జీవని

‘‘ఏరా తరుణ్‌... జీవని ఈమధ్య కనబడ్డమే మానేసింది’’ కాఫీ గ్లాసు తరుణ్‌ చేతికి అందిస్తూ అడిగాను.‘‘కాఫీ సూపర్‌ పిన్నీ. ఫిల్టర్‌ కాఫీ నీలా ఎవరూ కలపలేరు’’ అన్నాడు తరుణ్‌ కాఫీ సిప్‌ చేస్తూ....

Published : 10 Apr 2020 15:18 IST

కె.కె.భాగ్యశ్రీ

‘‘ఏరా తరుణ్‌... జీవని ఈమధ్య కనబడ్డమే మానేసింది’’ కాఫీ గ్లాసు తరుణ్‌ చేతికి అందిస్తూ అడిగాను.‘‘కాఫీ సూపర్‌ పిన్నీ. ఫిల్టర్‌ కాఫీ నీలా ఎవరూ కలపలేరు’’ అన్నాడు తరుణ్‌ కాఫీ సిప్‌ చేస్తూ.

నేనడిగింది వాడు సరిగా వినలేదేమోనని మళ్ళీ అడిగాను ‘‘ఏంట్రా, ఏదేదో మాట్లాడుతున్నావు. నేనడిగేది జీవని గురించి’’.

‘‘కాఫీతోపాటు జీడిపప్పు బాగా దట్టించిన ఉప్మా కూడా ఉంటే బాగుండేది. ఉప్మా చేయడంలో నువ్వు ఎక్స్‌పర్ట్‌వి కదా’’ అన్నాడు తరుణ్‌ నా మాటలు పట్టించుకోకుండా. అప్పుడు అర్థమైంది వాడు మాట దాటవేస్తున్నాడని. 
‘‘ఏరా, ఇద్దరూ పోట్లాడుకున్నారా?’’ 

లాలనగా అడిగాను.

‘‘ప్లీజ్‌ పిన్నీ, ఆ టాపిక్‌ మాట్లాడకు’’ అన్నాడు తరుణ్‌ అసహనంగా.

వాడికంత చిరాకు ఎందుకు కలిగిందో అర్థంకాక తెల్లబోయాను.

‘‘చూడు తరుణ్, నీకు జీవని మీద అంత కోపం ఎందుకొచ్చిందో తెలియదుగానీ... 

నీ మనసులో ఏముందో మాత్రం నాకు తెలియాలి. అసలేమైంది?’’ అడిగాను మృదువుగా.

తరుణ్‌ నా ముఖంలోకి ఓసారి చూసి ‘‘జీవనిని పెళ్ళిచేసుకోవడం నాకిష్టంలేదు పిన్నీ...’’ అన్నాడు కళ్ళు దించుకుంటూ.

నివ్వెరపోయాను.

‘‘ఏంటి తరుణ్, నువ్వేమంటున్నావో తెలుస్తోందా?’’ అన్నాను కాస్త కరుకుగా.

‘‘భేషుగ్గా... జీవనిని పెళ్ళి చేసుకోనని చెప్తున్నా’’ అన్నాడు తను కూడా అదే స్థాయిలో.

‘‘కారణం?’’ ఉబికివస్తున్న ఆగ్రహాన్ని అణచుకొనే ప్రయత్నంచేస్తూ అడిగాను.

తరుణ్‌ ఏమాత్రం చలించకుండా ‘‘ప్రత్యేకమైన కారణాలేమీ లేవు పిన్నీ. జీవని ఉద్యోగం పోయింది’’ అన్నాడు కూల్‌గా.

‘‘అయితే?’’ అయోమయంగా చూశాను.

నన్నొక వింతజంతువుని చూసినట్లుగా చూశాడు తరుణ్‌.

‘‘అయితే అని అంత మామూలుగా అడుగుతావేం పిన్నీ. జీవనిని నేను పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడింది ఆ ఉద్యోగం చూసే కదా’’ చెప్పాడు తరుణ్‌ రాకింగ్‌ ఛెయిర్‌లో ముందుకీ వెనక్కీ ఊగుతూ.

నిర్ఘాంతపోయాను. ఏమంటున్నాడు వీడు. జీవనిని ప్రేమించాననీ ఆమె లేకపోతే బతకలేననీ చెప్పిన వీడు ఇప్పుడు ఉద్యోగం పోతే వద్దంటున్నాడేంటి?అలా సందిగ్ధంలోపడి కొట్టుకుంటూనే ఉన్నాను చాలాసేపు. ఆ తరవాత తేరుకొని ‘‘జీవని ఉద్యోగం పోయిందా’’ అడిగాను గొంతు పెగుల్చుకొని.

అవునన్నట్లుగా తలూపాడు తరుణ్‌.

‘‘దానికీ నువ్వు జీవనిని కాదనడానికీ ఏమిటి సంబంధం?’’

తరుణ్‌ నావైపు విచిత్రంగా చూసి ‘‘ఎందుకులేదు పిన్నీ. ఈ రోజుల్లో ఇద్దరూ ఉద్యోగాలు చేస్తేకానీ బతకలేని పరిస్థితులు ఉన్నాయి. అలాంటప్పుడు ఉద్యోగం పోయిన జీవనిని పెళ్ళి చేసుకుని నేనేం సుఖపడగలను చెప్పు’’ ఎదురు ప్రశ్నించాడు.

‘‘ఈ ఉద్యోగం కాకపోతే మరొకటి. అంతమాత్రంచేత జీవనిని తిరస్కరించాలా?’’ అడిగాను కాస్త కోపంగా.

‘‘నీకు తెలియదు పిన్నీ. జీవని అంత తెలివైన అమ్మాయేంకాదు. ఏదో అదృష్టంకొద్దీ ఈ ఉద్యోగం దొరికింది. తగినన్ని కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ లేకపోవడంతో ఉన్న ఉద్యోగం కాస్తా పోయింది. మళ్ళీ మంచి ఉద్యోగం దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. ఈ పరిస్థితుల్లో రిస్క్‌ చేయడం దేనికని నేనే రిజెక్ట్‌ చేశాను’’ చాలా మామూలుగా చెప్పాడు తరుణ్‌. గొంతులో ఎక్కడా సంకోచంగానీ నదురుబెదురుగానీ లేవు.

వాడి ధోరణికి చిర్రెత్తిపోయింది నాకు.

‘‘ఒకవేళ పెళ్ళి అయ్యాక తన ఉద్యోగం పోయుంటే అప్పుడు ఏం చేసుండేవాడివి?’’ అడిగాను శాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ.

‘‘అబ్బబ్బ పిన్నీ... ఏమిటి నీ ఇంటరాగేషన్‌. ఒకవేళ నువ్వన్నట్టే జరిగుంటే నా ఖర్మని సరిపెట్టుకుని ఉండేవాడిని. నా టైం బాగుండబట్టి తన ఉద్యోగం పెళ్ళికిముందే పోయింది. ఇక ఈ విషయంలో చర్చలూ వాదోపవాదాలూ అనవసరం’’. నా దగ్గర ఉండే చనువుకొద్దీ కాబోలు తరుణ్‌ మాటలు కాస్త వాడిగా వచ్చాయి.

స్థాణువయ్యాను. తరుణ్‌ ఇంత నిర్దయగా మాట్లాడతాడని నేనసలు అనుకోలేదు. అతడి వ్యక్తిత్వం ఇంత బలహీనమైనదని ఏనాడూ ఆలోచించలేదు. వాడి గురించి నాకు పూర్తిగా తెలుసనుకున్నాను. కానీ... కానీ... వాడు ఈ రకమైన మనస్తత్వం కలిగినవాడని తొలిసారి అర్థమైంది.

తరుణ్‌ నిష్క్రమణ తరవాత నాలో అనేకానేకమైన ఆలోచనలు కందిరీగల తుట్టల్లా ముసురుకున్నాయి.

*      *      *

జీవని... ఎంత మంచిపిల్ల. సన్నగా నాజూగ్గా చామనఛాయకి ఓ మెట్టుపైనుండే శరీరఛాయతో, తీర్చిదిద్దిన ముఖ కవళికలతో, స్వచ్ఛమైన చిరునవ్వు చిందిస్తూ, ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. నిష్కల్మషమైన మాటతీరూ ఆకట్టుకొనే వ్యక్తిత్వం ఆమె సొంతమని ఆమెతో పరిచయమైన ఈ ఆరునెలల్లో గ్రహించాను.

తరుణ్‌ మా అక్క కొడుకు. వాడిని నా చేతులతో నేనే పెంచాను. తరుణ్‌ పుట్టిన ఐదేళ్ళకు నా పెళ్ళి జరిగింది. శ్రీవారికి తరచుగా క్యాంపులు తిరిగే ఉద్యోగం కావడంతో, నా కాలక్షేపం అంతా తరుణ్‌తోనే. దానికితోడు పెళ్ళయిన ఆరేళ్ళదాకా నాకు పిల్లలు పుట్టలేదు. ఆ తరవాత కూడా నాకు పుట్టినవాళ్ళిద్దరూ ఆడపిల్లలు కావడంతో మా ఇంట్లోనూ నా హృదయంలోనూ కూడా తరుణ్‌ స్థానం చెక్కుచెదరలేదు.

నా పెంపకంలో తరుణ్‌ ముద్దుల యువరాజులా ఎదిగాడు. నా భావాలూ ఆలోచనలూ అన్నీ పుణికిపుచ్చుకున్నాడు. సున్నితమైన వాడి మనస్తత్వం, విభిన్నమైన వాడి వ్యక్తిత్వం నన్నెంతో ముగ్ధురాలిని చేసేవి.

చక్కగా చదువుకుని, పేరున్న పెద్ద కంపెనీలో మార్కెటింగ్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న తరుణ్‌ ఆరునెలలక్రితం జీవనిని తనతోపాటు ఇంటికి తీసుకువచ్చాడు. తొలిచూపులోనే జీవని నా మనసుని ఆకట్టుకుంది. తరుణ్‌ తన తల్లిదండ్రులకన్నా ముందుగా జీవనిని నాకే పరిచయం చేశాడని తెలియగానే నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. వాడికి నామీద ఉన్న ప్రేమాభిమానాలకి గుండె పులకించిపోయింది.

జీవని... ఏదో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో జాబ్‌ చేస్తోంది. అమ్మాయి చదువుకున్నది, ఉద్యోగస్తురాలు, అందగత్తె కావడంతో తరుణ్‌ మనసు ఆమెవైపు మొగ్గడంలో అసహజత్వం ఏమీ లేదనిపించింది.

అందుకే వారిద్దరి తరఫున ప్రాతినిధ్యం వహించి, అక్కాబావలతో వాళ్ళ పెళ్ళి గురించి మాట్లాడాను. ఆమెను తిరస్కరించడానికి అభ్యంతరాలేవీ లేనికారణంగా వాళ్ళు కూడా ఈ పెళ్ళికి అంగీకరించారు. తరుణ్‌ ఏవో కంపెనీ పనులమీద త్వరలో అమెరికా వెళ్ళనున్నాడు. తిరిగి వచ్చేందుకు రెండునెలలు పట్టచ్చు. 

ఆ తరవాత ముహూర్తాలు పెట్టుకుందాం అనుకున్నాం ఇరువర్గాల పెద్దలమూ కలిసి. జీవని తరఫు పెద్దలంటూ పెద్దగా ఎవరూలేరు. తల్లి, అన్నయ్య.. అంతే. ఇక వారంరోజుల్లో తరుణ్‌ అమెరికా వెళ్ళబోతున్నాడు. అంతా సవ్యంగా ఉందనుకున్న ఈ తరుణంలో వాడిలా బాంబు పేల్చడం నా మనసును అల్లకల్లోలం చేసింది.

నా పరిస్థితే ఇలా ఉంటే... పాపం జీవని ఈ వేదనను ఎలా తట్టుకుంటోందో. 

అమెరికాలో రేగిన ఆర్థిక సంక్షోభం, ఇక్కడ... ఆంధ్ర రాష్ట్రంలోని ఒక ఆడపిల్ల జీవితంలో ఇలా పెనుతుపాను రేపడం నాకు మింగుడుపడని విషయమైంది. వీల్లేదు, జీవనికి అన్యాయం జరగడానికి నేనొప్పుకోను.

వెంటనే అక్కకి ఫోన్‌ చేశాను.

‘‘ఏం చేయమంటావు సుమా, వాడు ఆ అమ్మాయిని చేసుకోనని మొండికేస్తూంటే మేంమాత్రం ఏమి చేయగలం చెప్పు’’ నిస్సహాయత ధ్వనించింది అక్క గొంతులో.

‘‘అలా అని వాడు ఓ అమ్మాయి జీవితంతో ఆటలాడుకుంటుంటే చూస్తూ ఊరుకుంటారా? అదే మన అమ్మాయి అయితే మీరిలాగే ప్రవర్తించేవారా? నయానో భయానో వాడికి నచ్చచెప్పాలిగానీ ఇలా ఏమీ పట్టనట్టు ఊరుకుంటే ఎలా. అయినా... కోడలు సంపాదించి తెస్తేగానీ ఇల్లు గడవని పరిస్థితిలో ఉన్నారా మీరు? సుఖాలకీ కోరికలకీ అంతెక్కడ. ఉద్యోగం పోయిందన్న ఒకే ఒక్క కారణంతో ఆ అమ్మాయిని కాదనడం సంస్కారం అనిపించుకోదు’’ పట్టరాని ఉక్రోషంతో ఛడామడా దులిపేశాను.

అప్పటికిగానీ నా ఆవేశం తగ్గలేదు.

‘‘నువ్వంటున్నదంతా నిజమే సుమా. కానీ మేం ఎటూ మాట్లాడలేని అసహాయులం. ఒక్కగానొక్క కొడుకు. వాడి మాట కొట్టేయలేకే ఈ పెళ్ళికి ఒప్పుకున్నాం. ఇప్పుడు కూడా ఆ కారణంచేతే ఆ అమ్మాయిని కాదంటున్నాం. మా ప్లేస్‌లో ఉండి ఆలోచించి చూడు నీకే బోధపడుతుంది’’ నన్ను అనునయించే ప్రయత్నం చేసింది అక్క.

నాకు మరీ మండిపోయింది. లాభంలేదు. వీళ్ళతో ఏం చెప్పినా బధిర శంఖారావమే. 

ఠపీమని ఫోన్‌ పెట్టేశాను.

‘‘ఇదేం ఘోరమండీ, వాడు ఇలా చేయడం ఏమన్నా బాగుందా. వాడి విశాల భావాలూ ఆదర్శాలూ అన్నీ ఎటు కొట్టుకుపోయాయో’’ శ్రీవారి ముందు నా గోడు వెళ్ళబోసుకున్నాను.

‘‘పిచ్చి సుమా, తరుణ్‌ ఇంకా చిన్నపిల్లాడనుకున్నావా. తనకేం కావాలో తేల్చుకునే పరిపక్వత అతడికుంది. ఇక ఆదర్శాలంటావా... ఆచరణలో అవి సాధ్యంకావు. ఇక ఈ విషయం నీ బుర్రలోంచి తీసేయి’’ అన్నారు శ్రీవారు ఓదార్పుగా.

ఆయన అన్నంత సులువుగా నేనా విషయాన్ని మరచిపోలేకపోయాను. జీవనిని పరామర్శించడం సాటి స్త్రీగా నా ధర్మం అనిపించింది. తరుణ్‌ ఆమె మనసుమీద కొట్టిన దెబ్బకి ఆమె ఎంతగా తల్లడిల్లిపోతోందో. ఆమెని చూసి, నాలుగు ఓదార్పు మాటలు చెప్పి ఆమె దుఃఖాన్ని ఉపశమింపచేయాలి.

ఆ రాత్రల్లా జీవని గురించిన ఆలోచనలే నన్ను వేధించి కంటిమీద కునుకులేకుండా చేశాయి.

*    *    *

ఎప్పుడో తరుణ్‌ చెప్పిన గుర్తులనుబట్టి జీవని ఉండే ఇంటిని వెతుక్కొని వెశ్ళాను. చూడముచ్చటైన డాబా ఇల్లు అది. కాలింగ్‌బెల్‌ నొక్కగానే ఓ నడివయసావిడ వచ్చి తలుపు తీసింది. ఆవిణ్ణి నేను గుర్తుపట్టాను. ఆవిడ జీవని తల్లి శ్యామల. సంబంధం గురించి అక్కావాళ్ళింటికొచ్చినప్పుడు చూశాను.

‘‘నమస్కారమండీ’’ పలకరింపుగా అన్నాను చేతులు జోడించి.

ఆవిడ ముభావంగా ముఖంపెట్టి ‘‘నమస్కారం... ఏమిటిలా వచ్చారూ...’’ అంది.

ఆ మాటల్లో వ్యంగ్యం నా చెవులను తాకింది.

‘‘ఏమీలేదండీ, జీవనిని ఓసారి చూసిపోదామని...’’ అన్నాను బితుగ్గా.

ఆవిడ కళ్ళు ఎరుపెక్కాయి. ముక్కుపుటాలదిరాయి కోపంతో.

‘‘మీవాడు చేయవలసినదంతా చేసేశాడుగా... ఇంకా ఏం మిగిలుందని వచ్చారు? అది ఏ విధంగా ఏడుస్తోందో చూసిరమ్మని పంపాడా ఆ మహానుభావుడు’’ అంది ఆమె ఉక్రోషంగా.

నేను కిమ్మనలేదు. ఆవిడ ఆవేదనలో అర్థం ఉంది. తరుణ్‌ వాళ్ళ హృదయాలను అంతగా నొప్పించాడు మరి.

‘‘శ్యామలగారూ, తరుణ్‌ చేసినపని నాకూ నచ్చలేదు. ఈ విషయమై నాకూ వాడికీ గొడవైంది కూడా. కానీ వాడు ఎవరిమాటా వినే పరిస్థితిలో లేడు. కేవలం జీవనిని ఓసారి పలకరించిపోదామని వచ్చానుకానీ... మిమ్మల్ని మరింత హింసించాలని కాదు’’ మెత్తగా పలికిన నా స్వరం ఆమెను శాంతించేలా చేసింది.

ముఖంలోకి ప్రసన్నతని కొనితెచ్చుకుంటూ ‘‘లోపలికి రండి’’ అంది.

నా కళ్ళు జీవని కోసం వెతికాయి. 

నా మనోభావన గమనించినట్లుగా ‘‘అమ్మాయి ఆ గదిలో ఉంది వెళ్ళండి’’ అంది శ్యామల. నెమ్మదిగా అటువైపు నడిచాను.

ఉద్యోగం పోవడం ఒకెత్తు, పీటలదాకా వచ్చిన పెళ్ళి ఆగిపోవడం ఒకెత్తు. తరుణ్‌ ఆమె జీవితంలో ఎంతటి తుపాను సృష్టించాడు. 

ఆ కల్లోలం ఇప్పట్లో ఆగిపోయే అవకాశమేలేదు.

తలుపు తోసుకుని లోపలికి అడుగుపెట్టాను. దిండులో తలదూర్చి డొక్కలు పగిలేలా ఏడవకపోయినా జీవని ఎదకోత ఆ స్థాయిలోనే ఉంటుందని ఊహించిన నేను జీవనిని చూసి నివ్వెరపోయాను. ఒక మంచంలాంటి పరికరానికి లేత ఆరెంజ్‌కలర్‌ చీరను బిగించి దీక్షగా వర్క్‌ చేస్తూంది జీవని.

పట్టుదలతో దగ్గరకు ముడుచుకున్న లేత పెదవులు... తదేక దృష్టితో పనిచేయడం వలన తీక్షణత నిండిన చూపులు... ముక్కుకొన నుండి కిందికి జారుతున్న చెమట బిందువులు... 

ఏకాగ్రతతో ముడివడిన నుదురు... జీవనిలో ఎక్కడా విషాదఛాయలు కనబడటంలేదు.

లోస్వరంతో పిలిచాను ‘‘జీవనీ...’’

తలెత్తి నన్ను చూసిన ఆమె ‘‘ఓ సుమా ఆంటీ... రండి, రండి. బావున్నారా?’’ అంది నవ్వు ముఖంతో.

‘‘బాగున్నావా జీవనీ’’ నా పలకరింపు నాకే పేలవంగా తోచింది.

‘‘ఫైన్‌ ఆంటీ. చీర లాస్ట్‌కి వచ్చేసింది. ఒక్క టెన్‌మినిట్స్‌ అలా కూచోండి. వచ్చేస్తాను’’ అంటూ గదిలో ఓ మూలగా ఉన్న దీవాన్‌ చూపించింది.

నేను మాట్లాడకుండా దీవాన్‌ మీద కూర్చున్నాను. పొందికగా సర్దిన గది జీవని అభిరుచినీ శుభ్రతనూ తెలియపరుస్తోంది. అన్నట్టుగానే పది నిమిషాలలో పని పూర్తిచేసింది జీవని. చీరను తీసి మడతపెట్టి నా దగ్గరకు పట్టుకొచ్చింది.

‘‘ఎలా ఉందాంటీ చీరా’’ నా చేతిలో ఆ చీర పెడుతూ అడిగింది.

కుందన్స్, బీడ్స్, రంగురంగుల చిప్స్‌తో కుట్టిన చీర ఎంతో అందంగా ఉంది.

‘‘చాలా బాగుంది. నీకోసమే డిజైన్‌ చేసుకున్నావా?’’ అడిగాను చీరమీద వర్క్‌ పరిశీలనగా చూస్తూ.

‘‘ఈ చీర నాదికాదాంటీ, మా పక్కింటి డాక్టర్‌గారి భార్యది’’ చెప్పింది నాపక్కనే కూర్చుంటూ.

‘‘బయటి చీరలకి కూడా వర్క్‌ చేస్తూంటావా’’ విభ్రమంగా అడిగాను.

‘‘తప్పేంటి ఆంటీ? మెటీరియల్‌ అంతా పోను, చీరకి నాలుగైదు వందలు మిగులుతుంది’’ అంది జీవని.

‘‘ఒక చీర చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది?’’

‘‘ప్రొఫెనల్స్‌కి అయితే కొన్ని గంటలు లేకపోతే ఒకరోజు పడుతుంది. నాలా ఎప్పుడో చేసేవారికి మూడునాలుగు రోజులు పడుతుంది’’ అంది జీవని.

అప్రస్తుత ప్రసంగం అంటే ఇదే కాబోలు. నేనొచ్చిన పనేంటి, ఆడుతున్న కబుర్లేంటి? అసలు విషయం ఏమని మొదలుపెట్టాలో అర్థంకావటం లేదు. ప్రశాంతంగా కనిపిస్తున్న జీవనిని తిరిగి డిస్టర్బ్‌ చేయాలనిలేదు. 

కాసేపు మౌనం తరవాత అన్నాను ‘‘అయాం సారీ జీవనీ...’’.

‘‘ఎందుకాంటీ?’’ ఎదురు ప్రశ్నించింది జీవని తన చేతివేళ్ళ వైపు పరిశీలనగా చూసుకుంటూ.

ఏం చెప్పాలో తోచనట్లు అయోమయంగా చూశాను.

‘‘నీ ఉద్యోగం పోయిందిగా... అందుకనీ...’’ నీళ్ళు నమిలాను.

జీవని ముఖంలో కానీ స్వరంలో కానీ ఏ మార్పూలేకుండా అతి మామూలుగా ‘‘జీవితం అన్నాక ఈ ఒడిదుడుకులు మామూలేగా’’ అంది.

ఆమె నిబ్బరం చూసి నాకాశ్చర్యం కలిగింది.

‘‘వన్స్‌ అగైన్, అయామ్‌ సారీ జీవనీ. తరుణ్‌ చేసినపనికి సిగ్గుపడుతున్నాను’’ అన్నాను అవనతవదనంతో.

జీవని అదోలా నవ్వుతూ ‘‘మధ్యలో మీరు సిగ్గుపడటం దేనికాంటీ, ఇందులో మీ తప్పేం ఉంది. అయినా తరుణ్‌ ఇప్పుడేమంత నేరం చేశాడనీ’’ అంది.

‘‘జీవనీ’’ నిర్ఘాంతపోయాను ఆమె మాటలకి.

నాపక్కనుండి లేచివెళ్ళి కిటికీలోంచి బయటకు చూస్తూ అంది జీవని ‘‘అవునాంటీ, తరుణ్‌ నాపట్ల ప్రవర్తించిన విధానాన్ని నేను తప్పుపట్టదలుచుకోలేదు. అతడి అభిప్రాయాలతడివి. వాటిని స్వేచ్ఛగా వెల్లడించే హక్కు అతడికుంది’’.

ఆమె మాటల్లో ఎంతో పరిణితి కనబడుతోంది.

‘‘నీకు తరుణ్‌ మీద కోపంగా లేదూ?’’ కన్నార్పకుండా జీవని ముఖంలోకే చూస్తూ అడిగాను.

‘‘కోపమా... ఎందుకాంటీ?’’ జీవని వదనంలో చిరునవ్వు చెక్కుచెదరలేదు.

‘‘వాడింత దగా చేసినందుకు. నీ మనసుతోటీ జీవితంతోటీ ఆటలాడుకున్నందుకు’’ ఎందుకో చెప్పలేని ఆవేశం కలిగింది. జీవని పెదవులమీద చల్లని చిరునవ్వు కదలాడింది.

‘‘లేదాంటీ. తను దగా చేశాడని నేననుకోవడంలేదు. అతను చేసిన ఈ పనివలన నాకు మేలే జరిగింది’’ అంది నిబ్బరంగా.

‘‘అదెలాగమ్మా, పీటలవరకు వచ్చిన పెళ్ళి ఆగిపోయినందుకు నీకు బాధనిపించడంలేదూ’’ విస్మయంగా అడిగాను.

‘‘మీరన్నది నిజమే ఆంటీ. మొదట్లో నేను కూడా ఒక రెండుమూడు రోజులు అదే తలచుకుంటూ బాధపడ్డాను. కానీ ఆలోచించి చూస్తే ఇదీ నా మంచికే జరిగిందనిపించింది. ఇలా జరగడం వలన జీవితమంటే పూలబాటకాదనీ ఎన్నోరకాల అనుభవాలనే ముళ్ళూ కంకరరాళ్ళూ ఆ దారిలో అడ్డుతగులుతూ మనని ముందుకుపోకుండా అటకాయిస్తాయనీ బోధపడింది. 

ఇదే మా ఇద్దరికీ పెళ్ళయ్యాక అతని మనస్తత్వం తెలిసిందనుకోండి... అనుక్షణం కుమిలిపోయే నా మనసుని బుజ్జగించలేక చిత్రహింస పడవలసివచ్చేది. అలాకాకుండా పెళ్ళికి ముందే తరుణ్‌ మనస్తత్వం తెలియడం వలన నాకు ఎంతో మనశ్శాంతిగా ఉంది. ఈ సంఘటన వలన బతుకులో ఎన్నో పార్శ్వాలుంటాయనీ వాటిని స్పృశిస్తూ ముందుకుపోవడమే మనిషి కర్తవ్యమనీ నాకు అర్థమైంది’’ సుదీర్ఘంగా చెప్పుకొచ్చింది జీవని.

దిమ్మెరపోయాను. నిజంగా జీవని ఆలోచనా దృక్పథం ఎందరికో స్ఫూర్తిదాయకం. జీవితంలో ఎదురైన ఆటుపోట్లను ధైర్యంగా తట్టుకొని నిలబడగలిగిన సామర్థ్యం సొంతం కావడం ఎంత గొప్ప విషయం. ప్రేమలో విఫలమయ్యామనో పరీక్షల్లో ఫెయిలయ్యామనో ఆత్మహత్యలు చేసుకొనే చాలామంది యువతీయువకులకి జీవని ఒక ఆదర్శం కావాలి. మనిషిని... అందునా ఒక స్త్రీని ఉన్నతస్థానంలోకి అధిరోహింపచేసేది పాజిటివ్‌ థింకింగ్‌ మాత్రమే. జీవనయానంలో అడ్డుతగిలే అనేకానేక ఆటంకాలను తప్పించుకుంటూ ముందుకుసాగగలిగితే అందమైన జీవితం సాక్షాత్కరిస్తుంది. అందుకు ఆశావహ దృక్పథం చాలా అవసరం.

‘‘యు ఆర్‌ వెరీ గ్రేట్‌ జీవని. ఆడపిల్లలు అందరూ నీలా ఆలోచించగలిగితే ఈ లోకంలో బలవంతపు ఆత్మహత్యలుండవు... డిప్రెషన్‌తో కుంగిపోయి బతుకును భారంగా వెళ్ళదీయడాలుండవు’’ మనస్ఫూర్తిగా అభినందించాను.

ఇంతలో శ్యామల టీకప్పులున్న ట్రేతో ఆ గదిలోకి ప్రవేశించింది.

‘‘ఎందుకండీ ఇవన్నీ...’’ ఆమె చేతిలోంచి టీకప్పు అందుకుంటూనే అన్నాను మొహమాటంగా.

‘‘భలేవారే, కాసిన్ని టీనీళ్ళు పోసినంత మాత్రాన అరిగిపోతామా’’ శ్యామలలో ఇందాకటి కోపఛాయలు లేవు.

‘‘ఉద్యోగం పోయిందిగా... ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? దేనికైనా అప్లై చేశావా?’’ అడిగాను టీ తాగడం ముగించి.

‘‘ఇంకా ఏమీ ఆలోచించుకోలేదాంటీ. ఈసారి మాత్రం ఆచితూచి అడుగువేయాలని నిశ్చయించుకున్నాను. ఏదన్నా కాలేజీలో ఫాకల్టీగా చేరుదామని ఉంది. కానీ అకడమిక్‌ ఇయర్‌ మధ్యలో ఉందికదా... వెంటనే సాధ్యంకాదు. రెండుమూడు కాలేజీలకి రెజ్యూమె పంపించాను. అంతదాకా ఖాళీగా ఉండటందేనికని... నాకొచ్చిన ఈ వర్క్‌ని ఉపయోగించుకుంటున్నాను’’ నవ్వింది జీవని.

‘‘ఇంత చదువు చదువుకుని ఇలా చీరలపై వర్క్‌ చేసుకుంటూ సమయాన్ని గడపాల్సిరావడం... బాధగా లేదూ?’’ జీవని ముఖంలో భావాలేమన్నా మారుతాయేమోనని చూశాను ఆసక్తిగా.

ఆమె మోములో అదే దరహాసం.. వెన్నెల వెలుగులా.
‘‘ఏం ఆంటీ... ఇదిమాత్రం పని కాదా? అప్పుడంటే ఈ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలొచ్చాయిగానీ మునుపటి రోజుల్లో ఆడపిల్లలు బతకడం మానేశారా. డిగ్నిటీ ఆఫ్‌ లేబర్‌ అంటే మీకూ తెలుసు. నీతిగా నిజాయతీగా ఏ పనిచేసినా అది నాకు ఆనందాన్నిస్తుంది. ఇప్పటి ఉద్యోగాల వలన వచ్చే సుఖాలూ సరదాలూ ఎక్కువే కావచ్చు. కానీ మనిషి తృప్తిగా జీవించడానికి కనీసావసరాలు తీరితేచాలని నా అభిప్రాయం. ఒకవేళ ఉద్యోగం పోకుండా ఉంటే నువ్విన్ని కబుర్లు చెప్పేదానివా... అని మీరడగచ్చు. కానీ ఎప్పుడైనా నా భావన ఇదే. ఇదేమాట తరుణ్‌తో కూడా చాలాసార్లు చెప్పాను. బహుశా అందుకేనేమో ఉద్యోగం ఊడిపోగానే నాకు ఉద్వాసన పలికాడు’’ 

నిక్కచ్చిగా ఉన్నాయి జీవని మాటలు.

నేను మరి మాట్లాడలేకపోయాను. జీవని మాటలు అక్షరసత్యాలు. జీవనిని కాదన్న తరుణ్‌కి అంతకన్నా చదువుకున్న, అందమైన, గొప్ప ఉద్యోగం ఉన్న అమ్మాయి భార్యగా రావచ్చు. కానీ వాళ్ళెవరూ కూడా జీవనితో సమానం కాలేరు. ఆణిముత్యంలాంటి జీవనిని జారవిడుచుకున్న తరుణ్‌ నిజంగా చాలా దురదృష్టవంతుడు... మనసు మూలిగింది బాధగా.

‘‘వస్తానమ్మా జీవనీ. నీ వే ఆఫ్‌ థింకింగ్‌ చాలా బాగుంది. జీవితాంతం ఇలాగే ఆత్మవిశ్వాసంతో ఉండు. నీ లైఫ్‌ హాయిగా గడచిపోవాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఆల్‌ ద బెస్ట్‌’’ అంటూ ఆమె చేయిపట్టి మృదువుగా నొక్కి వదిలాను.

జీవని వదనంలో శతకోటి పున్నముల కాంతులు. 

‘‘థాంక్‌యు ఆంటీ, మీలాంటి శ్రేయోభిలాషుల ప్రోత్సాహమే నాలో కొత్త ఊపిరి నింపుతోంది’’ రెండుచేతులూ జోడించింది జీవని అందంగా నవ్వుతూ. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని