అడుగుల వేగం

బస్సు దిగి ఊరివైపు నడిచాడు సురేష్‌. చలిగాలి ముట్టడించింది. కోటు గుండీలు సర్దుకుని అటూ ఇటూ చూశాడు...

Published : 10 Apr 2020 14:18 IST

అలపర్తి రామకృష్ణ

స్సు దిగి ఊరివైపు నడిచాడు సురేష్‌. చలిగాలి ముట్టడించింది. కోటు గుండీలు సర్దుకుని అటూ ఇటూ చూశాడు. ఎవరూ కన్పించలేదు. పుట్టిపెరిగిన ప్రాంతమైనా బెదురుగా ముందుకు నడిచాడు. దారిపక్కన పచ్చనిచెట్లు తలలూపుతూ స్వాగతం చెప్పినా ఉత్సాహం ఉరకలు వెయ్యలేదు. కోటు తెచ్చుకోవడం మంచిదే అయిందనుకున్నాడు చలిగాలి ఉధృతి గమనించి. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా తొలి జీతం అందుకున్న రోజుల్లో కొనుక్కున్న కోటు అది.

ఊళ్లో బీటెక్‌ చదివింది తనొక్కడే. ఉద్యోగం వచ్చిన కొత్తలో ఎన్నో కలలుకన్నాడు. కొత్త బంగారులోకంలో విహరించాడు. సొంత ఊళ్లోని పాత పెంకుటిల్లు పడగొట్టేసి పెద్ద మేడ కట్టించాలి... అమ్మకు వంట వండిపెట్టడానికి వంటమనిషిని ఏర్పాటుచెయ్యాలి.. ఊళ్లో నాన్నగారి పేరుమీద పాఠశాల భవనం కట్టించాలి.. సంవత్సరం తిరగకముందే ఆ బంగారు కలలన్నీ కరిగిపోయాయి. ఆర్థికమాంద్యం కోరల్లో చిక్కుకుపోయింది ఐటీ రంగం. తన ఉద్యోగం ఊడిపోయింది. ఉద్యోగం కోసం పది కంపెనీలకు రెజ్యుమె పంపాడు. ఫలితం లేదు. మంచి ఉద్యోగం దొరికేవరకూ ఏదో ఒకటి చెయ్యక తప్పదు కనుక షాపింగ్‌మాల్‌లో అసిస్టెంటుగా చేరాడు. రాత్రిళ్ళు పిల్లలకు ట్యూషన్స్‌ చెబుతున్నాడు.

ఉద్యోగం పోయిన సంగతి ఊళ్లో ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడాలి... ఆ విషయం తెలిస్తే అమ్మ బాధపడుతుంది. అందుకే కోటూ బూటూ వేసుకుని దర్పంగా ఊళ్లో అడుగుపెడుతున్నాడు.డొంకదారి ఊరికి దగ్గరి దారి. ఎటుచూసినా పచ్చటిచేలు కన్పించాయి. ఎనభైశాతం మంది వ్యవసాయం మీద ఆధారపడ్డారు కాబట్టే ఆర్థికమాంద్యం ప్రభావం గ్రామాల్లో అంతగాలేదు.చిన్నప్పుడు స్కూలు ఎగ్గొట్టి డొంకమీద ఆడుకునేవాళ్ళు. చింతచెట్టుమీద ఎక్కి కోతికొమ్మచ్చి ఆడేవాళ్ళు. పంటకాలవల్లో ఈతలు కొట్టేవాళ్ళు. సీమచింతకాయలు, కందికాయలు కోసుకుని జేబులనిండా కుక్కుకునేవాళ్ళు.. పచ్చికలో పాములు తిరుగుతున్నా భయపడేవాళ్ళు కాదు.

ఇప్పుడు ఎందుకో బతుకు భయం.

బరువైన వస్తువులేవీ లేకున్నా భుజానికి వేశ్ళాడుతున్న ఎయిర్‌బ్యాగు బరువుగా అన్పించింది. మనస్సు కుదురుగా లేకపోతే ఒంటిమీది బనీను కూడా బరువుగా అన్పిస్తుందేమో! బీటెక్‌ చదివి, డాట్‌నెట్‌ క్రాష్‌ కోర్సులు పూర్తిచేసి షాపింగ్‌మాల్‌లో బిల్‌కౌంటర్‌లో పనిచేసే పరిస్థితి ఎదురైతే మనస్సు కుదురుగా ఎలా ఉంటుంది?అమ్మ గుర్తుకురాగానే అడుగులవేగం పెరుగుతూ ఉంది.

చిన్ననాటి స్నేహితుడు రఘు ఎదురొచ్చాడు.

‘‘ఏరా, ఇప్పుడేనా రావడం... నువ్వు మన ఊరు వచ్చి సంవత్సరం దాటింది. 

మీ అమ్మని చూడాలని అన్పించలేదా?’’ మొహమాటం లేకుండా అడిగేశాడు రఘు.

ఇబ్బందిగా అన్పించి తల అటూ ఇటూ తిప్పాడు సురేష్‌.

‘‘పెద్ద ఉద్యోగంలో ఉన్నావ్‌ కదా! పని ఒత్తిడి ఎక్కువై ఉంటుంది. నెలకు పాతికవేలు జీతం అంటే కష్టపడి పనిచేయాలి కదా. ‘అమ్మ, ఇల్లు’ అంటే కుదురుతుందా?’’ 

అతని ప్రశ్నకు అతనే సమాధానం చెప్పుకుపోయాడు.

తెచ్చిపెట్టుకున్న నవ్వుతో స్నేహితుడి భుజం కుదిపాడు సురేష్‌.

‘‘నీతోపాటే మీ అమ్మనూ తీసుకువెళ్ళరాదూ! పెద్దావిడ... ఒక్కతే ఇక్కడ ఏం అవస్థపడుతుంది?’’ అన్నాడు రఘు.

అతని ప్రశ్నకు సమాధానం మనస్సులో మెదిలింది... మాటలు పెదాలు దాటిరాలేదు.

తను ఉంటున్న రూము అద్దె రెండునెలలు బకాయి ఉన్నాడు. షాపింగ్‌మాల్‌వాళ్ళు ఇచ్చే మూడువేలు తనకే చాలడంలేదు. అమ్మనెలా పోషిస్తాడు? రాత్రిళ్ళు మరిన్ని ట్యూషన్స్‌ చెప్పి మరికొంత సొమ్ము కూడబెట్టి అమ్మని ఎలాగోలా హైదరాబాద్‌ తీసుకువెళతాడు. కానీ తనకు సరైన ఉద్యోగంలేదని అమ్మకి తెలిసిపోతుంది... అమ్మ బాధపడుతుంది... అది తనకు ఇష్టంలేదు.

‘‘అయినా మీ అమ్మ హైదరాబాద్‌లో ఉండలేదులేరా. కాలువగట్టుమీదా డొంకలమీదా స్వేచ్ఛగా తిరుగుతూ పచ్చని పచ్చిగడ్డిమేసే పాడిఆవును డైరీఫారమ్‌లో ఇనుప గొలుసుతో కట్టేసినట్లు ఉంటుంది. సాయంత్రం మీ ఇంటికి వస్తాలేరా... తీరిగ్గా మాట్లాడుకుందాం. డొంకమీద నిన్ను నిలబట్టేసి వాయించుతున్నాను. సాయంత్రం వచ్చేటప్పుడు జున్నుపాలు తెస్తాను... నీకు ఇష్టం కదా. అర్జంటుగా పొన్నూరు వెశ్ళాలి. ఎరువులు తెచ్చుకోవాలి’’ అనేసి సురేష్‌ సమాధానం కోసం ఎదురుచూడకుండా వెళ్ళిపోయాడు రఘు.

స్వగ్రామాన్ని చూడగానే మనసు పులకించింది.

చిట్టిపాదాలకు బుడిబుడి నడకలు నేర్పిన ఊరు... జీవన ప్రవాహనదిలో చేరడానికి పిల్లకాలువలా పరుగులెత్తించిన ఊరు.. వీధిబడిలో అక్షరాలు నేర్పిన సొంత ఊరిని చూస్తే ఎవరికి మనసు రాగరంజితం కాదు..?

‘‘అమ్మా’’ పాత పెంకుటింట్లోకి అడుగుపెట్టి మెల్లగా పిలిచాడు. 

‘‘ఎప్పుడొచ్చావురా నాన్నా? ఉత్తరంముక్క రాయలేదేం వచ్చేముందు?’’ కొడుకు ఒళ్ళంతా నిమురుతూ సంబరపడిపోయింది అన్నపూర్ణమ్మ.

‘‘నిన్ను చూడాలనిపించి వచ్చాన్లే. ఎలా ఉన్నావ్‌?’’ అడిగాడు సురేష్‌.

‘‘నాకేం, గుండ్రాయిలా నిక్షేపంగా ఉన్నా... నువ్వేమిట్రా అంత చిక్కిపోయావ్‌’’ కొడుకు భుజం నిమురుతూ అంది అన్నపూర్ణమ్మ.

తల్లి ఆప్యాయతకి కరిగిపోయాడు. 

కనుకొలకుల్లో నీళ్ళు నిలిచాయి. ‘‘రాత్రి ఎప్పుడు తిన్నావో... వేడివేడిగా మినపట్టు వేసి పెడతాను తిందువుగాని’’ వంటింటివైపు వెళ్ళింది అన్నపూర్ణమ్మ. 

బట్టలు విప్పేసి టవల్‌ చుట్టుకుని పెరట్లో ఉన్న బావివైపు వెశ్ళాడు సురేష్‌. చన్నీళ్ళ స్నానం చేస్తుంటే సూర్యకిరణాలు ఒంటిమీదపడి మిలమిలా మెరుస్తూ కన్పించాయి. 

బావిచుట్టూ ఉన్న అరటిచెట్ల పచ్చదనం మనసుకు ఆహ్లాదాన్ని కల్గించింది.

స్నానంచేసి వచ్చి కొడుకు బ్యాగులోని బట్టలు బయటకు తీయడం గమనించింది అన్నపూర్ణమ్మ. సంవత్సరంకిందట వచ్చినప్పుడు అవే బట్టలు చూసింది. ఆమెకు బాగా గుర్తు... అవే బట్టలు.

‘ఈసారి మన ఊరు వచ్చినప్పుడు సొంత కారు నడుపుకుంటూ వస్తానమ్మా’ కొడుకు మాటలు గుర్తుకువచ్చాయి.

‘‘బస్సులో వచ్చావా?’’ కొడుకును అడిగింది.

‘‘నా కారు మా ఫ్రెండు తీసుకున్నాడు. వాడి చెల్లెలు పెళ్ళి. ఓ పదిరోజులు నా కారు వాడుకుంటానన్నాడు... కాదనలేకపోయాను. ఈసారి మన ఊరు వచ్చేటప్పుడు కార్లోనే వస్తాన్లే’’ అన్నాడు సురేష్‌.

వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఒకరి పనులు మరొకరు గమనిస్తూనే ఉన్నారు. కొడుకు హృదయంలోకి తొంగిచూస్తూనే ఉంది. ఏదో వెలితి కొట్టొచ్చినట్లు కన్పించింది. తల్లికి తను చేస్తున్న పెద్ద కంపెనీగూర్చి, యజమానిగూర్చి గొప్పలు చెబుతూనే ఉన్నాడు అనుమానం కలగకుండా.

‘‘సుమతి అక్క ఎలా ఉందమ్మా?’’ తల్లిని అడిగాడు.

‘‘దాని కథ మామూలే. తొందరపడి పెళ్ళిచేశాం. చదువుకుంటానని మొత్తుకుంది. దానిమాట పట్టించుకోకుండా మెడలు వంచి తాళి కట్టించాం. మొగుడు రోజూ తాగివచ్చి గొడ్డును బాదినట్లు బాదుతాడు. అతన్తోపాటే పొలం పనులూ చేస్తుంది. మిరపచేలలో, పత్తిచేలలో ఎర్రని ఎండలో కష్టపడుతుంది. పంటలు బాగా పండి అప్పులు తీరిపోతే కొత్తచీర కట్టుకుని పిల్లలను తీసుకుని నవ్వుతూ ఇక్కడకు వస్తుంది. నాలుగైదు రకాల పిండివంటలు చేసుకువస్తుంది. వానలు వచ్చి పంటలు పాడైపోతే ఇటువైపే రాదు. డబ్బు అవసరమని ఎప్పుడూ నోరుతెరిచి అడగదు. మనవైపునుంచి దానికి ఒక్కటే ఆశ ఉందిరా. దాని పిల్లలను నువ్వు బాగా చదివించి పెద్దవాళ్ళను చేస్తావనే ఆశ. నిన్ను చూడాలని కలవరిస్తూ ఉంటుంది. నాలుగైదు రోజులు ఉంటావుగా... సుమతిని వచ్చిపొమ్మని కబురుచేస్తాను’’ అంది అన్నపూర్ణమ్మ.

‘‘ఇప్పుడు వద్దమ్మా. ఈసారి వచ్చినప్పుడు అక్కని తప్పకుండా కలుస్తాను. నేను రేపే తిరిగి వెళ్ళిపోవాలి. మా కంపెనీ మీటింగు ఉంది... నేను తప్పకుండా హాజరుకావాలి’’ అన్నాడు సురేష్‌ కంగారుగా.

‘ఈసారి వచ్చినప్పుడు నీకు ఇరవైవేలు ఇస్తాను. నువ్వు పట్టుచీర కొనుక్కో, మీ పిల్లలకు బట్టలు కుట్టించు’ అనేశాడు అంతకుముందు సుమతిని కలిసినప్పుడు.

ఇప్పుడు జేబులో అయిదొందలకుమించి లేవు. హైదరాబాద్‌ తిరిగివెళ్ళడానికీ దారి ఖర్చులకూ ఆ డబ్బు అవసరం. తను ఇక్కడ ఉన్నప్పుడు అక్క వస్తే ఇబ్బందే!

వేడివేడి అన్నంలో పప్పు, గోంగూరపచ్చడి వడ్డించింది అన్నపూర్ణమ్మ. కమ్మటి వంకాయపులుసు తింటుంటే అన్నంలో అమృతం కలుపుకుతిన్నట్లు అన్పించింది. పులుసులోని ములాక్కాడలు చప్పరించాడు. గడ్డపెరుగుతో భోజనం ముగించాడు.

సాయంత్రం అయిదుగంటల వరకు నిద్రపోయాడు పెరట్లోని వేపచెట్టు నీడలో.

*   *   *

‘‘శివయ్యగారి అమ్మాయి వచ్చింది’’ 

అన్నపూర్ణమ్మ కొడుకును తట్టిలేపింది. ఉలిక్కిపడి లేచాడు సురేష్‌.

‘‘ఎక్కడా?’’

‘‘ముందుగదిలో కూర్చుంది. ఆ పాత లుంగీతో వెళ్ళేవు... లుంగీ తీసేసి, ప్యాంటు తొడుక్కుని వెళ్ళు’’ అంది అన్నపూర్ణమ్మ.

ఆమె బట్టలుతెచ్చి కొడుక్కి ఇచ్చింది.

సబ్బుతో ముఖం రెండుమూడుసార్లు తోమి, బట్టలు వేసుకుని సుప్రజ కూర్చున్న గదిలోకి వెశ్ళాడు. సాయంత్రం నీరెండవెలుగు గది అంతా వ్యాపించి ఉంది. ఆ పచ్చటి వెలుగులో బంగారుబొమ్మలా మెరిసిపోతూ  కన్పించింది సుప్రజ.

‘‘ఎప్పుడొచ్చావ్‌? ఎన్నాళ్ళుంటావ్‌?’’ 

ముసిముసి నవ్వులు నవ్వుతూ దర్పంగా అడిగింది. మొదటిప్రశ్న మామూలుగా అడిగింది. రెండో ప్రశ్నకే సమాధానం ఆశించింది.

సర్పంచ్‌గారి అమ్మాయి సుప్రజ. పాతిక ఎకరాల పొలం ఉంది. ఒక్కతే కూతురు. బీకాం వరకు చదువుకుంది. చిన్నప్పటినుంచి కలిసిమెలిసి తిరిగారు. ఆ స్నేహబంధం ఆలుమగల అనురాగబంధంగా మారాలని ఇద్దరూ ఉవ్విళ్ళూరుతున్నారు. వాళ్ళ పెళ్ళికి సుప్రజ తండ్రికి కూడా అభ్యంతరమేమీలేదు.

‘‘రేపు వెళ్ళిపోవాలి’’ అన్నాడతను సముద్రకెరటాల్లా అలజడితో ఎగసిపడుతున్న మనస్సును సమాధానపరుస్తూ.

అతని చూపులు ఆమెను చుట్టుముట్టాయి. తొలకరి వానచినుకుల్లా ఆమెను తాకాయి.

‘‘అంత హడావుడిగా వచ్చి వెళ్ళకపోతేనేం?’’ అందామె అతనికి సమీపంగా జరిగి.

‘‘నిన్ను చూసే అపురూప క్షణంకోసం ఆరాటపడుతూ ఉంటాను సంవత్సరం పొడవునా... నిన్నుచూసిన మరుక్షణంలో నా బాధ్యతలు గుర్తుకువస్తాయి’’ అన్నాడతను ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని సుతారంగా స్పృశిస్తూ.

‘‘మా నాన్నతో మన పెళ్ళి విషయం ఎప్పుడు మాట్లాడతావ్‌?’’ అడిగిందామె.

‘‘మొన్నీమధ్యనే నాకు ప్రమోషన్‌ వచ్చింది. మరొక్క సంవత్సరం కష్టపడితే యాభైవేలకు జీతం పెరుగుతుంది... మనిద్దరం దర్జాగా బతకొచ్చు. అమ్మను కూడా మనతోపాటే తీసుకువెశ్దాం. మరో సంవత్సరం మన పెళ్ళి వాయిదా వేసుకుందాం’’ అన్నాడతను.

‘‘మీ ఉద్యోగం పోయిందటగా... షాపింగ్‌మాల్‌లో పనిచేస్తున్నారట... రాత్రిపూట పిల్లలకు ట్యూషన్స్‌ చెబుతున్నారట... మన ఊరి అబ్బాయి మీ వివరాలు సేకరించి మా నాన్నకు చెప్పాడు’’ అందామె తలవంచుకుని మెల్లగా.

వెయ్యి ఓల్టుల బల్బులా వెలుగుతున్న అతని ముఖం జీరోవాల్ట్‌ బల్బులా మారిపోయింది ఆమె మాటలు వినగానే.

తల వాల్చేశాడు. ఆమెకు దూరంగా జరిగే ప్రయత్నం చేశాడు. సుప్రజ తనకు దూరమవుతుందేమోనన్న తత్తరపాటు మొదలయింది.

ఆమెతో గడిపిన క్షణాలన్నీ తనకు వెన్నెలరాత్రులు... ఇక కృష్ణపక్షం మొదలవుతుంది... ఉద్యోగం పోయింది... సుప్రజ కూడా తనకు దూరమైపోతుంది. ఉద్యోగం, సద్యోగం లేనివాడికి పిల్లను ఎవరిస్తారు? పాత పెంకుటిల్లు తప్పితే ఆస్తిపాస్తులూ లేవు.

‘‘ఇక్కడ ఉక్కపోస్తోంది... పెరట్లో బాదంచెట్టు దగ్గర కూర్చుందాం పద’’ అందామె.

బాదంచెట్టుకింద చేరారిద్దరూ.

అన్నపూర్ణమ్మ రెండు కప్పుల్లో కాఫీ తెచ్చి ఇచ్చింది.

‘‘సుప్రజ మనస్సు బంగారంరా.. మొన్నీమధ్య జ్వరం వచ్చి మంచానికి అతుక్కుపోతే నేను కోలుకునేదాకా మనింట్లోనే ఉండిపోయింది. ఊళ్లో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకుంటుంది. పదో పరకో సర్దుతుంది. వాళ్ళ నాన్న కూడా సుప్రజ ఏది చెబితే అది చేస్తాడు’’ చెప్పుకుపోయింది అన్నపూర్ణమ్మ.

‘‘మరీ ఎక్కువగా పొగుడుతున్నావత్తయ్యా! నాకు ఇబ్బందిగా ఉంది’’ అంది సుప్రజ.

ఖాళీ కప్పులు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది అన్నపూర్ణమ్మ.

‘‘నీకూ మీ నాన్నగారికీ నామీద అసహ్యంవేసి ఉంటుంది... ఉద్యోగం పోగొట్టుకుని డాంబికంగా ఊళ్లో తిరుగుతున్నానని’’ అన్నాడు తల వంచుకుని.

‘‘నువ్వు వచ్చినట్లు తెలిసి మా నాన్నే నన్ను ఇక్కడకి పంపించారు. ఉద్యోగంలేదని అధైర్యపడొద్దని చెప్పమన్నారు. నీ తెలివితేటలు, పట్టుదలమీద మా నాన్నగారికి గట్టి నమ్మకం ఉంది. మంచిరోజులు వస్తాయి... నీకు మంచి ఉద్యోగం తప్పకుండా దొరుకుతుంది’’ అందామె అతని భుజంమీద చెయ్యివేసి ఆప్యాయంగా అతని కళ్ళల్లోకి చూస్తూ.

‘‘మంచి కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు ఉద్యోగం దొరికినప్పుడు నా ప్రతిభే కారణమనుకున్నాను. ఉద్యోగం పోయినప్పుడు ఆఫీసులో నేనంటే పడనివాళ్ళే కారణమనుకున్నాను. ఇప్పుడు అర్థం అవుతూ ఉంది... నేనో అడుగు ముందుకు వెయ్యడానికి నీలాంటి మంచి మనస్సున్నవాళ్ళ ప్రోత్సాహం కారణమనీ అపజయాలకు నా పిరికితనమే కారణమనీ. ఎడారిలో తిరుగుతున్న నాకు, నువ్వు పక్కన ఉంటే ఒయాసిస్సు పక్కన ఉన్నంత ధైర్యం కలుగుతూ ఉంది. నువ్వన్నట్లు మంచిరోజులు వస్తాయి... ఈ ఆర్థికమాంద్యం కలకాలం ఉండదు’’ అన్నాడతను తడికళ్ళతో ఆమెవైపు కృతజ్ఞతగా చూస్తూ.

బాదంచెట్టుమీద పిట్ట కిలకిలారావాలు చేసింది వాళ్ళిద్దరినీ చూసి ముచ్చటపడుతూ.

*     *     *

‘‘అప్పుడే వెళ్ళిపోతావట్రా? నాలుగురోజులు ఉండొచ్చు కదా’’ అంది అన్నపూర్ణమ్మ బ్యాగులో బట్టలు సర్దుకుంటున్న కొడుకువైపు చూస్తూ.

‘‘మా పైఅధికారి ఊరుకోడమ్మా... 

రెండురోజులే సెలవు ఇచ్చాడు. వెంటనే తిరిగి వెళ్ళకపోతే మళ్ళీ ఇబ్బంది’’ అన్నాడు సురేష్‌.

‘‘పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావురా?’’

‘‘పెళ్ళికెందుకే తొందరా... ముందు 

నన్ను స్థిరపడనీ’’.

కొడుకు చిరిగిన బనీను భద్రంగా మడిచి బ్యాగులో పెట్టుకోవడం ఆమె కళ్ళలోపడింది.

గబగబా లోపలి గదిలోకి వెళ్ళింది. పాత ట్రంకుపెట్టె మూతతీసి బట్టల అడుగున పెట్టిన బంగారు మురుగులు బయటకు తీసింది. సబ్బునీళ్ళలో వాటిని కడిగి తెచ్చి కొడుక్కి ఇచ్చింది.

‘‘నాకు ఇస్తున్నావెందుకమ్మా?’’ అడిగాడు సురేష్‌ ఆశ్చర్యంగా.

‘‘ఎప్పుడో పదేళ్ళకిందట చేయించిన మురుగులు... అంతా మేలిమి బంగారమే! అవి పెట్టుకోవడం మానేసి అయిదేళ్ళు అవుతుంది. వాటి అవసరం నాకులేదు నాయనా! నీ దగ్గర ఉంచు. అవసరానికి ఉపయోగపడతాయి’’ అందామె.

తత్తరపడ్డాడు సురేష్‌. ఉద్యోగం పోగొట్టుకుని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు అమ్మకు తెలిసిపోయిందా? సుప్రజ చెప్పిందా అసలు విషయం... చెప్పదే..!

‘‘నీ మురుగులు నాకెందుకే. నెలకు పాతికవేలు సంపాదిస్తున్నాను. డబ్బు అవసరం నీకు ఏమన్నా ఉంటే చెప్పు.. నేను సర్దుతాను’’ కోటు వేసుకుంటూ దర్పంగా అన్నాడు.

‘‘ఊళ్లో దొంగల భయం ఎక్కువగా ఉందిరా. వయస్సు మీదపడుతోంది.. నా దగ్గరుంటే ఎవడోకడు లాక్కుని ఎత్తుకుపోతాడు... నీ దగ్గరే ఉండనీ. అవసరం అయితే అమ్మేసుకో వాటిని’’ అందామె, కొడుకు బ్యాగులో పెట్టే ప్రయత్నం చేస్తూ.

‘‘నాకేం అవసరం ఉంటుందే నీ పిచ్చిగాని’’ తల్లిని వారిస్తూ అన్నాడతను.

కొడుకు చేతులు నెట్టివేసి ఎయిర్‌బ్యాగు అడుగున బట్టలకింద బంగారు మురుగులు ఉంచింది.

సురేష్‌ కళ్ళల్లో నీళ్ళు సుళ్ళు తిరిగాయి.

అన్నపూర్ణమ్మ చీరకొంగుతో కొడుకు ముఖం తుడిచింది.

‘‘వెళ్లొస్తానమ్మా’’ డగ్గుత్తికతో అన్నాడు సురేష్‌.

కొడుకుతోపాటే ఊరి పొలిమేరల వరకు వద్దామనుకుంది అన్నపూర్ణమ్మ.

‘‘నువ్వొద్దే, బయట చలి ఎక్కువగా ఉంది. చలిగాలిలో తిరిగితే ఛాతీ పట్టేస్తుంది’’ తల్లిని వారించి అక్కడనుంచి కదిలాడు.

డొంకదారిలో నడుస్తుంటే దిగులుగా ఇంటిముందు నిలబడిన తల్లిరూపం కళ్ళల్లో మెదిలింది. తల్లిని వదిలి వెళ్తున్నందుకు అతనిలోనూ బెంగ మొదలయింది. సుప్రజనూ అమ్మనూ వదిలి దూరంగా వెళ్ళడం ఇబ్బందే... అయినా నిబ్బరించాలి.

జారిపోతున్న మనసును దిటవుపర్చుకున్నాడు. తల్లి మురుగులు ఉన్న బ్యాగును ఆప్యాయంగా తడిమాడు. ఆత్మీయుల అనురాగం తనవెంట వస్తూ ఉంది... ధైర్యంగా ముందుకు అడుగువేస్తాడు... 

మంచి ఉద్యోగం సంపాదిస్తాడు.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా అమ్మ మురుగులు అమ్మడు. అమ్మ, సుప్రజ కలిగించిన ధైర్యమే కవచంగా మారింది. ఇక చలీ గిలీ లేదు... కోటు తీసేసి వడివడిగా అడుగులు ముందుకువేశాడు సురేష్‌. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని