మనసు దోచే మద్దూర్‌ వడలు

చల్లచల్లటి సాయంత్రం వేళ వెచ్చవెచ్చటి చిరుతిళ్లు తింటూ వేడివేడిగా టీ తాగుతుంటే.. ఈ నిమిషం ఇలా ఆగిపోతే బాగుండు అనిపించదా చెప్పండి?!

Updated : 19 Dec 2023 15:12 IST

 చల్లచల్లటి సాయంత్రం వేళ వెచ్చవెచ్చటి చిరుతిళ్లు తింటూ వేడివేడిగా టీ తాగుతుంటే.. ఈ నిమిషం ఇలా ఆగిపోతే బాగుండు అనిపించదా చెప్పండి?! తరచూ తినే పకోడీలూ, సమోసాలకు బదులు.. ఆదివారం పూట ఈ ఘుమఘుమలాడే ప్రత్యేక స్నాక్స్‌ చేసి చూడండి. ఇంటిల్లిపాదీ ఆనందించండి!


కర్నాటక మద్దూర్‌ వడ

కావలసినవి
బియ్యప్పిండి, ఉల్లి తరుగు - అర కప్పు చొప్పున, ఉప్మా రవ్వ, మైదాపిండి - పావు కప్పు చొప్పున, పచ్చిమిర్చి - 3, వెన్న -టేబుల్‌ స్పూన్‌, కొత్తిమీర తరుగు - 2 టేబుల్‌ స్పూన్లు, ఇంగువ -చిటికెడు, కరివేపాకు - 2 రెబ్బలు, ఉప్పు - అర చెంచా, నూనె - తగినంత
తయారీ
ఒక వెడల్పు పాత్రలో బియ్యప్పిండి, ఉల్లి తరుగు, ఉప్మా రవ్వ, మైదాపిండి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, కరివేపాకు, ఉప్పు, ఇంగువ, వెన్న, తగినన్ని నీళ్లు వేసి.. చపాతీ పిండిలా కలపాలి. పిండిని బాగా మర్దించి చిన్న ఉండలుగా తీసుకుని, చేత్తో అప్పాలుగా ఒత్తుకుని కాగుతున్న నూనెలో బంగారు రంగు వచ్చేదాకా వేయించాలి. అంతే.. కరకరలాడుతూ నోరూరించే ‘కర్నాటక మద్దూర్‌ వడలు’ తయారైపోతాయి. తిని ఆనందించడమే తరువాయి. ఇవి కొబ్బరి లేదా పుదీనా పచ్చడితో మరింత బాగుంటాయి.


కుఝి పనియారం

కావలసినవి
నూనె - 2 చెంచాలు, ఆవాలు, జీలకర్ర - చెంచా చొప్పున, కరివేపాకు రెబ్బలు - రెండు, క్యారెట్‌ తురుము, ఉల్లితరుగు - అర కప్పు చొప్పున, కొబ్బరి తురుము - రెండు టేబుల్‌ స్పూన్లు, పచ్చిమిర్చి - 3, చిక్కటి దోశ పిండి లేదా ఇడ్లీ పిండి - 3 కప్పులు, ఇంగువ - పావు చెంచా, కారం - చెంచా, నూనె, ఉప్పు - తగినంత, కొత్తిమీర తరుగు - పావు కప్పు
తయారీ
కడాయిలో నూనె కాగాక.. ఆవాలు, జీలకర్ర వేయాలి. ఆవాలు చిటపటలాడాక కరివేపాకు రెబ్బలు, ఉల్లితరుగు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్‌ తురుము వేయాలి. అవి కాస్త వేగాక కొబ్బరి తురుము వేసి ఒక నిమిషం వేయించి దించేయాలి. దోశ లేదా ఇడ్లీ పిండిలో వేయించిన మిశ్రమం, కొత్తిమీర తరుగు, కారం, ఉప్పు, ఇంగువ వేసి కలపాలి. పనియారం పాన్‌ గుంటల్లో కాస్త నూనె, సిద్ధంగా ఉన్న పిండిని గరిటెడు చొప్పున వేసి మూత పెట్టాలి. రెండువైపులా కాలనిచ్చి తీసేస్తే సరిపోతుంది.


పొటాటో చీజ్‌ బాల్స్‌

కావలసినవి

 చీజ్‌ - 200 గ్రా, బంగాళదుంపలు - 3, మయోనీస్‌ - చెంచా, మిరియాల పొడి, పార్‌స్లీ పొడి (కొత్తిమీర తరహా ఆకు పొడి) - అర చెంచా చొప్పున మొక్కజొన్న పిండి, బ్రెడ్‌ పొడి - అర కప్పు చొప్పున, ఉప్పు - తగినంత, నూనె - వేయించేందుకు సరిపడా

 తయారీ
చీజ్‌ను చిన్న ముక్కలుగా కట్‌ చేసి పక్కనుంచాలి. బంగాళదుంపలను ఉడికించి, పొట్టు తీసి చెంచా మయోనీస్‌, ఉప్పు, మిరియాల పొడి, పార్‌స్లీ పొడి (కొత్తిమీర తరహా ఆకు పొడి) వేసి మెదపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా తీసుకుని.. అరచేతిలో చిన్న రొట్టెలా ఒత్తి.. దాని మధ్యలో ఒక్కో చీజ్‌ ముక్కను ఉంచి, అంచులతో కప్పేసి బాల్స్‌ సిద్ధం చేసుకోవాలి. రెండు చిన్న పాత్రలు తీసుకుని, ఒకదాంట్లో మొక్కజొన్న పిండి, రెండో దాంట్లో బ్రెడ్‌ పొడి వేయాలి. ఒక్కో బాల్‌నూ రెండిట్లోనూ ముంచి తీయాలి. అన్నిటినీ అలా సిద్ధం చేశాక.. నూనెలో వేయిస్తే సరి.. రుచికరమైన ‘పొటాటో చీజ్‌ బాల్స్‌’ రెడీ! ఇవి గ్రీన్‌ చెట్నీ లేదా టొమాటో సాస్‌తో తింటే మరింత టేస్టీగా ఉంటాయి.


వెజిటబుల్‌ చాప్‌

కావలసినవి
మిరియాలు, సోంపు, ధనియాలు, జీలకర్ర - అర చెంచా చొప్పున, యాలకులు - రెండు, దాల్చినచెక్క - అంగుళం ముక్క, కారం, ఆమ్‌చూర్‌ పొడి - చెంచా చొప్పున, బ్లాక్‌ సాల్ట్‌ - అర చెంచా, నూనె - తగినంత, పచ్చిమిర్చి - రెండు, క్యారెట్‌, బీట్‌రూట్‌ తరుగు - పావు కప్పు చొప్పున, అల్లంవెల్లుల్లి ముద్ద - చెంచా, పంచదార - చెంచా, వేయించిన పల్లీలు - రెండు టేబుల్‌ స్పూన్లు, కొత్తిమీర తరుగు - చారెడు, బంగాళ దుంపలు - నాలుగు, కోటింగ్‌ కోసం: మైదా పిండి - అర కప్పు, మొక్కజొన్న పిండి, బ్రెడ్‌పొడి - పావు కప్పు చొప్పున
తయారీ
ప్యాన్‌లో మిరియాలు, సోంపు, ధనియాలు, జీలకర్ర, యాలకులు, దాల్చినచెక్కలను సన్నసెగ మీద రెండు మూడు నిమిషాలు వేయించాలి. బంగారు రంగులోకి మారిన తర్వాత మంచి వాసన వస్తుంది. సెగ తీసేసి, చల్లారనిచ్చి గ్రైండ్‌ చేసి, ఆమ్‌చూర్‌ పొడి, కారం, బ్లాక్‌ సాల్ట్‌ కలపాలి. కడాయిలో ఒక టేబుల్‌స్పూన్‌ నూనె వేసి తాలింపు దినుసులు వేయాలి. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్‌, బీట్‌రూట్‌ తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. రెండు నిమిషాల తర్వాత తయారుచేసుకున్న గరం మసాలా, పంచదార, వేయించిన పల్లీలు, కొత్తిమీర తరుగు, ఉడికించి పొట్టు తీసి మెత్తగా మెదిపిన బంగాళదుంపల ముద్ద వేయాలి. అన్నిటికీ మసాలా పట్టేలా కలియ తిప్పుతూ రెండు నిమిషాలుంచి దించేయాలి. మిశ్రమం చల్లారాక, చిన్న ఉండలుగా తీసుకుని చేత్తో మెదుపుతూ సిలిండర్‌ ఆకృతులుగా చేసుకోవాలి. కోటింగ్‌ కోసం ఒక పాత్రలో మైదా, మొక్కజొన్న పిండి వేసి, కొన్ని నీళ్లతో పూతపిండి కలపాలి. అది మరీ జారుగా లేదా మరీ గట్టిగా ఉండకూడదు. మరో పాత్రలో బ్రెడ్‌ పొడి తీసుకోవాలి. వెజిటబుల్‌ చాప్స్‌ను ముందు పిండిలో, తర్వాత బ్రెడ్‌పొడిలో.. ఇలా రెండుసార్లు ముంచి తీయాలి. వాటిని కాగిన నూనెలో బంగారురంగు వచ్చేదాకా వేయించి, కొద్దిగా ఉప్పు చల్లితే సరిపోతుంది. రెండుసార్లు కోటింగ్‌ ఇవ్వడం వల్ల మరింత క్రిస్పీగా ఉంటాయి. నూనెలో వద్దనుకుంటే అవెన్‌లో 200 డిగ్రీల వద్ద పావుగంట బేక్‌ చేయొచ్చు. చాప్స్‌ ఎక్కువుంటే.. జిప్‌లాక్‌ కవర్లో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టి, కావాలను కున్నప్పుడు వేయించుకోవచ్చు. వీటిని పశ్చిమ బెంగాల్‌ వాసులు మహా ఇష్టంగా తింటారు.


క్రిస్పీ వెజ్‌ స్ప్రింగ్‌ రోల్స్‌

కావలసినవి
టొమాటో, బంగాళదుంప ముక్కలు, మైదాపిండి - అర కప్పు చొప్పున, క్యారెట్‌ ముక్కలు, పచ్చి బఠాణీలు, మొక్కజొన్న పిండి - పావు కప్పు చొప్పున, పచ్చిమిర్చి - 2, శొంఠి పొడి, వెల్లుల్లి పొడి, కారం, పసుపు - పావు చెంచా చొప్పున, ఛాట్‌ మసాలా - చెంచా, కొత్తిమీర తరుగు - చారెడు, ఉప్పు - తగినంత, నూనె - వేయించేందుకు సరిపడా
తయారీ
కడాయిలో నూనె రెండు టేబుల్‌ స్పూన్లు వేసి ఉల్లి తరుగు వేయించాలి.  అది కాస్త వేగాక.. పచ్చిమిర్చి, క్యారెట్‌ ముక్కలు, టొమాటో, బంగాళదుంప ముక్కలు, వెల్లుల్లి పొడి, శొంఠి పొడి, కారం, ఉప్పు, పసుపు ఛాట్‌ మసాలా వేసి మధ్యలో కలియ తిప్పుతూ పది నిమిషాలు వేయించాలి. అవి వేగాక కొత్తిమీర తరుగు వేసి దించేయాలి.
ఒక పాత్రలో మైదాపిండి, మొక్కజొన్న పిండి, కాస్త ఉప్పు, తగినన్ని నీళ్లతో పిండి కలపాలి. పెనం మీద పావు చెంచా నూనె వేసి, కుంచెతో అడుగుభాగమంతా పరచుకునేలా చేసి, పిండిలో బ్రష్‌ను ముంచి అద్దుతూ మొత్తం సర్దాలి. కాస్త కాలగానే తీసేయాలి. ఇలా అతి పల్చటి రొట్టెలు తయారయ్యాక.. ఒక్కో దాని మీద వేయించిన కూరగాయల మిశ్రమం చెంచాడు వేయాలి. ముందు కుడి, ఎడమల్లో మడిచి, తర్వాత కింది నుంచి పైకి రోల్‌ చేయాలి. మడిచేటప్పుడు రొట్టెలకు కాస్త పచ్చి పిండి రాస్తే.. విడిపోకుండా రోల్స్‌ బాగా అంటుకుంటాయి. వీటిని కాగుతున్న నూనెలో వేయించుకుంటే సరి.. రుచికరమైన ‘క్రిస్పీ వెజ్‌ స్ప్రింగ్‌ రోల్స్‌’ తయారైపోతాయి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని