క్లిక్‌లతోనే.. కిక్‌

కొన్ని ఫొటోల్ని చూస్తే మైమరిచిపోతుంటాం. ‘వావ్‌’ అంటాం. ‘భలే తీశారే’ అని మెచ్చుకుంటాం. రవికాంత్‌ జీవితంలో ఇలాంటి ప్రశంసలు లెక్కలేనన్ని ఉన్నాయి. తనది అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మొగలికుదురు

Published : 27 Jan 2024 00:48 IST

ఏడేళ్లు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేశాడు.. లక్షల జీతానికి ఎగబాకాడు. కానీ ఫొటోగ్రఫీపై మక్కువతో కెమెరా బటన్‌ నొక్కినంత తేలిగ్గా ఆ కొలువు వదిలేశాడు! వెల కట్టలేని భావోద్వేగాలు ఒడిసిపట్టే ఓ చిత్రం ముందు.. ఒక మంచి ఫొటోకి దక్కే గుర్తింపు ముందు..ఆ సంపాదన ఎక్కువేం కాదంటున్నాడు కూర్మా రవికాంత్‌. ఈమధ్యే దుబాయ్‌లో నిర్వహించిన ‘హిపా డైవర్సిటీ’ అనే అంతర్జాతీయ ఫోటోగ్రఫీ పోటీలోనూ తను విజేతగా నిలిచాడు.

కొన్ని ఫొటోల్ని చూస్తే మైమరిచిపోతుంటాం. ‘వావ్‌’ అంటాం. ‘భలే తీశారే’ అని మెచ్చుకుంటాం. రవికాంత్‌ జీవితంలో ఇలాంటి ప్రశంసలు లెక్కలేనన్ని ఉన్నాయి. తనది అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మొగలికుదురు. బీటెక్‌ పూర్తయ్యాక ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో చేరాడు. వారాంతాల్లో సహోద్యోగులతో కలిసి సరదాగా ట్రెక్కింగ్‌కి వెళ్లేవాడు. ప్రయాణాలు చేసేవాడు. ఈ సమయంలో అందమైన ప్రకృతిని, అనుకోకుండా కనపడే దృశ్యాలను బంధించేందుకు ఓ కెమెరా కొన్నాడు. అలా ఫొటోగ్రఫీ ప్రయాణం మొదలైంది. క్రమంగా అదే అత్యంత ఇష్టమైన వ్యాపకంగా మారిపోయింది. చివరికి వృత్తి, ప్రవృత్తి.. రెండింటికీ న్యాయం చేయలేననే ఉద్దేశంతో కొలువునే వదిలేసి విహారిగా మారిపోయాడు రవికాంత్‌.

చేసిన పనికి వచ్చిన గుర్తింపుని బట్టి ఆ వ్యక్తి ఎంత సక్సెస్‌ అయ్యాడో ఓ అంచనాకు రావచ్చు. ఆ లెక్కన రవికాంత్‌ తను ఎంచుకున్న రంగంలో సూపర్‌హిట్టే అయ్యాడు. జైపుర్‌లోని జల్‌మహల్‌లో తీసిన ఫొటో 2015లో నేషనల్‌ జియోగ్రఫీ మేగజైన్‌లో ప్రచురితమైంది. అది ప్రారంభం. అప్పట్నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. 2016లో థాయ్‌ ఎయిర్‌లైన్స్‌ వేసిన పర్యాటక పుస్తకంలో రవికాంత్‌ తీసిన ఇండియాలోని పలు చారిత్రక, ప్రకృతి సౌందర్యాల చిత్రాలు ప్రచురితమయ్యాయి. 2017లో కేరళ ఓనం సందర్భంగా తీసిన పులికలి నృత్య విన్యాసాలు లండన్‌లోని ది గార్డియన్‌ దినపత్రికలో అచ్చయ్యాయి. మహారాష్ట్ర కొల్హాపూర్‌ ఎల్లో ఫెస్టివల్‌ ఫొటోలు టైమ్స్‌ ఆఫ్‌ లండన్‌ పత్రికలో అలరించాయి. కేరళ జాతీయ స్థాయి పోటీలు, తమిళనాడు టూరిజం శాఖ పోటీల్లోనూ అతడి ఫొటోలు బహుమతులు గెల్చుకున్నాయి. దిల్లీలోని యమునా నది ఒడ్డున తీసిన ‘ఏ డ్యాన్స్‌ ఆఫ్‌ సీగల్స్‌’ ఫొటో తాజాగా దుబాయ్‌లో నిర్వహించిన ‘హిపా డైవర్సిటీ’ అంతర్జాతీయ పోటీల్లో నలుపు-తెలుపు విభాగంలో మొదటి బహుమతి గెల్చుకుంది. ‘నేను కొలువును వదిలేస్తున్నప్పుడు నీకేమైనా బుర్ర పాడైపోయిందా? బంగారంలాంటి జాబ్‌ వదిలి కొండలు, గుట్టలు తిరుగుతున్నావు అన్నారు కొందరు. ఇప్పుడు వాళ్లే నాకొస్తున్న గుర్తింపు చూసి మావాడేనంటూ మురిసిపోతున్నారు’ అంటున్నాడు రవికాంత్‌. ‘ప్రపంచమంతా తిరిగి ఎవరికీ కనిపించని, ఎప్పుడూ చూడని కొత్త అందాలను అందరి ముందు ఉంచాలన్నదే నా లక్ష్యం’ అంటున్నాడు.              

దాసర హేమరాజు, ఈజేఎస్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని