Updated : 08 Aug 2021 03:31 IST

మక్కల్లో మహత్తు!

ఎర్రటి బొగ్గులపై కాల్చినా... ఉప్పు నీటిలో వేసి ఉడికించినా... దాని రుచే వేరప్పా! చిన్నా, పెద్దా... జనాలందరూ మెచ్చే మొక్కజొన్న కట్లెట్‌, ఫ్రిట్టర్స్‌, ఫ్రాంకీ... ఇలా పలు రూపాల్లో రుచులను పంచుతోంది. మక్క రుచులు మనమూ చూద్దాం రండి.


కట్లెట్‌

కావాల్సినవి: ఉడికించిన కార్న్‌ గింజలు- రెండు కప్పులు, జీలకర్ర, కారం, ధనియాల పొడి, గరంమసాలా- చెంచా చొప్పున, పసుపు- అర చెంచా, చాట్‌ మసాలా- రెండు పెద్ద చెంచాలు, బ్రెడ్‌పొడి- అర కప్పు, తరిగిన ఉల్లిపాయలు- రెండు, అల్లం తరుగు- చెంచా, తరిగిన పచ్చిమిర్చి- మూడు, నిమ్మరసం- చెంచా, ఉప్పు- తగినంత, నూనె- సరిపడా.

తయారీ: పొయ్యి మీద పాన్‌ పెట్టి నూనె వేయాలి. వేడయ్యాక జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఆ తర్వాత కార్న్‌ను కలపాలి. ఇప్పుడు పసుపు, ధనియాల పొడి, కారం, గరంమసాలా, ఉప్పు వేయాలి. మొక్కజొన్నగింజలకు మసాలాలు పట్టేలా ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని చల్లార్చి మిక్సీలో వేసుకోవాలి. దీంతోపాటు చాట్‌ మసాలా, నిమ్మరసం, బ్రెడ్‌ పొడి కూడా కలిపి బరకగా మిక్సీ పట్టుకోవాలి. వీటిని కట్లెట్‌లా చేసి డీప్‌ ఫ్రై చేసుకోవాలి. షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు.


ఫ్రాంకీ

కావాల్సినవి: మైదా- ఒకటిన్నర కప్పు, ఉడికించిన కార్న్‌ గింజలు- కప్పు, ఉడికించి మెదిపిన ఆలూ- మూడు, తరిగిన ఉల్లిపాయ- ఒకటి, అల్లంవెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి తురుము- పెద్ద చెంచా చొప్పున, పెద్దక్యాప్సికమ్‌- ఒకటి, టొమాటో కెచప్‌- రెండు పెద్ద చెంచాలు, పండుమిర్చి కెచప్‌, ధనియాల పొడి, కారం- పెద్ద చెంచా చొప్పున, పసుపు, ఆమ్‌చూర్‌ పొడి, గరంమసాలా-అర చెంచా చొప్పున, నూనె- పెద్ద చెంచా, నెయ్యి- అర కప్పు, చీజ్‌- 50 గ్రా., కొత్తిమీర తరుగు- కొద్దిగా, ఉప్పు-తగినంత.

తయారీ: గిన్నెలో పిండి, ఉప్పు వేసి, నీళ్లు పోసి చపాతీ పిండిలా కలపాలి. ఈ ముద్దపై నూనె రాసి కాసేపు పక్కన పెట్టాలి. ఇప్పుడు చపాతీల్లా చేసి పెనంపై సగం వరకు కాల్చుకుని పక్కన పెట్టాలి.

మరో పాన్‌లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద, కారం, పచ్చిమిర్చి, క్యాప్సికమ్‌ ముక్కలు, టొమాటో కెచప్‌, పండుమిర్చి కెచప్‌, ధనియాల పొడి, పసుపు, ఆమ్‌చూర్‌ పొడి, గరంమసాలా వేసి నిమిషం బాగా కలపాలి. ఇందులోనే ఉడికించిన ఆలూ, కార్న్‌ గింజలను వేసి మరోమారు బాగా కలిపి కాసేపు ఉడికించాలి. కొత్తిమీర వేయాలి. పొయ్యి మీద పాన్‌ పెట్టి చపాతీ వేసి రెండు వైపులా నెయ్యితో కాల్చాలి. దీంట్లో కార్న్‌మిశ్రమం, ఉల్లిపాయ ముక్కలు, కాస్తంతా ఫ్రాంకీ మసాలా వేసి, వెనిగర్‌ చిలకరించాలి. చివరగా... తురిమిన పనీర్‌ వేసి ఫ్రాంకీలా చుడితే సరి.. 


క్రిస్పీ కార్న్‌

కావాల్సినవి: ఉడికించిన కార్న్‌- రెండు కప్పులు, కార్న్‌ఫ్లోర్‌- మూడు పెద్ద చెంచాలు, బియ్యప్పిండి- పెద్ద చెంచా, కారం- చెంచా, చాట్‌ మసాలా- అర చెంచా, ఉల్లికాడలు- రెండు చెంచాలు, తరిగిన క్యాప్సికం- అర ముక్క, నిమ్మరసం- రెండు చెంచాలు, మిరియాల పొడి- అర చెంచా, ఉప్పు, నూనె- తగినంత, నీళ్లు- కాసిన్ని.

తయారీ: గిన్నెలో ఉడికించిన మొక్కజొన్న గింజలు, ఉప్పు, మిరియాల పొడి, కార్న్‌ఫ్లోర్‌, బియ్యప్పిండి వేసి బాగా కలపాలి. నీళ్లు చల్లి పొడులన్నీ గింజలకు పట్టేలా చేత్తో చక్కగా కలిపి పక్కన పెట్టాలి.

ఇప్పుడు పొయ్యి వెలిగించి పాన్‌ పెట్టి నూనె వేడిచేయాలి. దీంట్లో తయారుచేసి పెట్టుకున్న కార్న్‌ గింజలను వేసి డీప్‌ ఫ్రై చేసుకోవాలి. వీటిని ఓ గిన్నెలోకి తీసుకుని కారం, చాట్‌ మసాలా, ఉప్పు, ఉల్లికాడల తరుగు, క్యాప్సికం ముక్కలు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. అంతే రుచికరమైన క్రిస్పీ కార్న్‌ రెడీ.


ఫ్రిట్టర్స్‌

కావాల్సినవి: ఉడికించిన మొక్కజొన్న గింజలు- కప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు- పావుకప్పు, వెల్లుల్లి తరుగు- చెంచా, కొత్తిమీర తురుము- కొద్దిగా, నిమ్మరసం- రెండు చెంచాలు, మైదా- పావు చెంచా, ఉప్పు- తగినంత, మిరియాల పొడి- అర చెంచా, ఇటాలియన్‌ సీజనింగ్‌, చిల్లీ ఫ్లేక్స్‌- చెంచా చొప్పున, చీజ్‌ తురుము- 50 గ్రా., పాలు- కప్పు, బటర్‌- తగినంత.

తయారీ:  గిన్నెలో పదార్థాలన్నింటినీ వేసి కలపాలి. పొయ్యి వెలిగించి పాన్‌ పెట్టి బటర్‌ వేయాలి. ఇది వేడయ్యాక  కార్న్‌ మిశ్రమాన్ని చిన్నగా వడల్లా చేసి రెండువైపులా గోల్డెన్‌ బ్రౌన్‌ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి.


దోశ

కావాల్సినవి: ఉడికించిన మొక్కజొన్న గింజలు- రెండు కప్పులు, ఉప్పు- తగినంత, సెనగపిండి- కప్పు, తరిగిన అల్లం ముక్క, పచ్చిమిర్చి, ఉల్లిపాయ- ఒకటి చొప్పున, జీలకర్ర- అర చెంచా, కొత్తిమీర తురుము- కొద్దిగా, ఉప్పు, నూనె- తగినంత.

తయారీ: మిక్సీలో కార్న్‌ గింజలు, ఉప్పు, సెనగపిండి, కొన్ని నీళ్లు పోసి గ్రైండ్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసుకుని జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర తురుము వేసి బాగా కలపాలి. పొయ్యి మీద పాన్‌ పెట్టి ఈ పిండితో దోశ వేసి, నూనెతో రెండు వైపులా కాల్చుకుంటే సరి.


చీజ్‌ బాల్స్‌

కావాల్సినవి: ఉడికించిన మొక్కజొన్న గింజలు- కప్పు, ఉడికించి మెదిపిన ఆలూ- మూడు, తరిగిన ఉల్లిపాయ, క్యాప్సికం- అర ముక్క చొప్పున, అల్లంవెల్లుల్లి ముద్ద- చెంచా, తరిగిన పచ్చిమిర్చి- ఒకటి, కొత్తిమీర తరుగు- రెండు పెద్ద చెంచాలు, చిల్లీ ఫ్లేక్స్‌- చెంచా, మిరియాల పొడి, జీలకర్ర పొడి, గరంమసాలా- అర చెంచా చొప్పున, చీజ్‌- పావు కప్పు, ఉప్పు- తగినంత, నూనె- వేయించడానికి సరిపడా, కార్న్‌ఫ్లోర్‌, మైదా- రెండు పెద్ద చెంచాల చొప్పున, బ్రెడ్‌ పొడి- కప్పు.

తయారీ: చీజ్‌, బ్రెడ్‌ పొడి తప్ప పదార్థాలన్నింటినీ ఓ గిన్నెలో ఒకదాని తర్వాత మరొకటి వేసుకుంటూ కలిపి పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో కార్న్‌ఫ్లోర్‌, మైదా, చిల్లీఫ్లేక్స్‌, ఉప్పు వేసి, కాసిన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి.

ఇప్పుడు కార్న్‌ గింజల మిశ్రమాన్ని చిన్న కట్లెట్‌లా చేసి దాని మధ్యలో గోలీ పరిమాణంలో చీజ్‌ పెట్టి అన్నివైపుల నుంచి మూసేయాలి. దీన్ని గుండ్రంగా చేసి కార్న్‌ఫ్లోర్‌ మిశ్రమంలో ముంచి, బ్రెడ్‌ పొడిలో దొర్లించి అరగంటపాటు పక్కన పెట్టాలి. ఆ తర్వాత కాగుతున్న నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని