణు, సరిత కూడా లేచివచ్చారు. పలకరింపులు అయిపోయాక, స్నానాలు, టిఫిన్‌లు ముగించుకుని వేణు, నేను బయటకు వెళ్లొస్తామని చెప్పి బయలుదేరాం.

కొంచెం దూరం వెళ్ళి చిన్న పార్కులో కూర్చున్నాం. ‘‘ఇప్పుడు చెప్పరా వేణూ, ఎందుకు మీ అమ్మను ఓల్డేజ్‌హోంలో చేర్చాలని అనుకుంటున్నావు’’ అన్నాను. వాడు ఒక్క నిమిషమాగి, ‘‘సరిత మళ్ళీ జాబ్‌లో చేరతానని అంటోంది మామయ్యా. ఇల్లు కొన్నప్పుడూ మొన్న అమ్మకు ఆపరేషన్‌ అప్పుడూ కొంత అప్పు అయింది కదా. పైగా ఈ సిటీలో కాస్త సుఖంగా బతకాలంటే ఇద్దరి సంపాదన లేకపోతే కుదరదు కదా. బాబుని అంటే డేకేర్‌లో చేర్చవచ్చు. కానీ అమ్మకు ఆరోగ్యం సరిగా ఉండటంలేదు కదా. పైగా ఆపరేషన్‌ అయి ఉండటంవల్ల తనను ఒక్కదాన్ని ఇంట్లో వదలివెశ్ళాలన్నా భయమే. అందుకని సరిత అమ్మను హోంలో జాయిన్‌ చేయాలని పట్టుపడుతోంది. నాకు అమ్మను వదలి ఉండటం ఇష్టంలేదు. ఏం చేయాలో పాలుపోక మీకు ఫోన్‌ చేశాను. ఈ విషయం అమ్మకు ఇంకా చెప్పలేదు. ముందు మీతో మాట్లాడి తరవాతే అమ్మతో మాట్లాడాలి అనుకున్నాను’’ అన్నాడు వేణు.

‘‘చాలా మంచిపని చేశావు. ముందే మీ అమ్మకు తెలిసినట్లయితే నీకు హోం ఖర్చులేకుండా పోయేది. ఎందుకంటే, ఈ విషయం విన్నవెంటనే గుండె ఆగి చనిపోయేది’’ అన్నాను.

‘‘మామయ్యా’’ అంటూ దెబ్బతిన్నట్టుగా చూశాడు వేణు.

‘‘లేకపోతే ఏంట్రా? ఇప్పుడు నీకు తెలియని రెండు విషయాలు చెబుతాను విను. మొదటి విషయం... నువ్వు మీ అమ్మకు సొంత కొడుకువి కాదు. నా అక్క కొడుకువి’’ అన్నాను.

చలనంలేని విగ్రహంలా ఉండిపోయాడు వేణు. ‘‘నువ్వు చెప్పేది నిజమా మామయ్యా’’ అంటూ పదేపదే అడిగాడు.

‘‘అవును. మీ అమ్మ మీ నాన్నకు మొదటి భార్య. ఆమె నిన్ను కని చనిపోతే, మీ నాన్న రేవతిని రెండోపెళ్ళి చేసుకున్నాడు. సవతికొడుకనే ఆలోచన కూడా లేకుండా నిన్నెంతో ప్రేమగా పెంచింది. నీకేదైనా జబ్బు చేస్తే విలవిలలాడేది. నీకింకో విషయం చెప్పనా... తనకు పిల్లలు పుడితే నీమీద ప్రేమ తగ్గిపోతుందేమోనని మీ నాన్నని బలవంతాన ఒప్పించి, తనకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్‌ చేయించుకుందిరా పిచ్చితల్లి. అందుకే రేవతంటే నాకు ప్రేమ, అభిమానం. అన్నిటికీ మించి గౌరవం. తల్లీ తండ్రీ లేని నిన్ను ఇంత ప్రేమగా పెంచి, చదివించి ఇంతటివాడిని చేసినందుకు ఇలా కృతజ్ఞత చూపుతావనుకోలేదు. ఆ తల్లి రుణం ఏమిస్తే తీరుతుంది. రుణం తీర్చుకోలేకపోతే పోయావు. కనీసం మిమ్మల్ని చూసుకుంటూ సంతోషంగా బతుకుతున్న ఆమెకు ఆ సంతోషం కూడా లేకుండా బయటకు పంపేయాలని చూస్తావా. మీ అమ్మకు తన పెంపకంపై చాలా నమ్మకం. తన నమ్మకాన్ని వమ్ము చేస్తావనుకోలేదు. నేను చెప్పాల్సింది చెప్పాను. అయినా నీ అభిప్రాయం మారకపోతే, మీ అమ్మను నేను తీసుకెశ్తాను. అంతేకానీ, హోంలో చేర్చటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను. 

ఆలోచించుకో’’ అంటూ కోపంగా కదలబోయాను.

వేణు చేతులు నన్ను ఆపేశాయి. విసురుగా వేణు వైపు చూసిన నేను వాడి కళ్ళవెంట కారుతున్న నీటిని చూసేసరికి కొంచెం మెత్తబడ్డాను.

‘‘నన్ను క్షమించు మామయ్యా. సరిత అమ్మను ఓల్డేజ్‌హోంలో చేర్చుదామని చెప్పినప్పటినుండి నా మనసు మనసులో లేదు. మీరైతేనే నాకు సరైన సలహా ఇస్తారని మీకు ఫోన్‌ చేశాను. ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు విని కూడా నేను ఒక అభిప్రాయానికి రాకపోతే నేను మనిషిగా బతకటానికి కూడా పనికిరాను. ఏదేమైనా సరితను ఉద్యోగానికి పంపను. నా బిడ్డకు కూడా మాతృప్రేమను దూరం కానివ్వను. నా తల్లికి నా చేతనయినంత వరకూ ఏ కష్టం కలుగనివ్వకుండా చూసుకుంటాను. ఇది నీ మేనల్లుడిగా కాదు మామయ్యా, రేవతి కొడుకుగా చెబుతున్నమాట’’ అన్నాడు దృఢంగా వేణు. మళ్ళీ ‘‘హమ్మయ్య, ఇదంతా అమ్మకు తెలియదు. తెలిసినట్లయితే ఇక జీవితంలో అమ్మకు ముఖం చూపించటానికి నాకు అర్హత ఉండేదికాదు. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. నాకు చాలా హెల్ప్‌ చేశావు మామయ్యా. నీకు మెనీ మెనీ థాంక్స్‌’’ అని, ‘‘పద మామయ్యా, నాకు ముందు అమ్మని చూడాలని ఉంది’’ అన్నాడు వేణు.

ఇద్దరం ఇంటికి వచ్చాం. గాయత్రి ముఖంలో కూడా ఏదో సాధించిన సంతోషం కనబడింది. నాలాగే తను కూడా తన ప్రయత్నంలో సఫలం అయిందని అర్థమైంది.

వేణు ‘‘అమ్మా, అమ్మా’’ అని పిలుస్తూ రేవతి గదిలోకి వెళ్ళి చేయి పట్టుకుని హాల్లోకి తెచ్చి, సోఫాలో కూర్చోపెట్టి తన ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు.

‘‘ఏంటి నాన్నా, ఒంట్లో బాగాలేదా’’ అంది రేవతి నుదుటిపై చేయిపెట్టి ఆదుర్దాగా.

‘‘లేదమ్మా, ఊరికే పడుకోవాలనిపించింది’’ అన్నాడు వేణు.

కొడుకు తల నిమురుతూ ‘‘చూడన్నయ్యా, వీడికింకా పసి మనస్తత్వం పోలేదు’’ మురిసిపోతూ అంది రేవతి. తన ముఖంలో సంతోషం చూస్తుంటే, ఒక మంచి హృదయం ముక్కలుకాకుండా కాపాడగలిగానన్న తృప్తితో నా మనసంతా నిండిపోయింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని