93 గంటలు ఆగకుండా వండేసింది!

పండగలు, శుభకార్యాలంటూ.. ఆరేడుగంటలపాటు వంటింట్లో ఉంటే చాలు.. ఎక్కడలేని నీరసమూ ఆవహిస్తుంది. 26 ఏళ్ల హిల్డా బాసి మాత్రం ఏకధాటిగా 93 గంటల 11 నిమిషాలపాటు గరిటె తిప్పి 155 రకాలైన వంటకాలు అవలీలగా వండి వార్చేసింది.

Published : 18 Jun 2023 00:27 IST

పండగలు, శుభకార్యాలంటూ.. ఆరేడుగంటలపాటు వంటింట్లో ఉంటే చాలు.. ఎక్కడలేని నీరసమూ ఆవహిస్తుంది. 26 ఏళ్ల హిల్డా బాసి మాత్రం ఏకధాటిగా 93 గంటల 11 నిమిషాలపాటు గరిటె తిప్పి 155 రకాలైన వంటకాలు అవలీలగా వండి వార్చేసింది. ప్రపంచ రికార్డునీ దక్కించుకుంది. ఈమె పుట్టి పెరిగిందంతా నైజీరియా. చిన్నప్పటి నుంచి అమ్మే తనకు స్ఫూర్తి అంటుంది హిల్డా. ‘అమ్మ చెఫ్‌గా పనిచేసేది. దాంతో తనవద్ద ప్రతి రుచినీ అడిగి తెలుసుకొనేదాన్ని. ఎప్పటికైనా మా నైజీరియా సంప్రదాయ వంటకాలను ప్రపంచానికి రుచి చూపించాలనుకొనేదాన్ని. మడొన్నా విశ్వవిద్యాలయంలో సోషియాలజీలో డిగ్రీ చేసి.. సినిమా నటినయ్యా. అలాగని వంటలపై మక్కువను దూరం చేసుకోలేదు. రెస్టారెంట్‌ నిర్వహిస్తున్నా. ప్రపంచవేదికపై మా దేశ వంటకాల గురించి చర్చ జరగాలంటే ఏదైనా ప్రత్యేకంగా చేయాలనిపించింది. అప్పుడే ప్రపంచ రికార్డు ఆలోచనొచ్చింది. 2019లో భారతీయురాలు లతా టాండన్‌ నెలకొల్పిన 87 గంటల 45 నిమిషాల కుకింగ్‌ మారథాన్‌ రికార్డును బ్రేక్‌ చేయాలనుకున్నా. ఈ ఏడాది మే11న ‘కుక్‌-ఏ-థాన్‌’ పేరుతో వంటలు ప్రారంభించా. మే 15న ముగించి 93గంటల 11 నిమిషాల రికార్డును సాధించా. ప్రతి గంటకు 5 నిమిషాల విశ్రాంతి తీసుకున్నా. 96 గంటలు చేద్దామనేది నా మొదటి ఆలోచన. ఆ తర్వాత దాన్ని 100 గంటలకు పెంచుకుందామనుకున్నా. అయితే విశ్రాంతి తీసుకోవడంలో సమయం ఎక్కువగా అవడంతో 93గంటల 11 నిమిషాలకు నా మారథాన్‌ను పూర్తిచేసి రికార్డు సాధించా. నా మాతృదేశ వంటకాల గురించి అందరికీ తెలిసేలా చేయగలిగినందుకు గర్వంగా ఉందంటు’న్న హిల్డాను ఆదేశ ప్రముఖులెందరో ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని