ఉపవాస వేళ అల్పాహారం

శివరాత్రి రోజున భక్తులు ఉపవాసం, జాగారం చేస్తుంటారు. అయితే చాలా ప్రాంతాల్లో ఉపవాస దీక్షలో భాగంగా కొన్ని రకాల అల్పాహారాన్ని తీసుకుంటారు. అవేమంటే...

Published : 27 Jun 2021 17:00 IST

శివరాత్రి రోజున భక్తులు ఉపవాసం, జాగారం చేస్తుంటారు. అయితే చాలా ప్రాంతాల్లో ఉపవాస దీక్షలో భాగంగా కొన్ని రకాల అల్పాహారాన్ని తీసుకుంటారు. అవేమంటే...

 

ఆలూ రైతా

కావలసినవి
చిక్కని పెరుగు: రెండు కప్పులు, చిలగడదుంప: ఒకటి, ఆలూ: ఒకటి, కీరా: ఒకటి, కొత్తిమీర తురుము: టేబుల్‌స్పూను, పచ్చిమిర్చి: రెండు, వేయించిన పల్లీలు: 2 టేబుల్‌స్పూన్లు, జీలకర్ర పొడి: అరటీస్పూను, జీలకర్ర: అరటీస్పూను, నూనె లేదా నెయ్యి: 2 టీస్పూన్లు, ఉప్పు: తగినంత, పంచదార: చిటికెడు
తయారుచేసే విధానం
* చిలగడ దుంప, ఆలూ ఉడికించి పొట్టు తీసి సన్నని ముక్కలుగా చేయాలి. పల్లీలు కచ్చాపచ్చాగా నలగ్గొట్టాలి.
* ఓ గిన్నెలో పెరుగు వేసి బాగా గిలకొట్టాలి. తరవాత జీలకర్ర పొడి, ఉప్పు, పంచదార, పచ్చిమిర్చి తురుము వేసి కలపాలి. ఇప్పుడు కోసిన దుంపల ముక్కలు, పల్లీ పలుకులు అన్నీ వేసి కలిపి వడ్డించాలి.

 


ఠండాయీ

కావలసినవి
పాలు: కప్పు, పంచదార: అరకప్పు, తాజా గులాబీ రేకులు: పావుకప్పు, మంచినీళ్లు: ఒకటిన్నర లీటర్లు, బాదం: టేబుల్‌స్పూను, పుచ్చగింజలు: టేబుల్‌స్పూను, మిరియాలు: టేబుల్‌స్పూను, గసగసాలు: 2 టీస్పూన్లు, యాలకులపొడి: టీస్పూను
తయారుచేసే విధానం
* ఓ గిన్నెలో అరలీటరు నీళ్లు పోసి పంచదార వేసి పక్కన ఉంచాలి.
* గులాబీరేకుల్లో కాసిని నీళ్లు పోసి మెత్తగా రుబ్బాలి.
* బాదం, పుచ్చగింజలు, మిరియాలు, గసగసాలు అన్నీ శుభ్రం చేసి ఓ గిన్నెలో వేసి రెండు కప్పుల నీళ్లు పోసి రెండు గంటలపాటు నాననివ్వాలి. తరవాత వీటిని నీటితో సహా మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పలుచని బట్టలో వేసి గట్టిగా పిండుతూ వడగట్టాలి. అవసరమైతే మరికాసిని నీళ్లు పోసి మళ్లీ రుబ్బి అందులోని రసం మొత్తం కిందకి దిగేవరకూ వడగట్టాలి. ఇప్పుడు అందులో కాచిచల్లార్చిన పాలు, కరిగించిన పంచదార నీళ్లు, గులాబీ మిశ్రమం వేసి కలపాలి. తరవాత యాలకులపొడి కూడా వేసి కలిపి రెండు గంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచి అందించాలి.


ద్రాక్ష రబ్డి

కావలసినవి
చిక్కని పాలు: లీటరు, పంచదార: అరకప్పు, యాలకులు: నాలుగు, బాదం: 15, పిస్తా: 2 టేబుల్‌స్పూన్లు, ద్రాక్ష: కప్పు
తయారుచేసే విధానం
* ద్రాక్షపండ్ల కాడలు తీసి శుభ్రంగా కడిగి పక్కన ఉంచాలి.
* మందపాటి బాణలిలో పాలు పోసి మరిగిన తరవాత పంచదార, యాలకులపొడి వేసి పాలు మూడింట ఒక వంతు అయ్యేవరకూ సిమ్‌లో మరిగించాలి.
* పాలు చిక్కగా అయ్యి రంగు మారిన తరవాత స్టవ్‌ ఆఫ్‌ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు సగానికి కోసిన ద్రాక్షపండ్లు, పిస్తా ముక్కలు, బాదం ముక్కలు వేసి కలిపి కాసేపు ఫ్రిజ్‌లో పెట్టి అందించాలి.


సగ్గుబియ్యం కిచిడీ

కావలసినవి
సగ్గుబియ్యం: కప్పు, నూనె: టేబుల్‌స్పూను, జీలకర్ర: టీస్పూను, బంగాళాదుంప: రెండు, పల్లీలు: అరకప్పు, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి తురుము: 2 టీస్పూన్లు, కరివేపాకు: 4 రెబ్బలు, నిమ్మరసం: 2 టీస్పూన్లు
తయారుచేసే విధానం
* సగ్గుబియ్యంలో ముప్పావు కప్పు నీళ్లు పోసి రెండు గంటలపాటు నాననివ్వాలి.
* బంగాళాదుంప ఉడికించి పొట్టు తీసి ముక్కలుగా కోయాలి. పల్లీలు వేయించి పొట్టు తీసి కచ్చాపచ్చాగా నలగ్గొట్టాలి.
* బాణలిలో నూనె వేసి జీలకర్ర వేసి వేగాక బంగాళాదుంప ముక్కలు, నానబెట్టిన సగ్గుబియ్యం, ఉప్పు, పల్లీ పలుకులు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసి కలిపి మీడియం మంటమీద ఉడికించాలి. చివరగా కొత్తిమీర తురుము, నిమ్మరసం కూడా వేసి కలిపి దించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని