Published : 17 May 2022 00:40 IST

టక్కరి నక్క.. చక్కని కుందేలు!


పూర్వం జంబూకవనం ఒకటి ఉండేది. ఒకరోజు ఆ అడవిలో నివసించే జంతువుల సమావేశం జరుగుతోంది. రాజైన సింహం.. కుందేలును మంత్రిగా ప్రకటించింది. హోరాహోరీగా పోటీపడిన నక్క తాను మంత్రి కాలేకపోయానని బాధ పడింది.
సమావేశం ముగియడంతో జంతువులు, పక్షులు వాటి నివాసాలకు బయలుదేరాయి. నక్క కూడా బాధపడుతూ.. అడుగులో అడుగు వేయసాగింది. ‘నక్క బావా! ఆగు.. నేనూ వస్తున్నాను!’ అంటూ మంత్రి అయిన కుందేలు ఒక్క పరుగులో దాని దగ్గరకు వచ్చింది. ‘మంత్రిగారికి.. ఈ ఓడిపోయిన నక్కతో పనేమిటో?’ కుందేలు వైపు చూస్తూ అడిగింది నక్క. ‘అది చెప్పడానికే వచ్చాను!’ నవ్వింది కుందేలు. ‘మీకేం తక్కువ? రాజుగారికి మంచి మంచి సలహాలిస్తారు. అందుకే మంత్రిగా నాకంటే మీరే అర్హులని మిమ్మల్ని నియమించారు’ చిన్నబోతూ అంది నక్క. ‘నక్క బావా! బాధ దేనికి.. మంత్రి కానంత మాత్రాన.. సలహాలివ్వడానికి అనర్హుడివని అనుకోకు. రాజ్య క్షేమం కోసం ఎవరైనా సలహాలు ఇవ్వవచ్చు’ నచ్చజెప్పింది కుందేలు.
అప్పుడు ముందుకు అడుగేస్తున్న నక్క ఒక్కసారిగా ఆగి, ‘రాజైన సింహానికి నేనెప్పుడూ నచ్చను. నిన్ను తెలివైనదానివని మెచ్చుకుంటారు. నన్ను జిత్తులమారి అని తిడతారు. కానీ, నీకంటే ఎక్కువ తెలివి కలదాన్నని ఒకసారి రాజుతో అంటే... ఏమన్నారో తెలుసా?’ అడిగింది నక్క.
‘ఆ.. ఏమన్నారు?’ ఆత్రుతగా అంది కుందేలు. ‘నీ తెలివి గురించి ఇతరులు చెబితేనే అది గొప్పతనం అనిపించుకుంటుంది. నీకు నువ్వు చెప్పుకోకూడదు. అందుకే నిన్నందరూ జిత్తులమారి అనీ, కుందేలును తెలివైనదనీ అంటారు. ముందు అది తెలుసుకోమన్నారు’ దిగులుగా చెప్పింది నక్క.
అప్పుడు కుందేలు నవ్వుతూ.. ‘నువ్వు కూడా జిత్తులమారికి బదులుగా తెలివైన నక్కవని నిరూపించుకో.. అప్పుడు నిన్నే మంత్రిగా నియమిస్తారు’ అంది కుందేలు.
‘అయినా, అసలు అందరూ నన్ను జిత్తులమారి అని ఎందుకంటారు?’ ఆశ్చర్యంగా అడిగింది నక్క. అప్పుడు కుందేలు ముందుకు నడవడం ఆపి, ‘నన్ను తిట్టకుండా ఉంటే చెబుతాను!’ అంది. ‘తిట్టను గాక తిట్టను!’ అక్కడే నిలబడి కుందేలు వైపు చూస్తూ అంది నక్క. కుందేలు నక్కతో ఇలా చెప్పసాగింది. ‘నీ ఆహారాన్ని నువ్వు సంపాదించాలంటే తెలివి కావాలి. కానీ ఇతరులు తినే ఆహారాన్ని సంపాదించాలంటే వాళ్లను మోసం చేయాలి. అదే జిత్తులమారితనం అనిపించుకుంటుంది’ అంది కుందేలు. ‘నేనెవరినీ మోసం చేయలేదే?’ ఏమీ తెలియనట్టుగా కుందేలు కేసి అమాయకంగా చూస్తూ అంది నక్క.
‘మన సమావేశం ముగిశాక కాకి కష్టపడి సంపాదించుకున్న మాంసం ముక్కను నువ్వు మోసం చేసి దాని నుంచి లాక్కున్నావు. కాకి గొంతు బావుందని చెప్పడం, దాన్ని పాడమని చెప్పి కింద పడిన మాంసం ముక్కను నువ్వు తీసుకోవడం మోసం కాదా?’ అని కుందేలు నిలదీసింది.
‘ఈ విషయం నీకెలా తెలుసు?’ అని కుందేలును అడిగింది నక్క. ‘పాపం.. నీ దగ్గర మోసపోయిన కాకి నాకు తన బాధ చెప్పుకొంది. నేను నిన్ను చూసేలోగా ఆ ముక్కను నువ్వు తినేశావు. నీ తప్పును నీకు తెలియచెప్పాలనే నేను నిన్ను పిలిచాను. కాకి కూడా మనతోనే ఎగురుకుంటూ వస్తోంది. పైకి చూడు!’ అంది కుందేలు.
పైన ఎగురుకుంటూ వస్తోన్న కాకిని చూసింది నక్క. ‘ఇతరులు పెడితే తినడంలో తప్పు లేదు. కానీ మోసం చేసి తినడమే తప్పు. నీ కడుపు నింపుకోవడానికి మరొకరి కడుపు కొట్టడం నేరమనిపించుకుంటుంది. అందుకే మోసాన్ని వీడి తెలివిని ప్రదర్శించు. అప్పుడు నిన్నెవ్వరూ జిత్తులమారి అని అనరు. నువ్వు తినేసిన మాంసం ముక్కను తిరిగి ఎలాగూ ఇవ్వలేవు. ఇంకెప్పుడూ అలా తినవద్దని చెప్పడానికే వచ్చాను’ అంది కుందేలు.
ఈ మాటలతో నక్కకు కనువిప్పు కలిగింది. తాను చేసిన తప్పు తెలిసింది. అంతలోనే తన నివాసానికి వచ్చేశానని తెలుసుకుంది. వెనుతిరిగి వెళ్లిపోతున్న కుందేలు, కాకిని ఆగమని చెప్పింది. ఆ రెండూ ఎందుకన్నట్టుగా నక్క వైపు చూశాయి. నక్క గబగబా తన నివాసంలోకి వెళ్లి దాచుకున్న మాంసం ముక్కను కాకి నోటికందించింది. ‘ఇంకెప్పుడూ ఇతరులను మోసం చేయను’ అని కుందేలుతో అంది. నక్కలో వచ్చిన మార్పునకు కుందేలు సంతోషించింది. నక్క ఇచ్చిన మాంసం ముక్కను తిన్న కాకి ఆనందంతో ఎగిరి పోయింది.

- కె.వి.లక్ష్మణరావు


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts