Elon Musk: విచారణ వేళ.. ‘X’ లోగో ఏరియల్‌ వ్యూ వైరల్‌!

ట్విటర్‌ పేరును ‘ఎక్స్‌.కామ్‌’గా మార్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అమెరికా శాన్‌ఫ్రాన్సిస్కోలోని ‘ఎక్స్‌.కామ్‌’ ప్రధాన కార్యాలయంపై ఏర్పాటు చేసిన ఓ భారీ ‘ఎక్స్‌’ లోగో ఏరియల్‌ వ్యూ వీడియోను ఎలాన్‌ మస్క్‌ పోస్ట్‌ చేశారు.

Published : 29 Jul 2023 17:33 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk).. తన ట్విటర్‌ (Twitter) సంస్థ పేరును ‘ఎక్స్‌.కామ్‌’గా మార్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అమెరికా శాన్‌ఫ్రాన్సిస్కోలోని ‘ఎక్స్‌.కామ్‌’ ప్రధాన కార్యాలయంపై ఓ భారీ ‘ఎక్స్‌’ లోగో (X Logo) ఏర్పాటు చేశారు. చీకట్లో విద్యుత్‌ కాంతులు విరజిమ్ముతోన్న ఆ లోగోకు సంబంధించిన ఏరియల్‌ వ్యూ వీడియోను మస్క్‌ తాజాగా పోస్ట్‌ చేశారు. అంతకుముందు.. ఈ లోగో ఏర్పాటు విషయంలో ఆయనకు చట్టపరమైన చిక్కులు ఎదురైన విషయం తెలిసిందే.

ట్విటర్ ప్రధాన కార్యాలయంపై ఏర్పాటు చేసిన ‘ఎక్స్‌’ లోగో గురించి శాన్‌ఫ్రాన్సిస్కో యంత్రాంగం విచారణకు ఆదేశించింది. స్థానిక నిబంధనల ప్రకారం.. ఒక సంస్థ లోగో, గుర్తును మార్చాలనుకున్నప్పుడు ముందుగా అనుమతి తీసుకోవాలి. డిజైన్‌, భద్రతా కారణాల దృష్ట్యా ఈ అనుమతులు అవసరమని భవనాల తనిఖీల విభాగం అధికారి ఒకరు చెప్పారు. ఈ పరిణామాల నడుమ లోగో వీడియోను మస్క్‌ పోస్ట్‌ చేయడం గమనార్హం. ఇప్పటివరకు 52 లక్షలకుపైగా నెటిజన్లు ఈ వీడియోను చూశారు.

కొత్త లోగో ఏర్పాటు.. చిక్కుల్లో మస్క్‌ ‘ఎక్స్‌’

ఇదిలా ఉండగా.. ఎలాన్‌ మస్క్‌ గత ఏడాది ట్విటర్‌ను కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే ఉద్యోగుల తొలగింపు నుంచి తాజాగా పేరు మార్పు వరకు దానిలో అనూహ్య మార్పులు చేస్తూనే ఉన్నారు. మరోవైపు.. ఈ సోషల్‌ మీడియా సంస్థ నెలవారీ యాక్టివ్‌ యూజర్లు భారీగా పెరిగినట్లు మస్క్ వెల్లడించారు. ఆ సంఖ్య 540 మిలియన్లకు చేరిందని చెప్పారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని