అండగా... కూష్మాండం!

ఎన్నెన్నో అనారోగ్య సమస్యలు... కానీ అన్నింటికీ ఒకటే ఔషధం కావాలనుకుంటున్నారా... అయితే వెంటనే మీరు బూడిద గుమ్మడిని ఎంచుకోవచ్ఛు....

Updated : 15 Jun 2021 13:04 IST

పోషకాలం

ఎన్నెన్నో అనారోగ్య సమస్యలు... కానీ అన్నింటికీ ఒకటే ఔషధం కావాలనుకుంటున్నారా... అయితే వెంటనే మీరు బూడిద గుమ్మడిని ఎంచుకోవచ్ఛు ‘కూష్మాండం’గా పిలిచే దీన్ని తీసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ●

* దీంట్లో క్యాల్షియం, ఫాస్ఫరస్‌, పొటాషియం అధికంగా ఉంటాయి. విటమిన్‌-బి2తోపాటు విటమిన్‌-సి కొద్దిగా ఉంటుంది. పీచు ఎక్కువగా ఉండటం వల్ల అరగడానికి దాదాపు రెండున్నర గంటలు పడుతుంది.

* ప్రతి వంద గ్రాముల గుమ్మడి నుంచి పదిహేను కెలొరీలు మాత్రమే లభిస్తాయి. ●

* ఆయుర్వేద చికిత్సలో విరివిగా ఉపయోగించే ‘కూష్మాండ లేహ్యం’ శరీరానికి చలువ నిస్తుంది.

* కడుపులో మంట, పేగు పూతతో ఇబ్బందిపడేవాళ్లు గుమ్మడి రసాన్ని తేనెతో కలిపి తాగాలి. ఇందుకు ముదిరిన కాయను మాత్రమే ఉపయోగించాలి.

* గుమ్మడి హల్వా ఎంతో రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికీ మంచిది.

* అరిచేతులు, అరికాళ్ల మంటలతో బాధపడేవాళ్లకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.

* నరాల నొప్పులను తగ్గిస్తుంది. దీని లేహ్యాన్ని తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుంది.

* బూడిద గుమ్మడి ముక్కలను పంచదార పాకంలో వేసి ఊరనిచ్చి, ఎండబెట్టి కూడా వాడుకోవచ్ఛు

* వేసవికాలం చర్మ సంబంధ సమస్యలతో బాధపడేవాళ్లు బూడిద గుమ్మడి రసాన్ని తేనెలో కలిపి తీసుకుంటే మంచిది.

* కొందరికి అలెర్జీతోపాటు దద్దుర్లు కూడా వస్తుంటాయి. అలాంటివాళ్లు ఈ రసంలో జీలకర్ర, తేనె వేసుకుని ఉదయం, సాయంత్రం తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

* వేసవిలో కొందరికి ముక్కు నుంచి రక్తం కారుతుంది. అలాంటివాళ్లు ఈ రసాన్ని తీసుకోవచ్ఛు దీంతో వేడి వల్ల వచ్చే సమస్యలు తగ్గుతాయి.

* గుమ్మడికి అధిక రక్తస్రావాన్ని నిలువరించే గుణం ఉంటుంది. ఈ రసంలో ఉసిరి, నిమ్మరసం, తేనె వేసుకుని తాగాలి.

* గుమ్మడి గింజలను ఎండబెట్టి పొడిచేసి కొబ్బరిపాలతో కలపాలి. దీన్ని రాత్రిపూట తాగితే కడుపులో నులిపురుగులు చచ్చిపోతాయి.

* బలహీనంగా, నీరసంగా ఉండేవాళ్లు ఈ రసంలో నిమ్మరసం, తేనె కలిపి తీసుకోవచ్ఛు

* రెండు చెంచాల గోరువెచ్చని నీటిలో ఈ రసం వేసి పుక్కిలిస్తే చిగుళ్లవాపు, నోటి పుళ్లు తగ్గుతాయి.

* కొందరికి థైరాయిడ్‌ వల్ల ఒంటికి నీరు పడుతుంది. అలాగే వాపులూ వస్తాయి. అలాంటప్పుడు ఈ రసం తాగితే మంచిది.

* ఈ రసంలోనే శొంఠిపొడి వేసుకుని తాగితే ఆస్తమా, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు తగ్గుతాయి.

* పిల్లలకు ఒంటి మీద దద్దుర్లు, కురుపులు, మంటలు వస్తుంటాయి. అలాంటప్పుడు ఈ రసాన్ని ఉసిరి, నిమ్మరసంతో కలిపి ఇస్తే మంచిది.

* క్షయ రోగులు, గుండె సంబంధ సమస్యలున్నవారు ఈ రసం తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.


బూడిదగుమ్మడి హల్వా

కావాల్సినవి: బూడిదగుమ్మడి తురుము - 250 గ్రా., పంచదార- 100 గ్రా., నెయ్యి- 50 గ్రా., యాలకుల పొడి- చిటికెడు, జీడిపప్పు, బాదంపప్పు- 25 గ్రా.

తయారీ: ముందుగా జీడిపప్పు, బాదంపప్పును నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన నెయ్యిలో గుమ్మడి తురుమును వేయించాలి. ఇప్పుడు దీంట్లో పంచదార వేసి కలపాలి. తర్వాత యాలకుల పొడి, జీపపప్పు, బాదంపప్పును వేసి దించేయాలి.

● ఈ హల్వాను బ్రెడ్‌ మీద వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది..

- డాక్టర్‌ పెద్ది రమాదేవి, ఆయుర్వేద నిపుణులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని