ఫిదా చేసే ఫలూదా!

చిక్కని పాలతో చల్లటి ఐస్‌క్రీమ్‌ జోడీ..చలువ చేసే సబ్జా/చియా గింజలు.. తోడుగా సేమ్యా..తియ్యటి చాక్లెట్‌, తాజా పండ్లు.. పోషకాల డ్రైఫ్రూట్స్‌..ఆకర్షించే టూటీఫ్రూటీలు.. చిట్టి చెర్రీలు..అన్నీ కలసి... మండే ఎండల్లో నోటికి రుచికరమైన ఫలూదాను అందిస్తున్నాయి. మరెందుకాలస్యం తయారు చేద్దామా మరి.

Updated : 30 Aug 2022 14:33 IST

చిక్కని పాలతో చల్లటి ఐస్‌క్రీమ్‌ జోడీ..చలువ చేసే సబ్జా/చియా గింజలు.. తోడుగా సేమ్యా..తియ్యటి చాక్లెట్‌, తాజా పండ్లు.. పోషకాల డ్రైఫ్రూట్స్‌..ఆకర్షించే టూటీఫ్రూటీలు.. చిట్టి చెర్రీలు..అన్నీ కలసి... మండే ఎండల్లో నోటికి రుచికరమైన ఫలూదాను అందిస్తున్నాయి. మరెందుకాలస్యం తయారు చేద్దామా మరి.


చాక్లెట్‌...

కావాల్సినవి: పాలు- నాలుగు కప్పులు, కోకో పొడి, కస్టర్డ్‌ పొడి, సబ్జా గింజలు, డ్రై ఫ్రూట్స్‌ తరుగు- రెండు చెంచాల చొప్పున; సేమ్యా- పావు కప్పు, చాక్లెట్‌ సిరప్‌ (సూపర్‌ మార్కెట్‌లో దొరుకుతుంది)- అర కప్పు, నచ్చిన ఐస్‌క్రీమ్‌- రెండు స్కూప్‌లు, పాలు- 550 ఎం.ఎల్‌., చాక్లెట్‌ ముక్కలు- కొన్ని.
తయారీ:  పొయ్యి మీద గిన్నె పెట్టి అర లీటరు పాలు పోసి వేడి చేయాలి. పావు కప్పు పాలలో కోకో పొడి, కస్టర్డ్‌ పొడి వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. ఈ చిక్కటి ద్రవాన్ని వడగట్టుకోవాలి. మరిగే పాలలో ఈ ద్రవం పోస్తూ కలియబెట్టాలి. ఇప్పుడీ పాలను నాలుగైదు నిమిషాలు మరిగించాలి. స్టవ్‌ కట్టేసి చల్లార్చాలి. ఆ తర్వాత గంటపాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. మరో చిన్న గిన్నెలో సబ్జా గింజలు వేసి, నీళ్లు పోసి నానబెట్టాలి. వేరొక గిన్నెలో పావు కప్పు సేమ్యా తీసుకోవాలి.  దీన్ని ఉడికించి చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. కాజూ, పిస్తా, బాదం పలుకులను చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు రెండు గ్లాసులను తీసుకోవాలి. అందులో చాక్లెట్‌ ఫలూదా కోసం చాక్లెట్‌ సిరప్‌ను వాడుకోవచ్చు. మొదట చెంచా చొప్పున చాక్లెట్‌ సిరప్‌ను గ్లాసుల్లో పోయాలి. మరికాస్త సిరప్‌ను గ్లాసు అన్ని వైపులా అతుక్కునేలా పోయాలి. కావాలనుకుంటే మరో చెంచానూ వేసుకోవచ్చు. ఇందులో రెండు చెంచాల చొప్పున సేమ్యా, నానబెట్టిన సబ్జాగింజలు, డ్రై ఫ్రూట్‌ తరుగు వేయాలి. ఆ తర్వాత తయారుచేసి పెట్టుకున్న పాల మిశ్రమాన్ని పోయాలి. ఆ పైన ఐస్‌క్రీమ్‌ను వేయాలి. నచ్చిన ఐస్‌క్రీమ్‌ ఫ్లేవర్‌ను వాడుకోవచ్చు. ఐస్‌క్రీమ్‌ ఎక్కువగా ఇష్టపడేవారు రెండు స్కూప్‌లూ వేసుకోవచ్చు. దీనిపై చాక్లెట్‌ ముక్కలు, డ్రైఫ్రూట్స్‌ తరుగుతో గార్నిష్‌ చేసుకుంటే నోరూరించే చాక్లెట్‌ ఫలూదా రెడీ.


పాన్‌ రబ్డీ...

కావాల్సినవి: తమలపాకులు- నాలుగు, జీలకర్ర- చెంచా, యాలకులు- రెండు, గుల్‌ఖండ్‌- పెద్ద చెంచా, కండెన్స్‌డ్‌ మిల్క్‌- 70 ఎం.ఎల్‌., ఆర్గానిక్‌ ఫుడ్‌ కలర్‌- పావు చెంచా, కార్న్‌ఫ్లోర్‌- పెద్ద చెంచా, టూటీ ఫ్రూటీ, షుగర్‌ కన్‌ఫెట్టి (సూపర్‌ మార్కెట్‌లో దొరుకుతుంది), కొబ్బరి తురుము- రెండు చెంచాల చొప్పున; చియా గింజలు- చెంచా, పాలు- 550 ఎం.ఎల్‌., సేవ్‌- పావు కప్పు, గులాబీ రేకలు, కిస్‌మిస్‌- కొన్ని.
తయారీ: గిన్నెలో కార్న్‌ఫ్లోర్‌ వేసి, 50 ఎం.ఎల్‌., పాలు పోసి ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. చిన్న గిన్నెలో చియా విత్తనాలు వేసి, నీళ్లు పోసి అరగంట నానబెట్టాలి. ఇంకొక గిన్నెలో తమలపాకులు, జీలకర్ర, యాలకులు, గుల్‌ఖండ్‌, కండెన్స్‌డ్‌ మిల్క్‌, ఫుడ్‌ కలర్‌ వేసి మిక్సీ పట్టుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి పాలు పోసి వేడి చేయాలి. అవి మరుగుతున్నప్పుడు ముందుగా కార్న్‌ఫ్లోర్‌ ద్రవం, ఆ తర్వాత తమలపాకు మిశ్రమం వేసి బాగా కలపాలి. ఆ తర్వాత పది నిమిషాలు చల్లార్చాలి. ఈ ద్రవాన్ని 40 నిమిషాలు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఈ సమయంలోనే చిన్న గిన్నెలో టూటీ ఫ్రూటీ, షుగర్‌ కన్‌ఫెట్టి, కొబ్బరి తురుము వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడొక పాత్రలో కొన్ని నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి మరిగించాలి. ఈ నీళ్లలో సేవ్‌ వేసి బాగా కలుపుతూ ఉడికించాలి. ఆ తర్వాత ఏడెనిమిది నిమిషాలు చల్లార్చాలి. గాజు గ్లాసులో నానబెట్టుకున్న చియా గింజలు, టూటీఫ్రూటీ మిశ్రమం, ఉడికించిన సేవ్‌, ఫుడ్‌ కలర్‌... ఇలా ఒకదాని తర్వాత మరొకటి వేసి తమలపాకు మిశ్రమాన్ని పోయాలి. చివరగా ఐస్‌క్రీమ్‌ను వేసుకోవాలి. కిస్‌మిస్‌, గులాబీ రేకలతో అలంకరించుకోవాలి.


సేమ్యా కస్టర్డ్‌...

కావాల్సినవి: నెయ్యి- అర చెంచా, సేమ్యా- అర కప్పు, చిక్కటి పాలు- నాలుగున్నర కప్పులు, కుంకుమ పువ్వు- పావు చెంచా, చక్కెర- పావు కప్పు, కస్టర్డ్‌ పౌడర్‌ (వెనిల్లా ఫ్లేవర్‌)- రెండు పెద్ద చెంచాలు, సబ్జా గింజలు, దానిమ్మ గింజలు, యాపిల్‌, నట్స్‌, టూటీఫ్రూట్‌- రెండు పెద్ద చెంచాల చొప్పున; ద్రాక్ష- అయిదు, చెర్రీ- ఒకటి.
తయారీ: పొయ్యి మీద పాన్‌ పెట్టి నెయ్యి వేయాలి. అది వేడయ్యాక సేమ్యా వేసి చిన్న మంటపై లేత బంగారు రంగులోకి మారే వరకు వేయించి పెట్టుకోవాలి. పెద్ద గిన్నెలో పాలు పోసి, కుంకుమ పువ్వు వేసి గరిటెతో కలుపుతూ ఉండాలి. మరిగే సమయంలో వేయించిన సేమ్యాను జత చేయాలి. కాసేపటి తర్వాత చక్కెర వేసి కరిగించాలి. ఏడెనిమిది నిమిషాలు మరిగించాలి లేదా సేమ్యా మెత్తబడేవరకు ఉడికించాలి. చిన్న గిన్నెలో కస్టర్డ్‌ పౌడర్‌ వేసి కప్పు పాలు పోసి ఉండలు లేకుండా కలపాలి. ఇప్పుడీ కస్టర్డ్‌ ద్రవాన్ని మరిగే పాలలో పోసి బాగా కలపాలి. పాలు బాగా చిక్కబడి క్రీమీగా అయ్యేవరకు కలుపుతూనే ఉండాలి. కస్టర్డ్‌ సేమ్యాను పెద్ద గిన్నెలోకి మార్చాలి. దీన్ని పూర్తిగా చల్లార్చి రెండు గంటలు ఫ్రిజ్‌లో పెట్టాలి. గిన్నెలో రెండు పెద్ద చెంచాల సబ్జా గింజలు వేసి, నీళ్లు పోసి పావుగంట నానబెట్టాలి లేదా అవి బాగా నానేవరకు చూడాలి
సర్వింగ్‌ కోసం.. పొడవాటి గాజు గ్లాసుల్లో నానబెట్టిన సబ్జా గింజలు, ఆ తర్వాత చల్లని వర్మిసెల్లీ కస్టర్డ్‌ను వేసుకోవాలి. పై భాగంలో దానిమ్మ గింజలు, ద్రాక్ష పండ్లు, యాపిల్‌ ముక్కలను వేసుకోవాలి. వీటిపై నుంచి పావు కప్పు చల్లటి వర్మిసెల్లీ కస్టర్డ్‌ మరోసారి పోయాలి. చివరగా నట్స్‌, టూటీఫ్రూటీలు, చెర్రీలతో గార్నిష్‌ చేసుకుంటే సరి.

 


పార్సీ...

కావాల్సినవి: సబ్జా గింజలు- చెంచా, నీళ్లు- కప్పు, రోజ్‌ సిరప్‌- పెద్ద చెంచా, పాలు- అర కప్పు, వెనిల్లా ఐస్‌క్రీమ్‌- స్కూప్‌.
తయారీ: సబ్జా గింజలను నీళ్లలో వేసి అరగంట నానబెట్టాలి. ఇవి పూర్తిగా నీటిని పీల్చుకున్నాక, వీటిలో రోజ్‌ సిరప్‌ పోయాలి. అర కప్పు కాచి చల్లార్చిన చిక్కటి పాలను జత చేయాలి. చివరగా ఐస్‌క్రీమ్‌నూసుకోవాలి. . అంతే సింప్లీ, టేస్టీ పార్సీ ఫలూదా రెడీ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు