Viral Video: ఒక్క బైక్‌పై ఏడుగురా?రీల్స్‌ మోజులో డేంజర్‌లో పడొద్దు!

Viral Video: రీల్స్‌ మోజులో పడి యువత తమ ప్రాణాల్ని పణంగా పెట్టి వీడియోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఒకే బైక్‌పై ఏడుగురు కుర్రాళ్లు ప్రయాణించిన వీడియో వైరల్‌గా మారింది.

Published : 09 Aug 2023 15:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో లైక్స్‌, వ్యూస్‌, కామెంట్ల కోసం నేటి యువత ఎంతటి రిస్క్‌ చేయడానికైనా వెనుకాడట్లేదు. కొందరు కొండలపైకి ఎక్కి వీడియోలు చేస్తే.. మరికొందరు రైల్వేట్రాక్‌లపై ప్రమాదకర రీతుల్లో రీల్స్‌ చేసి ప్రమాదాల్ని కొని తెచ్చుకుంటున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా కొందరు కుర్రాళ్లు బైక్‌(Bike)పై ప్రమాదకర రీతిలో ప్రయాణించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ద్విచక్రవాహనంపై సాధారణంగా ఒకరిద్దరో, మరీ అయితే ముగ్గురో ప్రయాణించడం మనం చూస్తుంటాం. కానీ, ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh)లోని హాపూర్ జిల్లా కతిఖేరా ప్రాంతంలో ఏకంగా ఒకే బైక్‌పై ఏకంగా ఏడుగురు యువకులు అత్యంత ప్రమాదకరంగా  ప్రయాణించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

పిడిగుద్దులు.. గాల్లోకి లేచిన కుర్చీలు.. రివర్‌పార్కులో రచ్చరచ్చ

వీరిలో ఒక కుర్రాడు బైక్‌ నడుపుతుంటే అతడి ముందు ఒకరు కూర్చోగా.. వెనక సీట్లో నలుగురు కూర్చొని ఉన్నారు.  ఇంకో వ్యక్తి అయితే చివరన ఉన్న కుర్రాడి  భుజాలపైకి ఎక్కి రోడ్డుపై ప్రయాణిస్తున్న విన్యాస దృశ్యాలు చూసేవారికి భీతి గొల్పేలా ఉన్నాయి. ఈ బైక్‌పై ప్రయాణిస్తున్న ఏడుగురూ మైనర్లులాగే కనిపిస్తున్నారు. ఈ వీడియోను అదే రోడ్డులో కారులో వెళ్తున్న వారు రికార్డు చేశారు. మరోవైపు, ఈ వీడియోను టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘‘ద్విచక్రవాహనాలపై ఇలాంటి ప్రయాణాలు యమ డేంజర్‌. ఏమాత్రం తేడా వచ్చినా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకర ప్రయాణాలు చేయడం సరికాదు. బైక్‌లపై ఇద్దరు కంటే ఎక్కువమంది ప్రయాణించడం చట్టవిరుద్ధం’’ అని పేర్కొన్నారు. యూపీలోని ఉన్నావ్‌లో గత నెలలో ఆరుగురు యువకులు ఒకే బైక్‌పై ప్రయాణించి రీల్స్‌ చేసేందుకు ప్రయత్నించగా.. ఆ వీడియో వైరల్‌ అయి పోలీసులకు తెలియడంతో  బైక్‌ యజమానికి రూ.16వేలు జరిమానా విధించారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని