అమెరికా గౌను

నేను బయటపని చూసుకుని వచ్చేసరికి ఇల్లంతా సందడిగా ఉంది. ముందు హాల్లో దీవాను మీద చిన్నచిన్న ప్యాకెట్లు పరచి ఉన్నాయి...

Published : 10 Apr 2020 13:04 IST

వలివేటి నాగచంద్రావతి

నేను బయటపని చూసుకుని వచ్చేసరికి ఇల్లంతా సందడిగా ఉంది. ముందు హాల్లో దీవాను మీద చిన్నచిన్న ప్యాకెట్లు పరచి ఉన్నాయి. ఇంటిల్లిపాదీ అవి విప్పదీసి చూసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అర్థమయింది. రమణి పంపిన ప్యాకెట్‌ అందిందన్నమాట.

రమణి మా అమ్మాయి. అమెరికాలో ఉంటోంది. తెలిసినవాళ్ళెవరైనా ఇటు వస్తూంటే వాళ్ళతో ఇక్కడ దొరకని తేలికపాటి వస్తువులో, పిల్లల కోసం చిన్నచిన్న గిఫ్టులో పంపుతుంటుంది. వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు దానికి ఊరగాయలో వడియాలో మేమూ ఎగుమతి చేస్తుంటామనుకోండీ - అది వేరే సంగతి.

వారంక్రితమే ఫోన్‌చేసి చెప్పింది- ‘ఫలానావాళ్ళు ఇండియా వస్తున్నారు. వాళ్ళతో ఫలానా వస్తువులు ప్యాక్‌చేసి పంపుతున్నాను’ అని. వాళ్ళు ఇవాళ ఇచ్చి వెశ్ళారన్నమాట. అమెరికన్‌ గూడ్స్‌ దిగుమతయినప్పుడల్లా ఇల్లు ఇలా ఇరుగుపొరుగు అమ్మలక్కలతో కళకళలాడ్తూ గలగలమంటూ ఉంటుంది. 

ఆ హడావుడి సద్దుమణిగేదాకా ఇంట్లో ఎవరూ ఎవర్నీ పట్టించుకోరు.

నేను కామ్‌గా మోసుకొచ్చిన సంచుల్ని గోడవారగాపెట్టి, పెరట్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కున్నాను. మళ్ళీ హాల్లోకి వచ్చేటప్పుడు చూశారు నన్ను- నా మనవడు బాలూ, మనవరాలు సంజూ.
బాలు నా దగ్గరకు పరిగెత్తుకు వస్తూనే మళ్ళీ ఎక్కడ ఆలస్యమైపోతుందో అన్నట్టు, ‘‘తాతోయ్, అత్త నాకు రోబోట్‌ పంపించింది. చూడుచూడు ఎంత బావుందో. ఇదిగో ఇది చూడు... ఈ స్విచ్‌ నొక్కితే నడుస్తుంది. ఇది నొక్కితే పిల్లిమొగ్గలేస్తుంది. బాలు విసిరేస్తుంది. ఇంకానేమో...’’ చేతిలో బొమ్మని అటూ ఇటూ తిప్పిచూపిస్తూ దాని తాలూకు విచిత్రాలన్నీ ఒక్క గుక్కన చెప్పేశాడు. ఆరేళ్ళు వాడికి. ఒకటోక్లాసు చదువుతున్నాడు.

వాళ్ళత్త పంపిన గౌను కాబోలు- సంజూని నిలబెట్టి సైజు సరిపోతుందో లేదో అని కొలతలు చూస్తోంది మా కోడలు సుజాత.

తల్లి చేతుల్లోంచి ఆ ఫ్రాక్‌ని ఒక్క గుంజుగుంజి లాక్కుని ఉరుక్కుంటూ వచ్చింది సంజూ. ‘‘తాతా... అన్నకి బొమ్మొక్కటే. నాకు చూడు- ఈ గౌనూ, పియానో, రిబ్బన్లూ బోల్డు పంపించింది తెలుసా!’’

అన్నకు పోటీగా పలుకులు కుప్పబోస్తున్న దాని వెనకాలే విసుక్కుంటూ వచ్చింది 

మా కోడలు. ‘‘భడవకానా, ఒక్కక్షణం ఒక్కచోట కుదురుగా నిలబడవుగదా’’ అంటూ సంజూని నిటారుగా నిలబెట్టి మళ్ళీ గౌనుతో పొడుగూ వెడల్పూలు చూడ్డం ఆరంభించింది.

వెళ్ళిపోతున్న అమ్మలక్కలకి సెండాఫ్‌ ఇచ్చి, నాకు మంచినీళ్ళ గ్లాసు పట్టుకొచ్చింది మా ఆవిడ వర్ధని.

‘‘అలా పైపైన పెట్టిచూస్తే ఏం తెలుస్తుంది సుజాతా. పూర్తిగా తొడిగిచూడు’’ అని కోడలికి సలహా ఇచ్చి నావైపు తిరిగింది. ‘‘రమణి పంపింది. వారంరోజుల్లో సంజూ పుట్టినరోజుగా - తను పంపిన గౌనే వెయ్యాలిట మేనకోడలికి’’ కూతురి కోరిక చెబుతూ మురిపెంగా నవ్వింది మా ఆవిడ.

నాకు గ్లాసందించేసి తిరిగి మళ్ళీ వాళ్ళు విదేశీవస్తు పరిశీలనలోనూ వాటి గుణవిశిష్టతా గానంలోనూ మునిగిపోయిన తీరుచూస్తే... ఓ కప్పు కాఫీ అడుగుదామనుకునీ ధైర్యం చాలక మాట్లాడకుండా మంచినీళ్ళు తాగి ఉస్సురనుకుంటూ పడక్కుర్చీలో వాలిపోయాను.

అత్తాకోడళ్ళిద్దరూ సంజూకి గౌనువేసే కార్యక్రమంలోపడ్డారు. అది కాస్తా సంజూ భుజాల దగ్గరే బిగుసుకుని అలకపాన్పు దిగనని భీష్మించుక్కూర్చున్న కొత్త అల్లుడిలా కిందికి దిగనంటోంది. చేతులు దూర్చాలని వర్ధనీ, కిందికి జార్చాలని సుజాతా చేసే ప్రయత్నాలేవీ ఫలించలేదు.

చివరికి ‘‘లాభంలేదత్తయ్యగారూ, ఇంకా లాగితే చిరిగేట్టుంది’’ అంటూ చేతులెత్తేసింది మా కోడలు.

‘‘ఆర్నెల్లవ్వలేదు - చూసే వెళ్ళిందిగా పిల్లనీ - అంతమాత్రం ఆది తెలియలేదా దానికి’’ ఎక్కడో ఉన్న కూతుర్ని ఉద్దేశించి నిష్ఠూరమాడింది వర్ధని.

ఆర్నెల్లకింద రమణి వచ్చివెళ్ళినప్పుడు సంజూ సన్నజాజి మొగ్గ. ఇప్పుడు బొండు మల్లెపువ్వు. ‘పాపం రమణి’ లోలోపలే సానుభూతి చూపించాను మా అమ్మాయి మీద. 

‘‘బుజ్జిముండ, ఎంత ముద్దొస్తోందో చూడండత్తయ్యా. ఈ లేత గులాబీరంగు నాకెంతో ఇష్టం. ఇంచక్కటి లేసూ, ఈ ఫ్రిల్సూ ఎంతందం తెచ్చాయో గౌనుకి. 

ఇక్కడివాళ్ళకి ఇంత ఫ్యాషన్‌గా కుట్టడం ఛస్తేరాదు. ప్చ్, దీన్నెలా సరిచేయటం’’ సుజాత తిరగేసీ మరగేసీ ఆ గౌను ఏకాస్తన్నా లూజు చేసే వెసులుబాటుందేమోనని శతవిధాలా పరిశీలించింది.

ఉహూ, అమెరికన్‌ ప్రోడక్టా మజాకానా. మళ్లోసారి లాభంలేదంటూ పెదవి విరిచేసింది మా కోడలు.

సరే, సరిపోలేదు గదా, వదిలేయొచ్చునా - అబ్బే, అలా వదిలేస్తే వాళ్ళు సుజాతా వర్ధనీ ఎలా అవుతారు?

ఆ రాత్రే మా అబ్బాయిచేత రమణికి రెండుసార్లు రింగ్‌ చేయించారు. అది సిగ్నల్‌. అవి అందుకుని మా అమ్మాయే మాకు ఫోన్‌ చేస్తూంటుంది. అదీ మా కోడ్‌.

‘‘అంతర్జంటుగా ఫోనెందుకు చేశారమ్మా’’ అని అది కంగారుపడుతూ అడుగుతుంటే- ‘‘సంజూకి గౌను సరిపోలేదే అమ్మడూ, మారుస్తారేమో కనుక్కుంటావనీ’’ అంటూ ఆ ఎమర్జెన్సీ మెసేజ్‌ కూతురికి అందించింది మా వర్ధని.

‘‘ఊరుకో అమ్మా. నీకు చాదస్తం మరీ ఎక్కువైపోయింది. ఆ గౌను నువ్వు అమెరికాకి పంపించీ, మళ్ళీ నేనది మార్చి ఇండియాకి పంపించీ- ఇప్పుడయ్యే పనేనా అది? పైగా మేమది వీకెండ్‌లో న్యూయార్క్‌ వెళ్ళినప్పుడు అక్కడేదో కార్నివాల్‌ జరుగుతుంటే అక్కడ తీసుకున్నాం. మార్చటం కుదరదుగానీ, అది సరిపోయేవాళ్ళెవరైనా తెలిసినవాళ్ళలో ఉంటే ప్రజెంట్‌ చేసేయండి. ఈసారి నేను పెద్దసైజుది పంపిస్తాలే’’ రమణి వాళ్ళమ్మని మెత్తగా కసురుతూనే చకచకా సొల్యూషనూ చెప్పేసి, టక్కున ఫోను పెట్టేసింది.

‘‘అయ్యో అయ్యో, ఎంత నిర్లక్ష్యమే అమ్మా డబ్బంటే. మన రూపాయల్లో అయితే దగ్గరదగ్గర వెయ్యి రూపాయలవుతుందటా గౌను. అంతపెట్టి కొని ఉత్తిపుణ్యానికి ఎవరికన్నా ఇచ్చెయ్యాలా’’ మా ఆవిడ బుగ్గలు నొక్కుకుంది.

‘‘మరే. చూస్తూచూస్తూ అంత ఖరీదైంది ఊరికే ఎలా ఇచ్చేస్తాం’’ అత్తగారితో ఏకీభవించింది సుజాత. కొన్నికొన్ని విషయాల్లో వాళ్ళిద్దరికీ సఖ్యత చాలా ఎక్కువ.

వాళ్ళింకా ఆ విషయమ్మీదే తర్జనభర్జనలు సాగిస్తూంటే విసుగెత్తి, ‘‘అమ్మాయి చెప్పినట్టు, ఏ పుట్టినరోజు పేరంటానికో వెళ్ళినప్పుడు ఇచ్చేస్తే పోయేదానికి ఎందుకింకా ఆ పనికిమాలిన చర్చలు’’ అన్నాను. ఇంటి యజమాని హోదా వెలగబెట్టిన్నాటి వాసనలుపోక.

‘‘ఏం చెయ్యమంటారూ అని మిమ్మల్నడిగామా? దాన్నేం చేయాలో మాకు తెలుసునుగానీ మీరు గమ్మునుండండి’’ 

కసిరేసింది వర్ధని.

ఉద్యోగ విరమణ అనంతరం ఇంట్లో నా పరపతి తగ్గిందని ఇలా అప్పుడప్పుడూ గుర్తుచేస్తూ ఉంటుంది మా ఆవిడ.

కామ్‌గా ఆవిడ ఆజ్ఞ పాటించాను.

*   *   *

ఆ మర్నాడు ఉదయం వీధి వరండాలో పేపరు చూస్తూ కాఫీ సిప్‌ చేస్తున్నాను.

మా ఇంటికీ పక్కింటికీ మధ్య ఉన్న ప్రహరీగోడ దగ్గర్నించి వర్ధని స్వరం వినిపిస్తోంది.

‘పార్వతమ్మక్కా, ఇదిగో గౌను. నిన్న ఈ మాదిరిది మీ మనవరాలికీ తెప్పించిపెట్టమన్నావుగా. ఎప్పుడూ అడగనిదానివి అడిగావు పాపం. తీసుకో. మా సంజూకి కొత్త ఫ్రాకులు చాలానే ఉన్నాయిలే’’ మా ఆవిడ అతి తెలివి పోకడలవి. 

‘‘చాలా ఖరీదన్నావుగా వర్ధనీ. అంత విలువైంది మేం కొనగలమా?’’ పక్కింటావిడ సందేహంలో వినిపించేది వెక్కిరింతా ఎత్తిపొడుపా? అమెరికా నుంచి వచ్చింది గదా అని మా ఆవిడ నిన్న కాస్త అతిగా గొప్పలు చెప్పుంటుంది బహుశా.

‘‘ఆ ఎంతలే. మన రూపాయల్లో అయితే పన్నెండొందలవుతుందట. అయినా నీ దగ్గర అంత తీసుకుంటానా, రెండొందలు తగ్గించే ఇద్దువులే... మనసుపడ్డావుగా పాపం’’.

ఆవిడ వెటకారం అర్థంకానట్టే గడుసుగా తన ఉదార హృదయాన్ని చూపించేసింది మా వర్ధని.

‘‘ఏమనుకోకు వర్ధనీ. మరీ లేతరంగు గౌను. పిల్లల దగ్గర మాపుకాగదని నిన్ననే అనుకున్నాను. పోనీలే పిలిచి మరీ అడుగుతున్నావు పాపం. వద్దనలేకుండా ఉన్నాను. మూడువందలకిచ్చే మాటయితే చెప్పు. తీసేసుకుంటాను. మొహమాటం లేకుండా చెబుతున్నాననుకోకు సుమా. అంతకంటే ఎక్కువ చెయ్యదనిపిస్తోంది నాకు మరి’’.

‘ఆహాహా - తాడి తన్నేవాడు ఒకడైతే వాడి తల తన్నేవాడు మరొకడనీ - మా ఆవిణ్ణి మించిన అసాధ్యురాలే ఈవిడ’. నాకు నవ్వొచ్చింది.

‘‘పిలిచి పిల్లనిస్తానంటే ఒక కన్ను చిన్నదన్నారనీ - దొరసాన్ల బిడ్డకివేసే గౌనుకి వంక పెడుతోంది ఇల్లాలు. పైగా మూడువందల రూపాయలకివ్వాలట. ఎంత ఆశో చూడు’’ ఇంట్లోకొచ్చి రుసరుసలాడింది మా వర్ధని.

‘‘వదిలెయ్యండత్తయ్యా, ఆవిడ గుణం చూపించుకున్నదంతే’’ మా కోడలి ఓదార్పు.

ఆరోజు సాయంత్రం కొబ్బరికాయ, పూలదండ పట్టుకుని గుడికెళ్లొస్తానంటూ వెళ్ళింది సుజాత. గంట తర్వాత తన స్నేహితురాలిని ఆమె కూతురితో సహా వెంటబెట్టుకు తిరిగొచ్చింది.

నా అంచనా కరెక్టే. పావుగంటలో కాఫీలూ కుశలప్రశ్నలూ పూర్తయ్యాక మా అబ్బాయి గదిలోంచి నా చెవులబడిన వాళ్ళ సంభాషణ ఇది.

‘‘అబ్బ, నీ కూతురికీ గౌను అతికినట్టు సరిపోయిందే లలితా. అచ్చం షోకేసులో బొమ్మలా ఉందనుకో’’.

మా కోడలు ఏ సీనియరు సేల్స్‌మెన్‌కి తీసిపోతుంది చెప్పండి.

‘‘మరీ పొట్టిగా ఉన్నట్టుంది సుజాతా’’ 

ఆ వచ్చినమ్మాయి మొహమాటంగా నసుగుతోంది.

‘‘అయ్యో, ఏ కాలంలో ఉన్నావ్‌ నువ్వు. అలా మోకాళ్ళు దిగే గౌనులు వేసుకునేది మా కాలంలో. ఇప్పుడిలా కురచగా ఉండటమే ఫ్యాషన్‌. ఇప్పటి అమెరికన్‌ తయారీ ఇది. అంటే అదెంత లేటెస్ట్‌ మోడలో ఆలోచించు’’.

కోడలికంటే రెండాకులు ఎక్కువే చదివింది మా ఆవిడ.

‘‘అమెరికాలో అయితే సరేననుకోండి. 

ఇక్కడిట్లా తొడలు కనబడేట్టుంటే ఎబ్బెట్టుగా ఉంటుందేమో ఆంటీ. అందులోనూ మావారికి అలాంటి పట్టింపులెక్కువ. అయినా అడిగి చూస్తాలెండి’’.

‘ఆఁ చూస్తాలెండి’ అన్న మాటలో వద్దులెండి అన్న ధ్వని వినిపించట్లేదూ? హతోస్మి. ఈ బేరమూ కొండెక్కినట్టేనన్నమాట. ఇక మావాళ్ళ మొహాలు చూళ్ళేక అలా తిరిగొద్దామని రోడ్డెక్కాను.

ఆ తర్వాత వెనకింటి మేడమీద మార్వాడీ చాచీ అనుపమాదేవీ, చివరింటి తమిళ మామీ శకుంతలా, సోమూ వాళ్ళమ్మ సత్యవతీ... ఇట్లా ముగ్గురు నలుగురు అమెరికా గౌనుని చూడ్డానికొచ్చారు.

గౌను అయితే అందరూ భేషుగ్గా ఉందన్నారు. కాకుంటే కొందరికి దాని వెల నచ్చలేదు. కొందరికి దాని సైజు వాళ్ళ పిల్లలకి సరిపోలేదు. దానాదీనా గౌను చెల్లుబాటవలేదు.

సరే, ఆఖరికి చుట్టాల్లో ఎవరి పిల్లలకైనా కానుకగా ఇచ్చెయ్యమన్న మా అమ్మాయి సలహానే పాటించక తప్పని పరిస్థితొచ్చేసింది అత్తాకోడళ్ళకి.

అప్పుడే వచ్చింది తంటా.

*  *  *

ఆ రోజు రాత్రి నా పక్క దులిపివేస్తూ ఏదో సణుగుతోంది వర్ధని.

‘‘ఆ అనేదేదో వినబడేటట్టుగా అనరాదూ’’ అన్నాను.

‘‘ఆ అమెరికా గౌను వాళ్ళ చెల్లెలి కూతురికి పంపిస్తుందట మీ కోడలు. అది కాపురానికొచ్చి పదేళ్ళయిందా. మనం నెత్తిన పెట్టుకునేగా చూస్తున్నాం. అయినా ఆపేక్షంతా అటువైపే. ఆ చెల్లెలికేం తక్కువ చెప్పండి. కోటీశ్వరులు. ఈ గౌనే కావాలా వాళ్ళకి. 

సరే, అదంతా పక్కనపెట్టండి. నా కూతురు పంపిన వస్తువుమీద ఈవిడకేమిటి పెత్తనం’’ సౌండు అంతగా లేదుగానీ మాటలకి మాత్రం కారం అద్దినట్టే అనిపించింది నాకు.

వర్ధనికి కోపం వచ్చినప్పుడు మనం మాట్లాడకుండా ఉండటమే మంచిదని నా అనుభవం.

నేను మౌనం పాటించాను.

తెల్లారింది. ఇంట్లో ఏదో అనీజీ. నవ్వుకుంటూ కబుర్లాడుకుంటూ పనులు చేసుకునే అత్తాకోడళ్ళిద్దరూ ఎడమొహం పెడమొహం. పిల్లల్ని కసురుకోవటం, కాఫీలూ టిఫిన్లూ ఆలస్యం చేయటం, పిలిస్తే కరిచినట్టు జవాబివ్వటం. అబ్బ, ఇంట్లో ఉండటం ముళ్ళమీదున్నట్టే ఉంది. సమయానికి వర్ధని కూరల్లేవనటంతో బతుకుజీవుడా అని చేతిసంచి పట్టుకుని మార్కెట్టుకి బయలుదేరాను.

నేను వెళ్తుంటే హరి గేటు వేయటానికి వచ్చినట్టొచ్చి ‘‘ఏంటి నాన్నా, ఇంట్లో కోల్డ్‌వారేదో మొదలైనట్టుంది’’ అన్నాడు గుసగుసగా.

‘‘ఏంటీ?’’ అన్నాను - ఏమీ తెలీనట్టు నొసలు చిట్లించి.

‘‘అమ్మ ఆ అమెరికా గౌను వాళ్ళ అక్క మనవరాలికి ఇస్తానందిట. పంతానికి కాకపోతే నా కూతురికి ఇచ్చిన గౌను మీద ఆవిడకేమిటి హక్కు అని, ఎప్పుడూలేంది అమ్మ మీద రాత్రినుంచీ తెగ చిటపటలాడుతోంది సుజాత’’ చెప్పాడు హరి.

నేను కూడా వాళ్ళ అమ్మ తరఫు వాదన వినిపించాను.

‘‘పట్టమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం - ప్చ్, మనమిప్పుడు ఏం చెయ్యాలి?’’ బేలమొహం పెట్టాడు హరి.

నాకూ దిగులనిపించింది. బయటి పనుల్లో మాకెన్ని టెన్షన్లూ చికాకులు ఉన్నా ఇంటికొచ్చేసరికి అవన్నీ మరుపునపడి తేలిగ్గా అనిపించటానిక్కారణం - ఈ ఇంటి లక్ష్మీసరస్వతులిద్దరూ అన్యోన్యంగా కలిసిపోయి గృహ వాతావరణాన్ని ఆహ్లాదంగా ఉంచటంవల్లే అని మా ఇద్దరికీ బాగా తెలుసు.

అదిప్పుడు చెడుతోందా?

రాత్రి భోజనాల దగ్గర హరి తల్లికీ పెశ్ళానికీ సంధి కుదిర్చే ప్రయత్నం చేశాడు.

‘‘అమ్మా, మీ ఇద్దరూ ఇలా ఉలుకూ పలుకూ లేకుండా బొమ్మల్లా తిరుగుతుంటే మాకు ఇల్లు నరకంలా ఉంది. ఇంట్లో ఉండలేకపోతున్నాం. ఆ దిక్కుమాలిన గౌను గురించేగా గొడవంతా. అది ఎవరికో ఇస్తానని నువ్వు పట్టుపట్టద్దు. సుజా, దాన్ని మీవాళ్ళకి పంపే పని నువ్వూ మానుకో. ఆ గౌనుని పక్కకి పెట్టేయండి ప్రస్తుతానికి. దాన్నేం చేయాలో తరవాత ఆలోచిద్దాం. సరేనా. కాదూ మా మాటే నెగ్గాలని ఇంకా పట్టు పట్టారా - మీ మూతిముడుపులు తగ్గేదాకా నేనీ ఇంట్లో అడుగేపెట్టను, మీ ఇష్టం’’ అంటూ కొంత కన్విన్స్‌ చేశాడు. కొంత బెదిరించాడు.

మరీ అంత మూర్ఖులు కారు మా శ్రీమతులు. త్వరగానే సమాధానపడిపోయి రాజీ ఒప్పందం మీద చూపుల సంతకాలు చేసేశారు.

మర్నాటికి వాతావరణంలో ముసురు తగ్గింది. తెరపి వచ్చింది. అత్తగారికి కాఫీ కలిపి అభిమానంగా అందించింది కోడలు. కోడలి తలకి నూనె పట్టిస్తూ కబుర్లు చెప్పింది అత్తగారు. పరిస్థితి యథాస్థితికి వచ్చినందుకు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాం మేం.

కానీ ఈ ప్రశాంతత శాశ్వతమని ఏమిటి హామీ?

‘‘ఆ ముసలం ఇంట్లో ఉన్నంతకాలం వీళ్ళ బుర్రల్లో మళ్ళీ ఏ పురుగు తొలిచి కలకలం రేపుతుందో అన్న భయం వదలటంలేదురా అబ్బాయ్‌’’ అన్నాను హరితో.

అవునవునన్నాడు హరి.

*   *   *

ఆరోజు - వరండాలో కూర్చుని అరటిపువ్వు వలుస్తూ తీరిగ్గా కబుర్లు చెబుతోంది వర్ధని. నేను నా శేషతల్పం - అదే - పడక్కుర్చీలో వాలి వింటున్నట్టు నటిస్తున్నాను.

‘‘పెద్దమ్మ గారూ’’

తలెత్తాం ఇద్దరం. మా పనిమనిషి మంగ, దాని చీర కుచ్చిళ్ళు పట్టుకు వేశ్ళాడుతూ దాని కూతురు కనక.

‘‘ఏమే పొద్దున్న పని ఎగ్గొట్టావ్‌?’’ 

ఉరిమింది వర్ధని.

ఇద్దరు ముగ్గుర్ని మార్చిమరీ తన ఎర్రనిచూపుకి అదిరే మేధకురాలిని పనికి కుదుర్చుకుందిలెండి మా ఆవిడ.

కొత్త గౌనూ తల్లో పూలూ పెట్టుకుని తెగ సిగ్గుపడిపోతూ వెనక్కివెనక్కి జరిగిపోతున్న కనకని ‘‘దణ్ణం పెట్టవే’’ అంటూ ముందుకునెట్టి ‘‘ఇయ్యాల దీని పుట్టినరోజమ్మా. 

పూర్ణాలొండమని ఏకగుణుపు. అవీ, కాసిని గార్లూ వండేటప్పటికి వేళ మిగల్లేదమ్మా’’ నమ్రతగా చెప్పింది మంగ.

వంగిన కనక ముందున్న తన కాళ్ళని గబుక్కున వెనక్కి లాక్కుంటూ ‘‘నాలుక్కాలాలపాటు చల్లగా ఉండు’’ అని అర్జంటుగా దీవించేసి, ‘‘సరిసర్లే, పదపద... బోల్డంట్లు మూలుగుతున్నాయ్‌. పెరట్లోకి నడు’’ 

తొందరపెట్టేసింది వర్ధని.

‘‘ఎళుతున్నాలేగానీ అమ్మా...’’ నంగినంగిగా నానుస్తూ అక్కడే నిలబడిపోయింది మంగ.

‘‘ఏమిటే?’’ దేనికో టెండరు వేస్తోందని అర్థమయిపోయినట్టుంది మా ఆవిడకి - విసుగ్గా మొహంపెట్టింది.

‘‘సినిమాకెశ్దామని గోల చేస్తావుందిది. ఒక్కొంద రూపాయలివ్వండమ్మా. జీతంలో పట్టుకుందురుగాని’’.

‘‘ఈ నెల జీతం ఎప్పుడో వాడేసుకున్నావుగదే. మళ్ళీ...’’ వర్ధని ఇంకా ఏదో అంటూనే ఉంది. నేను ‘‘ఇస్తాలే’’ అని మాటిచ్చేశాను.

నేను పర్సు కోసం లోపలికొచ్చినప్పుడు విన్నాను - మా ఆవిడ కోడలితో అంటోంది, ‘‘కనక పుట్టినరోజట. దానికేమన్నా ఇవ్వాలిగా. మనకి పనికిరానివేమన్నా ఉన్నాయేమో చూడు... పక్కకి పడేసిన బొమ్మో దిమ్మో...’’. 

‘‘చూస్తాలెండి. కారు బొమ్మకటుండాలి. రంగు మాయలేదుగానీ వెనక చక్రం కాస్త విరిగింది. పర్లేదు, కనబడదులెండి. 

అట్టపెట్టెలో పెట్టి ఇచ్చేస్తాను’’ విశాల హృదయంతో చెబుతోంది కోడలు.

‘‘మొన్న మా పెద్ద బావగారు తెచ్చారే అక్బరీలు- అలాగే ఉన్నయ్, అవి పొట్లంకట్టి ఇచ్చేస్తాను’’ తనవంతు ఉదారత చాటుకుంది వర్ధని.

గట్టిగా ఉన్నాయని ఎవ్వరూ ముట్టకపోవటంవల్ల అవి తెచ్చినవి తెచ్చినట్టే ఉండిపోయాయిలెండి.

నేను నిట్టూర్చుకుంటూ పర్సులోంచి వందరూపాయల కాగితంతోపాటు మరో ఏభై బయటకు తీశాను.

మంగ ఇంకా అంట్లు తోముతూనే ఉంది. సుజాత అట్టపెట్టె ప్యాక్‌ చేస్తూనూ మా ఆవిడ అక్బరీలు పొట్లం కడుతూనూ ఉన్నారు.

‘‘మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్‌ ఆఫ్‌ ద డే’’, ‘‘విష్‌ యూ హ్యాపీ బర్త్‌డే కనకా’’ వాకిట్లోంచి మా సంజూ బాలూ గొంతులు వినిపించాయి.

అంతస్తుల తారతమ్యాలెరుగని నిష్కల్మషమైన వారి బాల్యాన్ని అభినందించుకుంటూ బయటకు వెశ్ళాను.

‘‘కనకా, ఇదిగో మా గిఫ్ట్‌’’

సంజూ, బాలూ జమిలిగా పట్టుకుని కనకకి ఇస్తున్నదేమిటి?

అమెరికా గౌను పెట్టిన అట్టపెట్టె కాదూ?

క్షణం మ్రాన్పడిపోయాను. కానీ మరుక్షణంలోనే ఎందుకో సంభ్రమంగా రిలీఫ్‌గా అనిపించింది. మేము భయపడుతున్న సమస్యకి అనుకోని పరిష్కారమా ఇది!

‘‘అమ్మా, మనకి పనికిరానిదేమన్నా ఇమ్మంటున్నదిగా బామ్మ. మనకిది యూజవదు గదా. అందుకే ఇచ్చేశాను. ఓకేనా’’ అంటోంది సంజూ.

 ‘‘చూడు, కనకకిది కరెక్టుగా సరిపోయింది కూడానూ’’ ఆనందంగా అంటున్నాడు బాలూ. తలెత్తాను. అట్టపెట్టెలోంచి గౌను తీసి కనకకి తొడిగి అటూ ఇటూ తిప్పిచూస్తూ మురిసిపోతున్నది మంగ. కక్కలేకా మింగలేకా పెదాలతో నవ్వుతూ, కళ్ళతో ఉరుముతూ మా ఆవిడా కోడలూ - వస్తున్న నవ్వు ఆపుకోలేక పేపరు అడ్డంపెట్టుకుని నేనూ..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని