ISS: తేనె శాండ్‌విచ్‌.. అంతరిక్షంలో ‘ఆహార’ విన్యాసం!

అంతరిక్ష కేంద్రంలోని ఓ వ్యోమగామి బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. యూఏఈకి చెందిన సుల్తాన్ అల్ నెయాది దీన్ని పోస్టు చేశారు.

Published : 22 Aug 2023 01:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భూమి నుంచి రోదసిలోకి వెళ్లేకొద్దీ గురుత్వాకర్షణ శక్తి తగ్గిపోతుంది. శూన్య గురుత్వాకర్షణ (Zero Gravity) పరిస్థితుల నడుమ.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ISS) తినడం నుంచి రోజువారీ కార్యకలాపాలవరకు అన్ని భిన్నంగా సాగుతాయి. ప్రస్తుతం ‘ఐఎస్‌ఎస్‌’లో విధులు నిర్వహిస్తోన్న, యూఏఈకి చెందిన సుల్తాన్ అల్ నెయాది (Sultan AlNeyadi) అనే వ్యోమగామి తాను అల్పాహారాన్ని తీసుకుంటున్న వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఎంతో ఆసక్తిగా ఉన్న ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

బ్రెడ్‌పై తేనె పూసుకొని తినేందుకుగానూ నెయాది ముందుగా ఓ తేనె సీసాను తెరిచారు. అందులోంచి బుడగ రూపంలో బయటకు వచ్చిన తేనెను బ్రెడ్‌కు అంటించి.. శాండ్‌విచ్‌లా చేసుకుని ఆరగించారు. ‘‘అంతరిక్షంలో తేనె రూపం ఎలా మారిపోతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? తేనె వ్యోమగాముల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది’’ అని ఆయన ఎక్స్‌(ట్విటర్‌)లో వీడియోను పోస్టు చేశారు. ‘‘తేనె బంతిలా మారడం భలేగా ఉంది’’ అంటూ ఓ నెటిజన్‌ స్పందించారు. ‘‘వావ్‌, అల్పాహారాన్ని ఇలా కూడా తినొచ్చా’’ అంటూ మరొకరు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. ఆర్నెళ్ల మిషన్‌లో భాగంగా సుల్తాన్‌ ప్రస్తుతం నలుగురు సహచరులతో కలిసి ఐఎస్‌ఎస్‌లో ఉన్నారు. ఏప్రిల్‌లో ఆయన ఐఎస్ఎస్‌ వెలుపల స్పేస్‌వాక్‌ చేశారు. తద్వారా అంతరిక్ష నడక చేపట్టిన మొదటి అరేబియన్‌గా నిలిచారు. ఈ వ్యోమగాములు సెప్టెంబరు 1న భూమికి తిరిగి రానున్నారు. 



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని