ఏజెన్సీ నుంచి శాస్త్రవేత్త దాకా!

పుట్టిందేమో కనీస సదుపాయాలు లేని ఏజెన్సీ ప్రాంతం... కన్నవాళ్లది చదువు కూడా చెప్పించలేనంత పేదరికం... అయితే ఏంటట? చదువుతోనే అన్ని అడ్డంకులూ దాటాడు.

Published : 23 Mar 2024 00:05 IST

పుట్టిందేమో కనీస సదుపాయాలు లేని ఏజెన్సీ ప్రాంతం... కన్నవాళ్లది చదువు కూడా చెప్పించలేనంత పేదరికం... అయితే ఏంటట? చదువుతోనే అన్ని అడ్డంకులూ దాటాడు... ప్రముఖ పరిశోధనాసంస్థలో శాస్త్రవేత్తగా కొలువు సాధించాడు...తనే లావుడ్య ఆనంద్‌.

నంద్‌ది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన రెడ్డిపాలెం. కన్నవాళ్లు సన్నకారు రైతులు. ఆరుగాలం శ్రమించినా సంపాదన పొట్టకూటికే సరిపోయేది. అయినా వాళ్లకి చదువు విలువ బాగా తెలుసు. కుటుంబం తలరాత మారాలంటే చదువొక్కటే మార్గమని ఆ కొడుకూ నమ్మాడు. మంచి మార్కులతో పాసవుతూ చెన్నైలోని సవిత విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో ఇంజినీరింగ్‌, 2019లో ఆంధ్రా విశ్వ విద్యాలయంలో కంట్రోల్‌ సిస్టమ్‌లో ఎంటెక్‌ చేశాడు. ఆపై దేశానికి ఉపయోగపడే శాస్త్రవేత్త కావాలనుకున్నాడు. ఈ సమయంలో జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ అతడిని ఆర్థికంగా ఆదుకుంది. ఆపై బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బీఈఎల్‌)లో శిక్షణ ఇంజినీర్‌ ఉద్యోగం సాధించాడు. అక్కడ్నుంచి హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓ-రిసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌లో జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోగా చేరాడు. కంట్రోల్‌ సిస్టమ్‌ లేబోరేటరీస్‌ విభాగంలో పనిచేసే అవకాశం దక్కించుకున్నాడు. అక్కడి శాస్త్రవేత్తలు బీవీ రవికుమార్‌, బీవీఎస్‌ఆర్వీ ప్రసాద్‌ పర్యవేక్షణలో ఫెలోషిప్‌ బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించాడు.  
ఫెలోషిప్‌లో ఉంటూనే బెంగళూరులోని ప్రతిష్ఠాత్మక సెంట్రల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్‌ (సీఎంఐటీ) అవకాశం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అందులో కేవలం నాలుగు పోస్టులే ఉంటే దేశవ్యాప్తంగా వేల దరఖాస్తులొచ్చాయి. ఎస్టీ విభాగంలో రిజర్వేషన్‌ లేకపోయినా.. జనరల్‌ కేటగిరీకి పోటీపడి చివరికి కొలువు దక్కించుకున్నాడు ఆనంద్‌. మెరిట్‌, షార్ట్‌లిస్ట్‌, అనుభవం, రాత  పరీక్ష, ముఖాముఖిలో ప్రతిభ ఆధారంగా ఈ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. నెలకి రూ.లక్షకుపైగా జీతం అందుకోనున్నాడు. ‘ప్రతిష్ఠాత్మక ఈ పరిశోధనాసంస్థలో శాస్త్రవేత్తగా ఎంపికవడం గర్వంగా భావిస్తున్నా. దేశానికి అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం అందించాలన్నదే నా ధ్యేయం. సరికొత్త యంత్రాలు, పరికరాలు, నానో, మైక్రో, సెన్సార్ల తయారీలో భాగస్వామినవుతా’నంటున్నాడు ఆనంద్‌.

లింగయ్య ఉప్పుల, ఈటీవీ ఖమ్మం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని