కొత్త సంవత్సరంలో పసందైన విందు

ఎన్నో తియ్యటి జ్ఞాపకాలను మిగిల్చిన ఈ ఏడాది.. ఇవాళ్టితో గతం ఖాతాలోకి చేరిపోతుంది. మరెన్నో ఆశల తాయిలాలు చుట్టి కొత్త సంవత్సరాన్ని కానుకగా పంపుతుంది.

Updated : 31 Dec 2023 07:24 IST


ఎన్నో తియ్యటి జ్ఞాపకాలను మిగిల్చిన ఈ ఏడాది.. ఇవాళ్టితో గతం ఖాతాలోకి చేరిపోతుంది. మరెన్నో ఆశల తాయిలాలు చుట్టి కొత్త సంవత్సరాన్ని కానుకగా పంపుతుంది. ఇకనేం.. ఆత్మీయులతో ఆనందాలు పంచుకోవడమే తరువాయి. రొటీన్‌గా చేసే వంటలకు ఈ పసందైన రుచులు చేర్చారనుకోండి.. ‘వారెవా’ అనాల్సిందే అంతా.

షాహీ టుకడా

కావలసిన పదార్థాలు: బ్రెడ్‌ స్లైసులు - 6, పాలు - 4 కప్పులు, పంచదార - అర కప్పు, నెయ్యి - 3 టేబుల్‌ స్పూన్లు, యాలకుల పొడి - పావు చెంచా, కుంకుమ పువ్వు - కొద్దిగా, బాదం, పిస్తా, జీడిపప్పు - అన్నీ కలిపి ఒక కప్పు

తయారీ: బాదం, పిస్తా, జీడిపప్పులను నేతిలో వేయించి, కచ్చాపచ్చా దంచాలి. పంచదార పాకం తయారుచేసుకుని పక్కనుంచాలి. అడుగు భాగం మందంగా ఉన్న పాత్రలో పాలు పోసి మధ్యలో కలియ తిప్పుతూ మరిగించాలి. పాలు చిక్కబడిన తర్వాత, చెంచా పంచదార, యాలకుల పొడి, డ్రైఫ్రూట్స్‌ పలుకులు, కుంకుమ పువ్వు వేసి, ఇంకో రెండు నిమిషాలుంచి దించేయాలి. ఈ రబ్రీని కూడా పక్కనుంచాలి. బ్రెడ్‌ స్లైసుల అంచులను తీసేసి, ఒక్కో బ్రెడ్‌ను రెండు ముక్కలుగా కట్‌ చేయాలి. వీటిని పెనం మీద నేతితో గోల్డెన్‌ బ్రౌన్‌ రంగు వచ్చే వరకూ వేయించి, పంచదార పాకంలో ముంచి తీయాలి. వడ్డించేటప్పుడు ఆ స్లైసుల మీద తగినంత రబ్రీ వేస్తే సరిపోతుంది. ఈ షాహీ టుకడాలు చిన్నా పెద్దా అందరికీ నచ్చేస్తాయి.


వెజ్‌ జల్‌ఫ్రెజీ

కావలసిన పదార్థాలు: బేబీ కార్న్‌ - 5, ఉల్లిపాయలు - 2, క్యారెట్‌, ఆకుపచ్చ, ఎరుపు, పసుపు- 3 రంగుల క్యాప్సికంలు - అన్నీ ఒకటి చొప్పున, బీన్స్‌ - 8, బఠాణీలు - అర కప్పు, పచ్చిమిర్చి - 3, వెన్న - 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - తగినంత, జీలకర్ర, మెంతి ఆకు పొడి, కారం, ధనియాల పొడి - చెంచా చొప్పున, టొమాటోలు - 4, గరం మసాలా, మిరియాల పొడి - అర చెంచా చొప్పున, పసుపు - పావు చెంచా, టొమాటో సాస్‌ - 2 చెంచాలు, లవంగాలు - 4, వెల్లుల్లి రెబ్బలు - 3, అల్లం - అంగుళం ముక్క, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, కొత్తిమీర తరుగు - చారెడు

తయారీ: కూరగాయలను కడిగి ముక్కలుగా కోయాలి. కడాయిలో కాస్త నెయ్యి వేసి బీన్స్‌, క్యారెట్‌, టొమాటో, బఠాణీలు, బేబీ కార్న్‌లను వేయించాలి. అవి కాస్త వేగాక మూడు రకాల క్యాప్సికంలు, ఉప్పు వేసి వేయించి, తీయాలి. అడుగు భాగం మందంగా ఉన్న పాత్రలో నూనె వేసి జీలకర్ర, మెంతి ఆకు పొడి, లవంగాలు, అల్లం, పచ్చిమర్చి తరుగు, ఉల్లిపాయ ముక్కలను గోధుమ రంగు వచ్చే వరకూ వేయించాలి. కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసి కలియ తిప్పి సన్న సెగ మీద ఉంచాలి. కూరగాయలు ఉడికాయనుకున్నాక గరం మసాలా, మిరియాల పొడి, టొమాటో సాస్‌ వేసి కలియబెట్టి ఇంకో రెండు నిమిషాలుంచాలి. చివర్లో కొత్తిమీర తరుగు వేసి దించేయాలి. అంతే వహ్వా అనిపించే వెజ్‌ జల్‌ఫ్రెజీ సిద్ధం.


చీజ్‌ బాల్స్‌

కావలసిన పదార్థాలు: బంగాళదుంపలు - 5, పచ్చిమిర్చి - 4, కొత్తిమీర తరుగు - కప్పు, ధనియాల పొడి, కారం, గరం మపాలా, ఛాట్‌ మసాలా, పిజ్జా మిక్స్‌ - చెంచా చొప్పున, ఉప్పు - తగినంత, మిరియాల పొడి - అర చెంచా, మైదాపిండి - 2 టేబుల్‌ స్పూన్లు, బ్రెడ్‌ పొడి - 2 కప్పులు, చీజ్‌ - 200 గ్రాములు, నూనె - వేయించేందుకు సరిపడా

తయారీ: బంగాళదుంపలను ఉడికించి, పొట్టు తీసి మెత్తగా మెదపాలి. అందులో పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగు, ధనియాల పొడి, కారం, గరం మపాలా, ఉప్పు, ఛాట్‌ మసాలా, పిజ్జా మిక్స్‌, మిరియాల పొడి, మైదాపిండి, సగం బ్రెడ్‌ పొడి వేసి కలపాలి. కొంత చీజ్‌ను తురిమి అందులో వేసి, మిగిలిన చీజ్‌ను చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి. బంగాళదుంప మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేయాలి. ఒక్కోదాన్నీ అరచేయంత రొట్టె చేసి.. మధ్యలో చీజ్‌ ముక్క ఉంచి, అంచులను కప్పేయాలి. గుండ్రంగా బాల్‌లా వస్తుంది. వీటిని మిగిలిన బ్రెడ్‌ పొడిలో ముంచి తీసి, కాగుతున్న నూనెలో వేయించాలి. అంతే ఘుమఘుమలాడే చీజ్‌ బాల్స్‌ రెడీ.


ఘేవర్‌

కావలసిన పదార్థాలు: మైదాపిండి - 2 కప్పులు, నెయ్యి - అర కప్పు, పంచదార - కప్పు, చల్లటి పాలు  - ముప్పావు కప్పు, బాదం, పిస్తా, జీడిపప్పు పలుకులు - చారెడు, యాలకుల పొడి - పావు చెంచా, నిమ్మరసం - చెంచా, నూనె - వేయించేందుకు సరిపడా

తయారీ: ముందుగా పంచదారలో పావు కప్పు నీళ్లు పోసి పాకం తయారుచేయాలి. అందులో యాలకుల పొడి వేసి పక్కనుంచాలి. ఒక పాత్రలో నెయ్యి వేసి, ఐసు ముక్కతో పదే పదే కలియబెట్టాలి. దాంతో తెల్లటి పిండిలా తయారవుతుంది. చిన్నగా అరిగిన ఐసును పడేయాలి. అందులో మైదాపిండి, పాలు, కొన్ని నీళ్లు పోసి ఉండలు కట్టకుండా బాగా కలపాలి. దానికి నిమ్మరసం జతచేసి మళ్లీ మళ్లీ బీట్‌ చేయాలి. పిండి జారుగా ఉండాలి. వెడల్పయిన సాస్‌ప్యాన్‌లో నూనె కాగనిచ్చి, చారు గరిటెతో కాస్త పిండిని మధ్యలో వేయాలి. అది చుట్టూ అంచులకు వెళ్లిపోతుంది. అలా కొద్దికొద్దిగా పిండిని మళ్లీ మళ్లీ వేయాలి. ప్రతిసారీ పిండి అంచులకు వెళ్తూ మధ్యలో ఖాళీ ఉన్న ఘేవర్‌ తయారవుతుంది. అది బంగారు రంగులోకి మారాక తీయాలి. తక్కిన పిండితోనూ ఇలాగే చేయాలి. బోలుబోలుగా ఉన్న ఘేవర్ల మీద పంచదార సిరప్‌ను పోసి, డ్రైఫ్రూట్స్‌ పలుకులు చల్లాలి. అంతే.. ఆ అద్భుత రుచిని ఆస్వాదించడమే తరువాయి.


వెజిటెబుల్‌ టోఫూ

కావలసిన పదార్థాలు: క్యాలీఫ్లవర్‌ - మీడియం సైజ్‌ ఒకటి, పచ్చి బఠాణీలు - పావు కప్పు, ఉల్లిపాయలు, చిలకడదుంపలు - రెండు చొప్పున, క్యాప్సికం - 1, టోఫూ - పావు కిలో, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి - చెంచా చొప్పున, పసుపు - పావు చెంచా, కొత్తిమీర తరుగు - చారెడు, అన్నం - కప్పు, మైదాపిండి - ముప్పావు కప్పు, నూనె - వేయించేందుకు సరిపడా

తయారీ: క్యాలీఫ్లవర్‌ను చిన్నగా కట్‌ చేసి కడిగి నీళ్లు వడకట్టాలి. ఉల్లిపాయలు, క్యాప్సికంలను తరగాలి. చిలకడదుంపలను చెక్కు తీసి ముక్కలు కోయాలి. పచ్చి బఠాణీలను కాస్త ఉడికించి, నీళ్లు తీసేయాలి. కడాయిలో కాస్త నూనె వేసి వీటన్నిటినీ వేయించాలి. టోఫూను తురిమి ఒక వెడల్పయిన పాత్రలో వేయాలి. అందులో వేయించిన కూరగాయలు, అన్నం, మైదాపిండి, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా తీసుకుని చేత్తో మెదుపుతూ చిన్న వడల్లా చేసి కాగుతున్న నూనెలో వేయించుకోవాలి. అంతే.. కరకరలాడే వెజిటెబుల్‌ టోఫూ రెడీ! ఇవి సాస్‌ లేదా చెట్నీతో మరింత టేస్టీగా ఉంటాయి.

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని