ఉపవాసవేళ.. ఉపాహారమిలా!

నదీస్నానాలూ దీపారాధనలూ శివ పూజలూ ఉపవాసాలతో భక్తులకు కార్తికమాసం హడావుడి అంతా ఇంతా కాదు. శివకేశవుల్ని ఎంతో నియమనిష్ఠలతో ఆరాధించే ఈ పవిత్రమాసంలో ఉపవాసాలు చేసేవాళ్లకోసం ఆరోగ్యకరమైన కొన్ని అల్పాహారాలు...

Published : 26 Jun 2021 17:07 IST

 నదీస్నానాలూ దీపారాధనలూ శివ పూజలూ ఉపవాసాలతో భక్తులకు కార్తికమాసం హడావుడి అంతా ఇంతా కాదు. శివకేశవుల్ని ఎంతో నియమనిష్ఠలతో ఆరాధించే ఈ పవిత్రమాసంలో ఉపవాసాలు చేసేవాళ్లకోసం ఆరోగ్యకరమైన కొన్ని అల్పాహారాలు...

మిరియాల దోసె

 

కావలసినవి 
ఇడ్లీబియ్యం: కప్పు, ముడిబియ్యం: అరకప్పు, మినప్పప్పు: అరకప్పు సెనగపప్పు: టేబుల్‌స్పూను, కందిపప్పు: టేబుల్‌స్పూను, మిరియాలు: టేబుల్‌స్పూను జీలకర్ర: టీస్పూను, కరివేపాకు: రెండు రెబ్బలు, కొబ్బరితురుము: కప్పు, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా, వెన్న: 2 టీస్పూన్లు

తయారుచేసే విధానం 
* బియ్యం, పప్పులు కలిపి సుమారు ఆరు 
గంటలపాటు నాననివ్వాలి. తరవాత ఆ నీళ్లు వంపేసి వీటికి మిరియాలు, జీలకర్ర, ఉప్పు వేసి, కాసిని నీళ్లు చిలకరించి, మరీ మెత్తగా కాకుండా రుబ్బాలి. ఇప్పుడు కొబ్బరి, కరివేపాకు కూడా వేసి బాగా రుబ్బాలి. 
* నాన్‌స్టిక్‌పాన్‌ మీద ఈ పిండి మిశ్రమాన్ని మందపాటి దోసె మాదిరిగా వేసి, నూనె వేసి మూత పెట్టాలి. ఒకవైపు కాలాక మరోవైపు కూడా కాల్చి కాస్త వెన్న వేసి తీయాలి. ఇలాగే అన్నీ వేసుకోవాలి. దీన్ని చట్నీ లేదా ఏదైనా పొడితో గానీ తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

కొబ్బరిపాల ఇడ్లీ

 

కావలసినవి 
ఇడ్లీబియ్యం: 2 కప్పులు, మినప్పప్పు: కప్పు, మెంతులు: టీస్పూను, అన్నం: టేబుల్‌స్పూను, కొబ్బరికాయ: ఒకటి, ఉప్పు: తగినంత

తయారుచేసే విధానం 
* ఇడ్లీబియ్యం, మినప్పప్పు, మెంతులు కలిపి సుమారు ఆరుగంటలపాటు నాననివ్వాలి. కొబ్బరిని ముక్కలుగా కోసి తగినన్ని నీళ్లు పోసి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి పాలు తీయాలి. 
* నానిన ఇడ్లీబియ్యం, మినప్పప్పు, మెంతుల్లో నీళ్లు వంపేసి, వాటికి బదులు కొబ్బరిపాలు జోడించి మెత్తగా రుబ్బాలి. ఓ పూట అంతా ఈ పిండిని పులియనిచ్చి, ఇడ్లీ వేసి, కొబ్బరి చట్నీ లేదా సాంబారుతో వడ్డిస్తే ఎంతో రుచిగా ఉంటాయి.

బంగాళాదుంపల బోండా

 

కావలసినవి 
సెనగపిండి: కప్పు, బియ్యప్పిండి: 3 టేబుల్‌స్పూన్లు, నీళ్లు: సరిపడా, కారం: అరటీస్పూను, పసుపు: చిటికెడు, బంగాళాదుంపలు: రెండు, ఉల్లిపాయ: ఒకటి, పచ్చిమిర్చి: నాలుగు, కరివేపాకు: 2 రెబ్బలు, అల్లం తురుము: టీస్పూను, కొత్తిమీర తురుము: టేబుల్‌స్పూను, ఆవాలు: అరటీస్పూను, గరంమసాలా: పావుటీస్పూను, దనియాలపొడి: అరటీస్పూను, జీలకర్ర: అరటీస్పూను, పసుపు: చిటికెడు, నిమ్మరసం: కొద్దిగా, ఉప్పు: తగినంత, నూనె:  సరిపడా

తయారుచేసే విధానం 
* బంగాళాదుంపలు ఉడికించి పొట్టు తీసి మెత్తగా మెదపాలి. 
* బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ఉప్పు, అల్లంతురుము, పసుపు వేసి వేయించాలి. తరవాత ఉల్లిముక్కలు వేసి వేగాక గరంమసాలా, దనియాలపొడి వేసి కలపాలి. ఇప్పుడు బంగాళాదుంప ముద్ద వేసి కలపాలి. ఈ కూరని చిన్నచిన్న ఉండల్లా చేసుకుని ఉంచాలి. 
* సెనగపిండిలో బియ్యప్పిండి, ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి. తరవాత కొంచెంకొంచెంగా నీళ్లు పోసి మరీ చిక్కగానూ మందంగానూ కాకుండా కలపాలి. 
* ఇప్పుడు బాణలిలో నూనె పోసి కాగాక ఉండల్ని పిండి మిశ్రమంలో ముంచి వేయించి తీయాలి.

సగ్గుబియ్యం కిచిడీ

 

  కావలసినవి 
సగ్గుబియ్యం: కప్పు, జీలకర్ర: టీస్పూను, ఆవాలు: అరటీస్పూను, పచ్చిమిర్చి: నాలుగు, కరివేపాకు: 2 రెబ్బలు, బంగాళాదుంపలు: రెండు, పల్లీలు: ముప్పావుకప్పు, తాజా కొబ్బరితురుము: 3 టేబుల్‌స్పూన్లు, పసుపు: పావుటీస్పూను, నిమ్మరసం: 2 టీస్పూన్లు, ఉప్పు: తగినంత, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు, నూనె: 2 టేబుల్‌స్పూన్లు, మంచినీళ్లు: ముప్పావుకప్పు

తయారుచేసే విధానం 
* సగ్గుబియ్యంలో మంచినీళ్లు పోసి నానబెట్టాలి. సుమారు రెండుగంటలపాటు నానాక వాటిని చిల్లుల ప్లేటులో వేసి ఎక్కువగా ఉన్న నీళ్లను వంపేసి, కాసేపు అలాగే వడేసి ఉంచాలి. 
* బంగాళాదుంపలు ఉడికించి పొట్టు తీసి ముక్కలుగా కోయాలి. పల్లీలు వేయించి పొట్టు తీసి ముక్కలయ్యేలా ఓసారి మిక్సీలో వేసి తిప్పాలి. 
* బాణలిలో నూనె వేసి కాగాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి వేగాక, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించాలి. ఇప్పుడు వడేసిన సగ్గుబియ్యం వేసి నాలుగు నిమిషాలు కలుపుతూ వేయించాలి. తరవాత పసుపు, ఉప్పు వేసి కలిపి సగ్గుబియ్యం పారదర్శకంగా మారేవరకూ ఉడికించాలి. తరవాత ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, వేయించిన పల్లీలు, కొబ్బరి తురుము వేసి కలుపుతూ ఓ ఐదునిమిషాలు వేగాక చివరగా కొత్తిమీర తురుము వేసి దించి నిమ్మరసం పిండి అందించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని