సోయా.. సూపరయా..

తియ్యటికాయగూరలతోనే కాదు.. చప్పటి గింజలతోనూ రుచికరమైన వంటకాలు చేయొచ్చు. ఆరోగ్యాన్నీ, అద్భుత రుచినీ కూడా సొంతం చేసుకోవచ్చు. ఔషధాల గని, పోషకాల నిధి అయిన సోయాతో నోరూరించే రెసిపీలు మీ కోసం.. బాస్మతి బియ్యం - 2 కప్పులు, సోయా చంక్స్‌ - కప్పు, పచ్చి బఠాణీలు - పావు కప్పు, ఉప్పు - తగినంత, క్యాప్సికం, ఉల్లిపాయలు, బంగాళ దుంపలు - 2 చొప్పున, టొమాటోలు - 3, క్యారెట్‌ - 1, క్యాలీఫ్లవర్‌ - కొద్దిగా, పచ్చిమిర్చి - 4, కచ్చాపచ్చా దంచిన మిరియాల పొడి, జీలకర్ర...

Published : 07 Jan 2024 01:03 IST

తియ్యటికాయగూరలతోనే కాదు.. చప్పటి గింజలతోనూ రుచికరమైన వంటకాలు చేయొచ్చు. ఆరోగ్యాన్నీ, అద్భుత రుచినీ కూడా సొంతం చేసుకోవచ్చు. ఔషధాల గని, పోషకాల నిధి అయిన సోయాతో నోరూరించే రెసిపీలు మీ కోసం..

పులావ్‌

కావలసినవి: బాస్మతి బియ్యం - 2 కప్పులు, సోయా చంక్స్‌ - కప్పు, పచ్చి బఠాణీలు - పావు కప్పు, ఉప్పు - తగినంత, క్యాప్సికం, ఉల్లిపాయలు, బంగాళ దుంపలు - 2 చొప్పున, టొమాటోలు - 3, క్యారెట్‌ - 1, క్యాలీఫ్లవర్‌ - కొద్దిగా, పచ్చిమిర్చి - 4, కచ్చాపచ్చా దంచిన మిరియాల పొడి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి ముద్ద - చెంచా చొప్పున, నెయ్యి - మూడు చెంచాలు, లవంగాలు - 5, యాలకులు - 3, దాల్చిన చెక్క - అంగుళం ముక్క, ఎండు కొబ్బరి - కాస్త, బిర్యానీ ఆకులు - 2, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా - అర చెంచా చొప్పున, పుదీనా, కొత్తిమీర తరుగు - అర కప్పు చొప్పున

తయారీ: ఒక పాత్రలో అర లీటరు నీళ్లు, చెంచా ఉప్పు, సోయా చంక్స్‌ వేసి ఉడికించాలి. నీళ్లు వడకట్టేసి పక్కనుంచాలి. అడుగు భాగం మందంగా ఉన్న పాత్రలో  నెయ్యి వేసి.. జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఎండు కొబ్బరి ముక్కలు, బిర్యానీ ఆకులు, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, ధనియాల పొడి, గరం మసాలాలను వేయించాలి. గోధుమ రంగులోకి మారాక.. పచ్చి బఠాణీలు, ఉల్లి, టొమాటో, బంగాళదుంప, క్యారెట్‌, క్యాలీఫ్లవర్‌, క్యాప్సికం ముక్కలు, సోయా చంక్స్‌, పచ్చిమిర్చి వేసి రెండు నిమిషాలు వేయించాలి. అందులో నాలుగు కప్పుల నీళ్లు, ఉప్పు, నానబెట్టిన బాస్మతి బియ్యం, పుదీనా, కొత్తిమీర తరుగు వేసి, సన్న సెగ మీద ఇరవై నిమిషాలు ఉడికిస్తే సరి.. టేస్టీ టేస్టీ సోయా పులావ్‌ రెడీ! రైతాతో తింటే.. అదుర్స్‌ అనాల్సిందే!


మసాలా సోయా

కావలసినవి: సోయా చంక్స్‌ - కప్పు, ఉల్లి పాయలు - 2, టొమాటోలు - 3, నూనె - 4 టేబుల్‌ స్పూన్లు, బిర్యానీ ఆకు - 1, మెంతి ఆకు పొడి, జీలకర్ర - చెంచా చొప్పున, ఎండు మిర్చి - 2, దాల్చిన చెక్క - అంగుళం ముక్క, పచ్చిమిర్చి - 3, లవంగాలు - 4, అల్లం వెల్లుల్లి ముద్ద - చెంచా, ఉప్పు - తగినంత, పంచదార, గరం మసాలా, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు - అర చెంచా చొప్పున, కొత్తిమీర తరుగు - చారెడు

తయారీ: ఒక పాత్రలో 3 కప్పుల నీళ్లు పోసి, సోయా చంక్స్‌, కాస్త ఉప్పు వేసి మరిగించాలి. సోయా నీళ్లు పీల్చుకుని సైజు పెరిగాక దించేసి ఐదు నిమిషాల తర్వాత వాటిని పిండి, నీళ్లు లేకుండా చేయాలి. టొమాటోలను మెత్తగా రుబ్బుకోవాలి. అడుగు భాగం మందంగా ఉన్న పాత్రలో నూనె కాగనిచ్చి, బిర్యానీ ఆకు, జీలకర్ర, ఎండు మిర్చి, దాల్చిన చెక్క, లవంగాలను నిమిషం పాటు వేయించాలి. అందులో అల్లం వెల్లుల్లి ముద్ద, ఉల్లి, పచ్చిమిర్చి తరుగులను దోరగా వేయించాలి. తర్వాత సోయా చంక్స్‌, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, ఉప్పు, టొమాటో ప్యూరీ వేసి మూత పెట్టాలి. ఆరేడు నిమిషాలు మగ్గనిచ్చి.. గరం మసాలా, మెంతి ఆకు పొడి, పంచదార జతచేసి కలియ తిప్పాలి. ఇంకో రెండు నిమిషాలు సన్న సెగ మీద ఉంచి కొత్తిమీర తరుగు వేసి దించేస్తే సరి.. ఘుమఘుమలాడే మసాలా సోయా సిద్ధం. ఇది అన్నం, రోటీ, పరోటా.. ఎందులోకైనా సూపర్‌గా ఉంటుంది.


స్టిర్‌ ఫ్రై

కావలసినవి: సోయా చంక్స్‌ - కప్పు, నూనె - 3 టేబుల్‌ స్పూన్లు, ఉల్లి తరుగు - అర కప్పు, పచ్చిమిర్చి - 2, సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి - టేబుల్‌ స్పూన్‌ చొప్పున, టొమాటో గుజ్జు - అర కప్పు, పసుపు - పావు చెంచా, కారం, గరం మసాలా, ధనియాల పొడి, మిరియాల పొడి - చెంచా చొప్పున, ఆవాలు, జీలకర్ర - అర చెంచా చొప్పున, కొత్తిమీర తరుగు - పావు కప్పు, ఉప్పు - తగినంత, కరివేపాకు - 2 రెబ్బలు

తయారీ: సోయా చంక్స్‌ను ఉప్పు నీళ్లలో ఉడికించి, నీళ్లు తీసేయాలి. కడాయిలో నూనె వేడయ్యాక.. ఆవాలు, జీలకర్ర వేయాలి. ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి, ఉల్లి తరుగులు వేయాలి. రెండు నిమిషాల తర్వాత.. పసుపు, ధనియాల పొడి, కారం, గరం మసాలా, టొమాటో గుజ్జు, సోయా చంక్స్‌ వేసి కలియ తిప్పాలి. చివర్లో మిరియాల పొడి, కొత్తిమీర తరుగు వేసి దించేస్తే సరి.. నోరూరించే సోయాబీన్‌ స్టిర్‌ ఫ్రై తయారైపోతుంది.


సోయాబీన్‌ చిల్లీ

కావలసినవి: సోయా చంక్స్‌ - 100 గ్రాములు, ఉప్పు, నూనె - తగినంత, మైదాపిండి - చెంచా, మొక్కజొన్న పిండి - 2 టేబుల్‌ స్పూన్లు, కారం - అర చెంచా, వెనిగర్‌ - 1 టేబుల్‌ స్పూన్‌, పచ్చిమిర్చి - 3, అల్లం, వెల్లుల్లి తరుగు, సోయా సాస్‌, కశ్మీరీ కారం - చెంచా చొప్పున, టొమాటో కెచప్‌ - 2 టేబుల్‌ స్పూన్లు, పసుపు - పావు చెంచా, అల్లం ముద్ద - చెంచా, ఉల్లి, క్యాప్సికం, టొమాటో ముక్కలు, ఉల్లి కాడల తరుగు - పావు కప్పు చొప్పున

తయారీ: వేడినీళ్లలో చెంచా ఉప్పు, సోయా చంక్స్‌ వేసి ఉడికించి, నీళ్లు తీసేయాలి. అందులో ఉప్పు, మైదాపిండి, మొక్కజొన్న పిండి, అల్లం, వెల్లుల్లి తరుగు, కారం, వెనిగర్‌, సోయా సాస్‌, కొంచెం నూనె వేసి కలియబెట్టి, పావుగంట అలాగే ఉంచాలి. కడాయిలో నూనె కాగనిచ్చి, మసాలా పట్టించిన సోయా చంక్స్‌ను మీడియం సెగలో బంగారు రంగు వచ్చే వరకూ వేయించుకోవాలి. వేగడానికి సుమారు నాలుగు నిమిషాలు పడుతుంది. కడాయిలో ఎక్కువున్న నూనె తీసేసి, మిగిలిన దాంట్లో అల్లం ముద్ద, ఉల్లి, క్యాప్సికం, టొమాటో, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఐదు నిమిషాలు వేయించాలి. అవి వేగాక.. ఉల్లి కాడల తరుగు, కశ్మీరీ కారం, పసుపు, ఉప్పు, టొమాటో కెచప్‌, సోయా సాస్‌ వేసి కలియ తిప్పాలి. రెండు నిమిషాల తర్వాత, వేయించిన సోయా చంక్స్‌ జతచేసి కలియబెట్టి, ఉడికించాలి. చివర్లో  కొత్తిమీర తరుగు వేసి దించేస్తే సూపర్‌ సోయాబీన్‌ చిల్లీ రెడీ.


స్పైసీ కర్రీ

కావలసినవి: సోయాబీన్స్‌ గింజలు - రెండున్నర కప్పులు, ఉల్లిపాయలు, టొమాటోలు - 3 చొప్పున, బంగాళదుంపలు - రెండు,  పచ్చిమిరప కాయలు - రెండు, ఆవాలు, జీలకర్ర, పసుపు - అర చెంచా చొప్పున, కొబ్బరి తరుగు - చారెడు, అల్లం వెల్లుల్లి ముద్ద - చెంచా, కరివేపాకు - 2 రెబ్బలు, ధనియాల పొడి, కారం, సాంబార్‌ పౌడర్‌, గరం మసాలా - చెంచా చొప్పున, ఉప్పు - తగినంత, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, కొత్తిమీర తరుగు - అర కప్పు, జీడిపప్పు - పావు కప్పు

తయారీ: సోయాబీన్స్‌ గింజలను ముందు రాత్రి నానబెట్టాలి. ఉదయం నీళ్లు తీసేసి, ప్రెషర్‌ కుక్కర్‌లో ఉడికించాలి. బంగాళదుంపలు ఉడికించి, పొట్టు తీసి, మెత్తగా మెదపాలి. కొబ్బరికోరు, జీడిపప్పుల్లో కొన్ని నీళ్లు పోసి పేస్టు చేయాలి. ఉల్లి, టొమాటో, పచ్చి మిరపకాయలు ముక్కలుగా కోయాలి. అడుగు భాగం మందంగా ఉన్న పాత్రలో నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకులతో తాలింపు వేసి ఉల్లితరుగు వేయించాలి. అది వేగాక.. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద, టొమాటో ముక్కలు వేసి మూత పెట్టాలి. నాలుగు నిమిషాల తర్వాత కారం, పసుపు, ధనియాల పొడి, సాంబార్‌ పొడి, గరం మసాలా, ఉప్పు, ఉడికించిన సోయా గింజలు, మెదిపిన బంగాళదుంపలు, కొబ్బరి, జీడిపప్పుల పేస్టు వేసి, కలియ తిప్పాలి. కొన్ని నీళ్లు పోసి సెగ తగ్గించి, ఇంకాస్త ఉడికించాలి. చిక్కగా అయ్యాక.. కొత్తిమీర తరుగు వేసి దించేయాలి. అంతే సోయా స్పైసీ కర్రీ రెడీ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని